హోసూరు గడపలోని పంచతంత్ర కథలు

వ్యాసకర్త: విశీ

కథలంటే కాగితం, కలంతో పుట్టినవేనా? వెన్నెల్లో మంచంమీద పడుకొని మన అమ్మమ్మలు, జేజమ్మలు చెప్పిన కథల సంగతేమిటి? నోటి నిండుగా తాంబూలం వేసుకుని అరుగు మీద కూర్చున్న పేదరాశి పెద్దమ్మ చెప్పే కథలో? పల్లెల్లో గడప గడపకూ దిద్దిన ముగ్గులాగా ఇంటింటి కట్టున వినిపించే కథల మాటేంటి? అవన్నీ కథలే! బతకు మజ్జిగలో మనసు కవ్వం పెట్టి సరుకుసరుకుమంటూ చిలికితే పుట్టిన వెన్నలాంటి కథలు. నీతి, ధర్మం, యుక్తి, ధైర్యం నేర్పిన కథలు. అదుగో అట్లాంటి కథల్ని మనకోసం చెప్పారు ఈ జతకథగాళ్లు. ఒకరు కెం.మునిరాజు. ఇంకొకరు గౌనోళ్ల సురేశ్‌రెడ్డి. 

తమిళనాడు హోసూరు ప్రాంతంలో పుట్టిన వీళ్లిద్దరూ తెలుగువాణి అనే సంస్థలో పరిచయమై, ఒకరికొకరు నేస్తులై, ఇద్దరూ కలిసి రాసిన కథల్ని పుస్తకంగా తెచ్చారు. ఇందులో కథలన్నీ ఆ ప్రాంతంలో ఎక్కువగా వాడుకలో ఉన్నవి. వాటిని సేకరించి, అనువుగా రాసి మనకందించారు. ఇంతా చేసి వాళ్లు ఏమంటారో చూడండి..

“ఈ పుస్తకములోని కతలు మేము ఊహించి రాసినవి కాదు. ఇందులో మా రచన గొప్పతనము ఏమీ లేదు. ఈ గొప్పతనము అంతా మా పల్లెల్లో మాకు కతలు చెప్పిన తిమ్మక్క, పాపవ్వ, కుంటవ్వ, నంజవ్వ, రామప్ప… వీళ్లదే. ఈ జతగాళ్లను కతగాళ్లు చేసిన వీరందరికీ దండాలు.”

ఇందులో అసలైన కథలకు ముందు కొంత కథ నడుస్తుంది. మునిగాడు, సూరిగాడు జతగాళ్లు. ఇద్దరికీ కథలంటే చాలా ఆపేక్ష. ఇద్దరూ ఒక దినం గొర్రెలు​ మేపేందుకు వాళ్లూరి చిన్న చెరువు పక్కనుండే పెద్ద దిన్నెకు పోయారు‌. ఆ మాట ఈమాట చెప్పుకుంటూ కథల్లోకి దిగారు. ఒకరు ఒక కథ చెప్తే, దాన్ని మించి మరొకరు ఇంకో కథ. అట్లా పొద్దు దిగేదాకా కథలు చెప్పకుంటూ ఉన్నారు. అలా చెప్పిన కథలే ఈ పుస్తకం నిండా ఉన్నాయి. ఇవన్నీ హోసూరు గడపలోని పంచతంత్ర కథలు.

ఇందులో ఉపయోగించిన ‌భాష హోసూరు ప్రాంతంలోని తెలుగు. చదవగానే మనస్సును కట్టిపడేసే మాండలిక సొగసు అది. ఈ మాటలు చూడండి..

‘పనిలో ఎవరు ఏమారినా నువ్వు ఏమారకూడదు. ఊరు వేసి ఎంత పొద్దాయె? ఇంకా పణుకోనే ఉంటే ఊరు నీ మొకాన ఉముసుతుంది. లెయిరా’ ఈకితా గట్టిగా గదిరింది తూరుపమ్మ తన కొడుకుని.

తిట్టుకొంటా కళ్లు విప్పినాడు పొద్దప్ప. బానములో వెలుగయింది.

తిట్టుకొంటా పడక దిగినాడు పొద్దప్ప. వెలుగు చుక్క వెలవెలపోయింది.

తిట్టుకొంటా దుప్పటి మడిచినాడు పొద్దప్ప. కావేరమ్మ తోపు ఇప్పిమానుల్లో కిలకిలలు మొదలయినాయి.

తిట్టుకొంటా జానము(పరుపు)ను చుట్టి పక్కకు నెట్టినాడు పొద్దప్ప. మంచుతెర తొలిగి బానము తేటపడింది.

సూర్యోదయాన్ని వర్ణించే ఈ అలతి మాటల సొగసు గురించి ఎంత చెప్పినా తక్కువే!

కథలు చాలా వరకు గతంలో విన్నవే అయినా హోసూరు మాండలికంలో సరికొత్తగా కనిపిస్తాయి. ‘మాట్లాడే గుల్లొంకాయ’ కథలో దొంగని తెలివితో మట్టుబెట్టిన మదనగిరి కనిపిస్తే, ‘గూసప్ప, గుల్లనక్క’ కథలో గూసప్పను మోసం చేసిన గుల్లనక్క వివరం తెలుస్తుంది. ‘కుంటోని గువ్వ నంజర’లో అవిటివాడైనా తెలివితో తన చెల్లెలిని కాపాడిన అన్న తారసపడతాడు. ఇద్దరు దొంగలు ఒకరికి మించి మరొకరు ఎత్తు వేసిన వైనం ‘సరయిన గాటీలు’ కథలో కనిపిస్తుంది.

ఆశ అనర్థాలకు దారి తీస్తుందన్న నీతిని చెప్పే కథలు ‘సీకప్ప గొర్రె, సాకప్ప కుక్క’, ‘మేదకస్తురాలు మోటమ్మ’. రెండూ చక్కగా సాగుతూ విలువైన సందేశాన్ని అందిస్తాయి. ‘తోక పీకుడుగాడు’ గమ్మత్తైన కథ. అనుకోకుండా అందలమెక్కిన అమాయకుడు పడే అగచాట్లు నవ్వు తెప్పిస్తాయి. ఇతరులను చూసి అసూయ పడరాదన్న సంగతి ‘మంచినడత, చెడ్డనడత’లో తెలుస్తుంది. గురువు దగ్గర నేర్చుకున్న విద్యలతో ఆ గురువులోని చెడ్డగుణాన్ని ఓడించే శిష్యుని కథ ‘గురువును మించిన శిష్యుడు’.

పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి దిగివచ్చి జనం చేత పడే మాటలు ‘లోకులు కాకులు’ కథలో చూడొచ్చు. నిజాయితీ గలవాడికి విజయం తథ్యమని ‘నియత్తే నిలబడుతుంది’ కథ ద్వారా తెలుస్తుంది. తెలివితో అపాయాన్ని దాటిన దంపతుల కథ ‘అత్తిముగం ఆచారి’. ఎంత మంచి చేసినా మనిషి తన నైజం మార్చుకోడని, అతనికన్నా కోతే నయమని వివరించే కథ ‘కోతిబుద్ధి, మనిషి బుద్ధి’. తాము తీసుకున్న గోతిలో తామే పడ్డ మనుషుల కథ ‘చెరపకురా చెడేవు’.

ఇలా కథలన్నీ చక్కటి సందేశాలను అందిస్తూ హాయిగా సాగుతాయి. ప్రతి కథలోనూ ఎన్నో కొత్త పదాలు కనిపిస్తాయి. బానము(ఆకాశం), మంపుర(మత్తు), పడసాల(వరండా), బీళు(కీడు), నూతనము(ప్రయత్నము), అజ్జు(అడుగు), కడ్డాయం(తప్పనిసరి), బేలాడి(బతిమిలాడి), నంజర(మాంసం), పరంగి(బొప్పాయి).. ఇలాంటి పదాలు హోసూరు తెలుగు సొగసును మనకు చూపిస్తాయి. ఈ పుస్తకానికి పూదోట శౌరీలు, చిలుకూరి దేవపుత్ర, ఎన్.ఎం.కృష్ణప్ప రాసిన ముందుమాటలు విలువైన విషయాలెన్నో చెప్పాయి.

పుస్తకం​: జతగాళ్లు కతగాళ్లు(కథలు)

వెల: రూ.70/-

ప్రతులకు: కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం, 2-1095, ఆవులపల్లి రోడ్డు, బస్తి, హోసూరు, కృష్ణగిరి జిల్లా, తమిళనాడు – 635109.

You Might Also Like

One Comment

Leave a Reply