“నలభీమ పాకాలతో” పద్యాల విందు

వ్యాసకర్త: తివిక్రమ్

కొన్నాళ్ల కిందట పిల్లలకు నేర్పడానికి తెలుగు పద్యాల జాబితా ఒకటి తయారుచేద్దామని కూర్చుంటే మొదటి వడబోతలో వేమన పద్యాలొక నలభై, సుమతి పద్యాలొక పాతిక పైగా తేలాయి. అది అక్కడితో ఆగిపోయింది. ఈరోజు వేరే పుస్తకం కోసం వెతుకుతుంటే “ప్రసిద్ధ తెలుగు పద్యాలు (భావంతో)” అన్న చిన్న పుస్తకం బయటపడింది. ఈ పుస్తకంలో రకరకాల పద్యాలు 200 పైగా ఉన్నప్పటికీ మొట్టమొదటగా నేను చూసిందీ, నా లిస్టుతో సరిపోల్చిందీ వేమన, సుమతీ పద్యాలే :-). దీంట్లో సుమతి శతకం నుంచి 22, వేమన పద్యాలు 27 ఉండగా నా లిస్టులో లేనివి సుమతి పద్యాలు 5, వేమన పద్యాలు 10 ఉన్నాయి.

అరచెయ్యంత సైజులో తొంభై పేజీలున్న ఈ విశాలాంధ్ర పుస్తక సంకలనకర్త, సంపాదకుడు పి. రాజేశ్వర రావు గారు. ఈ పుస్తకం రూపొందించడంలో సొదుం రామ్మోహన్ కొంతవరకు సహాయపడినారని preface “ఒక్క మాట”లో పేర్కొన్నారు. మంచి క్వాలిటీతో ప్రచురించిన ఈ పుస్తక రచయిత విశాలాంధ్ర మేనేజరు కాబట్టి, సోల్ డిస్ట్రిబ్యూటర్స్ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ కాబట్టి, ప్రచురించింది కూడా విశాలాంధ్ర అనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఆ పని చేసింది ప్రతిభ పబ్లికేషన్స్.

కవిత్రయ భారతం నుంచి విదుర నీతి పద్యాలను “భారతంలో విదురుడి నీతి పద్యాలు” అని విడిగా, మిగతా పద్యాలను విడిగా (హెడ్డింగు లేకుండా!) ఇచ్చారు. పోతన భాగవత పద్యాలు, ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి పద్యాలు, తెనాలి రామకృష్ణుని చాటువులు, సుమతి, వేమన, భాస్కర, భర్తృహరి, శ్రీకృష్ణ, నరసింహ, దాశరథీ శతకాలు, చిలకమర్తి లక్ష్మీనరసింహం పద్యాలు అని హెడ్డింగులున్నప్పటికీ వాటి మధ్యలో వేరే పద్యాలు కలిపి ఇచ్చారు.

ఉదాహరణకు పోతన భాగవత పద్యాల విభాగంలో 16 పేజీల తర్వాత ఇది శ్రీనాథుడిది అని పేర్కొంటూ ఒకదాని తర్వాత ఒకటి 16 పద్యాలు, అదే వరుసలో శ్రీకృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన, నంది తిమ్మన పద్యాలు కూడా అదే విభాగంలో ఇవ్వడం, తెనాలి రామకృష్ణుడి పేరుమీదున్న విభాగంలో అనేక ఇతర సమకాలికుల పద్యాలు, భర్తృహరి పద్యాల విభాగంలో 18వ శతాబ్దానికి చెందిన ఇంకొందరు కవుల పద్యాలు కలిపేసి ఇవ్వడం వల్ల విషయ సూచిక వల్ల పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. దాశరథీ శతకం విభాగంలో అ శతకం నుంచి 3 పద్యాలుంటే ఇతరులవి 6 పద్యాలున్నాయి!

తిరుపతి వేంకటకవులు, విశ్వనాథ, నార్ల చిరంజీవి, నార్ల వేంకటేశ్వరరావు, కరుణశ్రీ, రాయప్రోలు తదితరుల పద్యాలన్నిటినీ చిలకమర్తి లక్ష్మీనరసింహం విభాగంలో ఇచ్చారు. ఒక్క భారతకర్తలు, తెనాలి రామకృష్ణ, భర్తృహరి, శ్రీకృష్ణ శతకకర్త, నరసింహ శతకకర్త శేషప్ప కవి తప్ప ఇతర కవుల కాలం శతాబ్దుల్లో పేర్కొన్నారు. విదురుడి నీతి పద్యాల విషయంలో విదురుడి కాలం నిర్ధారించలేక వదిలేశారేమో! నీతి సారం విదురుడిదే అయినా పద్యరూపం ఇచ్చింది కవులే కదా? భర్తృహరి పద్యాల దగ్గర అనువాదకుడి కాలం ఇచ్చారు. ఇతర కవుల కాలం ఎందుకివ్వలేదో తెలియదు.

పద్యాల విభజన మాటెలా ఉన్నా పద్యాల ఎంపిక, సందర్భోచిత వివరణలతో తాత్పర్యాలు చాలా బాగున్నాయి. ప్రసిద్ధమైనవి, పురుష కవుల పద్యాలు దాదాపు అన్నీ ఒక్కచోట ఉండడం వల్ల తెలుగు పద్యాల మీద ఆసక్తి ఉన్న ప్రతివారికీ ఉపయోగపడే పుస్తకం. ఐతే దీంట్లో మొల్ల రామాయణం నుంచి గానీ, ఇతర కవయిత్రులవి గానీ పద్యాలు ఎందుకు లేవో అర్థం కాలేదు.

నా దగ్గరున్న కాపీ 2006 జనవరిలో వచ్చిన నాలుగవ ముద్రణ. వెల 30/-. ఇది మరిన్ని ముద్రణలు పొందినట్లుంది. ఎప్పటి ముద్రణో తెలియదుగానీ 80/- వెల గల ప్రతి మీద “20 వేల కాపీలకు పైగా అమ్ముడైన పుస్తకం” అని ఉంది.

You Might Also Like

Leave a Reply