అన్నిటికంటే బలమైనదెవరు?

వ్యాసకర్త: త్రివిక్రమ్

ఈ పుస్తకం పేరు చూడగానే లేదా అథమం చదువుతూ ఉండగా ఇలాంటిదే వేరొక కథ గుర్తొస్తుంది. ఒక ఋషి (పేరేమిటబ్బా?) దంపతులు ఒక ఆడ ఎలుక పిల్లను పెంచుకుంటారు. ఆ పిల్లకు పెళ్లీడొచ్చాక పెళ్లి చేద్దామని సంబంధాలు చూడబోతే ఆ పిల్లేమో అందరికంటే బలవంతుణ్ణే చేసుకుంటానంటుంది. సరే, లోకానికి వెలుగునిచ్చే ప్రత్యక్షదైవం సూర్యుడితో మొదలుపెట్టిన వెతుకులాట ఆ సూర్యుడినే కప్పేసే మేఘాలు, ఆ మేఘాలను అడ్డుకోగల పర్వతాల మీదుగా ఆ పర్వతాలనే తొలచగల ఎలుకల దగ్గరకొచ్చి ఆగుతుంది. చివరికి ఒక యోగ్యుడైన ఎలకను వరుడిగా నిశ్చయిస్తారు.


అదే విధంగా ఈ పుస్తకంలో సంభాషణ కూడా. అల్యోష అనే పిల్లాడు అన్తోన్ అనే పెద్ద మనిషి వెంటబడి రకరకాల యక్ష ప్రశ్నలు వేసి పీడిస్తుంటాడు. “అన్నిటికంటే బలమైనదేది? ఏనుగా తిమింగలమా?” అన్న ప్రశ్న దగ్గర ఆగిపోయి, సమాధానం రాకపోయేసరికి రెట్టిస్తాడు (పెళ్లి చేసుకోవడానికి కాదనుకోండి :P). అన్తోన్ అతడికి ఒక క్రేన్ ను చూపిస్తాడు. అది ఏనుగునైనా, తిమింగలాన్నైనా, రైల్వే వాగన్నైనా లక్ష్యపెట్టకుండా, గడ్డిపోచను ఎత్తిపారేసినట్టే ఎత్తిపారేస్తుంది.


ఆ క్రేను కంటే బలమైనదేదైనా ఉందా? అన్నది సప్లిమెంటరీ క్వెశ్చను. ఎలెక్ట్రిక్ రైలింజను అన్నది సమాధానం. సామాన్లతో నిండిన యాభై వేగన్లను లాగేస్తుంది. ఇక తర్వాతి డైలాగు ఊహించడం సులభమే :-). “దానికంటే బలమైనది?” స్టీమరింజన్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమాధానాలు వస్తూంటే దానికి అడ్డుకట్ట వెయ్యడానికన్నట్టు అడగదలచుకున్నది సూటిగా అడిగేస్తాడు అల్యోష. అది నిజానికి తన మొదటి ప్రశ్నే, కానీ మొదట్లో ఆప్షన్స్ తనే సరిగా ఇవ్వక సంభాషణ తప్పుదోవ పట్టింది: “అన్నిటికంటే బలమైనదేది?”


పైన బలమైనవని మనం అనుకున్నవాటికి బలం ఎక్కడినుంచి వచ్చింది? క్రేనును నడిపేదెవరు?రైలును నడిపేదెవరు? స్టీమరును నడిపేదెవరు? అసలు అంత బలమైనవిగా వాటిని తయారు చేసిందెవరు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం: మనిషి. “అందువల్ల అన్నిటికంటే బలమైనదెవరు? మనిషి!” అని ముగుస్తుంది అల్యోష-అన్తోన్ ల సంభాషణ. పుస్తకమంతా అంతే. అంతా కలిపి 16 పేజీల పుస్తకం. పుస్తకంలో ఉన్న టెక్స్ట్ అంతా కలిపినా రెండు పేజీలకు మించదు. మిగతా భాగమంతా రంగురంగుల బొమ్మలే. పిల్లలకు పుస్తకాల మీద, ముఖ్యంగా ఆలోచనలను రేకెత్తించి వదిలేసే ఇలాంటి పుస్తకాల మీద ఆసక్తిని కలిగించేలానే ఉంది.


రేకెత్తించి “వదిలేసే” పుస్తకం అన్నదెందుకంటే పుస్తకంలో సంభాషణ ఆగినచోట మన ఆలోచన ఆగదు కాబట్టి. ఇతర జీవులతో పోలిస్తే మనిషి నిజంగా బలమైనవాడా? బుద్ధిబలం ఉంది సరే, అది మనిషికి ఉన్న, తను మెరుగుపరచుకున్న నైపుణ్యం (సుఖ జీవనానికి అలవాటుపడి పోగొట్టుకున్న/కుంటున్న నైపుణ్యాలూ ఉన్నాయి మరి). వైరస్ నుంచి తిమింగలం దాకా సృష్టిలో ఉన్న ప్రతి జీవికీ ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంది కాబట్టే అవి మనగలుగుతున్నాయి. అలా అవసరాన్ని బట్టి నైపుణ్యాలను మెరుగుపరచుకోలేని జీవులు ఎంత బలమైనవైనా నశించిపోతాయి. ఏ జీవికి ఏ నైపుణ్యముందో నిశితంగా గమనిస్తే తెలుస్తుంది. మన చుట్టూ, మనకు దగ్గరగా ఉన్న జీవజాలం నుంచి ఈ పరిశీలన మొదలుపెట్టే విధంగా పిల్లలను ప్రేరేపిస్తూ, అలాగే మారుతున్న పరిస్థితులకు అనువుగా మారగలిగే సామర్థ్యమే అసలు బలం అని తెలిపేలా పుస్తకం ముగింపు ఉంటే బాగుండేది.

ఇది సోవియెట్ “యూనియన్”గా ఉన్నరోజుల్లో బహుశా 1980లలో వచ్చిన సోవియెట్ పుస్తకాల్లో ఒకటి. రాదుగ ప్రచురణ. వి. సూస్లొవ్ రచన, వుప్పల లక్ష్మణరావు అనువాదం. బొమ్మలు వేసింది వి.త్రుబ్కోవిచ్.

You Might Also Like

2 Comments

  1. D karunakar

    మంచి పుస్తకం ద్వారా మంచి అలుచేనలు పెంపుందుతాయి

  2. v.srinivasa rao

    చాలా బాగా వ్రాసారు.మరికొన్ని పుస్తకాలను పరిచయం చేయ వీలౌనా ?

Leave a Reply