చదువు చదివించూ.. లైఫ్ / 2 అందించు..

“బాపూరమణలను తెలుగువారికి పరిచయం చేయడం దుస్సాహసం అవుతుంది.” ట్ట! అప్పుడూ.. కోతి కొమ్మచ్చిని పరిచయం చేయటమో, సమీఈఈక్షించటమో, దుస్స్ టు ది పవరాఫ్ దుస్సాహసం అవుతుందేమో! లేదా, కొన్ని పదాల్లో నిశ్శబ్దమైయ్యే ఆంగ్లాక్షరాల్లా, సాహసం కాస్తా మూగబోయి.. దుస్స్ మాత్రమే మిగులుతుందేమో! అది కాస్తా “తుస్స్”మనీ ధ్వనించచ్చూ! ఊ.. ఎన్ని జరగచ్చో!? ఏం జరుగుతుందో చూడ్డానికైనా మనం ఏదో ఒకటి రాసుకోవాలిగా మరి?! ఇంకేం.. పదండి ముందుకు.. కాదు… కిందకు!

ఒప్పుకుంటాను.. తెలుగు సినీ వినీలాకాశంలో మాయాబజార్ లాంటి చిత్రం మరోటి రాకపోవచ్చు. అబ్బురపరుస్తున్నంత సేపూ నోరు ఆవలించుకొని చూసినా.. అప్పుడప్పుడైనా నోరు విప్పి ఏదో ఒకటి అనకపోతే ఎలా? దానికీ అర్హతలూ, ఆవగింజలూ అంటే ఎలా? సచిన్ కొట్టే షాట్లకి రవిశాస్త్రి కమ్మెంటరీ ఎంత మజా ఇచ్చినా, చుట్టూ జనాల ఈలలూ, గోలలూ లేకపోతే ఎలా?  ఇప్పుడు నాది కూడా అలాంటి గోలే… (ఈలల్ని రాయడం కష్టం కదా!)

స్వాతి అనే సపరివార సచిత్ర పత్రికలో ఫలనా ముళ్ళపూడి వారి ఆత్మకథ సీరియల్‍గా వస్తోందని తెలీని అజ్ఞానంలో బతుకుతున్న నాకు, “తెలుసునా?” అని ఎవరో ఉప్పందించినా, “ఔనా?!” అని చప్పరించి ఊరుకున్నానన్నమాట. మొన్న అరిపిరాల వారు మరికాస్త రుచి చూపించేసరికి, జిహ్వలాగి పుస్తకం లేక ముళ్ళపూడి వారి కథారమణీయంలో పడి మునకలేసి కాస్త దాహాన్ని తీర్చుకున్నాను. ఓ స్నేహాన్ని ఉద్దరించడానికి విశాలాంధ్ర మీద దండయాత్రకు బయలుదేరితే.. అప్పుడే దిగిన “కోతి కొమ్మచ్చీ” కాపీల బండిల్.. “నాకు..నాకు” అంటూనే, “నాకున్నూ, ఆ ఫ్రెండ్‍కిన్నూ, ఈ ఫ్రెండ్‍కిన్నూ, ఉ ఫ్రెండ్‍‍కిన్నూ, ఊ ఫ్రెండు‍కిన్నూ??” అంటూ ఎగబడేసరికి.. (సీన్ కట్ చేస్తున్నాం!)

రోజంతా తిరిగితిరిగి ఇల్లు చేరి, ఓ ముద్ద తిని, మూసుకుపోతున్న కన్నులతో ’అసలేముంటుందో’ అన్న ఉత్సుకుతతో, “ఓ నాలుగు ముక్కలు మాత్రమే.. ప్లీజ్’ అని నిద్రను ఒప్పించి మొదలెడితే.. ఏటవుతదీ? రాత్రి మూడవుతది. నిద్ర నూటయాభై పేజీలు లేటవుతది. ’పడుకుంటున్నావా? లేదా?’ అన్న తిట్లన్నీ మిడిల్ డ్రాప్ అవుతవీ! సావిత్రి నవ్వులాంటి ( ఎస్వీ రంగారావు మారు వేషంలో ఉన్నప్పుడు ఆయన గొంతుతో.. సావిత్రి నవ్వే!) హిహిహిహిలూ, హహహహహలూ భరించలేక, అంతా లేచి కూర్చోటం అవుతదీ! “బాబోయ్.. ఏం రాశారు తెల్సా” అని చెప్పబోతుంటే, మాయ చేసి పుస్తకం దాచేసి, మభ్యపెట్టి నిద్రపుచ్చితే, తెల్లారి నిద్రమంచం మీద నుండే మళ్ళీ మొదలూ.. అవే పకపకలూ, ఇకఇకలూ..

“తిరిగే కాలూ, వాగే నోరూ..” – మీకు తెల్సు కదా! ఫోనులు చేసి, మేల్స్ పెట్టి “నేను చదివేశానోచ్” అన్న దండోరా అయ్యిపోయింది. “హమ్మ్.. ఇప్పుడేనా చదవటం?!” అన్నారు కొంతమంది, “ఇప్పుడా చదవటం!” అనే అర్థంలో. “ఎప్పుడో చదివేశాను.. తెల్సా” అనీ అన్నారు. “అవునా.. నేనూ చదువుతా ఉండు”, “నేనింకా చదవనేలేదు” అన్నవి మాత్రమే కర్ణరసాయనంగా వినిపించాయి, ఎక్కువసార్లు! అసలు నాకెందుకు ఈ పుస్తకం ఇంతిలా నచ్చేసిందీ అంటే..

నాకు అసలే ఆత్మకబుర్లంటే (ఆత్మకథలు చెప్తున్నప్పుడు చెప్పుకొచ్చే కబుర్లు) అంటే భలే ఇష్టం. మామూలుగా చెప్తుంటేనే భలే ఉంటుందంటే, ఇలాంటి రచయితలు జీవితాన్ని కాచి వడపోసేసి ఘుమఘుమలాడుతుండగా అలా కప్పులో అందింస్తుంటే, భలేకి భలేలా ఉంటుంది. అలానే మొన్నీమధ్యనే జార్జ్ ఆర్వెల్ గారితో  ముచ్చట్లు పెడితే, “అమ్మాయ్.. దరిద్రం పరమ బోరింగ్!” అని సింపుల్గా తేల్చేశారు. “కామోసూ” అనుకున్నా.. ఇంతలో రమణగారొచ్చి, “జోకలి!” అన్నారు. “ఏం కలీ?” అనడిగా అర్థం కాక! “జోకలి” – అన్నం లేనప్పుడు ఆకలిని చలార్చేవి జోకులే- అని సెలవిచ్చారు. మనిషుకున్న అతి పెద్ద సమస్యనే ఈయన నవ్వులతో కొట్టిపారేశారని “వారేవ్వా!” అనబోతుంటే.. “నువ్వాగక్కడ.. ఆయన చెప్పేది ఎప్పటి కథో! తీరిగ్గా కూర్చొని ఇప్పుడు ఎన్ని కొత్త పదాలన్నా కనిపెడతారు కానీ, ఆకలి ఆకలే! దాన్ని జయించడానికి జోకులేంటి?” అని మెదడు ’అబ్జెక్షన్ -యువర్ హానర్’ అని మొదలెట్టింది.

“నిజమే ఆయనసలే కథలల్లటంలో జీనియస్” అనుకుంటూ నేనూ ఆలోచనలో పడ్డాను. పడ్డం పడ్డం, రిచర్డ్ ఫీన్మెన్ (Surely You’re Joking, Mr. Feynman) బుట్టలో పడ్డాను. ఆయనా అంతే కదూ.. హమ్మ్.. అర్థమయ్యిపోయింది. ఇందాక అన్నానే, డికాషనూ, కాచి వడపోయడమూ, కప్పూ అనీ.. దాని వల్లే అంతా! ఈ కాచి వడపోసిన జీవితాలలో ఒక్కో ఫ్లేవర్ అలా ఉండిపోతుందన్న మాట. మన రమణగారి ఫ్లేవర్ హాస్యం. మనిషి రూపురేఖలను చూసి పేర్లు పెట్టేవారట ఓ కాలంలో… అలా మనిషి వ్యక్తిత్వాలకి పేర్లు పెడితే.. రమణ కాస్తా బుడుగు అయ్యిపోతారేమో! ఈ కోతి కొమ్మచ్చి చదివాక, ఇకపై “బుడుగ్గారండీ..” అని పిలుస్తానేమో అనిపిస్తుంది. “My postulate is that all literature, in the end, is autobiographical!” అన్న బోర్హెస్ ఉవాచ పుస్తకమై నా చేతిలో నిల్చింది. డబ్భై ఏళ్ళ బుడుగు, జీవితాన్ని ఇలానే.. ఇలానే రాసుకునేవాడేమో!

సిరివెన్నెల గారన్నట్టు “మనం ఈదుతున్నాం.. ఓ చంచాడు భవసాగరాలు” – ఆపసోపాలు పడిపోతూ, శాపనార్థాలు పెట్టుకుంటూ! ఆకలీ, దరిద్రం, నిరుద్యోగం, వ్యాపారంలో నష్టాలు, “ఇక్కడ నుండి ఎక్కడికో” తెలీకపోవటాలు, అప్పిప్పించుకొనీ బాధలూ, ఇచ్చీ బాధలూ – అన్నీ చూసినా పసివాడంత హాయిగా, స్వచ్చంగా నవ్వుతూ, నవ్విస్తూ  – ఆహా జీవితం అనిపించింది. నాకెక్కడా రమణగారు జీవితాన్ని తిట్టుకున్నట్టు అనిపించలేదు. ఎండా, వానా కలిసొస్తే వచ్చే ఇంద్రధనస్సు, కారు మబ్బులు ( అంటే బ్లాక్ బాక్‍గ్రౌండ్ అని నా బాధ) మీద వస్తే ఇంకెంత మనోహరంగా ఉంటుందో తెలియాలంటే ఈ పుస్తకం చదువుకోండి. ఆనందమే పరమావధిగా భావించి, అది ఇవ్వలేని జీవితాన్ని నానా ఇబ్బందీ పెట్టటం కన్నా, ఏమొచ్చినా జీవితాన్నే పరమానందంగా భావించటం అంటే ఏంటో తెలుస్తుంది. “కానుక” లాంటి కథనిచ్చిన కళాకారుడి జీవితం ఎన్నో పాఠాలు నేర్పే వీలు కల్పించింది ఈ పుస్తకం. గొప్పగారైన రమణగారి వచనమే చతురోక్తులతో, అమాయకపు గడుసుతనంతో, గడుసైన అమాయకత్వంతో కడుపుబ్బ నవ్విస్తుంటే, గొప్పన్నరగారైన బాపూ గారేమో గీతలతో ఉబ్బున్న పొట్టని చెక్కలు చేసేస్తారు. స్నేహంలో రెండు జీవితాలు ఎలా పెనవేసుకుపోతాయో అందంగా ఆవిష్కరిస్తుందీ రచన. బాపూగారి జీవిత విశేషాలు అనేకానేకం తెలుస్తాయి. రమణ, బాపూలతో పాటు విభిన్న రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తుల జీవిత చిత్రాలు కూడా తెలియవస్తాయి.

ఈ రేంజ్‍లో ఫిలాసఫీ వాయించాననీ, పుస్తకం చదవడానికి వెనకాడకండి. మీరు మొదలెట్టండి చాలు.. ఆ తర్వాత అది హిప్నటైజ్ చేయకపోతే.. చూద్దాం! తెలుగుని అతి కష్టం మీద పదాలు కూడబలుక్కొని చదివేవాళ్ళు కూడా చదువాల్సిన పుస్తకం. “Nothing evaporates more swiftly as humour the moment it is explained or examined.” అని ఆర్కె నారాయణ్ గారి సలహా. అందుకే నేను ఆ దరిదాపులకి కూడా వెళ్ళబోవటం లేదు. నాదీ ఓ చిన్ని సలహా.. వీలైతే ఓ తెలుగొచ్చిన మనిషిని పక్కనుంచుకొని చదవండీ.. నవ్వులు పంచుకున్నా, పెంచుకున్నా భలే ఆనందం. వివాహభోజనంబు స్థాయిలో నవ్వుల విందు! మీకు తెలుగు పుస్తకాలు అందుబాటులో లేకపోతే, మీ మిత్రులనో, సన్నిహితులనో పోరి మరీ ఈ పుస్తకం తెప్పించుకోండి. చదవండి.. చదివి వినిపించండి.. చదివించండి..

ఎఫ్.ఎం లా హోరెత్తించాలంటే.. “చదువు.. చదువించూ.. లైఫ్ / 2 అందించు”

**********************************************************************************************

కోతి కొమ్మచ్చి – మొదటి భాగం
ముళ్ళపూడి వెంకటరమణ
హాసం ప్రచురణలు
వెల: రూ||లు 150.00
విశాలాంధ్ర పుస్తకకేంద్రాల్లో లభ్యం.

హాసం ప్రచురణలు
(సంచాలకుడు: ఎమ్బీస్ ప్రసాద్)
E101, Satyanarayana Enclave
Madinaguda, Hyderabad 500049
Ph: 040-23047638

You Might Also Like

11 Comments

  1. kumaar

    CHHALA SANTHASHAM ATUVANTI WRITER KAALAM LO MANAM KOODA UNNADUKU

  2. rajesh

    mullapudi rmamana gari gurinchi chala baga rasaru.
    mi vyasam chusaake naku kuda telisindi aanentha goppa rachaeto.
    i would like to read his books.
    Thank you.

  3. పుస్తకం » Blog Archive » కోతి కొమ్మచ్చి కోరి చదివొచ్చి..

    […] ************************************ పుస్తకం.నెట్ లో కోతికొమ్మచ్చి గురించి వచ్చిన ఇతర వ్యాసాలు ఇక్కడ మరియు ఇక్కడ. […]

  4. Purnima

    budugoy: మాష్టారూ.. స్వప్నలిపి ని పరిచయం చేయకూడదూ? నవోదయాలో అడిగి చూస్తాను. విశాలాంధ్రవాళ్ళు లేదన్నారు.

    అన్నట్టు మీ రెండో లెగ్గు అనుభవాలు మాతో పంచుకుంటారని ఆశిస్తున్నా..

  5. budugoy

    అజంతా గారి స్వప్నలిపి నవోదయలోనో, విశాలాంధ్రలోనో దొరకొచ్చండి. విజయవాడ సెకండ్ హాండ్ పుస్తకాల షాపుల్లో కూడా దొరుకుతుందని ఉవాచ. అజంతా రాసింది ఒకే ఒక పుస్తకం. కాని ఆయన నిజంగా గోప్ప కవి. తప్పక చదవాలి. నేనూ బుక్ ఫెటివల్ మొదటి లెగ్గులో (ఇం)కోతికొమ్మచ్చి కొనుక్కుని వచ్చా..కాని నిన్న తెగ అలసిపోయి ఉండడంతో నా కౌంట్ ఇరవయ్యైదుకే డ్రాప్ అయింది. ఇవాళ పూర్తి చేయాలి 🙂

  6. సౌమ్య

    ఇందాకె… అక్కడ “ఈవారం మీరెం చదివారు” లో వ్యాఖ్య రాసా ఈ పుస్తకం గురించి… ముళ్లపూడి వారి రాత అన్‌పుడ్డౌనబుల్, బాపు గీతలు అన్‌దృష్టిమరల్చబుల్ అని… దానికి ఇంకో ఫ్రేస్ అడిషన్ – ఈ సమీక్ష చదివాక ఆ పుస్తకం చదవాలి అనిపించకపోడం కూడా ఇంపాజిబుల్… 🙂
    Nice review!

  7. పుస్తకం » Blog Archive » తెలుగు సాహిత్యంలో మళ్ళీ మునకలేయాలనుకుంటున్నారా?

    […] స్వాతి పత్రిక లో “కోతి కొమ్మచ్చి” శీర్షికన సీరీస్‍గా వచ్చిన ముళ్ళపూడి వెంకటరమణ గారి ఆత్మకథ ఇప్పుడు పుస్తక రూపంలో లభ్యమవుతుంది. నవ్వుల కోసం కాదు, జీవితం కాచి వడబోసిన కళాకారుడి కోసం. నా రివ్యూ ఇక్కడ. […]

  8. శేఖర్

    🙂

    ముళ్ళపూడి వార్ని బానే వంటపట్టించుకున్నారుగా. చాలా బాగా రాసారు.

    అజంతా వారి పుస్తకాలు ఇప్పుడు ముద్రణలో లేవనుకుంటా. “స్వప్నలిపి” అని కవితాసంపుటం బాగా ఫేమస్.

  9. Purnima

    వ్యాసంలోనే రాద్దామనుకొని మర్చిపోయాను.. ఈ పుస్తకంలో రమణ గారి స్నేహితునిగా మహాకవి అజంతా గారి ప్రస్తావన చాల చోట్ల ఉంది. వారి గురించి వినడమే తప్పించి.. ఎక్కడా చదవలేదు. వారి రచనలు ఎక్కడ దొరుకుతాయో దయచేసి తెలుపగలరు… ప్లీజ్! మీలో ఎవరి దగ్గరైనా ఉంటే పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను.

  10. RK

    స్వాతిలో రావటం నాకూ లీలగా గుర్తే, కానీ బహుశా స్వాతి అంటే చిన్నచూపుండటంవల్లనుకుంటా – దీన్నెప్పుడూ చదవలేదు.

    మొన్నే ఒక friend సిఫార్సు చేస్తే “సరే చూద్దాం!” అనుకుంటూ కొన్నాను, తనమీదున్న నమ్మకంతో – కొన్నాకా, పనిమధ్యలో పరధ్యానంగా ఒక పేజీ తెరిచాకా ఏమయ్యింది – మీకు జరిగినట్టు గానే – యెనభై నాలుగో పేజీ అయ్యింది!

    అసలిన్నిరోజులూ ముళ్ళపూడి వెంకటరమణ అనే రచయితను పెద్దగా పట్టించుకోనందుకు సిగ్గుపడుతున్నాను! దరిద్రాన్నీ, ఆకలినీ ఇంత హాస్యస్ఫోరకం గా చెప్పగలడం సాధ్యమా అనిపించింది.

    ఇంకా చాలా చెప్పాలనుంది కానీ, ఇక్కడే వ్రాయబోయే రివ్యూ కోసం దాచుకుంటున్నా !

    btw, మీరు ఈ వ్యాసాన్ని రమణ style లో వ్రాయడం చాలాబాగుంది!

Leave a Reply