Man’s search for meaning – Viktor Frankl

వ్యాసకర్త: భారతి కోడె

1942 వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఒక యువ సైకియాట్రిస్ట్ నాజీ కాన్సంట్రేషన్ క్యాంపు బయట క్యూలో నిలబడి ఉంటాడు. అక్కడ వరుసలో నిలబడి ఉన్నవారికెవరికీ వారు దేనిని ఎదుర్కోబోతున్నారో తెలియదు. కొన్నాళ్ళు తమని అక్కడ బందీలుగా ఉంచుతారు అనుకున్నారు కానీ కొన్ని రోజులకే తామెంత నిస్సహాయ పరిస్థితులలో చిక్కుకుపోయామో అర్ధం చేసుకుంటారు. వారి వ్యక్తిగత వస్తువులన్నీ స్వాధీనం చేసుకుంటారు. వారికి గుండు గీయిస్తారు. చేతులపై వారి సీరియల్ నంబర్లు పచ్చబొట్లు పొడిచేస్తారు. గత జీవితంతో ఏ మాత్రమూ సంబంధం లేని దుర్భరమైన జీవితం గడుపుతుంటారు. అన్ని కష్టాల మధ్య, అంత నిస్సహాయతలోనూ ఆ బాధకి అర్ధాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ యువ సైకియాట్రిస్ట్.

1942 వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఒక యువ సైకియాట్రిస్ట్ నాజీ కాన్సంట్రేషన్ క్యాంపు బయట క్యూలో నిలబడి ఉంటాడు. అక్కడ వరుసలో నిలబడి ఉన్నవారికెవరికీ వారు దేనిని ఎదుర్కోబోతున్నారో తెలియదు. కొన్నాళ్ళు తమని అక్కడ బందీలుగా ఉంచుతారు అనుకున్నారు కానీ కొన్ని రోజులకే తామెంత నిస్సహాయ పరిస్థితులలో చిక్కుకుపోయామో అర్ధం చేసుకుంటారు. వారి వ్యక్తిగత వస్తువులన్నీ స్వాధీనం చేసుకుంటారు. వారికి గుండు గీయిస్తారు. చేతులపై వారి సీరియల్ నంబర్లు పచ్చబొట్లు పొడిచేస్తారు. గత జీవితంతో ఏ మాత్రమూ సంబంధం లేని దుర్భరమైన జీవితం గడుపుతుంటారు. అన్ని కష్టాల మధ్య, అంత నిస్సహాయతలోనూ ఆ బాధకి అర్ధాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ యువ సైకియాట్రిస్ట్.

ఇదీ స్థూలంగా విక్టర్ ఫ్రాంకిల్ రచించిన ‘మాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ పుస్తకంలోని కథ. ఈ కొత్త సంవత్సరం ఈ అద్భుతమైన పుస్తకంతో మొదలయ్యింది నాకు. నాజీల క్యాంపు లలో ఒక సాధారణ ఖైదీ రోజువారీ జీవితం ఎలా ఉంటుందో తెలియచేస్తూనే ప్రతి సంఘటనకు తనదైన వివరణ జోడిస్తాడు ఫ్రాంకిల్ ఈ పుస్తకంలో. తన మూడేళ్ళ ఖైదు జీవితంలో మనిషి తాను చేసే పని ద్వారా, తాను పొందిన/ఇచ్చిన ప్రేమ ద్వారా, తాను అనుభవించిన బాధ ద్వారా… ఈ మూడు మార్గాలలో తన జీవితానికి అర్ధాన్ని తెలుసుకోగలుగుతాడు అని గ్రహిస్తాడు.

తాను ఖైదు నుండి బయటపడ్డాక అక్కడి అనుభవాలను, జ్ఞాపకాలను, తాను ప్రతిపాదించిన లోగోథెరపీ అనే కొత్తరకం థెరపీ ను పుస్తక రూపంలోకి తెచ్చినట్లు, అది ప్రచురింపబడినట్లు ఆలోచనలలో మునిగితేలుతుండేవాడు ఫ్రాంకిల్. క్యాంపు కి తీసుకురాగానే అతను, తన భార్య వేరు చేయబడతారు. ఆమె ఎక్కడో క్షేమంగా ఉండి ఉంటుందని, మళ్ళీ తనను కలుసుకుని సాధారణ జీవితం గడుపుతామని ఊహించుకునేవాడు. తన దుర్భరమైన వాస్తవ జీవితం నుండి అతనికి ఊరట నిచ్చేవి ఆ ఆలోచనలే. గత జీవితాన్ని తలుచుకుని దుఃఖించే కన్నా ప్రస్తుత పరిస్థితులకు ఒక అర్ధాన్ని వెతుక్కోవడం మీదనే అతను దృష్టి పెడతాడు. ఈ భావననే అతడు ‘ది విల్ టు మీనింగ్’ గా అభివర్ణిస్తాడు.

ఈ పుస్తకంలో ఫ్రాంకిల్ మాట్లాడే రెండవ ప్రధాన అంశం ‘లోగోథెరపీ’. ఇది మనుషులు తమ జీవితం యొక్క అర్ధాన్ని వెతుక్కోవడంలో వారికి సహాయం అందించే ఒక మనస్తత్వ శాస్త్ర ప్రక్రియ. మనస్తత్వ శాస్త్ర నిపుణులయిన ఫ్రాయిడ్, ఆడ్లర్ లకు భిన్నంగా తన అస్తిత్వానికి అర్ధాన్ని వెతుక్కోవడమే జీవితంలో అన్నిటికన్నా ఎక్కువగా మనిషికి ప్రేరణ ను ఇచ్చే విషయంగా ఫ్రాంకిల్ పేర్కొంటాడు. తన జీవితంలో జరుగుతున్న సంఘటనలకు, పరిణామాలకు అర్ధాన్ని గ్రహించలేని సందర్భంలోనే మనిషి అత్యంత వేదనకి, అసహనానికి గురవుతాడని ఫ్రాంకిల్ అంటాడు. కాన్సంట్రేషన్ క్యాంపు లోని తన అనుభవాలను ఉదాహరణలుగా ఇస్తూ అలా అర్ధాన్ని గ్రహించలేని వారు అక్కడ ఇంకెంత దుర్భరంగా జీవించారో చెబుతాడు.

మనమంతా ఒక్కొక్కరం ఒక్కొక్క దానిలో మన జీవితానికి అర్ధాన్ని వెతుక్కుంటాము. గొప్ప సంగీతకారుడిగా లేదా గొప్ప రచయితగా, గొప్ప కళాకారుడిగా, గొప్ప వ్యాపారవేత్తగా… ఇలా ఏదో ఒక అంశంలో గొప్పతనాన్ని సాధించడమే మన జీవితానికి సార్ధకతను, అర్ధాన్ని ఇస్తుందని నిరంతరం దానికోసం కృషి చేస్తూ ఉంటాము. అయితే ఫ్రాంకిల్ అందుకు భిన్నంగా జీవితానికి అర్ధం ఏ ఒక్క అంశానికో ముడిపడినది కాదనీ, అది ఎప్పుడూ మారుతూ ఉంటుందనీ అంటాడు. ఎప్పటికప్పుడు తనకు ఎదురయ్యే సంఘటనలలో, తన జీవితంలో జరుగుతున్న పరిణామాలలో మనిషి నిరంతరం అర్ధాన్ని వెతుక్కుంటూ ఉండాలని సూచిస్తాడు.

అయితే ఆ అర్ధాన్ని ఎలా తెలుసుకుంటాం? సాధారణంగా జీవితంలో ఏదైనా అనుకోని దుస్సంఘటన జరిగినప్పుడు ఇది ఇలా ఎందుకు జరిగింది? దీని వలన ఏమి కానుంది? దీని అర్ధం ఏమిటి? అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ నిరాశలో కూరుకుపోతుంటాం. ఈ దృక్పథంలో కొంచెం మార్పు చేసుకున్నట్లైతే సమాధానం తెలుసుకోవడం కష్టం కాదనేది ఫ్రాంకిల్ సూచన. దీని అర్ధం ఏమిటి అనే ప్రశ్న మనం వేయకుండా ఆ ప్రశ్న జీవితం మనల్ని అడుగుతున్నట్లు భావించి జీవితానికి తిరిగి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయడం ద్వారా మాత్రమే మనం జీవితం యొక్క అర్ధాన్ని గ్రహించగలుగుతాం.

పరిస్థితులేవీ మన నియంత్రణలో ఉండవనీ, కానీ వాటికి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాము అనేది మాత్రం మన చేతిలో ఉంటుందనే అద్భుతమైన సత్యాన్ని తాను ఎదుర్కొన్న సంఘటనల నేపథ్యంలో ఉదాహరణలతో వివరిస్తాడు ఫ్రాంకిల్. అందులో ఒకటి నాకు చాలా నచ్చిన ఉదాహరణ ఇక్కడ మీకోసం. కాన్సంట్రేషన్ క్యాంపు కి ఖైదీలుగా తీసుకు వచ్చాక వారందరినీ క్యూ లో నిలబడి ఒక్కొక్కరినీ ముందుకు రమ్మంటారు. ఒక అధికారి అక్కడ నిలబడి వారిని పరిశీలించి కొంత మందిని ఎడమ వైపుకి, కొంతమందిని కుడివైపుకు పంపుతుంటాడు. ఎడమ వైపుకి పంపబడిన వారు గుండు చేయించుకుని అక్కడి అధికారులు కేటాయించిన పని చేయవలసి ఉంటుంది. కుడి వైపుకి పంపబడినవారు పని చేసే శక్తి లేని వారు. వారు గ్యాస్ ఛాంబర్లలో మృత్యువుని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ లైన్ లో నుండి బయటపడే పరిస్థితి అతనికి లేదు. దేనినీ నియంత్రించలేని ఆ నిస్సహాయ స్థితిలో అతను నియంత్రించుకోగలిగింది తన మనసుని, ఆలోచనను మాత్రమే. అనవసరమైన ఆందోళన చెంది అనారోగ్య సూచనలతో కనపడినట్లైతే అతను గ్యాస్ ఛాంబర్ లోకి వెళ్ళవలసి ఉంటుంది. అందుకే ఆ సమయంలో తాను చేయగలింది సాధ్యమయినంత ప్రశాంతంగా మనసును ఉంచుకోవడం మాత్రమే. ఇలా ఎక్కడికక్కడ తన జీవితం నుండి ఉదాహారణలతో ఫ్రాంకిల్ మనం కూడా మన జీవితం యొక్క అర్ధాన్ని ఏ విధంగా గ్రహించవచ్చో సూచిస్తాడు.

పుస్తకం చివరి భాగంలో ఫ్రాంకిల్ కాన్సంట్రేషన్ క్యాంపు నుండి బయట పడి దాని ఎదురుగా మోకాళ్లపై కూర్చుని చూస్తూ ఉంటాడు. ఒకప్పుడు తాను అదే క్యాంపు లో మరణిస్తాను అనుకుని ఉంటాడు. ఇప్పుడు అతను ఆ దుఃఖం నుండి, భయం నుండి బయట పడిన స్వేచ్చా జీవి. మనందరి వ్యక్తిగత జీవితాలలో, ఉద్యోగ జీవితంలో, సంబంధ బాంధవ్యాలలో అలా బయటపడలేమనుకునే బాధలు, దుఃఖాలు ఎన్నో ఎదురవుతూనే ఉంటాయి. మనకి ఎదురైన కష్టానికి, దానికి మన ప్రతిస్పందనకు మధ్య కొంత స్పేస్ ఉంటుంది. మనకు నియంత్రణ ఉండేది దాని మీదనే. ఎంత నిస్సహాయ పరిస్థితిలో అయినా మన ప్రతిస్పందనను ఎంపిక చేసుకునే శక్తి మాత్రం మనం కోల్పోకూడదు. ఏదో ఒక రోజు ఫ్రాంకిల్ లా కష్టం నుండి బయటపడి మోకాళ్ళపై కూర్చుని దాని వంక చూసే రోజు వస్తుంది. అంతవరకూ మనం ఆ కష్టానికి దుఃఖిస్తూ కూర్చుంటామా లేదా దాని నుండి జీవితం మనకు సూచించే అర్ధాన్ని వెతుక్కుంటామా అనేది మన చేతిలో ఉంటుంది. ఇంత అద్భుతమైన సందేశాన్ని చాలా సున్నితంగా చర్చించిన పుస్తకం ‘మాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’.

1947 లో మొదటిసారి ప్రచురితమైన ఈ పుస్తకం ఇప్పటికి ఎన్నో లక్షల కాపీలు అమ్ముడయింది. ఈ పుస్తకం నుండి కొన్ని నాకు నచ్చిన మాటలు:

“Everything can be taken from a man but one thing: the last of the human freedoms—to choose one’s attitude in any given set of circumstances, to choose one’s own way.”

“But there was no need to be ashamed of tears, for tears bore witness that a man had the greatest of courage, the courage to suffer.”

“Love is the only way to grasp another human being in the innermost core of his personality. No one can become fully aware of the very essence of another human being unless he loves him”

“An abnormal reaction to an abnormal situation is normal behavior.”

You Might Also Like

One Comment

  1. v.srinivasa rao

    చాలా బాగా వ్రాసారండీ,ఎక్కువ పుస్తకాలని పరిచయం చేయగలరని మనవి.

Leave a Reply