ద్వాసుపర్ణా

వ్యాసకర్త: తమ్మినేని యదుకుల భూషణ్

రియా , తెలుగు సాహిత్యాల మధ్య ఎంతో సాపత్యం ఉంది –   రెండు భాషల్లో, ఇప్పటికీ  భావాభివ్యక్తికి కవిత్వమే ప్రధాన వాహిక . అంతే కాకుండా ,  రెండు భాషల్లో ఒకటే దరిద్రం – కవితా సంకలనాలు ప్రచురించే నాథుడు లేడు , ఒక వేళ  ప్రచురణకు నోచుకున్నా – సరైన పంపిణీ  వ్యవస్థ లేదు. కనీసం అక్కడ , మంచి పుస్తకాలను గుర్తించి – వెలుగులోకి తీసుకువచ్చే  పధ్ధతి ఉన్నది కాబట్టి  మనంత భ్రష్టు పట్టలేదు సాహిత్య రంగం అందునా ముఖ్యంగా కవిత్వం !!.  

జతీంద్ర  మోహన మొహంతి  ‘ద్వా సుపర్ణా’ పుస్తకాన్ని 1984 లో వచ్చిన ముఖ్యమైన కవితా సంకలనంగా గుర్తించారు. 

“ Probably, to start with, it would be worthwhile noting a selection of relatively more important books in different literary genres. Thus in poetry, usually the richest genre, the books are Samayar Sesha Nama (The Last Name of Time), the seventh collection consisting of 33 poems  by Sitakant Mahapatra ; Dwa Suparna (Two Birds), the sixth collection consisting of 52 poems  by Saubhagya Mishra ; …. “

 “ Oriya literature has a rich poetical heritage. In fact, much of its ancient literature, beginning from the 15th till the 19th century was almost always in poetry, and even now, it is in poetry that its contemporary sensibility has the richest expression. Two poetry books, already referred to in the beginning, by Sita kanta Mahapatra and Saubhagya Kumar Mishra, are among the finest publications of the year under review. “

 (1984 & 85: Quantitatively Lean Years ( Indian Literature – 1986) by  Jatindra Mohan Mohanty

సౌభాగ్య కుమార్ మిశ్రా (ସୌଭାଗ୍ୟ କୁମାର ମିଶ୍ର) వృత్తి రీత్యా అధ్యాపకులు  ఆంగ్లసాహిత్యం బోధించారు. ప్రధానంగా  తన మాతృభాషలో తన ప్రజలకోసం వ్రాశారు. సందేశాలిచ్చే కవికాదు . బాధ , దుఃఖం లోంచికవిత్వం పుట్టుకొస్తుంది అన్నది romantic notion అని ఆయన దృఢాభిప్రాయం. తనదైన అనుభూతికి, ఉద్వేగానికి ఒక ఆకృతినివ్వడమే కవిత్వం ; ఆ భావాభివ్యక్తిని భాష ఎల్లప్పుడూ  అదుపు చేస్తూనే ఉంటుంది. ప్రజల నిత్య వ్యావహారికభాషలోని  లయను  ఊతంగా  చేసుకుని తనదైన ఛందాన్ని  సాధించిన ప్రౌఢ కవి. ఏ భాషలోనైనా, ఈ అవగాహన నుంచే పుట్టుకొస్తుంది ఆధునిక కవిత్వం. ఇది సౌభాగ్య కుమారుని కవిత్వ జైత్రయాత్రను క్లుప్తంగా  నాలుగుమాటల్లో  చెప్పాలి అంటే .1

అనువాదకుడి బాధ్యత రెట్టింపు అవుతుంది – మోయలేని బరువును సమర్థంగా మోశారు అనువాదకులు.మొత్తం పుస్తకాన్ని అనువాదం చేయడంలో ఉన్న సాధకబాధకాలు వేరు.  అన్నికవితలూ అనువాదానికి లొంగకపోవచ్చు.  కొన్ని అనువాదంలో తేలి పోవచ్చు .ముఖ్యంగా  నాగరిక భాషలైన  గ్రీకు , సంస్కృతం , చైనీస్ భాషల నుండి  ఆంగ్లంలోకి తర్జుమా అవుతున్నప్పుడు అనువాదసమస్యలు లెక్కకు మిక్కిలి. ఎందుకంటే –  అనువాదకులు పూడ్చలేని ఒక గొప్ప నాగరక అఖాతాన్ని ( civilizational gap)  హనుమంతునిలా లంఘించ వలసి వస్తుంది. ఒరియా – తెలుగు ఒక సమాన ఫాయాకు చెందిన భాషలే.  భాషా శాస్త్రంలో భారత ఉపఖండం ఒక భాషాప్రాంతం (Linguistic Area )విభిన్నకుటుంబాలకు చెందిన అనేక భాషలు అనాది నుండి మమేకమై-  కలిసి ఉన్నందున పరస్పర సంబంధ బాంధవ్యాలు మెండు. కాబట్టి, ఇట్టి భాషా ప్రాంతం లోని  భాషల మధ్య అనువాదాలకు ఎక్కువ  పాద పీఠికలు అవసరం లేదు. ఆరవతరగతి గణిత స్థాయి లో చెప్పాలి అంటే  ఈ రెండు భాషలకు  క. సా.గు కట్టడం  తేలిక. 

సరే  , ఇట్టి  భాషల  మధ్య  అనువాద వారధి  నిర్మించడానికి మన అనువాదకుల  ప్రణాళిక  ఏమిటి ?? ఇద్దరూ శాస్త్రవేత్తలే అయినా అంకగణితాన్ని వదిలి వనమాలికా కరణాన్ని2  ఆశ్రయించారు.

“ నా మాట”  నుండి: ఉట్టంకిపులు: 

వెనిగళ్ల  గారు : 

“ రెండు భాషల్లో  ఉన్న ప్రవేశంతో  పూలు దారం  సమ కూర్చాను . వేలూరి  కూర్చాడు  కావ్యమాల “ 

 వేలూరి గారు:

“ నిఘంటువిచ్చే  అర్థాలు  ఎక్కడా వాడని  సౌగంధికాలైతే , రోజువారీ వాడుకకు దొరికే పూలు మల్లెలు చామంతులు “ 

 ఇద్దరూ తమ తమ బలాబలాలను , పరిమితులను  చక్కగా అంచనా వేసుకున్నారు..  అవి పరస్పర పూరకాలై అనువాద  ప్రక్రియను ఆహ్లాదకరంగా మార్చి వేశాయి. 

సౌభాగ్య   రోజువారీ సంభాషణల వెనుక లయను గుర్తెఱిగి తన కవితాభివ్యక్తికి  మెఱుగులు  దిద్దుకున్నాడు. ఇక్కడ వెనిగళ్ల గారి ప్రమేయం వలన అనువాద లాభం. వేలూరి గారు ఆ విషయాన్ని ఎంతో చక్కగా గుర్తించి ‘ రోజూవారీ  వాడుకకు దొరికే  మల్లెలు చామంతుల “ తోటే తమ అనువాద వనమాలికా కరణాన్ని నిర్వహించి,  వాడని సౌగంధికం లాంటి పుస్తకాన్ని అందించారు..భాష పట్ల అవగాహన నీవు ఆధునికుడివా , అధముడివా అన్న విషయాన్ని చెప్పకనే చెబుతుంది..ఇప్పడు వస్తున్న అనువాదాలు తరచు తేలిపోవడానికి కారణం – మూలంలో కవికి భాషపట్లగల అవగాహన ఏమి ?? అది అతని  కవితాభివ్యక్తిని ఏ విధంగా తీర్చిదిద్దింది ?? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియకపోవడమే.

2. 

ఇక అనువాదంలోకి ప్రవేశిస్తే –

ద్వా సుపర్ణా సయుజా సఖాయా
సమానం వృక్షం పరిషస్వజాతే
తయో రన్యః పిప్పలం స్వాద్వత్త్య
నశ్నన్నన్యో అభిచాకశీతి  ( ముండకోపనిషత్ 3.1.1) 

“స్నేహితులై, సదా కలిసి యుండే రెండు పక్షులు ఒకే చెట్టుపై ఉన్నవి. వాటిలో ఒకటి చెట్టు పండ్లను ఆసక్తిగా తింటుండగా, మరియొకటి ఏమీ తినక వీక్షించుచున్నది.”

చాలా ప్రసిద్ధి పొందిన శ్లోకమిది , భారత వేదాంత చింతనతో పరిచయం ఉన్న వారు తప్పక  వినే ఉంటారు.కవికి భారత  దేశ సంప్రదాయాలు  బాగా తెలుసు. భారత రామాయణ ఇతిహాసాలు రక్తంలో కలగలిసి కవిత్వంలో సహజంగా ప్రవేశిస్తాయి.  అహల్య , శకుంతల పాత్రలు మునుపెన్నడూ మనం చూడని రీతిలో మన ముందు ప్రత్యక్షమవుతాయి.

“ నేను ఒక మెరుపులాగా మెరుస్తుండి పోయాను. 
గల గల అల్లరి చేసే నీళ్లు నిశ్చలమయ్యే ముందు
 నేను నా ప్రతిబింబంలో కలిసిపోక ముందే 
వారు నన్ను నా పేరు పెట్టి పిలిచారు. 
ఆశ్రమం బయట 
మాలతీ తీగ మొదలు ఎండి పోవటం చూసి 
అలవాటుగా అధిక్షేపించారు “ 

( అహల్య )

“మొట్టమొదటి నుండి నాకు తెలుసు , తను ఇలా వస్తారని 
మలమల మారుతున్న ఎండలో ముఖం ఎర్రగా మాడి మాడి , 
తలనుండి చెవుల అంచుల నుండి చెమట కారిపోతూ 
మా ఇద్దరికీ మాత్రం తెలిసిన అనిశ్చిత సత్య సముఖానికి 
ఆశ్చర్యంతో  ఆగిపోయి, కిరీటం తీసి 
ధనుర్బాణాల సమేతంగా తను లోబడుతారు. 
నేను చెబుతాను, నాకు కావలిసింది కేవలం ఉంగరం మాత్రమేనని”

(శకుంతల )

3. 

భారతదేశంలోని సాహిత్యభాషలన్నీ  సంస్కృతం నుండి ఎన్నో పదాలు , పదబంధాలు గ్రహించినా – వాటిమధ్య అర్థభేదాలున్నాయి . మన రాగం, ఆగ్రహం వేరు – బెంగాలీల రాగం, ఆగ్రహం వేరు.  అనువాదాల్లో, ఇటువంటి చిక్కులు అనేకం, అడుగడుగునా ఎదురవుతాయి. ఇన్ని చిక్కుల నడుమ, సౌభాగ్యుని ముక్తసరి వాక్యాలను , నాటకీయ శైలిని అలతి అలతి పదాలతో పట్టుకు రావడం అంత సులభం కాదు. 

“ ମା ମରଣାର ଭୟ
ବାପାର ଅନ୍ୟମନସ୍କ ଉତ୍ତରରେ ସମାହିତ “ ( କମକି) 

“మా మరణార్ భయ
బాపార్ అన్యమనస్క ఉత్తరార్ సమాహిత”

“ అమ్మ మరణిస్తుందన్న భీతి
నాన్నగారు పరధ్యాన్నంగా చెప్పిన సమాధానంలో ఇమిడిపోయింది”  ( తూనీగ ) 

“ସିରା ଧାମଣୀର ରକ୍ତ ନିର୍ଜନ 
ଗଲାପାକୁ ଫେରି ଯିବା   “ ( ଅପେକ୍ଷା ) 

“సిరాధమనీర్ రక్త నిర్జన 
గులాపీకు ఫెరిజిబా  “

“ఈ సిరా ధమనుల రక్తం ఏకాంతంగా ఉన్న 
గులాబీకి తిరిగి పోతుంది.”  ( నిరీక్షణ ) 

ఇవి సౌభాగ్యుని  కవితావాక్యాలు. ముక్తసరిగా  చెబుతాడు , అనువాదం వివరణలా 

అనిపించే  ప్రమాదం పొంచి ఉంది . ఇది ముఖ్యంగా  సౌభాగ్యుని కవిత్వాన్ని తర్జుమా  చేసే వారికి ఎదురయ్యే సమస్య. అదృష్ట వశాత్తు ఇందులోని  సంస్కృత పదాలు- అన్య మనస్కం , సిరాధమనులు , మన ఎరుక లోనివే . ఐతే, అపేక్ష  అన్నది ‘ఎదురు చూడడం’ అన్న అర్థంలో ఒడియా ,బాంగ్లా భాషల్లో వాడితే  ప్రేమ , కాంక్ష  అన్న అర్థంలో మనం వాడతాం . ఈ గొడవలన్నీ సద్దుమణిగి, అనువాదకుడు ఒద్దికైన మాటలతో కావ్యమాలను  కట్టడానికి  సమయం పడుతుంది.  

4. 

ఈ సంకలనంలో హాయి గొలిపే కవితా శకలాలు మచ్చుకు మరి కొన్ని : 

“ఇప్పుడు నా కోరిక, ఆఖరి పాట పాడుకోవాలని,
విభ్రాంతితో ఆఖరి పువ్వుని తాకాలని.
కాదు కాదు, చెపుతున్నా, రక్తం, వంగవన్నె దిగంతం, సూర్యుడూ,
చాలా శతాబ్దాలపూర్వమే నేను గుర్తించాను, నాకు తెలుసు,
వాళ్ళు నా గుప్పెట నింపుతారు, కనీసం నీ స్మృతితో.”

“ చీకటి నలువేపులా చుట్టిముట్టి వున్నప్పుడు రా,
తామరకాడతో చుట్టుకుపోయి, యిరుకైన అగాధంలోకి జారిపోదాం,
మనం ఒకరినొకరు చూసుకోలేం,
దీపానిది కాని ఆ చిరుకాంతి దొంగిలించుకొనిపోదాం.

“నువ్వొచ్చి నన్ను ఎలా చూస్తావు? ఏ రూపంలో?
మబ్బుల్లేని నక్షత్రం లాగానా, లేక నీళ్ళమీద పొరలాగా
అంచెలంచెలుగా తాకుతూ పరుగెత్తే చిల్లపెంకు లాగానా?”

“నాకు బాగుండే విషయాలు చాలా ఉన్నాయి — కొత్త పుస్తకం, సముద్రపొడ్డున
కూలిపోయిన ఇల్లు, స్కూలు వెనక దాక్కొని ఎండు మామిడి టెంక చీకుతున్న చెల్లి,
ఐదుబ్యాటరీల టార్చి లైటు వెల్తుర్లో మానుపడ్డ కుందేలు,
పోనుపోను క్రమంగా పెరిగిపోతూన్న నా చేతగానితనం.”

“ఇవాళ ఇంకేం చెప్పను?
అరువు తెచ్చుకున్న కలని పూలకీ, సీతాకోక చిలక్కీ, సూర్యుడికీ
తిరిగిచ్చెయ్యటానికి కూర్చున్నాను.
అనిర్మలమైన కాలం ఏం చూపించిందో గుర్తు లేదు.
నేను నిస్సహాయుణ్ణైతే ఏం చూపిస్తుంది,
మంచులో తడిసిన చతుర్దశిచంద్రుడి కాంతిలో,
వివస్త్రగా ఏకాంతంగా పార్కులో నిలబడితే.
కలువపూలతో నిండిన చెరువులా,
ఈ మనస్సు ఏమీ అర్థం చేసుకోదు.”

( ఏడు కవితలు )

అద్భుతం ! ఎన్ని రంగులు, ఎన్ని భావాలు,  ఎన్ని అనుభవాలు-  సౌభాగ్య కుమార్ మిశ్రా –   ‘ద్వా సుపర్ణా ‘(1986 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం  ) పుస్తకంతో తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిన  ‘మోహనా ఓ మోహనా’ -(1990 -శివారెడ్డి), ‘ కాలాన్ని నిద్ర పోనివ్వను’ (2000-నక్క గోపి), లాంటి ప్రముఖుల పుస్తకాలను పోలిస్తే హత విధి అనుకోక తప్పదు; మన ప్రముఖులకు తెలుగులో వాక్య నిర్మాణం చేతకాదు — ఈ ఆధునిక కవిత్వంలో అగుపించే స్వచ్చత, పారదర్శకత ఎప్పుడు సాధించాలి? గొప్ప కవిత్వాన్ని చదవడం దూర దేశపు అడవుల్లో రైలు ప్రయాణం లాంటిది. ఎన్నో సెలయేళ్ళు,  అందమైన లేళ్ళు, ఎదురెండ, అనుకోని వర్షం అన్నీ ఎదురవుతాయి. గొప్ప అనువాద ప్రయాణాన్ని మొదలు పెట్టి, వేసటలేక అభయారణ్యంలో విహరిస్తున్న వేదండ ద్వయానికి “అవిఘ్నమస్తు” అని చెప్పి ముగించడం సహృదయ ధర్మం.

Notes:

  1.  “ Every writer has his own style. And yes, my poems have set a trend in literature. Critics have pointed out that I have introduced a kind of ‘chhanda’ into Odia poetry by using the rhythm of day-to-day conversation. A good poet must add a rhythmic touch of his own. I have done a formal experiment. I have written a story in poetic form.”
    Sunday Post  Interview –  “My Poems are dear to me” ( 21 May 2018 )
  2. మ. గృహసమ్మార్జనమో, జలాహరణమో, శృంగారపల్యంకికా
    వహనంబో, వనమాలికాకరణమో, వాల్లభ్యలభ్యధ్వజ
    గ్రహణంబో, వ్యజనాతపత్రధృతియో, ప్రాగ్దీపికారోపమో,
    నృహరీ వాదము లేల? లేరె యితరు ల్నీ లీలకుం బాత్రముల్  ( ఆముక్త మాల్యద) 

You Might Also Like

One Comment

  1. గరికపాటి పవన్ కుమార్

    అనువాదం ఎప్పుడూ అనువాదమే, అనువాద కవిత్వాన్ని విమర్శించేవాడికి,అందులో లోటుపాట్లు, లోతుపాతులు తెలియాలి. సమగ్రంగా సాగిన ఈ విమర్శ ఈ పుస్తకాన్ని అమాంతం చదవాలనిపించేలా చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు

Leave a Reply