లోలోపల విధ్వంసాల బతుకు చిత్రం
(ఇది చంద్రశేఖర్ ఆజాద్ పి. రాసిన “విపరీత వ్యక్తుల” నవలకి దాట్ల దేవదానం రాజు రాసిన ముందుమాట. అనిల్ అట్లూరి రాసిన మరో ముందుమాటని గతవారం ప్రచురించాము. – పుస్తకం.నెట్)
అసలు స్వేచ్ఛగా ఉండేదెవ్వరు? అందులోనూ సంక్లిష్ట జీవితాల్లో. విభిన్న వాతావరణాల్లో. సమూహపు విరుద్ధ భావన అంత:కరణాల్లో. పోనీ పక్షులుంటాయా? అవి కూడా ఆకాశానికి బందీయే కదా అంటాడొక కవి. నీ మనసులో మాటన్నింటినీ బయట పెట్టగలవా? నీలోని సకల కల్మషాల్నీ కడుక్కోగలవా? ఆచరణలో నీవెక్కడున్నావు? ఏదో మూల దాక్కునే ఉన్నావు కదా. పలాయనం చిత్తగిస్తూనే ఉన్నావు కదా. ఏది నీదో ఏది నీది కాదో తర్కించుకుంటూనే ఉన్నావు కదా. తాత్వికంగా ఆలోచిస్తే తప్ప కొన్నింటికి సమాధానాలు రావు. పాఠకునికి అదనపు శ్రమ ఉండకూడదు. అరటిపండు ఒలిచి నోటికి అందించాలి. అటువంటి రచను కాలక్షేపానికి పనికొస్తాయి. నవల పఠనీయంగా ఉండాలి. కొంత వ్యాఖ్యానం ఉండాలి. కొంత చర్చ జరగాలి. కొన్ని ప్రశ్నలు మొలవాలి. ఒక భిన్నమైన దృక్పథాన్ని ప్రతిపాదించాలి. తలుపు తామే తెరవాలి. విస్తారమైన రచనానుభవం ఉన్న చంద్రశేఖర అజాద్ మూస ధోరణిలో అందరూ అంగీకరించే దారిలో నడవడానికి ఇష్టపడరు. అందుకు ఈ ‘ విపరీత వ్యక్తులు ’ నిలువెత్తు ఉదాహరణ.
ప్రేరణ లేకుండా ఏ రచనా వెలువడదు. అలా రాస్తే ఉపరితలంలో తచ్చాడుతూ తేలిపోవడం తధ్యం. ఒక నవల రాయడం వెనుక చాలా శ్రమ దాగి ఉంటుంది. మథనం ఉంటుంది. ఒత్తిడి ఉంటుంది. నిద్రలేమి ఉంటుంది. కథాగమనం పట్ల సంశయాలుంటాయి. పాత్రలు రచయితను ఎదిరించే సన్నివేశాలుంటాయి. మానసిక సంఘర్షణ ఉంటుంది. మార్గం తప్పుదారి పడుతుందేమోనని భయం ఉంటుంది. వీటన్నిటి నుంచీ తట్టుకుని నవల సాగాలి. మొత్తమ్మీద ఒక జీవితం ఆవిష్కరింపబడాలి. ఈ బాధ చదివేవాడికి అక్కర్లేదు. చంద్రశేఖర అజాద్‌కు తనను తాను సమన్వయపరచుకుని విశాల భావనల్ని ప్రోది చేసుకుంటూ చాలా ప్రశాంతంగా తొట్రుపడకుండా నవల రాయగలిగే శక్తి సామర్ధ్యాలున్నాయి. ఆ విషయం ప్రతి వాక్యం లోనూ కనిపిస్తుంది. రచయిత భావనా ప్రపంచంలోంచి తను నమ్మిన విశ్వాసాల లోంచి తనదైన సంస్కారం లోంచి నవల పుడుతుంది. ప్రాపంచిక దృక్పథానికి పరిశీలనా శక్తి మనుషుల మనస్తత్వాల్ని చదవడం తోడైతేనే మంచి నవల వస్తుంది. ఇదంతా అప్రయత్నంగానే జరిగిపోతుంది.
రచయిత సమాజంలోని వాడే. ఎక్కడ్నుంచో ఊడిపడడు. రకరకా వ్యక్తులు కలుస్తుంటారు. అందరూ ఒకలాంటి స్వభావాలు కలిగి ఉండరు. భిన్నమైన ఆలోచనతో రగిలిపోయే వారుంటారు. విచిత్రమైన ప్రవర్తన కలవారుంటారు. విపరీత వ్యక్తులూ ఉంటారు. ఈ విపరీత వ్యక్తుల జీవితమే మనల్ని వెంటాడుతుంది. అలాంటి ఒక విచిత్ర వ్యక్తి చంద్రశేఖర అజాద్ లాంటి వారికి తారసపడితే ఏమౌతుంది? అతగాడి ముద్ర బహుముఖంగా బుర్రలో విస్తరించి తిన్నగా ఉండనీయదు. ఊరికే ఉండలేనితనం ఆవహిస్తుంది. అక్షరాల్లో అనువదించుకుని బరువు దించుకోవాలి. లేకపోతే పెనుభారమై కూర్చుంటుంది. చంద్రశేఖర అజాద్ బరువు దించుకుని తేలికపడ్డ ఫలితమే ఈ నవల . ఈ నవల వెనుక పెద్ద కథే ఉంది. దాన్ని విడమరచి చెబితే మీరు నమ్మరు.
సామాజిక, కుటుంబ సంబంధాలకు భిన్నంగా స్పందించే పాత్ర గౌతమ్‌ది. అతని బాపతు మనోప్రపంచపు తలుపు తెరవనంత కాలం నిజ లోకానికి అసహజంగా అపసవ్యంగా కనబడతాడు. నవలలో ఒక పాత్రగా మిగిలిపోతాడు. అటువంటివాడి చిత్తప్రవృత్తి తాలూకు అసలు కారణం తెలిస్తేనే అర్థమౌతాడు. వాళ్లు జీవితాన్ని జయిద్దామనుకుంటారు. కానీ తమకు తెలియకుండానే అపజయం పాలవుతారు. లేదా మిగిలిన వారి కంటే మేధావి గానే ఉండిపోతాడు. ఇటువంటి వ్యక్తులు తాము తప్ప మిగిలివారు తెలివి తక్కువ వారనే భ్రమలో
ఉండిపోతారు. బయటకు రాలేరు. నీతి సూత్రాలు పట్టించుకోరు. వ్యసనాల దుష్పరిణామాల గురించి కూడా ఆలోచించరు. కానీ ఇందులో గౌతమ్ సజీవంగా ఈ నేల మీద నడుస్తున్నవాడే. ఇప్పటికీ తనదైన లోకాన్ని సృష్టించుకుని జీవిస్తున్నవాడే.
నిజానికి ఆత్మకథగా ప్రధమ పురుషలో గౌతమ్ కథ రాయాలి. చంద్రశేఖర అజాద్ జీవితచరిత్ర చేశారు. అంతిమంగా మనిషికి కావాల్సిందేమిటి? గౌతమ్ దేనికైతే బందీ అయ్యాడో దాన్ని తెంచేసి స్వేచ్ఛ లేదా తనకిష్టమైన జీవన గమనంలోకి పరుగెట్టాడు. ఆరాటాలూ, ఆశలూ, కోరికూ, తాపత్రయాలూ వీటి నుండి ముక్తి పొంది ఒక తాత్వికతను నింపుకోవడమే గౌతమ్ చేసింది. ఇటువంటి వాడికి ఏదీ కూడా తృప్తినివ్వదు. అలా తృప్తినివ్వకపోవడమే విపరీత వ్యక్తి మనస్తత్వం అవుతుంది. ఎవరినీ లెక్క చేయడు. ఏ నియమ నిబంధనలకు బద్ధుడు కాడు. సమూహంలో ఏకాకి అవుతాడు. గిరి గీసుకుంటాడు. ఎవరినైనా అవతల నుంచి మాట్లాడతాడు. వాదించి చీల్చి చెండాడుతాడు. అది అతని నైజం అనుకుంటాడు. అతని బారిన పడకుండా తప్పించుకున్నవాడు ఈ లోకంలో ఎవరూ ఉండరు. ఉన్నట్టుండి గీత దాటి బయటకు వచ్చేస్తాడు. అటువంటి వాడిని మీరెప్పుడైనా చూశారా?
‘నువ్వు నీలాగ బతుకు. అందుకు ప్రయత్నం చెయ్యి. ఇంకొకరి ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టకు ’
‘ఇప్పటి చదువు మాత్రం చిటికెలో బంధాలను తెంచేందుకు పనికొస్తున్నాయి. ఇక సెలవు ’
‘ అప్పుడప్పుడు నీ జాతి గురించి మాట్లాడేవాడివి. వాళ్లనీ వీళ్లనూ తగలబెట్టాలి అంటావు కదా…నీ జాతి కోసం ఎప్పుడైనా ఏమన్నా చిన్న పని చేసావా? చిన్న యుద్ధం చేసావా? కనీసం నీ జాతి మీద దాడులు జరిగినపుడు ఒక్కసారన్నా ఏడ్చావా? పక్కవాడిని చూడవు. పలకరించవు. నీకు దేశం కావాలి. ’’
చూపుడుమలును అతని ముందు కదిలిస్తూ మేరీ అన్న మాటలివి.
అంతకుముందు రాజీపడదామని వచ్చిన మేరీ అన్నమాటలు కూడా వినాలి.
‘డబ్బు సంపాదించమని చెప్పడమే నేరమా? ఏమైతే అసంతృప్తులున్నాయో అన్నీ మార్చుకుంటాను. మీరేది పెడితే అదే తిందాం ’
గౌతమ్ ఒకరి కోసం బతకానుకోలేదు. అతనికి తనకే పరిమితమైన ఆదర్శాలున్నాయి. కళ మీద మాత్రమే చూపు ఉంది. చుట్టూ ఉన్నవన్నీ బంధనాలే అనుకున్నవాడు పెళ్లి చేసుకోకుండా ఉండి పోవచ్చు. కానీ పెళ్లాడాడు. పిల్లాడ్నీ కన్నాడు. తర్వాత పెళ్లి బంధం వద్దనుకున్నాడు. పరస్పర విరుద్ధ భావనల ప్రతిరూపం గౌతమ్‌ది. ఇతరులకు హాని తల పెట్టనంత వరకు ప్రపంచం అందంగా ఉంటుందన్న ఆలోచన కలగడంతో నవల ముగుస్తుంది.
ఒక కొత్త వ్యక్తితో అయిదు నిమిషాలు మాట్లాడితే ఒక కథ రాయగలనని ఓ హెన్రీ కాబోలు అన్నాడు. చంద్రశేఖర అజాద్ కేవలం రెండు గంటలు గౌతమ్‌తో ఉండి విపరీతవ్యక్తులు రాశారు. నేను సాక్షిని. ఇతని కథను నవలగా రాయాలని ఉందని అపుడే చెప్పారు. నాకిది ఆశ్చర్యకరమైన నమ్మశక్యం గాని విషయమే. ఆయన చెప్పారు నేను విన్నాను అనుకున్నాను. అజాద్ అన్నంత పనీ చేశారు. ఒక వ్యక్తిత్వం మనసులో బలంగా నాటుకుంటే జరిగే పరిణామంగా దీన్ని తలుస్తాను. అది చంద్రశేఖర అజాద్‌కే సాధ్యమైన విషయంగా భావిస్తాను.
చంద్రశేఖర అజాద్ వందకు చేరువలో నవలలు రాశారు. అంతర్జాతీయ స్థాయి బహుమతులు పొందిన రచయిత. ఒక నవలకు మరొక నవలకూ పోలిక లేకుండా రాయడం ఆయనకు తెలుసు. జీవితానుభవమూ రచనానుభవమూ విస్తారంగా ఉండటం వల్లనే అలవోకగా నవల రాసే విద్య చంద్రశేఖర అజాద్‌కు అబ్బింది. ఈ మాట అనడం సులువే. లోలోపల ఎంతో సంఘర్షణ ఎంతో యుద్ధం చేస్తేనే గానీ ఇలాంటి నవల రాయలేరన్న సంగతి నవల చదివిన వారికి అర్థమౌతుంది.
నవల చదవండి. భిన్న ప్రవృత్తుల వ్యక్తుల్ని మీ చుట్టూ ఎవరైనా ఉంటే పోల్చి చూడండి. సమాజంలో తచ్చాడే వింత వ్యక్తుల మనస్తత్వాల్ని అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి జీవనసరళిని నవలగా రాసి మెప్పించిన చంద్రశేఖర అజాద్‌కు అభినందనలు.
నిజ జీవితం లోని గౌతమ్ నాకూ మిత్రుడే. ఈ నవలలో ఒక పాత్రగా కూడా నేను ఉన్నాను. ఈ నాలుగు మాటలు రాయడానికి అదే ఆర్హత. స్నేహపూర్వకంగా నాకీ అవకాశం ఇచ్చినందుకు చంద్రశేఖర అజాద్ గారికి ధన్యవాదాలు.
– దాట్ల దేవదానం రాజు
ప్రతి ధరః రూః120.00
ప్రతులకు
నవోదయ బూక్ హౌస్,
Navodaya Book House
3-3-865,Opp Arya Samaj mandir,
Kachiguda,Hyderabad,
Pin Code: 500027,
Telangana,India.
Mob:+91-9000413413
Office:040-24652387
Web: www.TeluguBooks.in
*
Nava Telangana Book House and all its branches
NavaTelangana Book House,
M.H.Bhavan Plot No 21/1, Azamabad,
Near R.T.C. Kalyana Mandapam,
Hyderabad-500020.
Ph.No:040 27660013,
Mobile.No:040 27660013,
http://www.navatelanganabooks.com/
*
Visalandhra Publishing House and all its branches
Chandram Buildings, Chuttugunta, Vijayawada, Andhra Pradesh 520004
Mob+91 905-210-1320 | 0866-243-0302
*
P Chandrasekhara Azad
Janaki Azad Prachuranalu
Flat No- 909, Saphire Block
My Home Jewel, Madinaguda,
Miyapur, Hyderabad – 500049
Mob: 92465 73575
Leave a Reply