మెహెర్ చేదుపూల పరిమళం
వ్యాసకర్త: అవ్వారి నాగరాజు
చేదుపూలు మెహెర్ కథాసంపుటి. ఇందులో ఇరవై కథలున్నాయి. మెహెర్ కథలను ఇంతకుముందే అడపాదడపా వెబ్ మ్యాగజైన్లలో చదివి ఉండటం వలన తను ఎంపిక చేసి, సంకలనపరచిన కథలు పుస్తక రూపంలో రాగానే మొత్తంగా చదవాలని అనుకున్నాను. ఇందులోని కథల్లో వస్తువైవిధ్యం ఉంది. పాఠకులని ఆకర్షించే కథనం ఉంది. అన్నింటికి మించి పాఠకులని తనవైపుకు లాక్కొనే వాక్య లాఘవం నిండుగా ఉంది. చాలా సందర్భాల్లో తన వాక్యాలు చక్కగా అమరిన కవితా పంక్తుల్లా కూడా అనిపిస్తాయి.
మెహెర్ కథలను విడివిడిగా చదివినప్పటికంటే వాటిని పుస్తక రూపంలో చదివినప్పుడు నాకు కలిగిన అనుభవం కాస్త భిన్నంగా ఉంది. విడివిడిగా అవి కలగజేసిన అనుభూతి, ఎరుకలతో పాటుగా, సుమారుగా ఒక దశాబ్ది కాలానికి పైగా ఒక ధారగా– ఒక రచయితని రాసేలా కదిలించిన అంశాలేమిటీ అనే కుతూహలం కలిగింది. తను రాసిన కథావస్తువుల వెనుక అవి వైవిధ్యమైనవి అయినప్పటికి కూడా వాటిని కలిపి ఉంచిన అవగాహన ఏదయినా ఉన్నదా అన్న ఆలోచన కూడా వచ్చింది. ఇంకా తను పొందుపరచిన వాచకానికి ఆవల, వాచకంలోని వాక్యాల మధ్య రచయితని, రచయితను ప్రభావానికి గురిచేస్తున్న అంశాలని అర్థం చేసుకొని పోల్చుకోవచ్చా అనే ఆసక్తి కూడా కలిగింది.
సిద్ధాంతాన్ని పైకెత్తడం కోసం జీవితాన్నీ, సృజననీ కుదించి, వాటికున్న బహుముఖీనతని బలిపెట్టే రచయితల మధ్యనుండీ మెహెర్‌ను చదవడం నిజంగానే మంచి అనుభవం. ‘తరళ మేఘచ్చాయ– తర్వాత ఎడారి’, ‘కాడమల్లి’, ‘చేదుపూలు’, ‘ముక్కు’, ‘తర్వాతి రోజుల్లో ఒక రోజు’ కథల్లో, నిజానికి మనమెరిగిన రచయితల కంటే, మెహెర్ తను చెప్పదలుచుకున్న విషయాన్ని మరింత గాఢంగా, క్లుప్తంగా చెప్పడం మనకి కొత్తగా ఉంటుంది. ఆ గాఢతా, క్లుప్తతా– నిజంగా ఎలాంటివంటే, వైవాహికేతర సంబంధాల్లో, అక్కడి నీతీ నియమాల విషయాల్లో పాత్రలు ప్రదర్శించే యధాలాపత కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబాలని ఛిద్రం చేసే ఇలాంటి సంబంధాలను మెహెర్ సెంటిమెంటలైజ్ చేసో, స్త్రీ–పురుష సంబంధాల ఘర్షణల పేరుతో మరింత గందరగోళపరిచో అవే వస్తువులని అందరిలాగా రాస్తూపోయినట్లయితే తనలో కొత్తదనమంటూ ఏదీ కనిపించకుండా పోయేది. ఇలా అంటున్నానంటే వాటిని తను మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న మాదిరిగా కాక, తన స్వకపోల కల్పితంగా రాసుకుంటూ పోయాడని కాదు. పాత్రల స్పందనలని కత్తిరించి, తను అనుకున్న పాళ్ళలో అమర్చి పెట్టినట్టుగా కూడా కాదు. వాటిలోని ఘర్షణని జీవితపు కొనసాగింపు ముందర చిన్నదిగా చేసి చూడగల కొలమానపు చూపు ఏదో రచయితకు ఉన్నదని చెప్పడం కోసమే ఈ కథలను ఉదహరిస్తున్నాను.
మిగతా అన్నింటికన్నా తన కథల్లోని పాత్రలను తరిమే చోదక శక్తి – మామూలు మనుషులకుండే జీవిత వాస్తవిక దృష్టి. ఇది సంపుటిలోని అన్ని కథలకూ వర్తిస్తుంది. అలాగని కథలన్నింటినీ గుదిగుచ్చి జీవిత వాస్తవికత పేరుతో రొడ్డకొట్టుడుగా ఒకే మూసలోకి పొదగడము కూడా ఉండదు. అది దేనికదిగా విడివిడిగానే ఉంటుంది. ‘చేదుపూలు’లో ఎలైజా కరుణను తెంపేసుకున్న ప్రసాదుకు, ‘తరళ మేఘచ్చాయ–తర్వాత ఎడారి’లో మాధవ్‌ను వదులుకునే నడికారు స్త్రీకీ తేడా ఉంది. ఎవరి జీవితం వాళ్లది. ఎవరి ఆలోచనలు వాళ్లవి. ‘తరళ మేఘచ్చాయ’లో తన కథని చెబుతున్న ఆమెకు, తనలో తాను సంఘర్షణ పడటానికి ఉన్నంత విరామం కూడా లేని జీవితపు పరుగు ‘చేదుపూల’లోని ప్రసాదుది.
తమ చుట్టూ ఉన్న జీవితం తమకొక ప్రత్యేక ఉనికి అంటూ లేకుండా తమని లాగేసుకొనే జీవిత సందర్భాల్లో నిశ్శబ్దంగా చేసే పెనుగులాట మెహెర్ మిగిలిన కథల్లోని పాత్రల స్థితి. అట్లాంటి స్థితి, కేవలం మూడ్, సందిగ్ధతలను ఎత్తిపట్టే ధోరణే ‘ముక్కు’, ‘నీలా టీచరు…’, ‘లోయల్లో ఊయల’, ‘డిగ్రీఫ్రెండ్’ కథల్లో ఎక్కువ. కార్యాకారణాలు, సుదీర్ఘ నేపథ్యాలుగా తన కథలు వ్యక్తం కావు. స్త్రీ పురుష సంబంధాల్లోని పరస్పర ఆకర్షణ, అవసరం, సెక్స్ ఎంత క్లుప్తతతో ఉంటాయో; పాత్రల మూడ్‌ని, సందిగ్ధతనీ, వే ఆఫ్ ద వరల్డ్‌కు ఆవలిగా ఉందామనుకొనే ధోరణినీ ప్రధానంగా చేసుకున్న ఈ కథలు అంత దీర్ఘంగానూ ఉంటాయి. ఒక రకమైన నోస్టాల్జిక్ అని వీటిని అనుకోవడం తేలిక. కానీ గతంలోనే అలా నిలిచిపోయేంత తీరికలేనితనం, వర్తమానపు ఒత్తిడి ఈ పాత్రల గతస్మృతులకు ఒక ప్రత్యేకమైన రంగుని తెచ్చిపెడుతుంటుంది. ఈ పాత్రల నేపథ్యాలు కూడా గ్రామీణ ప్రాంతం నుంచీ రావడం, ఎమ్సెటీకరణ లాంటి ఒత్తిళ్ళకూ, లేదా వెసులుబాటుకూ గురికాని, ప్రత్యేకమైన గురి అంటూ లేని చదువులూ– వాటిని అర్థం చేసుకొనేందుకు ఒక దారిగా కూడా కనపడుతూ ఉంటాయి. అలాంటి కౌమారం, యవ్వనాల నుండీ పట్టణాలకూ, నగరాలకూ వెతుక్కుంటూ మనుషులు రావడం పొడకడుతూ ఉంటుంది. చాలాసార్లు అదుపు తప్పిన ప్రేలాపనలాగా పదేపదే కథనంలోకి దూసుకువచ్చే గతపు జ్ఞాపకాలు ఈ కథలని కథల్లాగా చదవకూడదు అని హెచ్చరిస్తున్నంటుంటాయి. అందుకే మనం ఒకోసారి మనం చదువుతున్నదేమిటో తప్పిపోకుండా, చెక్ చేసుకొనేందుకు పేజీల వెనక్కి తలలు తిప్పి తడుముకుంటూంటాము. ఈ ఉరవడి గతంలోకి ఎంతగా కోసుకెళుతూ ఉంటుందో, పాత్రలు అంతగా తమ రోజువారీ జీవితాల్లోకి నిమగ్నమై పోవడమూ గమనించి మనం కథని ఇంకించుకునేందుకు కథకూ కథకూ మధ్య కొంచెం విరామాన్ని కోరుకుంటుంటాము.
ఇంకా, తన వాచకంలోని వాక్యాల మధ్య సెక్స్‌ని చెబుతున్నా, ఒత్తిగిలి పడుకున్న చెంపలలోని పసిదనాన్ని పట్టుకొనే చూపు మనల్ని అబ్బుర పరుస్తుంటుంది. బాల్యం తన కథలలో అమాయకత్వాన్ని దాటి, లోపలికి దిగబడే ప్రమాదకర ఏకాంతాలలోకీ మనలను తీసుకుపోతుంది. వాస్తవికత-తీవ్రమైన భావోదిజ్ఞతల నడుమ నీటిలోని ప్రతిబింబంలా అలల తాకిడికి చెదిరి, తిరిగి ఆ అలల నడుమునే ఇంకిపోయే అధివాస్తవికతయై మనలని కలవరపెడుతుంది. ఇక “ఒరాంగుటన్” కథలో కథకుని స్వరం తిన్నగా మెదడులోకి చురకత్తిలా దిగుతుంది. ఇంత బీభత్సమైన కథను నేను ఈ మధ్య కాలంలో చదివి ఎరుగను.
దేనికదిగా విడిపోతూ, జీవితపు సందోహంలో తమ సంఘర్షణలని ఒక చిన్న కంటిచెమ్మతోటో, ఇంకా ఆమాత్రం విరామం కూడా లేకుండానో తుడిచేసుకుని, తమ వాస్తవిక జీవితాల్లోకి నడిచిపోయే తన పాత్రలు ఆ తర్వాత ఏమవుతాయోననే ఆత్రుత ఈ కథలను చదివాక ఎవరికైనా తప్పక కలుగుతుంది.
రచన: చేదుపూలు.
రచయిత: మెహెర్.
ఛాయా ప్రచురణలు.
పేజీలు – 209.
ధర- 135.
Manasa
మెహెర్ చూపుల లోతులను కొలిచినట్టున్న ఈ వ్యాసం చాలా బాగుందండీ. ఈ కథల్లోని గతవర్తమానాల ఊగిసలాటలోని సందిగ్ధం, వాక్యం మామూలుగా మొదలవుతూ మధ్యలో పాఠకుణ్ణి సంభ్రమానికి గురిచేసే గమనింపుతో కొనసాగడం గురించి మీ పరిశీలనలు బాగున్నాయి. ఒరాంగుటాన్ కథను నిన్నే మరోసారి చదుతోంటే, తొలిసారి చదివినప్పుడు ఎదురైన అదే ఉద్విగ్నానుభవం!
చివాలున లేచి అంతలోనే చల్లారే ఆలోచనలు, మోహతీవ్రతకీ జీవన వాస్తవికతకీ మధ్య నడిచే అనివార్యమైన మానసిక సంఘర్షణని ‘నీకు చెప్తాను, విను ‘ అన్నట్టు ఏ దాపరికం లేకుండా చెప్పగల ఒడుపు, సుదీర్ఘమైన ఉపోద్ఘాతంతో కొన్నిసార్లు, అకస్మాత్తుగా తన దారిలోకి లాక్కుని ఆప్తుడైపోయి అంతలోనే వదిలేసే సహ ప్రయాణికుడిలా కొన్నిసార్లు – తన కథలోకి లాక్కునేందుకు మెహెర్ వేసే ఎత్తుగడలు .. ఇవన్నీ కలిసి మిగిల్చే ఒక అపురూపమైన పఠనానుభవం ఈ పుస్తకానికి సొంతం.
మరోసారి ఈ ఆలోచనలు పంచుకునే వీలిచ్చినందుకు నాగరాజు గారికి ధన్యవాదాలు.