Small Pieces: A Book of Lamentations – Joanne Limburg

[ట్రిగర్ వార్నింగ్: తోబుట్టువు మరణం, ఆత్మహత్య. 

ఇది ఒక పుస్తక పరిచయం మాత్రమే! అయినా దీంట్లో ప్రస్తావించిన కొన్ని అంశాలు తీవ్ర మనస్తాపం కలిగించచ్చు. మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటారని ఆశిస్తున్నాను.]

నార్వే దేశానికి చెందిన Gunnhild Øyehaug (ఎలా పలకాలో నాకూ తెలీదు) రాసిన “Small Knot” అనే కథ ఒకటుంది. అందులో ఒకామెకి పిల్లాడు పుట్టాక పేగుని కోయలేకపోతారు డాక్టర్లు. ఎంత ప్రయత్నించినా కుదరదు. ఏం చేయలేక దాన్ని అలానే వదిలేస్తారు. ఆజన్మాంతం పిల్లాడికి, తల్లికి పేగంత భౌతిక దూరం మాత్రమే సాధ్యమవుతుంది . వాడు స్కూలుకెళ్ళినా, పెళ్ళిచేసుకున్నా తల్లి దరిదాపుల్లోనే ఉంటుంది. ఆమే కాలం చేశాక డాక్టర్లు మళ్ళీ విశ్వప్రయత్నం చేస్తారు పేగు కోయడానికి. అయినా సాధ్యమవ్వక ఇక అతడూ శ్మశానంలోనే మకాం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది, సమాధికి దగ్గరగా. అయినా కథని బోలెడంత ఆశావాదంతో ముగిస్తారు ఆవిడ. 

ఈ మధ్యకాలంలో నాలో విపరీతంగా రొద చేస్తున్న కథ ఇది. కుటుంబ వ్యవస్థ, బంధాల నేపథ్యంలో జరిగే చర్చలలోనైనా, చదువుతున్న సాహిత్యంలోనైనా నేను ఈ కథ దగ్గరకే వచ్చి ఆగుతున్నాను. నన్ను వెంటాడుతున్న ప్రశ్నలన్నింటికీ ఇదే జవాబు ఇవ్వగలదనిపిస్తుంది. మొన్న ఎమ్.టి. వాసుదేవన్ నాయర్ రాసిన “భీమాయణం”ని పరిచయం చేసేటప్పుడు కూడా ఈ కథని ప్రస్తావించకపోయినా మృత్యుకన్యలా జీవదేవి ఉండదా అని నాచేత అడిగేలా ప్రేరేపించింది ఈ కథే! ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, మన చావుపుట్టుకుల మధ్య మనకి తెలీనంత దగ్గర సంబంధం ఉంటుంది అని గట్టిగా అరవాలనిపించేలా చేసిన పుస్తకం Joanne Limburg రాసిన Small Pieces: A Book of Lamentations

ఎందుకంత ఆవేశమంటే, నేను విసిగివేసారిపోయున్నాను కనుక. మీడియాలో, తెల్సినవాళ్ళ ద్వారానో ఎవరో ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త వినాల్సి వచ్చినప్పుడల్లా వార్తతో పాటు వచ్చే అసంబద్ధపు విశ్లేషణలు నన్ను ఏడిపిస్తాయి కనుక. “ఆన్‍లైన్ చదువుకోడానికి మొబైల్ లేక ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి,” “సినిమాలు హిట్టవ్వక ఆత్మహత్య చేసుకున్న యువహీరో,” “అప్పులు తీరక ఆత్మహత్య చేసుకున్న కుటుంబంలోని నలుగురు,” “ఉద్యోగం ఆఫర్ రాక ఆత్మహత్య చేసుకున్న ఐఐటి విద్యార్థి” – ఇలానే ఉంటాయి వార్తలు, సంతాపాలు. వాళ్ళు ప్రాణం తీసుకోడానికి ఒకే ఒక్క ఖచ్చితమైన కారణమేదో వీళ్ళ చెవిలో ఊదేసిపోయినట్టు. అక్కడికీ ఆ చివరి ఉత్తరాలు, ఆ సూసైడ్ నోట్స్, ఆ గుడ్‍బై కిసెస్, అరిచి గీపెట్టి చెప్తాయి: “నా నిర్ణయానికి ఎవరూ కారకులు కారు. ఎవరూ బాధ్యులు కారు. ఏ ఒక్కరి వల్లో, ఏ ఒక్క సంఘటన వల్లో నేనిలా చేయడం లేదు. ఏ మాత్రం ఆశ మిగిలినా వేరుగా ఉండేది. ఇక, ఇదంతా వద్దనుకుంటున్నాను. అర్థం లేదనుకుంటున్నాను.” అయినా మనం వినం. “ఎందుకు ప్రాణం తీసుకోవడం?” అన్న అతి ముఖ్యమైన ప్రశ్నకి అతిజాగ్రత్తగా అశ్రద్ధ వహిస్తూ మనం కారణాలిచ్చుకుంటాం. ఈ ముష్టి కారణాలిచ్చుకుని “RIP”లు మాత్రం రాసుకుంటాం సోషల్ మీడియాలో.  పోయినోళ్ళు గానీ మనల్ని, మన వెర్రి చేష్టల్ని చూసే అవకాశముంటే ఆ ఒక్క వేలూ చూపించకుండా ఉండలేరు!

జోయాన్ లిమ్‍బర్గ్ రాసిన పుస్తకం ఆత్మహత్య గురించి అని అనుకోలేదు మొదట. తోబుట్టువు ఆకస్మికంగా చనిపోతే, పోయాక ఆ వెలితిని పూడ్చుకోలేక, అలా అని అదేం పెద్ద లోటు కాదన్నట్టు వ్యవహరించలేక ఒక అసహాయతలో, ఒక అపరాధభావంతో బతుకు ఈడ్చే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ గురించి వచ్చిన ప్రస్తావనలో ఈ పుస్తకం పరిచయమైంది. అచ్చంగా ఈ పేరాతో: 

“As the sole surviving child of that family, I find myself left with certain difficulties in the area of speech and language, problems of tense and person, and of definition. To start with definition, does ‘sole surviving child’ effectively mean ‘only child’? Now that I have no siblings, can I still define myself as a sister? This leads into tense: unquestionably I was a sister, who had a brother, but if someone asks me, ‘Do you [not did you ever] have any brothers and sisters?’, how should I answer? If I say, in the present tense, ‘No, I don’t,’ am I declaring the truth, or concealing it? And then – moving on to the question of person or persons – even if the sibling question has not explicitly been asked, when I tell, in the course of an ordinary conversation, an ordinary story about myself, do I talk about my parents, my childhood, my family, say that I grew up in London, I was brought up Jewish, I always went to my grandparents on a Saturday? Or do I say that we went to the local school, loved to ride our bikes up and down the street, climbed trees on the wasteland that we called The Green and that, as we got older, we grew more and more impatient with our father? My dilemma here is not that ‘we’ would be incorrect in the past tense, it is rather that – like the answer to the sibling question – the use of the first person plural has the potential to lead a casual conversation towards a revelation that would render it no longer casual. So, Julian, what would you rather I did? Sprinkle a little bit of trauma wherever I go, or finish off what you started, and obliterate you? Which is your preferred legacy?”

ఇట్లాంటివే పుస్తకమంతా గుప్పించేసి ఉంటారు, నాకు కనీసం పదిపదిహేను జ్ఞానగుళికలు అలా నాలుక చివర్న ఉంటాయి ఇప్పటినుంచీ అనుకున్నాను. నా Emotional Intelligenceని అమాంతంగా పెంచేసి, ఈసారి తోబుట్టువుల్ని పోగొట్టుకున్నవాళ్ళతో మాట్లాడాల్సి వస్తే “అలా ఎందుకంటున్నావ్? ఇలా ఉండడానికి ప్రయత్నించకూడదా?” అన్న ఉచిత-సలహా-పోరు పెట్టకుండా, “అయ్యో… మీ అవస్థ నాకు అర్థమే కాదండీ!” అని బిగుసుకుపోకుండా  చాలా నిజాయితీతో, సహానుభూతితో వ్యవహరించే చిట్కాలన్నీ ఈ పుస్తకం ఇస్తుందనుకున్నాను. ముఖ్యంగా, తల్లిదండ్రులు పోతే పిల్లలు గురించి బాధపడతాం, భార్యాభర్తల్లో ఒకరు పోతే ఇంకొకరికి తోడెలా అని కంగారు పడిపోతాం, కానీ తోడబుట్టినవాళ్ళు పోతే “మీ అమ్మనాన్నలకి మిగిలింది నువ్వే!” అని భారం మోపుతామే గానీ “పోని వాళ్ళ” పీడని, లోటుని అర్థంచేసుకోవాల్సిన అవసరముందని గుర్తించం. “మీరెంతమంది మొత్తం? అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ?” అని కాలక్షేపానికి అడిగే ప్రశ్న కొందరి గొంతుకలకి అడ్డంపడుతుందని, లోపల నమిలేస్తుందని మనం ఊహించం. రోజుకి అంతలేసి మంది ఆక్సిడెంటుల్లో, ఆసుపత్రుల్లో, ఆత్మహత్యల్లో చనిపోతున్నారని వింటుంటాం గానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరు మనకి ఎదురుపడచ్చుననీ, వాళ్ళని కూడా కలుపుకునేలా, వాళ్ళల్లోని ముల్లు తక్కువగా కలుక్కుమనేలా మనం వ్యవహరించాలనీ, మన భాషని అందుకు అనుగుణంగా మార్చుకోవాలనీ మనకి తట్టదు. 

అయితే, ఆవిడ కేవలం ఈ అంశాన్నే స్పృశిస్తూ రాస్తారని అనుకోవడం కూడా నా అమాయకత్వమే. పుస్తకం చదవాలనుకున్నప్పుడు తెలీని విషయం, పుస్తకం మొదట్లోనే అర్థమైన విషయం – ఇది ఆత్మహత్య వల్ల కలిగే వియోగ దుఃఖం గురించిన పుస్తకమని. పైగా తమ్ముడి ఆత్మహత్య కాబట్టి చిన్ననాటి జ్ఞాపకాలు, అల్లర్లు, కొట్లాటలు, తల్లిదండ్రుల ప్రేమలు, వాటిల్లో కొరతలు అన్నీ వెనక్కి తిరిగి చూసుకుంటూ, ఎక్కడ పొరపాటు జరిగింది, ఏం చేసుంటే ఈ విపత్తు తప్పేది అని గతమనే చీకట్లో దేవులాడుకోవడం. ఈవిడకి ఒకానొక bereavement clubలో పరిచయమైన ఒకరు చెప్తారు: “నువ్వు గతాన్ని ఎంత దువ్వినా దాన్ని సాఫు చేయలేవు పూర్తిగా. చాలా వాటికి సమాధానాలు దొరకవు అనేదే మనకి దొరికే సమాధానం.” అది చాలా నిజమనిపించింది ఈ రచన చదువుతుంటే… ఎందుకంటే, ఇది కేవలం ఆత్మహత్య గురించి కాదు. కాలేదు. ఆవిడకున్న OCD (Obsessive Compulsion Disorder), వాళ్ళ అమ్మకున్న మానసిక సమస్యలు, వాళ్ళ నాన్నకున్న సమస్యలు అన్నీ కలగాపులగమై పోతాయి. నరేషన్‍కూడా అలానే ఒక అంశం మీదనుంచి ఇంకో అంశం మీదకి గెంతెతూ, ముందుకీ వెనక్కీ పోతూ అక్కడక్కడా గందరగోళంగా కూడా అనిపించింది. అంటే, ఏ ఒక్క భావోద్వేగంతోనూ సరిపడా సమయం పాఠకునికి ఇవ్వకుండా ఇంకోదానికి మరలిపోవడం. అప్పుడే ద్వేషం, అప్పుడే హాస్యం. బహుశా, బ్రేక్‍లు తీసుకుంటూ చదవాల్సిందేమో కానీ నేను ఆపలేకపోయాను చదవడం. 

మానసిక ఆరోగ్య సమస్యలు ఒక లీనియారిటికి లొంగవని మొన్నటి వ్యాసంలో రాశాను. ఆ ముక్కకి ఈ రచన మంచి ఉదాహరణ. ఇందులో కుటుంబంలో ఒడిదుడుకులు, కోపతాపాలు, లోటుపాట్లు మాత్రమే కాదు, వర్క్ పాలిట్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. పత్రిక భాషలో చెప్పాలంటే: జూలియన్ అనే కెమికల్ సైటింటిస్టు మంచి గ్రాంట్ సంపాదించినా కూడా వృత్తిలో వివక్షకు గురైనందుకు ఒక కెమికల్‍ తాగి ప్రాణం తీసుకున్నాడు. వాళ్ళ అక్క రచయిత కాబట్టి లోతుపాతుల్లోకి వీలైనంతగా వెళ్ళగలిగింది కాబట్టి, “ఆ… ఈ గ్రాంట్ కాకపోతే ఇంకో గ్రాంట్ రాకపోతుందా, ఆ మాత్రానికే అంతటి విపరీతానికి ఒడిగట్టాలా?” అన్నవి అనుకోడానికి లేదు.  కానీ అందరికీ ఇలాంటి రచయితలైన అక్కలు ఉండరు కదా? 

మనమెంత సేపూ పిల్లలకి మన పోలికలు ఉన్నాయా, మన జుట్టులా ఉందా, కళ్ళ రంగేంటి అని తెగ మురిసిపోతాం కానీ మన రూపురేఖలతో పాటు మన మానసికావస్థనీ, మన భయాందోళనలూ, అభద్రతలనూ, ట్రామాలనూ కూడా మనకి తెలీకుండా పంచుతామని అర్థంచేసుకోం. చిన్నపిల్లల మనసుల మీద మనం వేళాకోళంగా అన్న మాటో, వేసిన దెబ్బో వాళ్ళని ఎంత కృంగదీస్తుందో మనకి తెలీదు. మానసికారోగ్య సమస్యలు అనగానే ఉన్మాదం, అదుపులేకపోవడం అన్న విపరీత అర్థంలోనే చూస్తాము కానీ, ఒక శరీరాన్ని-మనసునీ రోజూ సూదులు గుచ్చుతూ పోతే అదెప్పుడో మొద్దుబారిపోవడమో, లేదా అసలు గాలి తాకినా భరించలేనంతగా మారిపోతుందని మనకి ఎవరూ అర్థం చేయించరు. మనకి అర్థమయ్యేసరికి ఒక్కోసారి చాలా ఆలస్యమైపోతుంది. 

అలా ఆలస్యమైపోయాక అర్థం కావాలంటే ఏ మతాన్నో ఆశ్రయించక తప్పదా? అన్న అనుమానాలు రేపింది ఈ పుస్తకం.  ముఖ్యంగా, తల్లిదండ్రులు “గుంపులో గోవింద” చందాన ఆచరించిన మతం, తనకీ, తన తమ్ముడికీ ఏ సంబంధమూ, ఏ అక్కరా లేదనుకున్న యూదియా మతాన్నే (Judaism) ఆధారంగా చేసుకుని ఆ అగాధాలని దాటుకుంటూ వస్తుంది. పుస్తకంలోని ప్రతి చాప్టర్ మరణానికి సంబంధించిన ప్రశ్నలు, వాటికి యూదియామతం ఇచ్చే వివరణలతోనే మొదలవుతుంది.  అందులో నన్ను విశేషంగా ఆకట్టుకున్న విషయం, ఈ మతం ప్రకారం ఆత్మహత్య చేసుకునేవారు విపరీతమైన పీడలో ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు కాబట్టి, అది వారి స్వయం-నిర్ణయంగా పరిగణించరు. 

“Nevertheless, it is important to understand and accept there are those who commit suicide out of extreme distress or emotional agony. Therefore it is entirely left up to Knower of All Souls (same one as the Giver of Life, aka G-d) to know whether this person really had any free choice left in his soul. This is not something that any fellow human being can conclude on our own, as we do not truly know what was going on within that person at that specific time.”   

ఈ ఒక్క ముక్కా గుర్తుపెట్టుకుంటే మనం పోయినవాళ్ళని, వాళ్ళ జీవితాలని, వాళ్ళ మరణాలని అంత దారుణంగా జడ్జ్ చేయకుండా ఉంటాము. 

ఈ పుస్తకం చదవడంలో నాకు చాలా కష్టమనిపించిన అంశాలు:

ఒక మనిషి చనిపోవడం కన్నా ఆ మనిషి బతికున్నప్పుడు అతడి మాట ఎవరూ వినకపోవడం, అతడిని ఎవరూ మాట్లాడించకపోవడం. కొన్నిసార్లు ఈ లోలోపల సుడులు తిరిగే ఆలోచనలే భూతద్దాల్లో కనిపించి ఊపిరాడనివ్వవు. “ఎవరితోనైనా మాట్లాడండి” అని ఊరికే పోస్టర్లు పెట్టడం కాదు, మనకి వ్యక్తీకరించడమూ చేతనవ్వాలి, అవతలివాళ్ళకి వినడమూ రావాలి. అట్లా ఒక స్నేహితుడున్నా జూలియన్ కథ వేరుగా ఉండేదేమో. 

మనకి మానసికారోగ్యం అంటే ఎంతటి అలక్ష్యమో. ఎవరన్నా చిన్నపిల్లాడిని అప్పుడప్పుడూ ఎవరైనా గోళ్ళతోనో, బ్లేడుతోనో గాట్లు పెడుతుంటే మనం చూస్తూ ఊరుకోం. ఎవరి పిల్లవాడైనా సరే గోల చేస్తాం, అన్యాయమంటాం. కానీ అదే మాటలతో, చేష్టలతో మళ్ళీమళ్ళీ గాయపర్చ వచ్చు అనే ఊహ కూడా రాదు మనకి. అవి పసిపిల్లలలో ఎంత లోతైన గాయాలుగా మిగిలిపోతాయో ఈ పుస్తకం కళ్ళకి కట్టినట్టు చెప్తుంది. There’s no one right way of parenting, but there are several wrong ways of doing it. “పిల్లలే, వీళ్ళకేం అర్థమవుతుందిలే?” అన్న ధోరణిలో కాకుండా “పిల్లలు కాబట్టే ఏ filters లేకుండా అన్నింటినీ సొంతం చేసుకుంటారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి” అన్నది గుర్తించాలి. ఇంట్లోనే ఆ అవకాశం లేకపోతే, లోకమెటూ పీక్కుతినడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి, చాలా కష్టమైపోతుంది. 

ఫిలిప్ రాత్ రాసిన ఒక నవలలో (పేరు గుర్తురావడం లేదు), అన్న చనిపోతే అందరూ రచయిత అయిన తమ్ముణ్ణే మాట్లాడమంటారు ఫ్యూనరల్‍లో. “This profession fucks up my grief,” అన్న అర్థం వచ్చేలా విసుక్కుంటాడు స్పీచ్‍కి ముందు. ఈమెకి కూడా ఆ అవస్థ తప్పలేదు. ఒక అందమైన eulogy చదివి వినిపిస్తుంది తమ్ముడికోసం. దాని పూర్తి పాఠం ఈ పుస్తకంలో చేర్చింది. అతడికున్న సమస్యలు, అయోమయాలు, సావాళ్ళు ఏమీ లేకుండా అతడిదో బహు చక్కని జీవితమనిపించేలా ఉంటుంది ఆ స్పీచ్. చెప్పాల్సిన నిజాలెన్నో దాచిపెట్టేశానే అని వాపోతుంది. 

ఆ చెప్పాల్సిన నిజాలు తర్వాత పుస్తకంగా తీసుకొచ్చినందుకు ఆమెకి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే! వేదనను గురించి రాయడం cathartic అంటారు, ఒక సాంత్వనం కలుగుతుందంటారు. అదెంత నిజమో గానీ, ఇలాంటివి రాసి “బయటపెట్టడం” వలన ఇంకెందరికో వ్యక్తీరించడానికి (మాటల్లోనే కానక్కర్లేదు, భావోద్వేగాల ద్వారా అయినా) అవకాశం కల్పించినట్టవుతుంది. 

కొండ అంచున, చిట్టచివరి అంచున నుంచున్న ఒకడు కాలి కింద రాయి కదిలి లోయలోకి పడిపోతే, రాయిని అనలేం కదా? అసలు వాడు అంతసేపు, ఆ మృత్యులోయను చూస్తూ కూడా అక్కడే ఎందుకుండిపోయాడు అన్నది కదా మనం అడగాల్సిన ప్రశ్న. అసలు అంత చివరకంటా వెళ్ళాల్సిన అగత్యాన్ని కల్పించిన పరిస్థితులేంటి అన్నది మనం కనుక్కోవాల్సిన విషయాలు. ఈ పుస్తకం చేసే పని అదే! 

తేరుకోడానికి సమయంతో పాటు, మనల్ని మనం కాస్త దయతో చూసుకోవాల్సిన అవసరం కల్పించే పుస్తకం. అందుకని చదువుతున్నప్పుడు, చదివాక జాగ్రత్త! 

You Might Also Like

Leave a Reply