2020 పుస్తకావలోకనం: శశిధర్

వ్యాసకర్త: శశిధర్


సంవత్సరంలో చాలా భాగం ఇంట్లోనే ఉండటం వల్ల చాలా పుస్తకాలు చదవగలను అనుకున్నాను కానీ నిజానికి అలా జరగలేదు. సగం పని వొత్తిడి వల్ల, సగం టి.వి.కి ఎక్కువ సమయం వెచ్చించడం వల్ల. ఈ సంవత్సరం కొత్తగా ప్రయత్నించింది ఒకే సారి ఒకటి కన్నా ఎక్కువ పుస్తకాలు చదవడం. వ్యాస సంకలనాలు, ఆథ్యాత్మిక పుస్తకాలు, కథా సంకలనాలు వంటివి ఒక్క పెట్టున చదవటం కంటే కొంచెం, కొంచెంగా చదివే ప్రయత్నం చేశాను. అలా మొదలు పెట్టినవి ఏవీ ఈ సంవత్సరంలో పూర్తి చేయలేకపోయాను. 

నల్లమిల్లోరి పాలెం కథలు – వంశీ

పుస్తక ప్రదర్శనలో ఎమెస్కో స్టాలులో ఈ పుస్తకం చూసి వెంటనే కొని చదవటం మొదలు పెట్టాను. కొంచెం నిరాశపరిచిందనే చెప్పాలి. జంపాల చౌదరిగారు చక్కని ముందు మాట రాశారు. బొమ్మలు శ్రీ బాపు, కడలి సురేష్, హంపి, వాసు అందించారు. వంశీ కథలకి బాపు గారి బొమ్మలు లేని లోటు స్పష్ఠంగా తెలుస్తుంది. వెలకు తగ్గట్టు పుస్తకం చాలా నాణ్యంగా, అందంగా ముద్రించారు. అందుకైనా ఈ పుస్తకం కొని దాచుకోవచ్చు.

On Meditation : Finding Infinite Bliss and Power Within – Sri M
ధ్యానానికి సంబంధించిన ప్రశ్నలకి శ్రీ ఎమ్ సమాథానాలు. చిన్న పుస్తకం అయినా చాలా విషయాలు చర్చకు వస్తాయి. ధ్యానం మీద ఆసక్తి ఉన్న వారు తప్పక చదవవలసిన పుస్తకం.

ఆనందమే అందం – పొత్తూరి విజయలక్ష్మి
వివిధ సంవత్సరాలలో, వివిధ పత్రికలలో ప్రచురించబడిన కథల సంకలనం ఈ పుస్తకం. సరదాగా బానే ఉన్నాయి కథలు. నేను చదివిన పొత్తూరి వారి వేరే పుస్తకాలు యింకా బాగున్నాయి.

శరత్‌పూర్ణిమ – జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి
నవోదయా రామమోహనరావు గారు పంపారు ఈ పుస్తకం. యివి అన్నీ పేరడీ కథలు అనుకొని చాలా సంవత్సరాలు చదవలేదు. చివరికి పుస్తకాలు సర్దుతూ పక్కన పెడదాం అని తీసి ఆపకుండా పూర్తి చేశాను. మొత్తం 20 కథలు. అద్భుతమైన భాషా సౌందర్యం.

 నల్లమిరియం చెట్టు – డా. చంద్రశేఖరరావు
దండోరా ఉద్యమ నేపధ్యం ఈ నవల కథా వస్తువు. మనుషులు, వ్యవస్థలు యింత కృూరంగా ఎందుకు ఉంటారో, ఉంటాయో అనిపించింది ఈ పుస్తకం చదివాక.

భూచక్రం – మధురాంతకం నరేంద్ర
Don’t judge a book by it’s cover. ఆ తప్పు చేసి నేను ఈ పుస్తకమే కాదు మధురాంతకం నరేంద్ర అనే గొప్ప రచయిత రచనలను దూరం పెట్టాను. మృణాళిని గారు తమ అక్రర యాత్రలో భాగంగా రచయితతో సంభాషణ చూశాక ఈ పుస్తకం చదివాను. మంచి నవల. ఈ పుస్తకం గురించి రచయిత మాటల్లోనే –


రెండేళ్ళ పద్నాలుగు – మధురాంతకం నరేంద్ర
ఈ కథల గురించి బి. తిరుపతిరావు గారు తమ వ్యాఖ్యానంలో వస్తువిస్తృతి చాలా తక్కువ అని నరేంద్ర గారు మరింత వైవిధ్యభరితమైన ప్రయోగపూరితమైమ కథలు రాయాలని అన్నారు. నా వరకు నరేంద్ర గారి కథలు చదవటం యిదే మొదలు అవటం వల్ల నాకు ఈ కథలు చాలా నచ్చాయి. ఈ పుస్తకం గురించి రచయిత మాటల్లోనే –

వెదురుపువ్వు – మధురాంతకం నరేంద్ర
2003 – 2013 వరకు వివిధ పత్రికలలో అచ్చయిన కథలు, 1985 లో అచ్చయిన రెండు కథలు కలిపి వెదురుపువ్వు మరికొన్ని కథలుగా సంకలనం చేశారు. మాయా వాస్తవిక పద్థతిలో వ్రాసిన కథలు నాకు అర్థం కాలేదు. మిగతా కథలు బాగున్నాయి.

మోహన మకరందం –   మోహన్ కందా
పలు ముఖ్యమంత్రులతో పని చేసిన ఒక అధికారి అనుభవాలు అంటే చాలా ఆసక్తికరంగా ఉంటాయని ఆశించాను. నేను ఆశించినంత దాపరికం లేకుండా రచయిత తమ అనుభవాలను అక్షర బద్ధం చేయలేదు. ఎమ్బీయస్ ప్రసాద్ గారి కూర్పు మాత్రం అద్భుతంగా ఉంది. బాపు గారి బొమ్మల కోసం అయినా ఈ పుస్తకం కొనవచ్చు.

చిత్రసుందరి – అఖిలన్ అనువాదం : మధురాంతకం రాజారాం

భారతీయ జ్ఞానపీఠ్ అవార్డు పొందిన నవల. సాధారణంగా ముందు మాట చదవని నేను ఈ నవల ముందు మాట చదవటం వల్ల ముగింపు చూచాయగా తెలిసిపోయింది. అయినా అసక్తిగా చదివించేలా చేశారు రచయిత. మంచి మనుషుల మధ్యలో ఒక విషపురుగు. చాలా తెలుగు సినిమాలు ఉండి వుంటాయి యిలాంటి కథతో. అయితే ఈ రచనలో ఉన్న సున్నితత్వం మాత్రం ఉండదు.
 

Half – Lion: How P.V Narasimha Rao Transformed India – Vinay Sitapati
కాంగ్రెస్ వెలి వేసిన పి.వి., ప్రస్తుతం బి.జె.పి, తె.రా.స. చంకనెక్కించుకుంటున్న పి.వి. గురించి తెలియని విషయాలు ఎన్నో తెలిశాయి ఈ పుస్తకం వల్ల. యిలాంటి పుస్తకం తెలుగులో రాకపోవటం సిగ్గుచేటు. ఆయన ఖాతాలో ఎన్ని విజయాలు ఉన్నాయో, అంతకంటే పెద్ద అపజయాలు ఉన్నాయి. రెండు కోణాలని నిజాయితీగానే మన ముందు ఉంచారు రచయిత. మంచి పుస్తకం.

మథురాంతకం రాజారాం ఉత్తమ కథలు – సింగమనేని నారాయణ (సంపాదకులు)National Book Trust, India
పుస్తక ప్రదర్శనలో ఎన్.బి.టి స్టాలు మొత్తం వెతికినా కనపడలేదు ఈ పుస్తకం. ఎవరో వేరే పుస్తకం తెచ్చి ఈ పుస్తకాల ముందు పెట్టారు. ఎమెస్కో వారు త్వరలో మథురాంతకం రాజారాం గారి సమగ్ర సాహిత్యం తీసుకు వస్తున్నారని నరేంద్ర గారు అన్నారు. అప్పటి వరకు నేను ఈ పుస్తకం మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంటాను.


రమణీయ శ్రీ రామాయణం – ముళ్లపూడి శ్రీదేవి
రామాయణాన్ని సంక్షిప్తంగా, సమగ్రంగా చక్కని తెలుగులో అందించారు శ్రీదేవి గారు. అద్భుతం. బాపు గారి బొమ్మలు.

The Collected Short Stories – Satyajit Ray, Gopa Majumdar (Tr.)

అసలు ఒక రచయిత యిన్ని కథలు, ప్రతి కథా ఆసక్తికరంగా ఎలా రాయగలుగుతారు? ఒక వ్యక్తి అన్ని రంగాలలో అంత ప్రతిభ చూపడం ఎలా సాధ్యం? వీటిలో కొన్ని కథలు మమత గారి అనువాదంలో చదివి ఉన్నా చదవని కథలు చాలా ఉన్నాయి ఈ సంకలనంలో.

భగవాన్ స్మృతులు – చలం
రమణ మహర్షి గురించి రమణాశ్రమంలో ఉన్న వ్యక్తుల ద్వారా వారికి తెలిసిన రమణ మహర్షిని మనకు చూపిస్తారు చలం. చివరలో తన ప్రయాణం కూడా తెలియచేస్తారు. మంచి పుస్తకం. రమణ మహర్షి ఉపదేశ సారం, నేను ఎవరు చదవాలి అనే ఆసక్తిని కలిగించింది ఈ పుస్తకం.

అబ్బూరి ఛాయాదేవి కథలు –  సంపాదకులు : వి.ప్రతిమ
భూమికలో అబ్బూరి ఛాయాదేవి గారి ప్రత్యేక సంచిక (http://bhumika.org/archives/category/ప్రత్యేక-సంచిక-అబ్బూరి-ఛ) చదివి ఆశ్చర్యం వేసింది. ఒక వ్యక్తి యింత విలక్షణంగా తమ జీవితం గడిపారంటే వారి రచనలు ఎలా ఉంటాయో అనే ఆసక్తితో చదివిన పుస్తకం యిది. మన చుట్టూ జరిగే మనం మామూలు అనుకునే విషయాలలో ఎంత అన్యాయం ఉందో ఈ కథలు చదివితే తెలిసింది. అందరూ చదవాల్సిని కథలు యివి.

http://bhumika.org/archives/category/ప్రత్యేక-సంచిక-అబ్బూరి-ఛ

కథలూ, బొమ్మలూ – V. Sutayev
సుతయేవ్ పుస్తకాలు నా దగ్గర ఉన్నవి దాదాపు చిరిగిపోయాయి. మంచి పుస్తకం వారు వాటిని అన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా తీసుకు వచ్చారు. సుతయేవ్ బొమ్మలతో కథలు చెప్పే తీరు అపూర్వం. ఎన్నో మంచి పుస్తకాలను అందిస్తున్న మంచి పుస్తకం వారికి అభినందనలు.

వేయిపడగలు – విశ్వనాథ సత్యనారాయణ
విశ్వనాథ వారి 125వ జయంతోత్సవాలు చూసిన తరువాత విశ్వనాథ వారి వేయిపడగలు చదవటం మొదలు పెట్టాను కానీ ఈ పుస్తకం నేను పూర్తిగా చదవలేదు. చివరలో గుడిలో జరిగే ఉత్సవాల వివరాల పేజీలు తిప్పేసాను. చదివినంత వరకు బాగానే వుంది. ఆంగ్లేయులకు పూర్వం ఎలా ఉండేది, తరువాత జీవనం ఎలా మారింది అందులో మంచి చెడులు ఏమిటి అనేది విశిదీకరించారు.

https://www.youtube.com/watch?v=TrEvSSxgDMg

అష్టదిగ్గజాలంటే ఆరు – పొత్తూరి విజయలక్ష్మి,సోమరాజు సుశీల
నిజానికి అష్టదిగ్గజాలంటే ఒకరే సోమరాజు సుశీల గారు. వారి రచన కోసం మాత్రమే ఈ పుస్తకం చదవవచ్చు.

బాపు బొమ్మల పంచతంత్రం – అనిల్ బత్తుల (పున:కథనం)
అనిల్ గారి పుస్తకాలు బాగుంటాయి కానీ ఈ పుస్తకం మాత్రం నాకు నచ్చలేదు. చెప్పిన కథకు అది ఆ తంత్రంకు ఎలా సంబంథించినదో నాకు అర్థం కాలేదు. బాపు గారి పాత శైలి బొమ్మల కోసం ఈ పుస్తకం కొనుక్కోవచ్చు.

జ్ఞాపకాల జావళి – పొత్తూరి విజయలక్ష్మి
రచయిత్రి చిత్తరంజన్ లో గడిపిన కాలం యొక్క జ్ఞాపకాల జావళి ఈ పుస్తకం. అద్భుతంగా ఉంది. సరదాగానే కాక చాలా నేర్చుకుని ఆచరించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో.

కథకాని కథ – డా. శ్రీ గోపాల్ కాబ్రాఅనువాదం : ఆర్. శాంతసుందరి
ఈ కథలకి నేపథ్యం ఒక పెద్ద ఆసుపత్రి, కాన్సర్ రోగులను చివరి దశలో సేవలందించే ఒక ఆశ్రమం. వైద్యరంగంలో చాలా సున్నితమైన అంశాలను చర్చకు తీసుకు వస్తారు రచయిత. అయితే వాటికి పరిష్కారం కానీ, సమాధానం కానీ చెప్పరు చాలా సార్లు. మనల్ని ఆలోచించుకోమని వదిలేస్తారు.

Murder on the Orient Express: A Hercule Poirot Mystery (Hercule Poirot Mysteries) – Agatha Christie
మొదట్లోనే యిచ్చిన ఒక చిన్న సూచన వల్ల ముగింపు ఊహించగలిగాను. అంత గొప్పగా అనిపించలేదు.


Trial by Silence, The Story of a Goat – Perumal Margin
మాటల మాంత్రికుడు రచయిత. మసుషుల గురించి రాయలేక మేక గురించి రాసినా కూడా అదే అంత అద్భుతంగా ఉంటే యింక ఆయన రాయలేనిది ఏముంటుంది? ఆయన ఏమి రాసినా కళ్లకద్దుకుని చదువుకోవచ్చు.

You Might Also Like

Leave a Reply