అంబేడ్కర్ – కొన్ని రచనలు – ఒక పరిచయం

ఆ మధ్య మా లైబ్రరీ వెబ్సైటులో అరువు తెచ్చుకోడానికి ఏదో పుస్తకం కోసం వెదుకుతూ ఉంటే దొరకలేదు. ఎందుకో గానీ వెంటనే అంబేడ్కర్ అని వెదికాను. “What Babasaheb Ambedkar means to me” అన్న వ్యాస సంపుటి ఒక్కటి వచ్చింది. ఆ పుస్తకం ఆపకుండా చదివించడమే కాకుండా ఓ ఊపు ఊపి, దిమ్మ తిరిగేలా చేసింది. దెబ్బకి కష్టపడి కొన్నైనా అంబేడ్కర్ రచనలు చదువుదాం అనుకుని మొదలుపెట్టి కొన్ని రోజులుగా… ఎప్పుడు ఖాళీ దొరికితే అపుడు.. పగలు రాత్రి తేడా లేకుండా .. ఒక్కోరోజు నిద్ర మానేసి … అంబేడ్కర్ సమగ్ర రచనల సంకలనాల నుండి నాకు అర్థమయ్యే స్థాయికి తగ్గ రచన ఏదో ఒకటి ఎంచుకుని చదువుతూ పోతున్నా. ఈ చదువుల గురించి ఒక చిన్న పరిచయం చేస్తాను ఈ వ్యాసంలో. మొదట నన్నీ దారిపట్టించిన పుస్తకంతోనే మొదలుపెడతాను:

What Babasaheb Ambedkar means to me: ఇది అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 2017లో వచ్చిన పుస్తకం. ప్రచురణకర్తలు ఈ పుస్తక శీర్షికతో వ్యాసాలు రాయమని యువతీ యువకులని ఆహ్వానించారు. వచ్చిన వాటిలోంచి కొన్ని ఎంపిక చేసి ఈ పుస్తకంగా వేశారు. ఇదీ పుస్తకం వెనుక కథ. ఈ పుస్తకంలో కొన్ని వ్యాసాలు పూర్తిగా అంబేడ్కరిజం అన్న పేరు పెట్టిన భావజాలాన్ని వివరిస్తూ సాగాయి. కొన్ని ఈ పేరు పెట్టకుండా అంబేడ్కర్ జీవితం, కృషి గ్రామాలలో నివసించే వారి మధ్యకి కూడా ఎలా వ్యాపించిందో చెప్పాయి. చాలా వ్యాసాలు రచయితల జీవితంలో అంబేడ్కర్ కి ఉన్న పాత్రని పదాడంబరం లేకుండా,సూటిగా చెప్పాయి. నన్ను బాగా కదిలించిన వ్యాసాలు ఇవే ఈ పుస్తకంలో. కొన్నింటిని కింద ఉదహరిస్తున్నాను:

“Babasaheb means to me a dream that is waking up with thousands of us striving towards becoming the essense of him. I dare say – ‘I am Ambedkar'” అంటుంది స్వాతి కంబ్లే అన్నామె. ‘I am Ambedkar’ అన్న తన వ్యాసంలో.

“A classmate would call him “Baba” as his father, and this deeply emotional connect to a thinker was something new I was witnessing for the first time.” – అంటుంది శృతి హెర్బర్ట్ “Babasaheb: Unravelling and rebuilding my world” అన్న తన వ్యాసంలో.

“Babasaheb makes me feel strong and purposeful” అన్న శీర్షిక పెట్టుకున్నాడు వినయ్ షెండే తన వ్యాసానికి. “When I am happy, I look up to him. When I am sad or depressed, I look up to him.” అంటాడు ఇతను.

అంబేడ్కర్ పటం ఇంట్లో పెట్టుకోడం గురించి చెబుతూ – “We don’t workship, we thank, we salute Babasaheb” అంటాడు అరవింద్ బౌద్ధ్.

ఒకాయన ఎంత మేధావి, నాయకుడు గట్రా గట్రా అనుకున్నా, ఆయన చనిపోయిన ఇన్నేళ్ళకి కూడా యువతీయువకులని ఇంతగా ప్రభావితం చేస్తున్నాడంటే ఓ దండం పెట్టాలనిపించింది. వాళ్ళన్నట్లే భక్తితో కాదు.. గౌరవంతో.

“Bhima’s force shall keep growing” అన్న వ్యాసంలో ప్రధ్న్యా జాదవ్ భీం గీతె అన్న పాటలని పరిచయం చేసింది. పెద్ద పెద్ద పుస్తకాల ద్వారా కంటే ఆ పాటల ద్వారా అంబేడ్కర్ భావజాలం ప్రజల మధ్యకి బాగా చొచ్చుకుపోయింది అంటుంది. “The masses who were deprived of education were the first people to understand Ambedkar. … these songs by our foremothers documented the history of Babasaheb’s life in a wholesome manner. … The Bheemgeete were sung during the naming ceremony of a newborn so that the baby grows up with the character of Babasaheb and is blessed with Babasaheb’s presence throughout her life. The Bheemgeete are also sung during death ceremonies so that the people in mourning get the strength to deal with the loss … ..” అంటూ తమ జీవితాలలో ఆ గీతాల పాత్రను వివరించింది.

“A Tribute to my teachers” అన్న గౌరీ పట్వర్ధన్ వ్యాసం వీటన్నింటిలోకి కొంచెం ప్రత్యేకం అనిపించింది నాకు. మిగితా వ్యాసాలలా కాక.. ఒక అగ్రవర్ణ యువతి… అంబేడ్కర్ ని రాజ్యాంగ నిర్మాతగా తప్ప ఎరుగని మనిషి… ఏదో ప్రాజెక్టు పనిలో భాగంగా ఒక డాక్యుమెంటరీ తీస్తూ అంబేడ్కర్ ఎంతో మంది జీవితాలపై చూపిన ప్రభావం ఎలాంటిదో తెలుసుకుంది. ఈ క్రమంలో బాలన్న నిమల్ అనే తెలుగు దళిత వాగ్గేయకారుడు (మరాఠీ భాషలోనే భీంగీతె రాసి, పాడారంట) గురించి, ఆయన కృషిగురించి పరిచయం చేసింది ఈ వ్యాసంలో. ఇక్కడ రాసినదాన్ని బట్టి ఈ బాలన్న ఎవరో చాలా గొప్పాయన లాగా ఉన్నాడు, ఇంకొంచెం తెలుసుకోవాలి అనిపించింది.

చివరిలో వచ్చిన “Babasaheb, you, have been betrayed” అన్న వ్యాసంలో ఉన్న ఈ వాక్యం చాలా నిజం అనిపించింది నాకు.
“Ambedkar remains indispensable. The questions which were raised by Ambedkar on nation and nationalism, unity of the country, danger of Hinduism, democracy, reservation, equality, annihiliation of caste, women’s liberation, democratic socialism, equal distribution of resources, education and so on, find genuine resonance even today.”

పుస్తకం లోని బొమ్మలు కూడా లోతుగా ఉన్నాయి. మొత్తానికి నేను చదివిన ఒక విలువైన పుస్తకంగా లెక్కకడతాను దీన్ని. దీన్ని గురించి చెప్పి చెప్పి ఇద్దరి చేత “కొని చదువుతా” అనిపించా పూర్తిచేసిన రోజే. 🙂 ఈ పుస్తకం చదివాక అంబేడ్కర్ ఏంరాశాడు? అన్న కుతూహలం కలిగింది. దానితో వరుసబెట్టి కొన్ని చదవడం మొదలుపెట్టాను. వాటి సంక్షిప్త పరిచయం క్రింద రాస్తున్నాను:

“Castes in India – Their mechanism, genesis, and development”: ఇది 1917లో పాతికేళ్ళ వయసులో అంబేడ్కర్ ఒక అకడమిక్ జర్నల్ లో ప్రచురించిన వ్యాసం. దీనిని అంతకు ఓ ఏడాది ముందు కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎమ్మే విద్యార్థిగా ఒక కోర్సులో పరిశోధనాపత్రంగా సమర్పించాడు అంట ఆయన. వ్యాసం శీర్షికలో ఉన్నట్లే ఇది భారతదేశంలో కులాలు ఎలా పుట్టాయి? అన్న విషయమై ఒక సిద్ధాంత ప్రతిపాదన. సిద్ధాంతం కనుక సమర్థన కోసం వాదనలుంటాయి కానీ ప్రూఫులు ఉండవు. కానీ, వ్యాసంలో నన్ను ప్రధానంగా ఆకట్టుకున్నవి రెండు విషయాలు:

  • అంబేడ్కర్ భాష, భావ ప్రకటనలో స్పష్టత. ఎవరో పాశ్చాత్యులు రాసిన ఆంగ్లం చదువుతున్నట్లు ఉండింది. ఆయన నేపథ్యానికి పాతికేళ్ళు కూడా లేకుండా ఇంత ప్రావీణ్యం చూపాడంటే ఎంత మేధావో, ఎంత కష్టపడి చదివుంటాడో, అనుకున్నాను.
  • వ్యాసం ముగుస్తూండగా రాసిన ఈ పేరా వ్యాసం కంటే నచ్చింది నాకు అసలు:
    ” Sentiment must be outlawed from the domain of science and things
    should be judged from an objective standpoint. For myself I shall find
    as much pleasure in a positive destruction of my own ideology, as in a
    rational disagreement on a topic, which, notwithstanding many learned
    disquisitions is likely to remain controversial for ever. To conclude,
    while I am ambitious to advance a Theory of Caste, if it can be shown to
    be untenable I shall be equally willing to give it up.”

ఈ వ్యాసంలో ప్రతిపాదన నాకు అంత బలంగా అనిపించలేదు చదవగానే.. కానీ ఆయన రచనలో క్లారిటీ, ఈ చివరి పేరా చూసి, ఇంకా ఏవన్నా చదువుదాం అని నిర్ణయించుకున్నాను.

Waiting for Visa“: పాతిక పేజీలు మించని చిన్న పుస్తకం. ఇందులో అంబేడ్కర్ తనకి అస్పృశ్యతతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిగిన అనుభవాలను రాశారు. పుస్తకం శీర్షిక చూసి నేను మొదట ఆయన విదేశాలకి వెళ్ళే సంగతులేమో అనుకున్నా. మళ్ళీ అప్పట్లో వీసాలుండేవా అని అనుమానం వచ్చింది. అయితే, బహుశా అంటరానితనం నుండి విముక్తిని కోరడానికి మెటఫర్ గా ఈ శీర్షిక వాడారేమో అనిపించింది.

Dr. Babasaheb Ambedkar writings & speeches, Volume 1: ఇది మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన అంబేడ్కర్ సమగ్ర సాహిత్యంలో మొదటి భాగం. ఇలాంటివి పదిహేడున్నాయి (అయితే చివరిది పదిహేడవ భాగాన్ని ఓసారి తిరగేస్తూ ఉంటే అది ఆయన రాసినది కాదు…ఆయన గురించి రాసినది అని అర్థమైంది). ఈ పుస్తకంలో అంబేడ్కర్ రాసిన ప్రసిద్ధ రచన Annihiliation of Caste తో పాటు పైన ప్రస్తావించిన Castes in India, ఆపైన పలు దేశ రాజకీయాలకి, ముఖ్యంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన కాలం నాటి వ్యాసాలు, ఒక పుస్తక పరిచయం, ఇలా రకరకాలవి ఉన్నాయి. ఇందులో “Annihiliation of Caste” నన్ను అన్నింటికంటే బాగా ఆకట్టుకున్న రచన. ఎంత స్పష్టంగా, తేలికగా అర్థమయ్యేలా వివరించాడు? అనుకుని ఆశ్చర్యపోయా. ఇందులో ఏముంది? అన్నది లింక్ చేసిన వికీపీడియా పేజిలో ఉంది, నేనంతకంటే ఏం‌ చెప్పను. పుస్తకం నా మీద బలమైన ప్రభావం చూపించిందని, ఏదో సడన్ గా జ్ఞానోదయం అయిన భావన ఇంకా వదల్లేదని మాత్రం చెప్పగలను.

ఇక ఈ సిరీస్ గురించి ఒక రెండు ముక్కలు చెప్పాలి: మొత్తం పదిహేడు సంపుటాలు విదేశాంగ శాఖ వారి వెబ్సైటులో ఉచితంగా దిగుమతికి ఉన్నాయి. ఒక్కో భాగానికి ముందు ఓ గొప్ప పరిచయం రాశారు – ఆ పుస్తకంలో ఏమున్నాయి? వాటి నేపథ్యం ఏమిటి? వాటిని ఎడిటర్లు ఎందుకు ఇలా జతకలిపారు -అన్నీ వివరిస్తూ. ప్రతి వ్యాసం/ప్రసంగం గురించి ఒక పేరాగ్రాఫు సమ్మరీ కూడా ఉండింది. కనీసం నేను బ్రౌజ్ చేసిన మొదటి మూడు సంపుటాలూ చాలా శ్రద్ధతో చేసినట్లు అనిపించాయి. చివరి సంపుటం చూసినపుడు మాత్రం ఈ శ్రద్ధ లేదనిపించింది. అప్పటికి ముందు చేసిన ఎడిటర్ అనారోగ్యం కారణంగా వేరొకరొచ్చారు – దీనితో ప్రయారిటీ మారిపోయింది అనిపించింది. కానీ, ఈ వ్యాసమంతా చదివి ఏ ఒక్కరికైనా అంబేడ్కర్ రచనలు చదవాలనిపిస్తే మాత్రం ఇక్కడికెళ్ళి మొదలుపెట్టండి! మన తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఈ పదిహేడు సంకలనాలకీ పేర్వారం జగన్నాథం గారి సంపాదకత్వంలో అనువాదాలు తెచ్చారంట కానీ ఇలా పద్ధతిగా ఏదన్నా వెబ్ పేజి పెట్టారో లేదో నాకు తెలియదు మరి.

You Might Also Like

5 Comments

  1. 2021 – నా పుస్తక పఠనం – పుస్తకం.నెట్

    […] ఈ ఏటికి ఈయనే నా మీద అత్యంత ప్రభావం చూపిన మనిషి. మొత్తం సమగ్ర సాహిత్యం 17 భాగాలు. మిగితా భాగాల్లో కూడా మధ్య మధ్య ఏదో ఒకటి తీసి చదువుతూనే ఉన్నా ఏడాది పొడుగుతా. వీటిల్లో కొన్నింటి గురించి గతంలో పుస్తకం.నెట్ లో రాశాను. […]

  2. leol

    అంబేడ్కర్ గారి రచనలు ఏవీ యింత వరకు చదవలేదు. Annihiliation of Caste తో మొదలు పెడతాను. మంచి పరిచయం సౌమ్య గారు. ధన్యవాదాలు.

  3. Sowmya

    Here is the link to the Telugu translations of Ambedkar’s writings and speeches, published by Telugu university:
    http://teluguuniversity.ac.in/dr-b-r-ambedkar-writing-speeches/

  4. తమ్మినేని యదుకుల భూషణ్

    పుస్తకాలు చదవడం కూడా ఒక కళ .మన పరిమిత జీవితంలో, లెక్కలేనన్ని పనులమధ్య, కొన్ని పుస్తకాలను ఎంపిక చేసుకుని చదవడం గొప్ప కళ అనిపిస్తుంది. ఈ రోజు అంబేద్కర్ జన్మదినం ( ఏప్రిల్ 14) -ఆయన గూర్చి సౌమ్య రాయడం సముచితం.
    ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున, తెలుగు విశ్వ విద్యాలయం సారథ్యంలో చాలా సంపుటాలు వచ్చాయి.ఆసక్తి ఉన్నవారు చదవగలరు. నా సలహా ఏమిటంటే -కొన్ని పుస్తకాలు ఆంగ్లంలోనే చదవమని -ముఖ్యంగా -పాకిస్తాన్ విభజన, Aryan Invation Theory ( AIT) మీద అంబేద్కర్ రచనలు ;అంబేద్కర్ వాదనా పటిమ అపూర్వం. కూలంకషంగా విషయాన్ని తెలుసుకుని, సమగ్రంగా విచారవిమర్శ చేయడం వారి పద్ధతి.భారతదేశంలో అతి పెద్ద వ్యక్తిగత గ్రంధాలయం వారిదే. రెండవది ప్రముఖ తెలుగు సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు గారిది. పొతే, 1996 లో వచ్చిన అంబేద్కర్ రచనలు – ప్రసంగాలు 12 వ సంపుటం కు లింకు : https://archive.org/details/in.ernet.dli.2015.390056/mode/2up

  5. Malleswari

    సారమంతా కుమ్మరించకుండా పరిచయం చేయడం బావుంది.ఈ సంపుటాలు కొన్ని పుస్తకాలుగా, కొన్ని లింక్ రూపంలో నా దగ్గర ఉన్నాయి.

Leave a Reply