Born a Crime: Trevor Noah

వ్యాసకర్త: భారతి కోడె

ఖాళీ సమయాలలో యూట్యూబ్ లో ఏదో ఒక వీడియో లో మునిగి ఒక ముప్ఫయి, నలభై వీడియోల తర్వాత ఎక్కడో తేలడం నాకు బాగా అలవాటైన పని. అలా ఒకసారి యూట్యూబ్ వీడియోల ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు రాండమ్ గా చూసిన ఒక వీడియో అమెరికన్ టివి కార్యక్రమం ‘ది డైలీ షో’. అప్పటి నుండి ఈ డైలీ షోస్ చూడడం నా దినచర్యలో భాగం అయిపోయింది. ఆ కార్యక్రమంలో నన్ను ఆకర్షించింది దాని హోస్ట్ గా ఉన్న ట్రెవర్ నోవా. నోవా టివి కార్యక్రమ నిర్వాహకుడు మాత్రమే కాదు. అతను ఒక కమెడియన్, రచయిత, నిర్మాత, రాజకీయ విమర్శకుడు, నటుడు కూడా. ఇతను వృత్తి రీత్యా మొదట కమెడియన్ కావడంతో అతను నిర్వహించే డైలీ షోస్ కూడా

ఎంత సీరియస్ చర్చలనైనా హాస్యంతో నింపి ఆసక్తితో చూసేలా చేస్తాయి.
Born a Crime అనేది ఈ ట్రెవర్ నోవా ఆత్మ కథ. 36 ఏళ్ళ నోవా తన 32 సంవత్సరాల వయసులో ఈ పుస్తకాన్ని ప్రచురించాడు. తన డైలీ షోస్ కు నేను పెద్ద అభిమానిని కావడంతో ఈ పుస్తకం గురించి తెలియగానే చదవడం మొదలు పెట్టాను.
సౌత్ ఆఫ్రికాలోని జోహెన్స్ బర్గ్ లో జన్మించిన నోవా పుట్టుకే ఒక నేరం. వర్ణ వివక్ష తీవ్రంగా ఉన్న కాలంలో, తెల్లవారికి, నల్లవారికి మధ్య లైంగిక సంబంధాలు ఉండడం నేరంగా పరిగణించిన సమయంలో స్విస్ కు చెందిన తెల్లజాతి తండ్రికి, ఆఫ్రికా లోని జోసా అనే నల్లజాతికి చెందిన తల్లికి పుట్టిన పిల్లవాడు ట్రెవర్. తల్లి తండ్రి వేర్వేరు జాతులకు చెందిన పిల్లలందరిలాగే అతనిది కూడా రెండు అస్థిత్వాలు, రెండు ప్రపంచాల మధ్య నలిగిపోయిన బాల్యం. ఆ కాలంలో వర్ణ వివక్ష ఎంత దారుణంగా ఉండేదో మనకు పరిచయం చేస్తూ మొదలు పెడతాడు నోవా ఈ పుస్తకాన్ని.
తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు ఒకసారి నోవా తల్లి అతనిని కదిలే కార్ లో నుండి బయటకి తోసి వేస్తుంది. నోవా తెల్లటి రంగుతో పుట్టడమే అందుకు కారణం. ఆ కార్ వెళ్ళేదారిలో కొంచెం ముందు పోలీస్ లు ఉంటారు. తాను నల్లజాతికి చెందినది. కొడుకు తెల్లటివాడు. పోలీసులు సందేహిస్తే పిల్లవాడు ప్రాణాలతో ఉండే అవకాశం లేదు. దానికన్నా అతనిని కార్ లో నుండి బయటకి నెట్టివేయడమే అతనిని బతికించుకునే మార్గం అనుకుంటుంది ఆ తల్లి. పుస్తకం తొలి అధ్యాయాలన్నీ ఆ బిడ్డను బతికించుకోవడానికి, అతనికి కావాల్సిన చదువు సంధ్యలు నేర్పించి అతనికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఆమె చేసిన ప్రయత్నాలే.


ఇక నోవా బాల్యం కూడా మిగిలిన పిల్లలలాగా ఆనందంగా ఆటపాటలతో గడిచిపోయిన బాల్యం కాదు. చాలావరకు తాను ఎవరి కంటా పడకుండా దాక్కుని ఉండాల్సిన పరిస్థితి. ఇతర పిల్లలతో ఆడుకోవడం కూడా అంత తేలికైన విషయం కాదు. నల్లజాతి పిల్లలతో ఆడుకోవాలంటే అతని తెల్లటి రంగుని చూసి వాళ్ళు అతనిని పరాయివాడిగా చూసి ఆటపట్టించేవారు. తెల్లజాతి పిల్లలతో ఆడుకోవాలంటే అతని ఆఫ్రికన్ భాషను వాళ్ళు ఎగతాళి చేసేవారు. తన ఉనికే పెద్దగా ఎవరికీ తెలియని ప్రపంచంలో ఎన్నో సందిగ్ధాలు, అవమానాల మధ్య పెరిగిన పిల్లవాడిని ఇప్పుడు అతని డైలీ షోస్ లో చూస్తుంటే అంత ఆత్మ విశ్వాసం, హాస్య చతురత, వాగ్ధాటి ఎలా సాధించుకున్నాడో అని ఆశ్చర్యం వేస్తుంది.


27 ఏళ్ళ కారాగారవాసం తర్వాత విడుదలైన నెల్సన్ మండేలా కృషితో ఆఫ్రికా లో apartheid వ్యవస్థ ముగిసే ముందు వరకు అతని బాల్యాన్ని, post-apartheid కాలంలో అతని బాల్యాన్ని తనదైన హాస్య ధోరణిలో చాలా చక్కగా వివరిస్తాడు నోవా. అతని తల్లి ఒక నల్లజాతి వ్యక్తిని రెండవ పెళ్లి చేసుకోవడం, తాగుబోతు, వ్యసనపరుడు అయిన అతను ఆమెను పెట్టే హింస, చివరకి ఆమెను హత్య చేయబోవడం, అతని నుండి విడివడి మళ్ళీ ఆ తల్లి, కొడుకు మరొక కొత్త జీవితం ప్రారంభించడం వంటి సంఘటనలతో అత్యంత బాధాకరమైన బాల్యాన్ని, యవ్వన జీవితాన్ని కూడా ఎంతో ఆసక్తితో, హాస్యపూరితంగా వివరిస్తాడు.


ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన విషయాలు ముఖ్యంగా రెండు ఉన్నాయి. తన పట్ల ఉన్న వివక్ష, చిన్నచూపు నుండి బయటపడి అందరితో కలిసిపోయేందుకు నోవా ఎంచుకున్న మార్గాలు. ఒకటి వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవడం. రెండవది హాస్యం. ఏ జాతి పిల్లలతో కలిస్తే వారితో వారి భాషలోనే సంభాషణలు చేయడం, తన చతురోక్తులతో వారిని ఆనందపరచడం ద్వారా వారికి దగ్గరయ్యే అతని ప్రయత్నం చూస్తే పరిస్థితులు వాటికి అనుగుణంగా మనల్ని మనం మలుచుకునే నైపుణ్యాలను వాటంతటవే మనకి నేర్పిస్తాయి కదా అనిపించింది.


ఇక ఇందులో నాకు నచ్చిన రెండవ అంశం ట్రెవర్ తల్లి పాట్రిసియా నోవా బలమైన వ్యక్తిత్వం. తన బిడ్డను బతికించుకోవడం కోసం, అతని భవిష్యత్తు కోసం ఆమె పడిన కష్టం, తపన, ఆమె చూపించిన తెగువ ఇలా ఏది చూసినా ఈ పుస్తకానికి నిజానికి ఆమే అసలైన హీరో అనిపించింది.


జాతి వివక్ష, గృహ హింస, అస్తిత్వ సమస్య, కుటుంబం నుండి, సమాజం నుండి ఎదుర్కున్న సమస్యలు ఇలా పుస్తకమంతా ఎంతో గంభీరమైన, బాధాకరమైన అంశాలే ఉన్నప్పటికీ వాటిని ఆద్యంతం హాస్యంతో నింపి ఆసక్తితో చదివించేలా చేసిన నోవా ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేము. ఈ సామర్ద్యమే అతని డైలీ షోస్ ను కూడా అంత ఆసక్తికరంగా చేసింది.


ఎన్ని కష్టాలు ఎదుర్కున్నా, ఎంత ఒడిదుడుకుల జీవితం గడిపినా జీవితంలో ప్రేమను, ఆనందాన్ని అలాగే నిలుపుకోగలగడం అసాధ్యమేమీ కాదనేది ఈ పుస్తకం ద్వారా ఈ తల్లి, కొడుకుల జీవితం నుండి నేను నేర్చుకున్న అసలైన పాఠం

You Might Also Like

Leave a Reply