ఆదివాసులు – జీవితం, చరిత్ర, ఐదు పుస్తకాలు

దాదాపు నాలుగేళ్ళ క్రితం ఒకసారి లైబ్రరీ బిల్డింగ్ లోంచి బైటకి వస్తూండగా బయట ఉన్న కొత్త పుస్తకాల సెక్షన్ లో ఓ పుస్తకం అట్ట నన్ను ఆకర్షించింది. అది ఒక కెనడియన్ ఆదివాసీ రచయిత డ్రూ హేడెన్ టేలర్ ఆయన నేపథ్యాన్ని ప్రతిబింబిస్తూ, తన వారి దృక్పథాన్ని అనుసరిస్తూ రాసిన సైంస్ ఫిక్షన్ కథల సంకలనం. (దాన్ని గురించి అప్పట్లో నేను రాసిన పరిచయం ఇక్కడ). అప్పటికి నేను కొందరు ఇతర నేటివ్ అమెరికన్ రచయితల రచనలు చదివాను కానీ, సై-ఫై రాయలేదు వాళ్ళు. ఇక్కడ నుంచి ఇంక అదో కొత్త రచనా ప్రపంచం – ఆయన ద్వారా చాలా రచనలు పరిచయమయ్యాయి గత నాలుగేళ్ళలో. నేను గతంలో చదివిన నానారకాల రచనలకంటే భిన్నంగా అనిపించాయి కథాంశాలు వీటిల్లో. హాస్యం, వ్యంగ్యం కూడా కొంచెం peculiarగా అనిపించాయి. ఎలా? అంటే చెప్పడం కష్టం – కొత్తగా తోచాయంతే. ఈ నేపథ్యంలో నాకు మనదేశంలోని ఆదివాసి సమాజాల గురించి, వాళ్ళ భాషల గురించి, జీవితాల గురించి కుతూహలం కలిగింది. అప్పట్లో ఇంటర్ లైబ్రరీ లోను పుణ్యమా అని సవరల గురించి, తొడ భాష (Toda) గురించి, ఇలా పుస్తకాలు కొన్ని చదివాను. అయితే, సమకాలీన సాహిత్యంలో ఎవరన్నా ఈ నేపథ్యం ఉన్న వారు రాస్తున్నారా? అన్నది తెలుసుకోలేకపోయాను. ఫేస్బుక్ పోస్టుల్లో సూచించిన ఒకట్రెండు కథలూ నన్ను కథనం, శిల్పం వగైరాల పరంగా అంతగా ఆకట్టుకోలేదు నన్ను. ఇక నెమ్మదిగా కెనడా వచ్చాక ఇక్కడ అనేక పెద్ద పెద్ద (సైజులో) ఆదివాసీ సమాజాలు ఉండడం, తరుచుగా వీటికి చెందిన రచయితల గురించి, రచనల గురించి వార్తలు వస్తూండటం వల్ల వాటిని చదవడం పెరిగింది.

అనుకోకుండా పోయిన నెలలో మళ్ళీ ఇలాగే మన తెలుగు ప్రాంతలలోని ఆదివాసీ జాతుల గురించి వారి నుండి గానీ, ఇతరుల నుండి గానీ పుస్తకాలేం వచ్చాయని వెదుక్కుంటూ ఉంటే నాకు కె.బాలగోపాల్ గారి పేరిట ఉన్న వెబ్సైటు కనబడింది. ఇందులో ఆయన ఆదివాసీల గురించి రాసిన మూడు వ్యాస సంకలనాలు ఉన్నాయి. ఇవి చదువుతూండగా నేను రెండేళ్ళ బట్టి పేజీలు తిప్పుతూ, బాగుందనుకుంటూనే చదవడం దాటవేస్తున్న మరో పుస్తకం – ఉత్తర అమెరికా ఆదివాసుల గురించి… అది గుర్తు వచ్చి, ఈసారి పూర్తిచేశాను. వీటి గురించి అనుకుంటూ ఉండగా గత సంవత్సరం ఇక్కడ కెనడా డే సందర్భంగా చదివిన మరో ఆదివాసీ పుస్తకం గుర్తు వచ్చింది. సరే, అన్నింటినీ పరిచయం చేస్తూ ఓ వ్యాసం రాద్దాం అని ఇలా …..

మొదట కె.బాలగోపాల్ రాసిన మూడు వ్యాస సంకలనాలతో మొదలుపెడతాను. అవి:

  • ఆదివాసులు: వైద్యం, సంస్కృతి, అణిచివేత
  • ఆదివాసులు: చట్టాలు, అభివృద్ధి
  • ఆదివాసులు: చత్తీస్ ఘడ్, కంధమాల్ పై వ్యాసాలు

నాకు బాలగోపాల్ రచనలతో పరిచయం తక్కువ. ఆయన ఉన్నరోజుల్లోనే అక్కడక్కడా పత్రికల్లో వచ్చినవి (రాజకీయాల గురించి ఉండేవి ఎక్కువగా అని గుర్తు) కొన్ని చదివాను. ఆ తరువాత అందరూ ఆయన్ని గురించి చెప్పడమే విన్నాను. ఈ వ్యాస సంకలనాలలో మానవ హక్కుల సమితి తరపున ఆదివాసీలతో చాలాసార్లు పనిచేసిన అనుభవాలని రాశారు. అయితే, అనుభవాలంటే ఏదో పర్సనల్ పిట్టకథలనుకునేరు! వార్తలండి, వార్తలు! ఆదివాసులపై వారి జీవనవిధానానికి ప్రభుత్వం “అభివృద్ధి” పథకాల పేరిట జరిపే కార్యకలాపాలకీ మధ్య ఉన్న అంతరం, వారి నివాస ప్రాంతాలలో ఉండే వైద్య, ఆరోగ్య, ఇతర సదుపాయాలు, భూముల గురించిన చట్టాలు – వాటి అమలు, పోలీసులతో ఆదివాసీల సంబంధాలు? ఇక కొన్ని ప్రాంతాలలో నక్సలిజం ప్రభావం వారి జీవితాల మీద ఎలా ఉంది? ఇలాంటి అంశాలన్నీ స్పృశించారు. వ్యాసాలు అన్నీ అక్కడా ఇక్కడా పత్రికల్లో పడినవే. రెండు పర్స్పెక్టివ్స్ వారు సంకలనంగా వేస్తే, ఇంకోటి మానవ హక్కుల వేదిక వారు వేశారు.

సాధారణంగా ఆంటీ-ఎస్టాబ్లిష్మెంట్ పద్ధతిలో సాగే వాదనలు నాకంత రుచించవు. ప్రభుత్వాలని, లేదా మనకి నచ్చిన ఏదో పార్టీనీ వాళ్ళేం చేసినా నెత్తిన మొయ్యాలన్న నమ్మకం నాకు లేదు కానీ కొంచెం ఆలోచించి చేసే విమర్శలు అర్థవంతంగా ఉంటాయి, సరైన వాళ్లు చేస్తే ఆయొక్క ఎస్టాబ్లిష్మెంట్ కి ఉపయోగకరంగానూ ఉంటాయి అనుకుంటాను. అలాగే ఊరికే ప్రతిదాన్ని విమర్శించి ఏం లాభం – ప్రత్యుమ్నాయాలు సూచించొద్దా? అనిపిస్తుంది ఒక్కోసారి ఇలాంటి వ్యాసాలు చదువుతూంటే. ఈ వ్యాసాలు చదువుతున్నపుడు మొదట కొంచెం బోరు కొట్టింది – ఏమిటీ ఈయన ఎంత సేపు ప్రభుత్వం అది చెయ్యట్లేదు, ఇది చెయ్యట్లేదు అంటూనే ఉంటాడు… ఏదో ఒక్కటన్నా చేయకుండా ఎలా ఉంటుంది? అని. పైగా ఒకచోట అంటాడు – “ప్రజలపట్ల తమకుండే బాధ్యతలను ఉద్దేశపూర్వకంగా విస్మరించేవారికి ప్రజల హక్కుల కోసం, సాధన కోసం ప్రయోగించే హింసను విమర్శించే నైతిక హక్కు ఏమాత్రం లేదు” అని. దీనితో ఎంతైనా ప్రభుత్వాలు నక్సలిజాన్ని నెత్తిన పెట్టుకుంటారా ఏం? అనుకున్నా. కానీ, కాసేపయ్యాక నక్సలైట్లని తిట్టాడు – ఓహో, పోనీలే, ఈయన కనీసం సాయుధ పోరాటం వచ్చి ప్రభుత్వాలని కూలదోయాలి (తర్వాతేం అవుతుంది? అన్నది అప్రస్తుతం) అనట్లేదు, కనుక ఆదివాసిల పక్షం వహించి చూస్తే everyone failed them ఏమో అనుకున్నా. తరువాత ఒకట్రెండు చోట ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో చేసిన కొన్ని చట్టాలు ఆచరణలో ఏమయ్యాయో రాశారు.

పుస్తకమంతా సీరియస్గానే సాగినా, అక్కడక్కడా పదునైన వ్యంగ్యం, ఆపకుండా చదివించేలా సాగిన వ్యాఖ్యానం చూస్తే ఈయనెప్పుడూ ఫిక్షన్ ప్రయత్నించలేదా? అన్న సందేహం కలిగింది. ఉదాహరణకి – నాకు బాగా నచ్చిన వ్యాఖ్య:


“ఆదివాసుల కోసం అందమైన చట్టాలు చాలా చేసిన మాట వాస్తవం. ఎల్.టీ.ఆర్. చట్టం వారి భూముల పరాయీకరణను నిషేధించింది. పీసా చట్టం వారి గ్రామ సభలకు అనేక రకాల స్వయం నిర్ణయాధికారం ఇచ్చింది. కొత్తగా వచ్చిన అటవీ హక్కుల చట్టం రిజర్వ్ ఫారెస్టులో సహితం వారికి నివాస హక్కు, భూమి వినియోగ హక్కును కల్పించింది. రేపు ప్రళయం వచ్చి నాగరికత మొత్తం ధ్వంసమయి ఈ మూడు చట్టాల ప్రతులు మాత్రమే మిగిలాయనుకోండి, కుజగ్రహం నుండో శుక్రగ్రహం నుండో పరిశోధకులు వచ్చి వాటిని సేకరించి భూమి మీద ఆదివాసులకు అద్భుతమైన జీవితం ఉండిందని భూగోళ చరిత్రలో రాయగలరు”

ఇలా ప్రభుత్వం చాలా చేసింది అని ఇండియాలో అనుకున్నాను, కెనడాలో కూడా అనుకున్నాను. అవి ఆచరణలో ఎలా ఉన్నాయో ఇలా ఈయన చెబుతూ ఉంటే తెలిసింది.

నాకు ఆశ్చర్యం అనిపించిన వివరం మరొకటి ఉంది. చాలా చోట్ల ఒకటి అంటారు – ప్రైవేటు వాళ్ళకి ఆదివాసులతో చేసేది వ్యాపారం. ప్రభుత్వానికి అది “నా భూముల్లో వాళ్ళు పనిచేసినందుకు నేను ఇచ్చే కూలి.” కనుక ప్రభుత్వం కంటే ప్రైవేటు వాళ్లే ఎక్కువ డబ్బులు ఇస్తారని ఆదివాసులు వాళ్ళవైపుకే మొగ్గుచూపుతారు అని. ప్రస్తుతం జరుగుతున్న ఒక సామాజిక-రాజకీయ సంఘటన నేపథ్యంలో ఈ విషయం, అదీ బాలగోపాల్ నుండి చదవడం ఆసక్తికరంగా అనిపించింది. ఇంకా చాలా చెప్పొచ్చు కానీ, ప్రధానంగా మూడు పుస్తకాలలోని అంశాలనూ సమ్మరైజ్ చేయాలంటే, ఆయన అనేది ఇదీ:


“గమనించాల్సిన విషయం ఏమిటంటే గిరిజనుల సమస్యలకు గిరిజనేతరుల బాధ్యత ఎంత ఉందో, రాజ్యాంగ యంత్రం బాధ్యత కూడా అంతే ఉన్నా, చట్టం మొదటి దానిని మాత్రమే గుర్తించి నియంత్రించే ప్రయత్నం చేసింది (ఈనాటికీ అంతే – చట్టాలంటూ చేయడం జరిగితే అది గిరిజనేతరుల వ్యవహారాలను నియంత్రించడానికే తప్ప రాజ్యాంగ యంత్రం అధికారాలను నియంత్రించడానికి కాదు. రాజ్యాంగ యంత్రం అనేది వర్గాలకి అతీతంగా ప్రజల “సంక్షేమాన్ని” చూసుకుంటుంది అనే భ్రమను మనదేశంలో ఎంతగా పోషించారంటే ఈ వాస్తవాన్ని గుర్తించడానికి కూడా కొంత సమయం పడుతుంది. అడవుల సంరక్షణ అంటే దేశంలోని ధనికవర్గాల అవసరం తీర్చడం కోసం అడవులను గిరిజనుల నుండి కాపాడడం అని అర్థం చేసుకోకపోతే ఈ భ్రమలో పడిపోయే ప్రమాదం చాలా ఉంటుంది.” (ఏ వ్యాసంలో చూశానో గుర్తులేదు. కానీ రెండో పుస్తకంలో అనుకుంటాను).

మొత్తానికి ఈ పుస్తకాలు విలువైనవి. సాధారణంగా రోజూ చదివే వార్తల్లో ఆదివాసుల ప్రస్తావన అంతగా కనబడదు అని నాకు అనిపిస్తుంది. పైగా వచ్చిన వార్తలు కూడా వాళ్ళ కోణం ఏంటో మనకి చూపవు – రాసేది “నాగరిక” రిపోర్టర్లే కదా సాధారణంగా. ఈ పుస్తకాలు కూడా వాళ్ళ కోణం చూపదు కానీ కనీసం ఫోకస్ వాళ్ళ మీద పెడతాయి. అందువల్ల ఈ పుస్తకాలు చదవడం ఒక ఉపయోగకరమైన అనుభవం అనిపించింది. ఇలాంటి రిపోర్టులు రాయడం, అసలు రాసేంత అనుభవం తెచ్చుకోడం – రెండూ రిస్కుతో కూడిన వ్యవహారాలే అనుకుంటాను. అందువల్ల బాలగోపాల్ గారికి, ఈ పుస్తకాల ప్రచురణకర్తలకి ధన్యవాదాలు. ఆయన పేరిట ఉన్న వెబ్సైట్ లో ఈ మూడూ పీడీఎఫ్ లు గా ఉచిత దిగుమతికి ఉంచారు. అందుకు మరిన్ని ధన్యవాదాలు. ఈ పుస్తకాలు చదువుతున్నంత సేపూ నాకు ఇవన్నీ బయటి వ్యక్తులు ఆదివాసీలకోసం పనిచేస్తూ రాస్తున్నవి కదా. అసలు వాళ్ళ గురించి వాళ్ళేం రాశారు (మనం చదువుకోగలిగే భాషల్లోనే!) అన్న కుతూహలం కలిగింది. ఎవరికన్నా తెలిస్తే చెప్పండి.

ఇక ఈ మూడూ‌ నన్ను ప్రేరేపించి చదివించిన పుస్తకం దగ్గరికి వస్తాను.

The Inconvenient Indian: A Curious Account of Native People in North America – Thomas King

మన దేశంలోలాగే కెనడాలో కూడా అనేక ఆదివాసీ జాతులు ఉన్నాయి. ఇంచుమించు పై పుస్తకాలలో బాలగోపాల్ చర్చించిన విషయాలన్నీ, ప్రభుత్వాల తీరుతో సహా వీళ్ళకీ వర్తిస్తాయి. ఈ పుస్తకం ఈ ఆదివాసీ జాతుల చరిత్ర. అయితే, చరిత్ర పుస్తకాల పద్ధతిలో సాగదు. అందుకే ఆయన curious account అని పిలుచుకున్నాడు (దీన్ని గురించి పుస్తకం మొదట్లో ఓ సుదీర్ఘ చర్చ ఉంది ఎందుకా పేరు పెట్టాడని). ప్రధానంగా యూరోపియన్ లు ఉత్తర అమెరికా ఖండాన్ని “కనుక్కున్నాక” ఈ వివిధ జాతుల జీవితాలు ఎలా మారాయి? వీళ్ళంతా మారుతున్న కాలానికి అనుగుణంగా మారారా? ఏది వర్కవుట్ అయింది? ఏది కాలేదు? అసలు తెల్లవాళ్ళకీ వీళ్ళకీ మధ్య గతంలో, ఇప్పుడూ ఉన్న తగాదాలు ఏమిటి? ఎందువల్ల? రెండు దేశాలలోనూ (అమెరికా, కెనడా) ప్రభుత్వం, ఆదివాసీ కాని ప్రజలూ వీళ్ళ పట్ల ఎలా ప్రవర్తించారు/ప్రవర్తిస్తున్నారు? ఆదివాసీ నేపథ్యం నుండి వచ్చి రాజకీయంగానో, క్రీడల్లోనూ, సినిమాల్లోనూ పేరొందిన వాళ్ళు ఎవరు? – ఇలా ఒకటని కాదు, అనేక అంశాలను స్పృశించిందీ పుస్తకం.

ఇపుడు పర్యాటక స్థలాలైపోయిన కొన్ని ప్రాంతాలు కొన్ని తెగల వారి పవిత్ర స్థలాలు. వాళ్ళింకా పోరాడుతూనే ఉన్నారంట కోర్టు లలో. అలాగే, కొన్ని కొన్ని చదివి ఇవన్నీ ఒకప్పుడు, ఇపుడు మనం పరమ నాగరికులం అయిపోయాం, మనం డీసెంట్ పీపుల్ అనిపిస్తుంది కానీ, తేదీలు చూస్తే నా జీవితకాలంలోనివి కూడా ఉన్నాయి. పుస్తకం చదువుతూ ఉంటే అనేక పర్యాయాలు బాధ, కోపం, నాకు సంబంధం లేని అంశమే అయినా సిగ్గూ, అసహ్యం కూడా కలిగాయి. సరిగ్గా పైన బాలగోపాల్ గారు రాసిన అంశాలు – మంచి చట్టాలే అయినా అమలులో ఫెయిల్ అవడం, గిరిజనేతరులు గిరిజనుల మధ్య సంబంధాలు (ఇక్కడ ఆదివాసీ అనే అందాము – కెనడాలో అంతా గిరిజనులే అని నాకు అనిపించలేదు పుస్తకంలో), “భూమి” అన్నదే ప్రధానాంశం కావడం – అన్నీ ఇందులో కూడా ప్రస్తావించారు. అయితే, ఒక్క తేడా ఉంది. ఇది రాసింది కూడా ఆదివాసీ రచయితే! అందువల్ల, ఈ పుస్తకం మరింత విలువైనది అనిపించింది. పుస్తకం చివరి రెండు పేజీలలో రచయిత అన్న వాక్యాలు “ఎందుకీ పుస్తకం?” అని ఇక్కడిదాకా ఈ చిన్న పరిచయం చదివిన ఎవరికైనా అనిపిస్తే దానికి జవాబిస్తాయి. స్క్రీన్ షాట్ ఇక్కడ పెడుతున్నాను.

2019లో నేను ఒక వార్తాపత్రికలో డేటాసైంటిస్టుగా చేసేదాన్ని. అక్కడ కొత్త కొత్త పుస్తకాలు ఎడిటర్ల దగ్గర రివ్యూలకి వచ్చినవి – చాలా కాపీలు వస్తే వాళ్ళు తీసుకున్నవి కాక మిగిలినవి అందరికీ అందుబాటులో వదిలేసేవాళ్ళు. లంచ్ త్వరగా ముగించి నేను రోజు ఆ పుస్తకాలు పెట్టే హాలులో తచ్చాడుతూ ఉండేదాన్ని. ఓ రోజు “The Inconvenient Indian” అన్న పుస్తకం కనబడింది. చక్కటి illustrated, hard bound edition. రచయిత పేరు థామస్ కింగ్. గతంలో ఒకసారి డ్రూ హేడెన్ టేలర్ ని పుస్తకం.నెట్ కోసం ఇంటర్వూ చేసినపుడు (మొదటిభాగం, రెండోభాగం) ఆయన “I want to be Thomas King when I grow up” అన్నాడు సరదాగా. అయితే, ఆయనపైన డ్రూ కి ఉన్న అభిమానం అక్కడ తెలిసింది. అందువల్ల ఆ పుస్తకం కనబడగానే టక్కుమని తెచ్చేసుకున్నా! అప్పట్లోనే ఓ ఛాప్టర్ చదివి వావ్ … అనుకున్నా. విషయం అంత గొప్పగా ఫీలయ్యేది కాదు – సిగ్గుపడాల్సినది. వావ్ ఏంటి? అనుకుంటారేమో – కింగ్ రాసిన పద్ధతికి. అయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మార్పుల వల్ల మళ్ళీ తిరిగొచ్చి ఇది చదవడానికి నాకు రెండేళ్ళు పట్టింది. బాలగోపాల్ గారి పుస్తకాలు చదువుతూండగా ఇది గుర్తొచ్చి మళ్ళి మొదలుపెట్టి ఈసారి పూర్తి చేశాను. మధ్యలో ఇతర కెనడియన్ ఆదివాసీ రచనలు కొన్ని చదివాను. గతంలో తెలుగు పుస్తకాలలోనో, సోషల్ మీడియా పోస్టులలోనూ పరిచయమైన దళిత రచయితల ఆవేశం (కొంతమంది రచనలైతే బహిరంగ ద్వేషం) నాకు అర్థమవ్వడం మొదలుపెట్టింది ఇవి చదవడం మొదలుపెట్టాకే. అయితే, ద్వేషం వెళ్ళగక్కకుండా, వ్యంగ్యంతో, నిజాలతో, నిజాల వివరాలతో కొడతారు నేను ఇష్టపడ్డ ఇద్దరు రచయితలూ (కింగ్, డ్రూ హేడెన్ టేలర్). ఈ పుస్తకం అందుకే నచ్చిందనుకుంటాను.

This Place: 150 Years Retold (అనేక రచయితలు, చిత్రకారులు)

ఈ పుస్తకాలన్నీ చదివాక నాకు ఆ మధ్య చదివిన మరో పుస్తకం గుర్తు వచ్చింది.


గత జులై లో కెనడా డే సందర్భంగా ఏదన్నా ఇక్కడి చరిత్రకు సంబంధించిన పుస్తకం చదువుదాం అని చూస్తూ ఉంటే కొత్త పుస్తకమంటూ న్యూసులో దీని గురించి వచ్చింది. ఇది కెనడియన్ ఆదివాసీ రచయితలు, ఆర్టిస్టులూ కలిసి వేసిన గ్రాఫిక్ కథల సంకలనం. కథలంటే కథలు కావు. నిజాలే. నిజంగా జరిగినవే. చరిత్ర అంటే తెల్లవారికోణం లో రాసిన పుస్తకాలే కాదు – మా జీవితాల్లో ఇవి చారిత్రక సంఘటనలే అంటూ మన ముందుకు తెచ్చిన కథలు. ఒకటీ అరా కథల్లోని పాత్రల పేర్లు వేరే పుస్తకాల్లో చూశా కానీ, వీటిల్లో ఒక్కటి కూడా ముందు తెలిసిన కథ కాదు. కానీ, అన్నీ ఆయా ప్రాంతాల్లో పెద్ద పెద్ద సంఘటనలే. కొన్ని చోట్ల చిన్న చిన్న గ్రూపుల్లోనైనా ఆదివాసీ ప్రతిఘటనల గురించి చదువుతూ ఉంటే అదో ఉద్వేగం. అదో ఆవేశం. బొమ్మలు కూడా గొప్పగా ఉన్నాయి. ఎవరికన్నా కెనడా గురించి ఏ కాస్త కుతూహలం ఉన్నా తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. అసలు నేను పుస్తకాలు కానుకలిచ్చేది చాలా చాలా తక్కువ. ఈ పుస్తకం మాత్రం చదవంగానే కొత్తగా కెనడా తీర్థం పుచ్చుకున్న ఓ స్నేహితురాలికి అర్జంటుగా కొనిచ్చా – నువ్వు చదువు, నీ సిటిజెన్ షిప్ టెస్టులో ఇలాంటివి బహుశా అడగరేమో అని. ఆ పూనకం ఇంకా తగ్గలేదు నాకు. ఆ పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ తిప్పుతూ ఉంటా అందుకే అప్పుడప్పుడూ.

పైన ఉటంకించిన బాలగోపాల్ వాక్యం ఈ చివరి రెండు పుస్తకాలనీ దృష్టిలో ఉంచుకుని చదివితే, ఇదేదో మనదేశానికి ప్రత్యేకమైన వ్యవహారం కాదు… “ఏ జాతి చరిత్ర చూసినా, ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం” శ్రీశ్రీ ఏనాడో అన్నది నేను రోజూ తల్చుకుంటాను.. ఇక ఈ సమస్యలకంతా పరిష్కారం ఏమిటో అర్థం కాదు. వాళ్ళ బ్రతుకులు వాళ్ళ భూముల్లో వాళ్ళని బ్రతనివ్వాలి – కానీ ఆధునిక నాగరికత, జీవన విధానం దాన్ని ఒప్పుకోదు. మళ్ళీ‌మనకి ఆ భూములు కావాలి, ఆ అడవులు కావాలి, అన్నీ కావాలి. అన్ని దేశాల్లోనూ ఇదే దౌర్జన్యం – మనమొక్కళ్ళమే అనుకోనక్కర్లేదు. కానీ ఈ చివరి రెండు పుస్తకాల లాంటివి మన భాషల్లో, మన దేశం నుండి కూడా రావాలి అనిపించింది. సమకాలీన ఆదివాసీ సాహిత్యం గురించి, రచయితల గురించి నాకేం తెలియదు కానీ, ఇలాంటి కథలెన్నో ఉంటాయి… అవి కూడా అందరికీ తెలియడం అవసరం… చరిత్రంటే ఇపుడు చదివేది మాత్రమే కాదు అనిపిస్తుంది. “మొన్నా నిన్నా మన కథలెన్నో … నేడవి జనమే చదివే చరితగా మారాలోయ్” అని కబాలి సినిమాలో పాడినట్లు ఆదివాసులంతా అనుకుంటారో లేదో నాకు తెలియదు కానీ, మనకి తెలిసింది మాత్రమే నిజం కాదు అన్న విషయం మనమంతా వాళ్ళ ముందు ఒప్పుకోవాలేమో అనిపిస్తుంది నాకు (ఇది నా అజ్ఞానంతో కూడిన పైత్యమే లెండి – వాదోపవాదాలు అక్కర్లేదు. విని పక్కకు తప్పుకొని కూడా పోవొచ్చు).

ఇంతకీ అసలు ఒ పుస్తకం పట్టి దాన్ని పూర్తి చేయడమే నాకు గగనమైన రోజుల్లో నన్ను మళ్ళీ చదువు బాట పట్టించి వరుస బెట్టి ఇవన్నీ చదివించినందుకు, ఇంత వ్యాసమూ రాయించినందు బాలగోపాల్ గారికి, ఆ పుస్తకాలు వేసిన పర్స్పెక్టివ్, మానవ హక్కుల వేదిక వాళ్ళకి, ఉచితంగా వెబ్సైటులో ఉంచిన బాలగోపాల్.ఆర్గ్ వారికి అనేక ధన్యవాదాలు.

You Might Also Like

One Comment

  1. 2021 – నా పుస్తక పఠనం – పుస్తకం.నెట్

    […] గురించీ) గతంలో పుస్తకం.నెట్లో ఇక్కడ పరిచయం […]

Leave a Reply