పుస్తకాల అరలూ – సర్దుకోవడాలు – భ్రమలూ!
పనిలేని మంగలోడు పిల్లి తల గొరిగాడన్నది పాతకాలం సామెత. తీరికలేని సాఫ్ట్-వేర్ ఇంజనీర్ తలకెత్తుకునే తిక్క పనులని నిరూపించడమే ఈ పోస్ట్ పని. పనిలో పనిలో కొన్ని పుస్తకాల కబుర్లు.
క్రిస్మస్ నుంచి హోలీ దాకా:
తెల్సిందే కదా, లాక్‍డౌన్ పాపమా అని ఇంటికి-ఆఫీసుకి, లంచ్‍కి-డిన్నర్‍కి తేడా తెలీనంత తీరికలేకుండా పోయిన ఇంజనీర్‍కి ఒక వారం సెలవులు దొరికితే ఏం చేయాలో పాలుపోదు (నీళ్ళూ పోదు). చక్కగా అరల్లో (ఒకే అంత చక్కగా ఏం కాదు, కాస్త ఎగుడుదిగుడుగా, అడ్డదిడ్డంగా) ఉన్న పుస్తకాలు అన్నింటినీ బయటకు తీసి వాటినో కుప్పలా పేర్చి, దానికి క్రిస్మస్ ట్రీ అని పేరు పెట్టాలనే దుర్బుద్ధి పుట్టింది. అది ఇలా తయారైంది.
<<#ఏందోఅబ్బాజనాలు అను రాంట్ మొదలు:
పని ఎలా చేశాం, ఎంత చేశాం అన్నది చాలక, మళ్ళీ దాని గురించి డప్పు కొట్టుకునే బాధ్యత కూడా మన నెత్తినే వేస్తుంది కార్పరేట్ కాబట్టి అదే సూత్రాన్ని పాటిస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాను. ఏదో తాహతుకి తగ్గట్టుగా లైకులూ, హార్టులూ వచ్చాయనుకోండి. కానీ నా చిట్టి సంతోషపు బుడగను సూదితో పొడుస్తూ ఒక ఫ్రెండ్ కామెంట్‍లో అడిగారు: “ఇవ్వన్నీ ఎప్పటికి సర్దుకుంటారు మళ్ళీ?”
అప్పటికప్పుడే, అక్కడికక్కడే మాటర్ క్లియర్ చేసేశాను: నాకలా పుస్తకాలన్నీ సర్దుకోవాలి, పద్ధతిగా పెట్టుకోవాలి లాంటి చాదస్తాలూ, పట్టింపులూ ఏం లేవండీ! ఈ విషయంలో నన్ను మించిన బిందాస్ మనుషులుండరు. ప్రాసలో “మా ఇంటావంటా లేని పనులు” అని చెప్పుకోడానికి వీల్లేకుండా మా ఇంట్లోవాళ్ళూ, అప్పడప్పుడూ ఇంటికొచ్చి పోయే నా దోస్తులూ నా పుస్తకాల మీద చేయి చేసుకుంటుంటారు (అంటే, సర్దుకుంటారు). మరి బంధాలూ, బాంధవ్యాల వల్ల ఆ మాత్రం త్యాగం (నేను) చేయకతప్పదు.
ఏంటో! పుస్తకాలు సర్దుకోకపోవడంలో ఉన్న మజా జనాలకి బొత్తిగా తెలీదు. కిచిడి సీరియల్‍లో హన్సా బేన్ “వాటీస్… వాటీస్” అంటుందే, అలా నేను ఏదైనా పుస్తకం చదవాలనుకున్న వెంటనే “వెరీజ్… వెరీజ్” అని కాలుగాలిన పిల్లిలా (ఇన్ని సామెతలు పిల్లిలు మీద ఎందుకున్నాయ్? ఐ హేట్ కాట్స్, యా!) తిరుగుతూ ఒక అరగంటకో, గంటకో పుస్తకం కోసం దేవులాడితే ఎంత కిక్! “గంట వేస్ట్ కాలేదా, తీరికలేని సాఫ్ట్‍వేరు ఇంజనీరూ…” అని మీరు అడగచ్చు, “బట్, గంట సస్పెన్స్ కూడా తట్టుకుని పుస్తకం చదవాలన్న కోరిక ఇంకా బలపడింది కదా!” అని నాలోని రొమాంటిక్ (కాదు, కాదు, అచ్చ తెలుగులో భావుకత్వం) జవాబిస్తుంది.
అలానే, ఇంటికొచ్చి నా ఎదురుగా కూర్చుని నాతో మాట్లాడుతూ ఏ క్షణాన కూలిపోతుందో అని భయభయంగా ఒక కంటిని ఒక పుస్తకాల leaning tower మీదేసి, ఇంకో కంటిని నాకోసం కేటాయిస్తుంటారు. ఎందుకంత భయం? మొదటి సంగతి: పడాల్సుంటే ఎప్పుడో పడిపోయేది. పడాలనుకుంటే ఎవరూ ఆపలేరు. మనుషులం కదా, అన్నింటినీ మనమే కంట్రోల్ చేస్తామని మన భ్రమ. అది అహంకారం. మనం నిమిత్తమాత్రులమని మర్చిపోకూడదు.
రెండోది: పుస్తకాలకీ ఇష్టాయిష్టాలూ, ప్రేమలూ, కోరికలూ వగైరాలు ఉంటాయి. కట్టేసి అల్మారాలో పెట్టేస్తే పాపం వస్తుంది. వాటికీ అప్పుడప్పుడూ గాలి తగులుతుండాలి. పుస్తకాలని బోర్లా పెట్టకు, కాగితాలని మడత పెట్టకు, మధ్యలో ఇంకో పుస్తకాన్ని బుక్‍మార్కర్‍గా పెట్టకు – పుస్తకాలేమన్నా బోర్డింగ్ స్కూల్ పిల్లలా, నీట్‍గా క్రాఫ్ ఉండి, స్వటర్ వేసుకుని, అటెన్షన్‍లో నుంచోడానికి? Chill, ya! మనీ ప్లాంట్ దగ్గర కొంత మట్టి వాసన, సింక్ దగ్గర నీటి తుపర, మంచంమీద దుప్పటి ముడతల్లా కొన్ని మడతలు, లాప్‍టాప్ వెచ్చని సాంగత్యం, తింటున్న మిక్స్చర్‍లోంచి కొన్ని పలుకులు… ఇవ్వన్నీ “జీతా-జాగ్తా సబూత్” (సజీవైన నిదర్శనాలు), పుస్తకాలు నాతో కలిసి ఉంటున్నాయని. What’s the point of co-habiting a space and time, without ever leaving a mark (pun intended) on the other?
నేనిట్లా వితండవాదం చేస్తానని తెల్సి మొన్న లాక్‍డౌన్‍లో నిరంతర జూమ్ స్రవంతిలో నాచేత ఒక లెక్చర్ చూపించారు ఇంట్లోవాళ్ళు. అసలు టాపిక్ అయితే “కళలని అభ్యసించడం వల్ల కలుగు ఉపయోగాలు.” కేరళకి చెందిన చాలా పెద్ద కథకళి ఆర్టిస్ట్ ఇచ్చిన లెక్చర్. అందులో ఆయన ఏకంగా మనకున్న అరవైనాలుగు కళల్లో ఒకటి, కళకి సంబంధించినవన్నీ జాగ్రత్త చేసుకోవడం, వాటి బాగోగులు చూసుకోవడమని చెప్పారు. ఈ విషయమై మాకు కేరళ మ్యూరల్స్ లో కూడా వాయింపు ఉంటుంది బాగా, బ్రషులు కడుక్కోవడమనేది పెయింటింగ్ కన్నా చాలా శ్రద్ధగా చేయాల్సిన పని. ఆయన మాట్లాడుతూ అలా శ్రద్ధపెట్టని వారికి మరీ “పుట్టగతులుండవు” వరకూ వెళ్ళబోయి, ఆగి, వాళ్ళకి కళ సరిగ్గా అబ్బదు, వాళ్ళు గొప్ప కళాకారులు కాలేరు అని మాత్రం తేల్చారు.
ఆ సెషన్ అయిన ఒక నాలుగైదు రోజులు నేను ఠంచనుగా అన్నీ పక్కాగా సర్దిపెట్టేసుకుని హై-అటెంటివ్ మోడ్ లో ఉన్నాను. కానీ ఎందుకంత హైరానా అని ఆలోచిస్తే పెద్ద కారణాలేం కనిపించలేదు. కళ కూడా ప్రాప్తమే కదా! ఎంత రావాలో అంతే వంటబడుతుంది. అర్థంకాని కథలు, అరకొర వ్యాసాలు నే రాసినంత మాత్రన తెలుగు జాతికి వచ్చే నష్టమేం లేదు. దానికోసం మెదడులో ఒక వైరింగ్ లేదని ఎంతని తిట్టుకుంటాం?
నా క్రిస్మస్ ట్రీని ఒకేసారి నేలకూల్చలేక అక్కడో పుస్తకం, అప్పుడో పుస్తకం లాగుతూ పనికానిస్తూ ఉంటే, “సర్దు, సర్దు” అని చెవిలో జోరీగ పోరు. సర్దడమే తప్ప సర్దుకుపోవడం తెలీదు మనకి. స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళ మెడలని కూడా వంచగలదు ఈ సమాజం, ఇహ నేనెంత? ఆ విధంగా క్రిస్మస్ నుంచి హోలీ వరకూ జాలీగా ఎంజాయ్ చేసిన నా పుస్తకాలు మళ్ళీ అరల్లోకి చేరాయి. (చేర్చబడ్డాయి.)
#ఏందోఅబ్బాజనాలు అను రాంట్ ఇంతటితో సమాప్తం>>
పదేళ్ళ ప్రయాణం
అలా సర్దుతుంటే కొన్ని సంగతులు పంచుకోవచ్చనని అనిపించింది. ఆ మధ్యన ఫేస్‍బుక్ వాడు 10yearphotochallenge అని ఒకటి వాయించాడు. పదేళ్ళ క్రితం ఫోటో, ప్రస్తుత ఫోటో పెట్టాలి. అది వాడి ఇమేజ్ రికగ్నిషన్ ఆల్గోరిథమ్స్ కి డేటా కావాల్సి వచ్చి చేసిన పన్నాంగం కూడా అయ్యుంటుంది, కానీ అందరూ పాత-కొత్త ఫోటోలు పెట్టి తెగ మురిసిపోయారు. మన రూపురేఖల్లో వచ్చే మార్పుల్లానే మన పుస్తక పఠనంలో కూడా మార్పులూ, చేర్పులూ వస్తుంటాయి. వాటిని పరామర్శించడం కూడా (కొంత vanity లా అనిపించినా కూడా) ఒక మంచి పనే అనిపించింది.
మనం చదివే పుస్తకాలు కేవలం మనకి సంబంధించినవే కావు. మన మనుషులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రభావితం చేస్తాయి ఆ ఎంపికలని. ఆలోచించుకుంటే అవ్వన్నీ కూడా ఆసక్తికరమైన విషయాలే. నా పుస్తక పఠనంలో ఏ 2010-11తోనో పోల్చుకుంటే ఇప్పటికి వచ్చిన మార్పుల్లో కొన్ని.
ఒక సబ్జెక్ట్ లో డీప్-డైవ్:
నేను చిన్నప్పటి నుంచీ పుస్తకాలు చదవలేదు కాబట్టి, చదవడం మొదలెట్టిందే ఇరవైల వయసులో కాబట్టి దొరికిన పుస్తకం దొరికినట్టు చదువుతూ పోవడం నాకెప్పుడూ మామూలు అనిపించలేదు. అది ఒక unorganized, ineffective పద్ధతే అనిపించింది. అందుకని పద్ధతిగా ఒక సబ్జెక్ట్ తీసుకుని దాని మీద వీలైనన్ని పుస్తకాలు చదవాలనుకుంటూనే ఉన్నాను గానీ కుదర్లేదు. ఒక ఫ్రెండ్ రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఏడు వాల్యూమ్స్ గిఫ్ట్ కూడా చేశారు. అడపాదడపా తప్పించి వాటి జోలికి పెద్ద వెళ్ళింది లేదు.
2012లో మొదట పార్టీషన్ గురించి చదవడం మొదలెట్టాను. ఆ ఏడాది చివర్లో మంటో పరిచయమైయ్యాడు. అప్పటినుంచీ పార్టిషన్ మీద బాగానే చదివాను. మంటోని అనువాదం చేస్తూ ఆయన గురించి వేర్వేరు విషయాలు చాలా తెల్సుకున్నా గానీ, మొదట ఆసక్తి కలగడం మాత్రం ఆయన విభజన గురించి రాసినవే! అలా చదువుకుంటూ చదువుకుంటూ పోతే ప్రస్తుతానికి ఇన్ని పుస్తకాలు అయ్యాయి. కిండిల్‍లోనూ, కొన్ని ప్రింట్‍లోని విలువైన పుస్తకాలు పిడిఎఫ్ రూపంలోనూ ఉండడం వల్ల, ఇది పూర్తి జాబితా కాదు. వీటిని గురించి రాయాల్సింది, మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది.
భారతీయ సాహిత్యం అనువాదంలో
మొదట్లో అంతా ఎక్కువగా యూరోపియన్ రచయితలనే చదివేదాన్ని. ఇప్పటికీ వాళ్ళ రచనలతో, ముఖ్యంగా ఫిక్షన్ విషయంలో, ఒక గాఢమైన అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. భారతీయ సాహిత్యం గురించి నాకు కొన్ని అపోహలుండేవి. ఆర్ట్ సినిమాల గురించి ఉండే అపోహల్లాంటివే! లోకమంతా అన్యాయంతో నిండిపోయింది, కూడూ గుడ్డ లేక అందరూ అలమటిస్తున్నారు – ఇవే రాస్తుంటారు అని అనుకునేదాన్ని. కానీ చదవడం మొదలెట్టాకే అర్థమైంది మనవాళ్ళలో వైవిధ్యం, చెప్పడంలో సరళత.
స్కూల్‍లో నేర్చుకున్న అరకొర దేవనాగరితో హింది/ఉర్దూ పుస్తకాలు బాగానే చదువుకోగలిగినా తక్కినవాటికి మాత్రం ఇంగ్లీషు మీదే ఆధారపడాల్సి వచ్చింది. ఒకట్రెండు కన్నడ పుస్తకాల ఆంగ్లానువాదాలు తప్పించి, మిగితావన్నీ బాగా నచ్చాయి. వీలైనంత వరకూ వేర్వేరు భాషల సాహిత్యం చదవడానికి ప్రయత్నించాను. గుజరాతి, రాజస్థానీ, ఒడియా భాషల్లో చదివింది చాలా తక్కువ. ఈశాన్య రాష్ట్రాల సాహిత్యంలో మాత్రం కొన్ని ఆణిముత్యాలు దొరికాయి.
#readmorewomen
యూరోపియన్ సాహిత్యమంటే అంత ఇష్టమని చెప్పాను కదా, కానీ అందులో ఒక్కరంటే ఒక్కరు కూడా మహిళా రచయిత లేరు. నాకసలు ఈ జెండర్ స్ఫృహ లేదు, వినిపిస్తున్న – దొరుకుతున్న పుస్తకాలు పట్టుకుని చదువుకోవడమే తప్పించి అని అనుకునేదాన్ని. కానీ ఈ వినిపిస్తున్న-దొరుకుతున్న పుస్తకాలని కూడా మార్కెట్ నిర్ణయిస్తుందని, ఆ మార్కెట్ మగవాళ్ళు కాని రచయితలకి అనుకూలంగా లేదని తెల్సుకున్నాక పట్టుబట్టి మహిళా రచయితల కోసం వేట మొదలెట్టాను. ఈ విషయంలో https://electricliterature.com/ వాళ్ళ ఆర్టికల్స్ చాలా సహాయం చేశాయి. వాళ్ళ స్ఫూర్తితో హాన్స్ ఇండియా పత్రికకి నేనూ ఒక వ్యాసం రాశాను. (లింక్ ఇక్కడ: https://aksharf.com/2021/03/26/read-more-women-hans-india/)
ఈ మధ్యకాలంలో అయితే ముఖ్యంగా భారతీయ మహిళలు రాసిన మెమొయిర్స్ నన్ను బాగా ప్రభావితం చేశాయి. వాటిల్లో కొన్ని ఇవి.
చిత్రకళకు సంబంధించిన పుస్తకాలు
భారతీయ సాహిత్యం గురించే కాదు, భారతీయ కళల గురించి కూడా నాకు చాలా అపోహలుండేవి. అందులో ముఖ్యమైంది, భారతీయ కళలు మతంతో ముడిపడి ఉంటాయి, అవి నాలాంటి దేవునిపై నమ్మకంలేని జీవులకి ఏమీ ఇవ్వలేవు. అందుకని గుళ్ళకి గోపురాలకి ఎప్పుడన్నా వెళ్ళాల్సి వచ్చినా చాలా విసుక్కుంటూ వెళ్ళేదాన్ని. కానీ, ఎందులోనైనా మనకి నేర్చుకునే అవకాశముంటుంది, ముఖ్యంగా భారతీయ కళలూ, సంస్కృతీ homogenous కానే కాదనీ, వాటిల్లో ఉన్నంత accommodative nature బహుశా మరెక్కడా దొరక్కపోవచ్చననీ, ఒక కళని అంటిపెట్టుకుని, దాని చుట్టూ కంచె కట్టుకునుండే నియమాలు, నిబంధనలు (ఎవరు అభ్యసించవచ్చు, ఎక్కడ ప్రదర్శించవచ్చు) బట్టి కళని జడ్జ్ చేయకూడదనీ అర్థమైయ్యాక నా ప్రపంచం (అక్షరాలా) రంగులమయమైంది.
నాట్యమైనా, శిల్పమైనా, చిత్రమైనా దానికీ ఒక భాష, ఒక పరిభాష ఉంటాయి. మనమెంత సేపూ “క్లాసికల్ ఆర్ట్స్ బోర్ అబ్బా!” అని ఎందుకనుకుంటామంటే, ఆ భాష-పరిభాష మనకి చెప్పినవాళ్ళు లేరు కనుక. ఒకసారి ఆ భాషకి అలవాటు పడితే, అందులో ఉన్న సరుకు అర్థమైతే ఒక డాంటె రాసిన ఇన్‍ఫర్నోకి, శ్రీనాథుడు రాసిన కావ్యాలకీ, హలెబిడులో చెక్కిన శిల్పాలకీ ఏం తేడా ఉండదు. అన్నింటిలో ఉన్నది అదే రసానుభూతి. ఇంకో తమాషా ఏంటంటే ఈ కళలన్నింటికీ (నాట్యం, శిల్పం, చిత్రం) శాస్త్రం ఒక్కటే. ఒక భాష నేర్చుకుంటే మూడు లిపుల్లో చదువుకోవచ్చు, రాసుకోవచ్చు లాంటిది అన్నమాట.
చిత్రకళలకి సంబంధించిన పుస్తకాలు నేను ఎక్కువగా ఈ కల్చరల్ టూరిస్ట్ స్థలాల్లో ఉండే స్టాల్స్ లో కొన్నాను. ఒక పుస్తకం కొనడం ద్వారా ఒక మనిషికి ఉక్కిరిబిక్కిరి అయ్యేంత ఆనందం కలిగించచ్చని నాకు అంతకు ముందు తెలీదు. కర్ణాటక, కేరళలలో ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్ మెంట్ స్టాల్స్ లో ఉండే స్టాఫ్ పుస్తకం గురించి వాకబు చేస్తేనే మురిసిపోతారు. ఇహ కొంటే, దండేసి దండం పెట్టడమే తరువాయి.
మ్యూరల్ పెయింటింగ్ మ్యూజియమ్, త్రిశూర్‍లో బయటకొచ్చేస్తూ వాళ్ళు పెట్టిన పుస్తకాలు చూస్తుంటే నా ఫ్రెండ్స్ గేట్ దగ్గర వెయిట్ చేస్తామంటూ వెళ్ళారు. ఒక అరగంటకి గానీ నేను బయటకు రాలేదు. నన్ను గేట్ వరకూ దిగబెట్టడానికి స్టాఫ్‍లో ఒకాయన వచ్చారు. గేట్ దగ్గర మళ్ళీ కాసేపు సంతోషపడిపోతూ మాట్లాడి, నా చేతికో కవర్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇదంతా చూసిన నా ఫ్రెండ్స్ నేనేదో భారీ డొనేషన్ చేసేశాననుకున్నారు. తీరా చూస్తే, ఆ ఉత్సాహమంతా పదిహేనొందలు బిల్ చేసినందుకు, వాళ్ళ పుస్తకాలు కొన్నందుకు!
ఈ స్టాల్స్ నిర్వహించేది కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన విభాగాలే. ఎక్కడోగాని ప్రైవేట్ సంస్థలుండవు. ఇక్కడి స్టాఫ్‍కి పుస్తకాలు అమ్మడంతో పాటు వేరే పనులు చాలానే ఉంటాయి. అయినా అడిగిన ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానమిస్తారు. వాళ్ళకి తెలీని విషయాలు కనుక్కుని చెప్తారు. చిల్లర అటూ ఇటూ అయితే వాళ్ల పర్సుల్లోంచి ఇస్తారు. “ఆ వచ్చారులే, కొన్నారులే!” అన్నట్టు మొహాలు పెట్టరు.
అదే సాహిత్యానికే ప్రత్యేకించిన సాహిత్య అకాడెమీ ఆఫీసులో పుస్తకాలు కొనడానికి వెళ్తే బిల్ ఒక్కటీ అతి కష్టం మీద రాసిచ్చి, డబ్బు తీసుకుంటారు. మూలల్లో డబ్బాల్లో ఉన్న పుస్తకాలు బయటకు తీసుకోవడం, దుమ్ము దులుపుకోవడం, వెతుక్కోవడం లాంటి పనులన్నీ మనమే చేసుకోవాలి. What a contrast!
పుస్తకాల కొనుగోళ్ళూ, ఆపై చదవకపోవడాలూ
అను అనివార్యమైన విషయముల గూర్చి హైరానా దేనికి? ఎటూ తప్పనివే అవి అని ఒప్పుకోవడంలోనే సుఖముంది. అంతకు ముందు చదవాలనుకున్నవి కొనీ చదవకపోవడమనేది ఒకటే బాధ. ఇప్పుడు ముందు కిండిల్‍లో చదివేసి, బాగా నచ్చేసి, తెప్పించిన హార్డ్ కాపీని మాత్రం మొహం చూడకపోవడమనేది కొత్త బాధ. టెక్నికల్లీ, ఇదీ చదవని పుస్తకం కిందే లెక్కకు వస్తుందా? ఏమో.
అందుకే జపాన్‍వాళ్ళు మంచోళ్లు. దీనికో పదాన్ని కనిపెట్టి ఒక legit behaviour అని ముద్ర వేశారు. (ఈ పుస్తకం మస్త్ ఉంటుంది. వీలైతే కొనుక్కుని దాచుకోదగ్గ పుస్తకం)
చివరిగా, గ్రాంట్ స్నైడర్‍కి ఒక “ఓ” వేసుకుంటూ:
Leave a Reply