రుచించే కథలు

వ్యాసకర్త: లక్కరాజు మీనాక్షి

*********************

విషయ పరిజ్ఞానం ఉండటం , దానిని ఎదుటి వారికి అర్ధమయ్యే విధంగా చెప్పటం ,మళ్ళీ అందులో ఎటువంటి సందేహాలు లేకుండా చక్కటి వచనం లో రాయటం ,దానికి కొంత హాస్యాన్ని జోడించి తళుక్కున మెరిపించటం , అక్కడక్కడా నేటి తరం మరచిపోతున్న సామెత లను జోడించడం, మధ్య మధ్యలో పద్యపు తళుకు లను అద్దటం ఇవన్నీ తెలుగు భాష మీద సంధ్య కు ఉన్న పట్టును, భాష మీద ప్రేమను తెలియచెప్తున్నాయి.

పుస్తకావిష్కరణ లో విజయలక్ష్మి గారు ఎగతాళి చేసినట్టు స్మాల్ స్మాల్ గా, రౌండ్ రౌండ్ గా అనకుండా వినసొంపైన పదాలతో వంటలను వర్ణించటం,  దానిని పుస్తక రూపంలో అందించటం అభినందించ దగ్గ విషయం. బంగారు పళ్ళానికి అయినా గోడ చేరుపు కావాలి. ఒక పుస్తకం ముద్రణ కు రావాలన్న ఇంటా బయట ఎందరి సహకారం ఉంటేనే కుదురుతుంది. ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యుల సహకారం . ఇందుకు కొండలరావు గారిని అభినందించాలి .అందుకే సంధ్యా ధైర్యంగా ఆయన మీదే ప్రయోగించి “టెస్ట్ చేయబడినది…ప్రూవ్ చేయబడినది. కాబట్టి నిర్భయంగా వండవచ్చు “అనగలిగింది. దీనికి ఇంకో మాట “ఏ పని అయినా నిర్భయంగా చేయవచ్చు.” అని మనం కలుపుకోవచ్చు.           

ఈ పుస్తకం లో కొన్ని వంటలు ఇలా కూడా చేయవచ్చా అని ఆశ్చర్యం లో ముంచితే ఇంకొన్ని మనం కూడా ఒక ప్రయత్నం చేస్తే పోలే అనే ఉత్సహాన్ని ఇస్తాయి. ఉదా.  కస్టర్డ్ పౌడర్ కి శనగ పిండి కి తేడా తెలియని అయోమయం , కస్టర్ద్ పౌడర్ తో దోసెలు వేసే ప్రయత్నం ఆహా ఏమి తెలివి ! అని మనని నవ్విస్తుంది.అదే సమయంలో వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు వాళ్ళకే పోతే ఎలా? అని విసుగు రావటం మనను విస్తు పోయేలా చేస్తుంది. తర్వాత చేసిన తప్పు తెలిసి నాలుక కర్చుకోవటం ఆద్యంతం ఒక ప్రహసనమే.  అమ్మ పోపుల డబ్బా ను ఆరోగ్య బీమాగా వర్ణించటం, డోక్లా కాస్తా నాయనమ్మ చేతిలో స్పాంజి ముక్కలా మారటం, ఆవిడ అతి ప్రేమతో ఎలాంటి వస్తువులు కొనుక్కోవాలో కూడా తెలియదా అని అక్షింతలు వేయట , ముద్ద పప్పు కోసం హక్కుల ఉద్యమాలు నడపటం, పుట్టినరోజు కు నూనె అంటే సంప్రదాయం ఇలా పిల్లల నుంచి పెద్దల దాకా జీవితంలో వివిధ పార్శ్వాలను హాస్యం గా చెప్తూనే “మనమెప్పుడు  గ్రహిస్తామో మనమొదిలేస్తున్న  అమృతాన్ని” అంటూ జీవిత సత్యాలను వివరించటం సంధ్యా కే చెల్లింది.       

వంటగది ని ప్రయోగశాల గా మార్చి కొబ్బరి వారోత్సవాలు నిర్వహించినా మధ్యలో కుక్కర్ ఆక్సిడెంట్ లు , నోరు అతుక్కు పోయే హల్వాలు,వేయించి చేస్తే ఏం,ముందు రుబ్బి తర్వాత వేయిద్దాం అని చేసిన పచ్చడులు, ఫట్ మని పేలే మైదా పిండి గులాబీ జామూన్ లు , హల్దీరాం మూంగ్ దాల్ తో చేసిన పప్పు లాంటి విచిత్రమైన ప్రయోగాలు మనని నవ్విస్తాయి.  దోశ సిగ్గులమొగ్గ , నూనె పొంగి వరద గోదావరి అయింది , చీకట్లో మెరిసే డెంటిస్ట్ పళ్లలా ఇడ్లీలు లాంటి పద ప్రయోగాలు అక్కడక్కడా మురిపిస్తాయి. పళ్ళురాలగొట్టుకోవటానికి  ఆవడలు,పిజ్జాలు, ఇటుకల వంటి ఇడ్లీలతో తేలిక మార్గం చెప్పింది.ఈ సులువైన మార్గాలు చూసి పళ్ళ డాక్టర్ లు నెత్తి నోరు బాదుకుంటారు.       

వంటిట్లో ఎక్కువ సేపు గడపలేము అంటూనే  “ఇంటికి వంట గది గుండెకాయ”  “రోటీ మేకర్ అంత పోసి కొన్నారు… హాయిగా రెండు తులాల బంగారం వచ్చేది “అని గుండెలు బాదు కోవటం సాధారణ మహిళల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. వాన పడితే మిరపకాయ బజ్జిలు తినాలని అనుకోవటం, మొదటి చినుకు పడగానే నేల నుంచి వచ్చే మట్టి వాసనను ఆస్వాదించడం లాంటి ఏదో ఒక సన్నివేశం మనలను ఈ పుస్తకంతో మమేకం అయ్యేలా చేస్తుంది.ఇది నేను అనుభూతి చెందానే అనో, లేతే ఇలా నాకూ జరిగిందే అనో ఎక్కడో అక్కడ అనుకుంటాం.. సంధ్య చెప్పినట్టు మనలను రింగులు తిప్పుతూ (ఫ్లాష్ బ్యాక్ ) గతంలోకి తీసుకెళుతుంది . నిర్దేశిత సమయానికి చిన్న విజిల్ వేసిమనలను రమ్మని పిలిచి కన్నుకొట్టి కూర్చునే అక్షయ పాత్ర లాంటి ఇన్స్టంట్ పాట్, కావలసిన పదార్థాలు వేసి మీట నొక్కగానే కావాల్సినన్ని రొట్టె లను చేసే అన్నపూర్ణ లాంటి రోటిమేకర్ గురించి విశేషాలు మనలను అలరిస్తాయి.

వంటలలో ‘బాలదశ’ ను దాటి వంటలపైనే పుస్తకం రాసే దశ కు చేరటం, స్త్రీ శక్తిని ,ఆమె ఔన్నత్యాన్ని తెలియచెప్పే దసరా నవరాత్రులలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరగడం ఎంతో ఆనందం దాయకమైన విషయాలు. మరెన్నో రచనలు చేయాలని అవి కూడా పుస్తక రూపం లో అచ్చులోకి రావాలని ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా.

You Might Also Like

Leave a Reply