పుస్తకం.నెట్ 13వ వార్షికోత్సవం

అందరికీ నమస్కారం, 

జనవరి 1, 2009 నాడు మొదలైన పుస్తకం.నెట్ ప్రయాణం మొత్తానికి ఇన్నాళ్ళు నిర్విఘ్నంగా సాగి పుష్కరకాలం పూర్తి చేసుకుని పదమూడో ఏట అడుగుపెడుతోంది. ఈ ప్రయాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు! 

పుస్తకాలకి మాత్రమే పరిమితమై, పాఠకులకి ప్రత్యేకించిన వేదికగా ఈ ప్రయాణం సాగడం అనేక రకాలుగా విడ్డూరమే! ప్రపంచంలోనే పుస్తకాలు తక్కువైపోతున్నాయని ఒక పక్క, తెలుగే కనుమరుగైపోతుందని ఇంకో పక్క (ఇవ్వనీ మేం మొదలెట్టే నాటికే) అందరూ తెగ హైరానా పడుతున్నా, ఒక రాయి వేసి చూద్దామని మొదలెట్టిన ప్రయత్నం ఇది. మరి అందులో తప్పులే ఉన్నాయో, తిప్పలే పెట్టామో గానీ మాకు మాత్రం బోలెడంత ఆనందాన్ని ఇచ్చింది ఇన్ని పుస్తకాల గురించి ఇంతమంది రాయడం, చర్చించడం చూసి. వెనక్కి తిరిగి దీన్ని మళ్ళీ ఎవరైనా చూస్తారో లేదో మాకు తెలీదు గానీ ఒకరిద్దరు మాత్రమే వ్యాసాలు రాసినా ఇదిలానే నడుస్తూ ఉంటుందని, ఎవరూ రాయకపోయినా ఇదిలానే నిలుస్తుందని మాట ఇస్తున్నాము.

ఇంటెర్నెటులో వయసుని డాగ్ ఇయర్స్ (dog years)కింద లెక్కవేస్తారట. ఆ లెక్కల్లో ఈ పన్నెండేళ్ళూ మానవుల వయసు కింద లేక్కేస్తే ఏ డబ్భై, ఎనభై ఏళ్ళ వయసంత! మాకంత వయసు వచ్చేంత వరకూ దీన్ని కొనసాగించడానికే మేం తలూపుతాం గానీ ఆసక్తులతో పాటు శక్తులూ ఉండాలి కదా?! మారుతున్న టెక్నాలజి వేగాన్ని మేం అందుకోలేక కాదు, అది డిమాండ్ చేస్తున్న సమయం మేం ఇచ్చుకోగలిగిన దానికన్నా ఎక్కువ!  మేమా వీలు చిక్కించుకునే దాకా మాతో ఓపిక పట్టమని మనవి. పుస్తకం.నెట్‍ ఆర్కైవ్ అపురూపం: తెలుగులో ఖచ్చితంగా, భారతీయ భాషల్లో కూడా ఏమో. దాన్ని searchableగా, accessibleగా చేసే ఆలోచనలు ఉన్నాయి. చేస్తాము. ఎవరికైనా ఓ చేయి వేసే ఓపికా, తీరికా ఉంటే మమ్మల్ని ఓ సారి పింగ్ చేస్తారా, ప్లీజ్? 

ఫేస్‍బుక్‍లో పెట్టగానే మీకోచ్చే ఇరవై ముప్ఫై లైకులు మేం ఈ సైట్ ద్వారా ఇవ్వలేము, ప్రస్తుతానికైతే. అలా అని, “ప్లీజ్ రాయండి, రాయండి” అని అడగలేము మాటిమాటికి – 12 years is annoyingly long time to continue nagging! 😛 ఈ సైట్ మొదలెట్టినప్పుడు “వీలైనంత”గా (as much as possible) తెలుగులో ఇంటర్నెటులో పుస్తకాల గురించి వస్తున్న వ్యాసాలకి ఇది వేదికవ్వాలి అని ఆశపడ్డాం. మారుతున్న పరిస్థితుల్లో దాన్ని “వీలున్నంతలో” (whatever is possible) అని మారినా మరేం పర్లేదు. 

ఈ పన్నెండేళ్ళల్లో ఎవరో ఒకరు వ్యాసాలు నిరంతరంగా పంపిస్తూనే ఉన్నారు. ఎవరూ రాయకుండా ఎప్పుడూ లేదీ సైట్‍లో. అందుకు పేరుపేరునా అందరికీ కోటికోటి దండాలు! కొత్తవాళ్ళకి (ముఖ్యంగా తెలుగు బ్లాగులు, ఫేస్‍బుక్ లో తెలుగు రచయితల సమూహం కానివారిని) చేరాలని ఈ ఏడాది (తాహతుకి సరిపడే) సోషల్ మీడియా కాంపేనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. 

ప్రస్తుతానికి ఫేస్‍బుక్‍లో ఆక్టివ్‍గా ఉన్నాం: https://www.facebook.com/pustakamdotnet 

తక్కిన హాండిల్స్ త్వరలో ప్రకటిస్తాం. అలానే ఆడియో, వీడియో ఫార్మాట్లలో పుస్తకాల కబుర్లని పంచుకునే వీలు ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. ఆ వివరాలూ త్వరలో ఇక్కడే పంచుకుంటాం. 

మేం అడగగానే పుస్తకం.నెట్ కాంట్రిబ్యూటర్లు, పాఠకులు ఈ పన్నెండేళ్ళ అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. వారి మాటలనూ, పలుకలనూ ఒక్కొక్కొటిగా సోషల్ మీడియాలో పెట్టి సంక్రాంతి నాటికి అన్నీ ఒకేసారి ఇక్కడ పంచుకుంటాం. మీకు కూడా పుస్తకం.నెట్ గురించి ఏమన్నా చెప్పాలనిపిస్తే editor@pustakam.net కి మెయిల్ చేయండి. అలానే సలహాలూ, సూచనలూ, కంప్లెయింట్సూ ఏమున్నా సరే!

మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! బోలెడన్ని పుస్తకాలు చదివే భాగ్యం ప్రాప్తిరస్తు! 🙂 

2020లో సెప్టంబర్, అక్టోబర్ నాటికి ఉన్న గణాంకాలని ఇలా పోస్టర్లుగా క్రియేట్ చేశాము. వాటిని ఇక్కడ మళ్ళీ పంచుకుంటున్నాము. 

పుస్తకం.నెట్ లో ఇప్పటి వరకూ వచ్చిన వ్యాసాల్లో ఎడిటోరియల్స్ ని పక్కకు పెడితే, కాంట్రిబ్యూటర్స్ లో పాతికకు పైగా ఆర్టికల్స్ రాసినవారు 35% ఉంటే, అంతకన్నా తక్కువ రాసినవారు 41% ఉన్నారు. ఎన్ని ఆర్టికల్స్ రాశామని కాదు అధ్యక్షా, ఇలాంటి బిగ్ పిక్చర్ చూసినప్పుడు, రాశామా? లేదా? అన్నదే ముఖ్యమని తెలిసొస్తుంది.

ఇహ “ఇది సౌమ్య, పూర్ణిమల సైట్” అనే జనరలైజేషన్‍కి తిప్పుకొట్టడానికి మేం ప్రవేశపెడుతున్న బ్రహ్మాస్త్రం (కింద చూడుము) . వాళ్ళిద్దర్నీ ఎలిమినేట్ చేసి మిగితావి లెక్కపెట్టి చూడండమ్మా!

“తెలుగువాళ్ళు చదవరబ్బా అసలు!” అన్న మరో జనరలైజ్డ్ వ్యాఖ్యానానికి మన తాహతుకి తగ్గట్టుగా డేటా పాయింట్ సమర్పించుకుంటున్నాం. అంటే, పుస్తకం.నెట్ అనేది ఒక చిన్న బావి లాంటిది, బయట తెలుగు ప్రపంచం సముద్రంలాంటిది అని అనుకున్నా కూడానూ… these numbers are still trying to say something!

నవలల గురించి ఎక్కువగా రాసుకున్నాం! “సినిమా అయితే మూడు గంటలు చూసొచ్చేసి చకచకా రివ్యూ రాసేస్తారు. పుస్తకం పూర్తిగా చదవడమంటే మాటలా? మళ్ళీ దాని గురించి రాయడమా? వాట్ ఆర్ యు టాకింగ్!” పుస్తకం.నెట్ మొదలెట్టాలనుకున్నప్పటి వాదోపవాదాల్ని తునాతునకల్ని చేసిన ఈ కమ్యూనిటికీ దండాలయ్యా, దండాలమ్మా!

తెలుగు పుస్తకాలు ఎక్కువగా పరిచయం చేసుకున్నాం, తర్వాత ఇంగ్లీషు పుస్తకాలు. (ఇవి అనువాదాలు కావు. నేరుగా ఆ భాషలో వచ్చిన పుస్తకాలు). అనువాదాలు తెలుగులోవి, ఇంగ్లీషులోవి దాదాపు సమానంగా మాట్లాడుకున్నాం.

భారతీయ భాషలనుంచి అనువాదాలైన రచనల్లో మన పక్కింటి కన్నడ వాళ్ళ రచనలు ఎక్కువ పరిచయం చేసుకున్నాం. కానీ అల్లంత దూరాన ఉన్నా మన సాహిత్యమేనని అనిపించిన బెంగాలీ కూడా ఉంది దగ్గర్లోనే.

ఇహ, అనువాదంలో బయట భాషల పుస్తకాలు మనం చదువుకుని, రాసుకున్నవి ఇవి! రష్యన భాష ఆక్రమించుకోవడంలో వింతేం లేదు.

ఈ లెక్కల చిట్టా ఇంతటితో సమాప్తం. మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, జీవితం మనతో ఫుట్‍బాల్ ఆడకుండా టైమ్‍ప్లీజ్ ఇచ్చినప్పుడు ఒకటో అరో పుస్తకాల గురించి ఇక్కడ పంచుకుంటే, ఎప్పుడో ఎవరికో అక్కరకు వస్తుంది. లేదూ, ఇట్లా రంగురంగుల బొమ్మలేసుకోవచ్చు. 😛

Any which way, it’s all about having fun!

మరో సారి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

మీ,
సౌమ్య, పూర్ణిమ

You Might Also Like

2 Comments

  1. leol

    పుస్తకం నిర్వాహకులకు ౧౩ సంవత్సరాలుగా ఒక మంచి వేదికను అందించినంచదుకు హృదయపూర్వక అభినందనలు. ఎన్నో మంచి పుస్తకాలను గురించి తెలుసుకుని చదవే వెసులుబాటు ఈ వేదిక ద్వారా కలిగింది.

  2. anjaneyulu bvsr

    sowmya poornima garlaku

    nootana angla vatsara shubhaakaankshalu. mee visleshana mee sameekshallagaane chaala chakkaga vundi. mee krushi ilagey kalakaalam padimandinee kalupukuni poye reetilo saagaalani korukuntoo, marokkasaari meeku shubhaakaankshalu, dhanyavaadaalu.
    anjaneyulu

Leave a Reply