వెలివాడల బతుకు పువ్వులు

వ్యాసకర్త: విశీ

ఎండపల్లి భారతి మదనపల్లిలో​ ఉంటారు. ఎక్కువగా బయటకు రారు. సమావేశాలు, సభలకు హాజరు కారు. ఆమె కథలు చదివి, ఆమెను అభిమానించే వారితో కథల ద్వారానే మాట్లాడుతూ ఉంటారు. అదొక పద్ధతి. ‘ఎదారి బతుకులు’ ఆమె తొలి పుస్తకం. ఇందులో ముప్పై కథలు ఉన్నాయి. 120 పేజీల్లో ముప్పై కథలు ఉండటం చూసి ముందు కొంచెం విచిత్రంగా అనిపించింది. ఒక్కో కథ మూడు, నాలుగు పేజీలకు మించదు. కొన్ని రెండు పేజీల్లోనే ఉన్నాయి. అయితే చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పే ఆ ఒడుపు మాత్రం ప్రతి కథలోనూ కనిపిస్తుంది. మదనపల్లిలో తాను పుట్టి పెరిగిన దళిత వాడల జీవితాల్ని, వారి కష్టసుఖాలను కథల రూపంలో ఇందులో అక్షరీకరించారు. ఈ కథలన్నీ వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

ఈ కథా సంపుటిలోని కథల్లో నాకు బాగా నచ్చిన కథ ‘సావు బియ్యం’. అసలా పేరే పు‌స్తకానికి పెట్టి ఉంటే బాగుండేది అనిపించేంత అద్భుతమైన కథ. ఇంట్లో తినడానికి తిండి లేక ఓ కుటుంబం అల్లాడుతున్న సమయంలో ఊళ్లో రెడ్ల మనిషి ఒకాయన చనిపోతాడు. ఆ చావు కార్యక్రమం దగ్గర బియ్యం పంచుతున్నారని తెలిసి ఓ పాప అక్కడికి వెళ్లి బియ్యం తెచ్చి ఇంట్లో వారికి వండి పెడుతుంది. అయితే సావుబియ్యం తింటే చచ్చిపోతారని తండ్రి చెప్పిన మాట విని భయపడతుంది. తప్పు చేశానని దిగులు పడ్తుంది. సావు బియ్యం, బతుకు బియ్యం అంటూ ఉండవని, కాలే కడుపును చల్లార్చే ఏ బియ్యమైనా ఒకటేనని తెలుసుకుని ఊరట చెందుతుంది. ఆకలి కష్టాన్ని, ఆచారాల రీతికి ముడిపెడుతూ చెప్పిన ఈ కథ చదువుతుంటే అద్భుతంగా అనిపిస్తుంది.

చెప్పుకోవాల్సిన మరో విశేషమైన కథ ‘సచ్చి సాదించడం’. మొదటి భర్తతో విడిపోయి రెండో పెళ్లి చేసుకున్న భార్య ఆ మొదటి మొగుడు చస్తే వైధవ్యం అనుభవించాల్సిన పరిస్థితి ఇప్పటికీ కొన్ని చోట్ల ఉందని ఈ కథ చదివాకే తెలిసింది. నిండుగా బొట్టు పెట్టుకుని, తల్లో పూలతో కళకళలాడే అత్త మామ బతికుండగానే వితంతువుగా మారడం గురించి కోడలి చెప్పిన కథ వింటుంటే అయ్యో అనిపిస్తుంది. కొందరు చచ్చి కూడా ఇతరుల్ని సాధించే తీరు ఇలాంటిదా అనిపిస్తుంది.

‘ఇత్తలిబింది’ కథ స్త్రీ శ్రమను పురుషుడు దోచుకునే పద్ధతికి నిదర్శనం. ‘దప్పి’ కథ అటు కులవివక్షనూ, ఇటు తల్లి మనసునూ ఏకకాలంలో పట్టి చూపిస్తుంది. ‘మాయన్న సదువు’ కథ దళితుల ఆహారపు అలవాట్ల మీద ఇతరులకు ఉండే ఏహ్యభావాన్ని చూపిస్తుంది. ‘తాగుబోతు’ భార్యాభర్తలిద్దరూ మద్యానికి అలవాటైన తీరుని చూపుతుంది. దళితులైన కారణం చేత తప్పు మోయాల్సిన దురవస్థ గురించి చెప్పేది ‘తడిక తోసింది ఎవరు?’.

కథలన్నీ మదనపల్లి మాండలికంలో సాగుతాయి. వారు వాడే మాటల్ని బూతులతో సహా కథల్లోకి తెచ్చి ఆ జీవన వైవిధ్యాన్ని పాఠకుల ముందు పెట్టారు భారతి. మునాలు(వరసలు), తెల(కంచం), ఉరువులు(సామాన్లు), నెత్తినూక(తలంబ్రాలు), మంటిమరుగు(పూడ్చి పెట్టడం).. వంటి మాండలిక పదాలు కథల్లో కనిపిస్తూ భాష సౌందర్యాన్ని మనకు పరిచయం చేస్తాయి. సందర్భానికి తగ్గ అనేక సామెతలనూ ఈ కథల్లో వాడారు. బి‌.కిరణ్‌ కుమారి వేసిన బొమ్మలు కథల ఆత్మను పట్టి చూపించాయి. అందరూ తప్పక చదవాల్సిన కథలివి.

పుస్తకం: ఎదారి బతుకులు (కథలు)

వెల: 100/-

ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ప్లాట్ నం.85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్ – 500006.

www.hyderabadbooktrust.blogspot.com

You Might Also Like

2 Comments

  1. ఎదారి బతుకులు | నా ప్రస్థానం

    […] గురించి మరిన్ని వివరాలు పుస్తకంలో ఇక్కడ ఈమాటలో ఇక్కడ […]

  2. ఎం.ఎస్.బి.పి.ఎన్.వి. రమా సుందరి

    ఎంత బాగుందో ఈ కథా పరిచయం. చాలా సూటిగా, సంక్షిప్తంగా ఉంది. వీరి కథలు చదివి వీరిని కలవాలని ఉంది. విశీ గారికి అభినందనలు.

Leave a Reply