నసీరుద్దీన్ కథలు

వ్యాసకర్త: త్రివిక్రమ్

అరవయ్యేళ్ళ కిందట మహీధర నళినీమోహన్ గారు మాస్కోలో పిఎచ్.డి. చేస్తున్న రోజుల్లో అజర్ బైజాన్ మిత్రుల సంభాషణల్లో తరచూ వినేవాళ్ళట ఈ నసీరుద్దీన్ కథలను. అలా విన్నవాటినే సంకలనం చేసి 1978లో ప్రచురిస్తే పదేళ్ళలో నాలుగు ముద్రణలు, నాలుగో ముద్రణలో ప్రతుల సంఖ్య నాలుగు వేలు.

ఈ నసీరుద్దీన్ కథల్లో ఆ వూరి ప్రభువుగా తరచూ తారసపడే పాత్ర తైమూర్. నళినీమోహన్ గారు “ఈ మౌల్వీ నసీరుద్దీన్ కుంటి తైమూరు కాలంలో జీవించినట్లు ఈ కథలలో ఉన్నది. కాని, ఇది నిజమో కాదో సరిగ్గా తెలియదు.” అన్నారు. ఈ కథల్లోని తైమూర్ చరిత్రలో ప్రసిద్దికెక్కిన తైమూర్ ఖాన్ / కుంటి తైమూర్ / తామర్లేన్ కాక ఒక స్థానిక ప్రభువు కావచ్చుననిపిస్తోంది.

ఎందుకంటే వికీపీడియా ప్రకారం అఫ్ఘాన్, ఇరాన్, మధ్య ఆసియా; ఈజిప్త్, సిరియా, ఆట్టోమన్, డిల్లీ సుల్తనత్ లను జయించిన తామర్లేన్ లలిత కళలు, ఆర్కిటెక్చర్ ను గొప్పగా పోషించినవాడు. పండితులు, మేధావులు, విద్యా, ఆధ్యాత్మిక సంస్థలను పోషించినవాడు. ఈ కథల్లో చూస్తే సూక్ష్మబుద్ధి, తార్కిక జ్ఞానం కలిగి, పండితుడు (మౌల్వీ) కూడా అయిన నసీరుద్దీనుకు తైమూర్ ఏనాడూ జీతం, భత్యం ఇవ్వలేదని ఎత్తిపొడిచే కథలు, నసీరుద్దీన్ తన పేదరికం పట్ల నిస్పృహను వ్యక్తపరిచే కథలు, డబ్బు అవసరాన్ని వేరేదారిలేక యుక్తితో తీర్చుకునే కథలు కూడా ఉన్నాయి. చెంఘిజ్ ఖాన్ ముత్తాత సోదరుడి తొమ్మిదో తరం వాడు తామర్లేన్. దాదాపు 27 ఏళ్ళ వయసులో గొర్రెలను దొంగతనంగా మళ్లించుకుపోతూ, గొర్రెల కాపరి వేసిన బాణాలకు కుడి కాలు, కుడి చేతి రెండు వేళ్ళు పోగొట్టుకుని, కుంటి తైమూర్ (తామర్లేన్) అని పేరు పొందాడు. ఈ కుంటితనపు ప్రస్తావన నసీరుద్దీన్ కథల్లో ఉండనే ఉండదు. పైగా నసీరుద్దీన్ వెటకారాలు, ఎత్తిపొడుపులు తరచుగానే తైమూర్ తో చేస్తూ ఉంటాడు.

తామర్లేన్ జయించిన విశాల సామ్రాజ్యంలో ఈ అజర్ బైజాన్ ఒక పక్కన, కాస్పియన్ సముద్రానికి అవతల ఉండడం, అక్కడ తప్ప తామర్లేన్ రాజధాని ఉన్న ఉజ్బెకిస్తాన్లో గానీ, ఇతర ప్రాంతాల్లో గానీ నసీరుద్దీన్ కథలు ప్రాచుర్యంలో లేకపోవడం ఈ కథల్లోని తైమూర్ తామర్లేన్ కాదనుకోవడానికి ఇంకొక కారణం. నసీరుద్దీన్ కథల్లోని తైమూర్ ఒక స్థానిక పాలకుడు అనుకుంటేనే తైమూరుతో మాటకు మాట సమాధానమిచ్చే నసీరుద్దీన్ సాహసం అర్థం చేసుకోదగ్గ స్థాయిలోనే ఉందని స్పష్టమౌతుంది.

ఈ ముల్లా/మౌల్వీ నసీరుద్దీన్ పేరు ఎత్తితే ఏడు కథలు చెప్పాలని అజర్ బైజాన్ లో వాడుక అట :-). మన తెనాలి రామకృష్ణుడు లేదా బీర్బలుకు, నసీరుద్దీనుకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే మనవాళ్లిద్దరూ రాజులను ఆశ్రయించుకుని ఉన్నవాళ్ళు కాగా నసీరుద్దీనుకు తన ఊరి పాలకుడైన తైమూర్ అంటే తేలికభావమూ, లెక్కలేనితనమూ, విమర్శించడంలో తెంపరితనమూ కూడా చూడవచ్చు
ఉదాహరణకు నజరానా అనే కథలో నసీరుద్దీన్ తను మాట్లాడుతున్నది తైమూర్తో అని తెలియనప్పుడు “పొగడ్తతో ఎటువంటి గాడిదకైనా జీను వేసెయ్యవచ్చు. తైమూర్ ఎంత?” అని, “నా నల్ల గాడిద తోక వాడి తాత ముత్తాతల గోరీల మీద పెట్టి లేచొస్తా” అని అంటాడు. తర్వాత తైమూర్ మారువేషం తీసేసినాక కూడా నదురూ బెదురూ లేకుండా “నా నల్ల గాడిద నెత్తిన దాని తోక పెట్టక తప్పదు.” అంటే తైమూర్నే కాక అతని తాత ముత్తాతలను కూడా నల్లగాడిదలు అని తైమూర్తోనే అనేశాడు!

అడిగిన జీతంబియ్యని తైమూర్ మిడిమేలపు దొరతనం; తైమూర్, ఖాజీల తెలివితక్కువతనం గురించి బాగా తెలిసినవాడైన నసీరుద్దీన్ అలాగని పూర్తిగా రాజాస్థానానికి దూరంగానూ లేడు. కొన్ని కథల్లో తైమూర్ ఆస్థానంలో నేరుగా ప్రవేశమే దొరకనివాడు, కొన్ని కథల్లో మౌల్వీ హోదాలో తైమూరుకు అవసరమైనప్పుడు సలహాలు, క్లిష్టమైన కేసుల్లో తీర్పులు కూడా ఇచ్చాడు. కొన్ని కథల్లో అవకాశం దొరకబుచ్చుకుని, తైమూర్ను ఇరకాటంలో పెట్టి బహుమానాలు కూడా పొందుతాడు.

వీటిలో కొన్ని కథలు తొలి పలుకులో పేర్కొన్నట్లు మన దేశపు మర్యాదరామన్న, తెనాలి రామకృష్ణ, బీర్బల్ కథలను పోలినవి ఉన్నాయి. చమత్కారం, తర్కం, సూక్ష్మబుద్ధి, అతి అమాయకత్వం, సందర్భాన్ని బట్టి తైమూర్, కాజీ లాంటివాళ్ళ ఎదుట మాటల్లో సాహసం ప్రదర్శిస్తూ మనోల్లాసాన్ని కలిగించే నసీరుద్దీన్ కథలు మళ్లీ మళ్లీ చదువుకోవచ్చు


You Might Also Like

Leave a Reply