మొట్టమొదటి మాయావాస్తవికుడు

(ప్రముఖ కథకుడు, కీ.శే. డా. వి. చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా 18 ఏప్రిల్ 2021న ఆవిష్కరించబడుతున్న సంస్మరణ సంచిక, ‘అదృశ్యమైన నిప్పుపిట్టకోసం’ లో ప్రచురితమవుతున్న వ్యాసం).

“మోహనా! నీతో మాట్లాడుతుంటే, సుదీర్ఘమైన దుఃఖగాధను వింటున్నట్టుగా – నువ్వు కమ్మని కబుర్లు చెప్పే కాలమెప్పుడొస్తుంది?

నావైపు తీవ్రంగా చూసి – “అంతటా కత్తులు దూసి ఉన్నాయి. ఆద్భుతమైన  సంగీతాన్ని వినిపించే పరికరాలన్నీ పగిలిపొయ్యాయి. దుఃఖమే! నిరాశే! అయినా భయం లేదు. మనమెప్పుడూ ఆశాజీవులమే” అన్నాడు ప్రవక్త ముఖంతో.  (నిప్పు పిట్ట, ఎర్ర కుందేలు మరియు అదృశ్యమవుతున్న జాతుల కథ, 1999).

ఈ ప్రశ్నను ఎంతో ఉద్వేగంతో మనం చంద్రశేఖరరావును అడిగితే చంద్రశేఖరరావు మనకు ఇదే సమాధానం మృదువుగా నవ్వుతూ ప్రవక్త ముఖంతో చెపుతాడు అనిపిస్తుంది నాకు. అతని కథల్లో చాలా విషాదమూ, విధ్వంసమూ, భీభత్సమూ, శారీరక మానసిక హింసలు ఎంతగానో ఉన్నా, ఒక ఆశావహ దృక్పథం కనిపిస్తూనే ఉంటుంది

***

1998, 99లలో ఇంటర్నెట్ వాడకం వడిగా పెరుగుతున్న సమయంలో అమెరికాలో ఉన్న మాకు కొన్ని తెలుగు పత్రికలను సకాలంలో చదివే అవకాశం కలిగింది. ఆంధ్రజ్యోతి, వార్త, ఆంధ్రభూమి వార్తాపత్రికలతో పాటు, ఆదివారం అనుబంధాలు, సోమవారం సాహిత్యపేజీలు చదివే సదుపాయం దొరికింది. అప్పట్లో కొంతమంది తెలుగు సాహిత్యాభిమానులం ’తెలుసా’ అనే ఇంటర్నెట్ వేదికలో ఈ విషయాలు మాట్లాడుకొనేవాళ్ళం. ఆ రోజుల్లో నిప్పు పిట్ట, ఎర్ర కుందేలు మరియు అదృశ్యమవుతున్న జాతుల కథ అని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథ తెలుసాలో ఒక సంచలనం సృష్టించింది. ఈ కథ – పేరు, వస్తువు, శైలి,  మా బృంద సభ్యులకు దిగ్భ్రమ కలిగించిందనే చెప్పాలి. ఎందుచేతో కాని, ఆన్-లైన్ వెర్షన్‌లో కథ రచయిత పేరు కనిపించలేదు. ఈ రచయిత ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది. అప్పుడు కన్నెగంటి చంద్ర ఇది వి.చంద్రశేఖరరావు కథ అన్నాడు. అంత నమ్మకంగా ఎలా చెప్పావు అంటే, మోహినీ, మోహనసుందరాలు పాత్రలుగా, ఆశైలిలో కథలు రాసేవాళ్ళు తెలుగులో వేరే ఎవరూ లేరు అని తాపీగా తేల్చేశాడు.

***

“కథారచనలో సంపూర్ణత్వాన్ని సాధించానని భ్రమలు నాకేమీ లేవు. అయితే ఈ సంపుటిని ఒక Standing Report గా భావించి, ఆ పరిణతి వేపుగా పయనించగలిగే ఆత్మవిశ్వాసం నమ్మకం నాకున్నాయి”  – డా|| వి. చంద్రశేఖరరావు (జీవని కథాసంకలనానికి ముందు చెప్పుకున్న ‘స్వగతం’, 1994)

“చంద్రశేఖరరావు కథల్ని అప్పుడప్పుడూ పత్రికల్లో చదువుతూ కొత్తగా బలంగా ఆలోచించగల అతని శక్తిని చూసి ఆశ్చర్యపోతూ ఉండేవాణ్ణి. ఇప్పుడు ఈ కథలన్నీ ఒక్కసారిగా చదివాక నా ఆశ్చర్యమే కాదు, అతని మీద నాకున్న నమ్మకం కూడా ఎక్కువైంది. ఆశలు పెట్టుకోవటం మన హక్కు. వాటిని పండించటం చంద్రశేఖరరావు బాధ్యత.”  – వల్లంపాటి వెంకటసుబ్బయ్య (జీవని కథాసంకలనానికి ప్రతిస్పందన, 1994)

 ***

1980-94 ల మధ్య నేను తెలుగు సాహిత్యానికి కళాప్రపంచానికి దూరంగా నా విద్య, వృత్తి, పరిశోధనల మధ్య మునిగిపోయి ఉన్నాను.  చంద్రశేఖరరావు గారి మొదటి కథలు ప్రచురితమవుతున్న కాలంలో నేను వాటిని చదవలేదు. కొన్నాళ్ళ తరువాత ఆయన మొదటి రెండు కథాసంకలనాలు – జీవని, లెనిన్ ప్లేస్ – దాదాపు వెంటవెంటనే చదివాను. మొదటి సంకలనానికి రెండో సంకలనానికి ఉన్న అంతరాన్ని చూసి విస్తుపోయాను. రచయితలు ఎదిగే క్రమం సాధారణంగా నెమ్మదిగా పైకి లేస్తున్న తిన్నని గీతలా ఉంటుంది. జీవని సంకలనంలో కాలపరంగా మొదటి కథ (అక్టోబరు 1988; తర్వాత ఇంకో సందర్భంలో వ్రాసిన మాటలు బట్టి ఇదే ఆయన మొదటి కథ అనుకొంటున్నాను) డ్యూటీ, రెండేళ్ళ తరువాతి (ఏప్రిల్ 1990) నైట్ డ్యూటీ, ఇంకో నాలుగేళ్ళ తరువాతి (1994 మార్చ్) మహాకవి మరణం కథలు చూస్తే, ఆ తిన్నటి ఎదుగుదల జీవని సంపుటిలో కనిపిస్తుంది.

కానీ, ఇంకో నాలుగేళ్ళ తర్వాత వచ్చిన లెనిన్‌ప్లేస్ లో కథలకూ జీవనిలోని మొదటి కథలకూ పోలిక లేదు. ఆ తిన్నటి గీత మధ్యలో ఏదో విస్ఫోటనం జరిగి గీత రెండో భాగం ఇంకా ఎక్కడో ఎత్తుగా మళ్ళీ మొదలయినట్టుగా ఉంటుంది. చంద్రశేఖరరావు చెప్పే కథలు మారాయి. చెప్పే విధానం అంతకన్నా మారింది. తన మొదటి సంకలనంలో వెంకటసుబ్బయ్యగారి ఛాలెంజ్‌ని అందుకొని, ముందుమాటలో తాను రేపిన ఆశను ఫలవంతం చేయటానికన్నట్టు పట్టుదలగా శ్రమించి కొత్త అవతారం ఎత్తాడు చంద్రశేఖరరావు. 

ఒక రెండుమూడేళ్ళ వ్యవధిలో ఈ రచయితకు కొత్త సాహిత్యం పరిచయం అయ్యిందనీ, అతని ఆలోచనలు కొత్త తాత్వికతను సంతరించుకొన్నాయని, తన తాత్వికతను వ్యక్తపరచటానికి అతను తనదైన శైలిని సృష్టించుకొని రచించటం మొదలు పెట్టాడని అనిపించింది. ఆ రోజుల్లోనే మనకు మాలతి మొదటిసారి కనిపిస్తుంది; మాలతితో పాటు, ఆనందశంకరం, మోహనసుందరం, మోహిని, పూర్ణమాణిక్యం అతని కథల్లో కనిపించటం మొదలుపెట్టారు. మనకు అప్పటివరకూ కథ అంటే ఉన్న భావనలను ఛిన్నాభిన్నం చేసి, తన విలక్షణత్వంతో మనల్ని ఆకర్షించాడు. ఇవేమి కథలు, ఇవేమి పాత్రలు, వీళ్ళేం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏమిటి ఈ కథ అర్థం, పరమార్థం అని మనం ఆలోచించాల్సిన అవసరాన్నీ, అలజడినీ కలిగించాడు. అంతవరకూ మనమెరుగని సృజనాత్మకతతో మనల్ని కట్టిపడేసి, మాయాదండాన్ని ఊపి కొత్తలోకాలను శరవేగంతో చూపిస్తూ మనం నోళ్ళు తెరచి, కన్నుమూయకుండా చూసేట్టు చేశాడు. అతను నిజంగానే తెలుగు సాహిత్యప్రపంచంలో అంతకుముందు చూడని తలుపులు తెరిచి కొత్త దారులు చూపెట్టాడు. అయితే ఆ దారిన మరింతమంది వెళ్ళకపోవడం (వెళ్ళలేకపోవడం) వేరే విషాదం.

ఆతను ఎన్నుకొన్న కథనశైలికి, కవితాత్మకంగా, ఉద్విగ్నభరితంగా పరుగులు పెట్టే అతని వచనం వేగాన్ని తీసుకువచ్చింది. ఇతర కళారూపాల పట్ల, ముఖ్యంగా ప్రాదర్శిక కళల (performance arts) పట్ల అతనికి ఉన్న విశేష పరిజ్ఞానం ఈ కథలకు పరిపుష్టమైన నాటకీయతను జోడిస్తుంది.  అతను బుద్ధి పెట్టి ఉంటే ఒక గొప్ప నాటకప్రయోక్త అయ్యేవాడేమో అని నాకు చాలాసార్లు అనిపించింది.

ఆయన తొలి, మలి దశల కథల మధ్య ఉన్న వ్యత్యాసం, మలిదశ కథలకూ తరువాతి కథలకూ మధ్య లేదనిపిస్తుంది కాని, అది నిజం కాదు. లెనిన్ ప్లేస్, మాయలాంతరు సంకలనాల కథలను ముగింపుకు ముందు కథలతో పోల్చి చూస్తే, పాత పాత్రలే కనిపిస్తున్నా ఈ కథకుడి శైలిలోనూ, తాత్విక దృక్పథంలోనూ, చెప్పదలచుకున్న విషయాల్లోనూ చాలా తేడా ఉందని స్పష్టంగా తెలుస్తుంది.

చంద్రశేఖరరావు కాల్పనిక కథను, చరిత్రను నమోదు చేయగల మాధ్యమంగా భావించాడు. ఆ భావన అతని కథలకు ప్రాసంగికత, సమకాలీనత ఆపాదిస్తే, అతని శైలి, తాత్వికత ఈ కథలను విశ్వజనీనం చేశాయి. ఆ పాత్రలలో, ప్రతీకలలో మనల్ని, మన సమకాలీనులను వెదుక్కొనేట్లు చేస్తూనే ఇది ఏ ఒక్కరి కథ కాదని ఒక సామాజిక ఘోష అని అనిపించేలా చేసే నేర్పు అతనికి ఉంది.

దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు తెలుగు కథకుల ప్రథమశ్రేణిలో డా.చంద్రశేఖరరావు ఉండటంలో ఆశ్చర్యం లేదు.

***

చంద్రశేఖరరావు నేను చదువుకున్న గుంటూరు మెడికల్ కాలేజీలోనే చదివారు కానీ నాకు కాలేజీలో ఆయన పరిచయం లేదు. నేను కాలేజీనుంచి బయటకు రావటానికి కొద్దిరోజుల ముందే ఆయన కాలేజీలో చేరారు. ఆయన్ని నేను మొదటి సారి ప్రత్యక్షంగా కలిసింది ఆయన కథకుడిగా నాకు బాగా పరిచయం అయ్యాకే. 2002లో గుంటూరులో పాత మిత్రులు చెరుకూరి సత్యం, పాపినేని శివశంకర్, నల్లూరి రుక్మిణిలతోపాటు చంద్రశేఖరరావు గార్ని కలవటం బాగా  గుర్తు. కథల్లో ఉన్న తీవ్రత ఈ మెత్తటి నవ్వుముఖం మొహమాటస్తుడిలో కనిపించలేదు కాని, ఆలోచనల లోతు కనిపించింది. ఆ తరువాత విభిన్న సందర్భాలలో కలుసుకున్నాము. ఒక స్నేహబంధం క్రమంగా బలపడింది. ఇండియా వచ్చిన ప్రతిసారీ ఆయనను కలిసేవాణ్ణి.

2015లో చంద్రశేఖరరావు డెట్రాయిట్‌లో జరిగిన తానా సభలకు ప్రత్యేక అతిథిగా వచ్చారు. డెట్రాయిట్‌లో కన్నెగంటి రామారావు ఇంట్లో కొన్ని రోజులు కలసి ఉన్నాం. తరువాత ఇతర సాహితీ మిత్రులతో కలసి ఆయన మండలైన్‌లో మా ఇంట కొన్నిరోజులు ఉండటం, చికాగో మ్యూజియాలూ, పాతపుస్తకాల షాపులూ తిరగటం నేను చిరకాలం పదిలంగా దాచుకునే జ్ఞాపకం. అప్పుడే, నా పుట్టిన రోజున ఆయన ఒక కవితతో ప్రత్యేకంగా నన్ను సన్మానించటం నేను అందుకొన్న అరుదైన గౌరవాలలో ఒకటి.ఆ కవితను మళ్ళీ వేరే రాసి బొమ్మలతో అందంగా అలంకరించి ఇస్తానని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండానే,  కుటుంబాన్నీ, తెలుగు కథనీ, మిత్రులనీ ఇలా వదిలేసి ఇంత తొందరగా చంద్రశేఖరరావు  మన మధ్యనుంచి మాయమైపోవటం ఇప్పటికీ జీర్ణించుకోలేని విషాదం.

ఇక్కడ ఇప్పుడు లేకపోయినా డా. వి. చంద్రశేఖరరావు తెలుగు సాహితీగగనంలో ఎప్పటికీ ప్రత్యేకంగా వెలిగే నక్షత్రమే.

జంపాల చౌదరి
09 ఏప్రిల్ 2021
మండలైన్, ఇల్లినాయ్, అమెరికా

You Might Also Like

3 Comments

  1. ఎ.కె.ప్రభాకర్

    వ్యాసం ఎత్తుగడతోనే రచయితగా డా.చంద్రశేఖరరావు లోతునీ విస్తృతినీ ఆయన కథల సారాన్నీ ఆవిష్కరించారు చౌదరి గారూ!

  2. anil

    చాలా చక్కటి పరిచయం. ‘ఆయన మార్గంలో వేరెవ్వరూ వెళ్ళడానికి ప్రయత్నించకపోవడం’ – కరెక్ట్ అబ్సెర్వేషన్.

  3. తాడిగడప శ్యామల రావు

    జంపాల చౌదరి గారూ,
    నాటి తెలుసా గ్రూపును గుర్తుచేసినందుకు మీకు ధన్యవాదాలు.

Leave a Reply