విలువైన విలక్షణ కథలు

వ్యాసకర్త: విశీ

మధురాంతకం నరేంద్ర గారు 1975 నుంచి కథలు రాస్తున్నారు. ఆయన కథలతో గతంలో ‘కుంభమేళా’, ‘అస్తిత్వానికి అటూ ఇటూ’, ‘రెండేళ్ల పద్నాలుగు’, ‘వెదురుపువ్వు’ కథా సంపుటాలు వెలువడ్డాయి. 2019లో అన్వీక్షికి పబ్లిషర్స్ ‘నాలుగుకాళ్ల మండపం’ పేరుతో కథా సంపుటి ప్రచురించారు. దాదాపు 504 పేజీలున్న ఈ పుస్తకంలో 31 కథలున్నాయి. ఒక రచయిత రాసిన కథలతో ఇంత పెద్ద పుస్తకాన్ని చూడటం ఈ మధ్య కాలంలో ఇదే!

నరేంద్ర గారి కథల గురించి చెప్పేముందు ముందుమాటలో ఆయన చెప్పిన మాటలు చెప్పాలి. ‘కథానికా రచన నాకు సాహిత్య సాధనగానూ, వ్యక్తిగత శోధనగానూ, ప్రాపంచికావగాహనా వేదికగానూ తోడ్పడింది అని తెలుసుకున్నాను.’ ఈ మాటలు విన్న తర్వాత కథా రచన మీద ప్రత్యేక గౌరవం కలుగుతుంది. కేవలం వ్యక్తిగత పేరు, సంతృప్తి అనే లాభాలను దాటి ప్రాపంచిక అవగాహన కోసం కథలు మార్గంగా మారగలవని అర్థమవుతుంది. ఆ అవగాహనలోనుంచి అద్భుతమైన కథలు పుడతాయి.

ఈ కథల్లో ఎక్కడా ఆకాశంలోంచి ఊడిపడ్డ మనుషులు కనిపించరు. అందరూ ఈ నేల మీద మన చుట్టూ జీవించేవాళ్లే. వారి నిత్యజీవితంలో జరిగే అనుభవాలే కథలు. శ్రమజీవులు, మధ్యతరగతి ప్రజలు, డాబుతో ఊరేగే పెద్దింటి జనాలు.. అందరూ కనిపి‌స్తారు. ఒకర్ని చెడ్డగా చిత్రించడం ద్వారా మరొకర్ని మంచిగా చూపించడం ఈ కథల్లో ఉండదు. మంచైనా, చెడైనా ఆ పరిస్థితులకు అనుగుణంగా చూడాలని చెప్పే వాదన వినిపిస్తుంది. మానవ జీవన వైవిధ్యం అందులోనే ఉందని అర్థమవుతుంది.

31 కథల్లో ఒక్కో కథ గురించి ఒక్కో వ్యాసం రాయొచ్చు. ప్రతి కథలోనూ చర్చించాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. నరేంద్ర గారు అన్నీ విప్పి చెప్పే రచయిత కాదు. పాఠకులను గౌరవించి, వారి మేధకు పనిని కల్పించే విధంగా కథలల్లడంలో ఆయన నేర్పరి. ‘మెకావో చిలకలు’ కథ అందుకు మంచి ఉదాహరణ. ఈ కథ ప్రత్యేకంగా ఏ విషయాన్నీ చర్చిస్తున్నట్లు అనిపించదు. తరచి చూస్తే మనుషుల​ ప్రవర్తన, మానవ సంబంధాల తీరుతెన్నులు, స్త్రీలు పితృస్వామిక వ్యవస్థ చేతిలో​ చిక్కిన వైనం కనిపిస్తుంది. ఇదంతా ఒక్కసారిగా అర్థమవదు‌. రెండు, మూడు సార్లు చదివాక బోధ పడుతుంది.

‘అమర్ కథ’ బహుశా ‘అమర్‌నాథ్ యాత్ర’ గురించి తెలుగులో వచ్చిన అతి తక్కువ కథల్లో ఒకటి. 22 పేజీల కథ ఇది. అయితే ఎక్కడా విసుగు తెప్పించకుండా ఉత్కంఠగా నడుస్తుంది. అమర్‌నాథ్ యాత్ర విశేషాలు చెప్తున్నట్టు అనిపించినా అంతర్లీనంగా స్త్రీ పురుషుల సంబంధాలు, ఉన్నట్టుండి మారిపోయే మనుషుల మనస్తత్వాల గురించి లోతైన అవగాహన అందించే కథ. ‘రెండు ఆకాశాలు’ కథ గతకాలపు జ్ఞాపకాల సమాహారంలా నడుస్తుంది. ఆధునిక జీవనంలో దూరమవుతున్న ఆత్మీయబంధాల స్పర్శ మనను తాకుతుంది.

మానవ సంబంధాల చిత్రణ ఈ కథల్లో చాలా విలక్షణంగా ఉంటుంది. ఒక బంధం తాలూకు విభిన్న పార్శ్వాలను చర్చించే కథలు ఇందులో ఉన్నాయి. అవి అక్కడితోనే ఆగకుండా సామాజిక అంశాల మేళవింపుగా మారాయి. నరేంద్ర గారి అన్ని కథల్లో దీన్ని గమనించొచ్చు. ‘చివరి యిల్లు’ కథలో ఒంటరి ముసలిజంట చివరి రోజుల కథలా అనిపించినా, ప్రస్తుత కాలంలో వృద్ధుల మానసిక వేదన, తిరిగిపోతున్న గత తరాల జ్ఞాపకాల గురించి చర్చిస్తుంది. ‘యుద్ధకాండ’ కథ తల్లిదండ్రులు బిడ్డల చదువు మీద చూపుతున్న అతి శ్రద్ధ గురించి చెప్తూ, రాబోయే తరాన్ని మార్కుల యంత్రాలుగా మారుస్తున్న విధానాన్ని వివరిస్తుంది.

ఈ కథల్లో మనం గమనించే మరో అంశం వర్ణన. కథ జరుగుతున్న సమయం, సందర్భం, స్థలం, పాత్ర ఆహార్యం, వారి మానసిక స్థితి.. అన్నీ కళ్లకు కట్టినట్లు రాస్తారు నరేంద్ర.

“తూర్పు వైపు నుంచి యిండ్ల పైకప్పుల్ని దాటి పైకొచ్చిన సూర్యుడు నీడల్ని నిగుడి‌స్తున్నాడు. షామియానా కింద జనసమ్మర్దం పెరుగుతూనే ఉంది. యెక్కడి పొలం పనులక్కడే వదిలిపెట్టి వచ్చిన వ్యక్తుల దుస్తులన్నీ మట్టిగొట్టుకుపోయి ఉన్నాయి. వస్తున్న ప్రతి వ్యక్తి మరికొంత నిశ్శబ్దాన్ని మోసుకొస్తున్నట్టుగా షామియానా క్రింద నిశ్శబ్దంగా నిల్చుని చేతులు జోడిస్తున్నారు. తెలుపూ నలుపూ బురకాలు తొడుక్కున్న ముస్లిం స్త్రీలు కొందరు వో మూల నిలబడి గుసగుసలు పోతున్నారు.” (సద్గతి)

“బక్కచిక్కిన అతని ముఖంపైన, పొడుచుకొచ్చిన యెముకలాగున్న ముక్కు కింద, పొడవాటి బవిరి గడ్డంలోని వెంట్రుకలు​ అటూ యిటూ కదలడంతో, అతడు నవ్వుతున్నాడేమోననిపిస్తోంది. ప్రమిదల్లాంటి గుంటల మధ్య నుంచి అతడి కళ్లు దీపకిరణాల్లాంటి తీక్షణమైన చూపుల్ని రువ్వుతున్నాయి.” (మహిమ)

ఇలాంటివి ప్రతి కథలోనూ కనిపిస్తాయి. ఈ వర్ణన ద్వారా పాఠకుడు కథలో గాఢంగా లీనమయ్యే అవకాశం ఉంటుంది. పేజీల పరిమితులకు లొంగకుండా రాసిన కథలివి. ఇందులో ప్రతి కథా కనీసం ఎనిమిది పేజీలుంటుంది. ‘మహిమ’, ‘గమ్యం’, ‘గమనం’, ‘అత్యాచారం’ కథలు దాదాపు 20 పేజీలకు పైగానే ఉన్నాయి. కథనం బలంగా ఉన్నప్పుడు ఎంత పెద్ద కథైనా ఆసక్తికరంగా సాగుతుందనేందుకు ఈ కథలు చక్కటి ఉదాహరణ.

కొన్ని కథల్లో చర్చించిన అంశాలు చాలా విభిన్నమైనవి. ప్రస్తుత కాలానికీ అవి తమ విలక్షణతను కోల్పోనందువల్లే ఈ కథలు ఎన్నాళ్లైనా నూతనంగానే అనిపిస్తాయి. కార్పొరేటు కాలేజీల ధాటికి, నాయకుల నిర్లక్ష్యానికీ ప్రాభవం కోల్పోతున్న ప్రభుత్వ కళాశాలల పరిస్థితిని చూపించే ‘రేపటి చరిత్ర’, వీసాల కోసం నిలబడే క్యూలైన్‌లో చోటును అమ్మి బతికేవారి జీవితాన్ని తడిమే ‘చోటు’, మతాలు, నమ్మకాలు వేర్వేరు అంశాలని చెప్పే ‘వొక మైనారిటీ కథ’, పేదవారి సొమ్ము దోచుకునే పెద్దల బుద్ధులు వివరించే ‘కాకులు-గ్రద్దలు’.. అన్ని కథలూ ఇలాంటి భిన్న సామాజిక అంశాలను చెప్తాయి. తప్పక చదవాల్సిన విలువైన విలక్షణ కథలివి.

పుస్తకం: నాలుగుకాళ్ల మండపం(కథలు)

వెల: 290/-

ప్రతులకు: అన్వీక్షికి పబ్లిషర్స్, అజ్రా హౌస్, 59/సి/డి, ఎమ్మెల్యే కాలనీ, బంజారాహిల్స్​, హైదరాబాద్.

లింక్: https://www.amazon.in/Naalugu-Kaalla-Mandapam-Madhurantakam-Narendra/dp/8194118069/ref=mp_s_a_1_32?dchild=1&keywords=anvikshiki+book&qid=1604008202&sprefix=Anwikshiki&sr=8-32

You Might Also Like

One Comment

  1. తిరుమల్

    బాగుంది

Leave a Reply