‘మనసు’ లోపలి మాట (శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సర్వలభ్య సంకలనం ఎలా తయారైందంటే..)

రచన: మనసు ఫౌండేషన్ బృందం
టైప్ చేసి పంపినవారు: సూరంపూడి పవన్ సంతోష్.

మనసు ఫౌండేషన్ 6000 పుటలకు పైబడిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సర్వలభ్య రచనల సంకలనం నాలుగు సంపుటాల బాక్స్ సెట్‌గా ప్రచురించారు. ఈ సంకలనంపై అనేక సంవత్సరాల పాటు కృషి జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఆ సంకలనాల్లో వేసి “మనసు లోపలి మాట” అన్న వ్యాసంలో వివరించారు. మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మన్నం వెంకటరాయుడు గారి అనుమతి తీసుకుని, రచనా సంకలనాల వెనుక జరిగే కృషినీ, ఆర్కైవింగ్ ప్రాముఖ్యతనీ, ఇటువంటి మరెన్నో విలువైన అంశాలను పరోక్షంగా వివరిస్తున్న ఈ వ్యాసం తోటి పుస్తక ప్రేమికులకు అందించాలన్న సంకల్పంతో పుస్తకం.నెట్‌లో ప్రచురిస్తున్నాము.
– సూరంపూడి పవన్ సంతోష్‌.


మా ‘మనసు ఫౌండేషన్’ ప్రచురణల కార్యక్రమంలో ఇప్పుడు మీ చేతిలో ఉన్న శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సర్వలభ్య రచనల సంకలనం చాలా విధాలుగా ప్రత్యేకమైనది. ఇంతవరకూ మేం రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, శ్రీశ్రీ, బీనాదేవి, గురజాడ, పతంజలి, జాషువా రచనా సర్వస్వాలు ప్రచురించాం. తిలక్ సర్వస్వ ప్రచురణకి సేకరణలో సహకరించాం. వాటి అన్నింటిలోనూ పరిమాణంలో పెద్దది శ్రీశ్రీ సర్వస్వం. సినిమా పాటలను కూడా చేర్చడం వల్ల ఇంచుమించు 2000 పుటలు అయ్యాయి. శ్రీపాద సర్వస్వం 6000 పుటలు దాటింది. పరిమాణంలోనే కాక, సేకరణలో, ప్రూఫ్‌ రీడింగ్‌లో, కూర్పులో ఈ గ్రంథం మా మనసు బృందానికి ఒక సవాలు.


ఈ సందర్భంగా-
మా మనసు ఫౌండేషన్ పుట్టుక, ప్రయాణం, పరిణామం, ప్రస్తుత స్థితి చెప్పుకోవాలనుకుంటున్నాం.

  1. కాళీపట్నం రామారావు రచనల సర్వస్వం 1998లో ప్రచురించాం. దానితో మాబృందం ప్రయాణం ఆరంభమయింది. ఆనాటికి మనసు ఫౌండేషన్ ఆలోచన లేదు. రాచకొండ రచనా సాగరంనాటికి ‘మనసు ఫౌండేషన్’ ఏర్పడింది. పుస్తక ప్రచురణ కార్యక్రమం ఆరంభమయింది.
  2. రచనా సర్వస్వాల ప్రచురణ అంటే రచయితల రచనలన్నీ వారు రాసిన / అచ్చైన తేదీల ప్రకారం ఎటువంటి మార్పులూ, తొలగింపులూ, ఎంపిక లేకుండా కూర్చడంగా మేం అనకున్నాం. ఆ రచన ప్రచురించిన తొలి పత్రిక, అందుకున్న పురస్కారాలు, చేర్చిన సంపుటాలు, సంకలనాలు, ఇతర లభ్య సమాచారం రచనలతోబాటు ఇవ్వాలనుకున్నాం.
  3. సమాజంలో, వ్యక్తిలో పరిణామం సహజం. రచయిత కలం పట్టినరోజు నుంచి చివరి వరకూ ఒకే అవగాహనతో రాయరు. ఒకే సామర్థ్యంతోనూ రాయరు. వారిని ప్రసిద్ధుతలను చేసిన రచనలలోని అవగాహనకు భిన్నమైన అవగాహనతో వారు ఆదిలో రాసే అవకాశమూ ఉంది. తన అవగాహనలో మార్పులతో తరవాతా రాసే అవకాశం ఉంది. ఆ మార్పులకు బాహిర (సామాజిక) కారణాలూ ఉండవచ్చు. అంతర్గత కారణాలూ ఉండవచ్చు. రచయిత పరిణామాలను, తద్వారా సమాజ గమనాన్నీ అధ్యయనం చెయ్యదలచుకున్న వారిని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని ఈ సర్వస్వాలను కూర్చాం. రచయిత సాహితీ, సామాజిక ప్రస్థానాలలో ప్రధాన దశలు గుర్తించి, కాల విభజన చేసి, ప్రక్రియాపరమైన విభజన చేయకుండా రచనలను కూర్పు చేసాం. ఆయా దశలలో రచయిత జీవిత నేపథ్యాన్నీ, ఆనాటి సామాజిక ప్రధాన ఘటనలనూ అందించటానికి ప్రయత్నించాం. కారా, రావిశాస్త్రి పుస్తకాల నాటికి ఇదీ మా అవగాహన.
  4. రచనాసాగరం చదువుకోవడానికి అనుకూలంగా లేదన్న అభిప్రాయం వచ్చింది. దాంతో శ్రీశ్రీ సర్వస్వం ప్రక్రియాపరంగా విభజించి ఆయాప్రక్రియలలోని రచనలను కాలక్రమం పాటించుతూ మూడు భాగాలుగా విభజించి ప్రచురించాం.
  5. రచనల సేకరణ అన్నింటికన్నా కష్టసాధ్యమైన పని. రచనల జాబితా అంటూ ఒకటి ముందుగా తయారుచెయ్యాలి. దానికి వారిపై జరిగిన పరిశోధన పత్రాలు, ఆత్మకథలు, డైరీలు కొంత వరకు ఆధారాలు. గ్రంథరూపంలో లభించే రచనలు కొంతవరకూ గ్రంథాలయాలలో లభ్యమవుతాయి. ఆయా గ్రంథాలయాలలోని గ్రంథసూచికలు కొంత సమాచారం ఇస్తాయి. కథా నిలయం గత పదహారు సంవత్సరాలుగా తయారుచేస్తున్న రచనల పట్టికలో పత్రికలలోని కథలనే కాకుండా, సుప్రసిద్ధ రచయితల అన్ని ప్రక్రియలలోని రచనలనూ చేరుస్తున్నది. కొందరు సాహితీ అభిమానులు కొందరు రచయితల రచనలన్నీ భద్రపరుస్తున్నారు. ఇటీవల పెరిగిన సాంకేతికతతో ప్రభుత్వ విభాగాలు, కొన్ని ప్రైవేటు సంస్థలూ ప్రసిద్ధ గ్రంథాలయాలలోని గ్రంథాలను డిజిటైజ్ చేయడం ఆరంభించాయి. వాటినన్నింటినీ ఒక క్రమంలో ఉంచే పనిని మా మనసు బృందం స్వీకరించింది. వీటన్నింటితో మా సేకరణ సాగుతోంది. ఈ క్రమంలో మాకు అనేక అమూల్య స్నేహాలూ, సహకారాలూ లభించాయి. అయినా ఎంత కాలం ఈ సేకరణ సాగాలి? ఎంత కాలం వరకూ గ్రంథ ప్రచురణ ఆపాలి? ఇది చిక్కు ప్రశ్న. మేం ప్రచురించిన రచయితలందరి రచనలూ గ్రంథం వెలువడిన తరవాత కూడా కొన్ని లభ్యమయ్యాయి. అందువల్లనే వీటిని సర్వలభ్య సంకలనం అంటున్నాం.
  6. 18, 19 శతాబ్దాలలో మనదేశంలోనూ, సమాజంలోనూ వచ్చిన పరిణామాలు వర్తమాన పరిస్థితులకి మౌలిక కారణం అన్న అవగాహన మాది. తెలుగు సమాజపు పరిస్థితులను ఎంతో కొంతైనా చెప్పే ఇతర భాషాగ్రంథాలను అనువదించి అందించాలన్న మా ‘మనసు’ పుస్తక ప్రచురణ కార్యక్రమంలో భాగంగా చెప్పులు కుడుతూ… కుడుతూ…, సర్ ఆర్థర్ కాటన జీవితచరిత్ర గ్రంథాలను ప్రచురించాం.

2.శ్రీపాద సర్వస్వానికి సేకరణలో ఉన్న ప్రత్యేక ఇబ్బంది ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన శ్రీపాద కావటమూ, ఆయన జీవించినది తెలుగు సమాజం కావటమూనూ.
1891 ఏప్రిల్ 23న శ్రీపాద జన్మించారు. 1909 నుంచి చనిపోయేవరకు నిరంతరాయంగా రాసారు. పద్యకవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం, ఆత్మకథ, సంపాదకీయం, పాఠ్యగ్రంథం వంటి అనేక ప్రక్రియలలో కృషి చేసారు.
శ్రీపాద లాగే కందుకూరి, విశ్వనాథ, శ్రీశ్రీ, కొడవటిగంటి, చలం, గోపీచంద్, రావిశాస్త్రి వంటివారు జీవితమంతా నిరంతరాయంగా రాసారు. వీరందరూ అనేక ప్రక్రియలలో కృషిచేసారు. సామాజిక గమనంలో పాల్గొని ఉద్యమాల కోసం కూడా రాసారు. ఎవరి రచనా లక్ష్యాలు, ప్రేరణా వారివి. ఎవరి ప్రతిభ, కౌశల్యం వారిది. వీరందరిలోనూ సాధారణమైన లక్షణం తమ రచనలను భద్రపరచటంలో చూపిన అశ్రద్ధ. కొందరు భద్రపరిచినా వారి సంతానం, వారసులు వాటిపట్ల చూపిన అశ్రద్ధ.
కాకపోతే-

కందుకూరి వంటివారు స్థాపించిన సంస్థలూ, తెలుగునాట బలంగా పనిచేసిన అభ్యుదయ ఉద్యమాలూ, శ్రీశ్రీ, రావిశాస్త్రి వంటివారి అభిమానుల కారణంగా వారి రచనలు పదేపదే ముద్రణలు జరిగి, చర్చకు నోచుకొని- ఎక్కువభాగం సులువుగా సేకరించగలుగుతున్నాం. శ్రీపాద రచనల రాశి, వాసి ఎంతటివో సేకరణ జరుగుతున్న సమయంలో మాకు అవగతమయింది.

తెలుగు సమాజంలో రచయితల రచనలు అమ్ముడు పోకపోవటం గురజాడ మొదలుకొని ఈనాటి వారి వరకూ మాటలాడిన అంశమే. దీనివల్ల చాలామంది తమ ఉత్సాహంతోనో, ఆదర్శంతోనో ప్రేరేపితులై రాసారు. భుక్తి, విలాసాలు ఆశించి అమ్మకాలు ప్రేరణగా రాసే అవకాశం లేదు. శ్రీపాద భావించినట్టు సాహిత్యాన్ని, తమ సమాజపు సభ్యతా సంస్కారాలకూ, ఘనతకూ చిహ్నంగా భావించే లక్షణం కూడా తెలుగు సమాజానికి లేదు. గ్రంథ ప్రేమికులో గ్రంథకర్తలో చేతులు కాల్చుకుంటే తప్ప సాహిత్యం గ్రంథరూపం ధరించటం కష్టం. అటువంటి తెలుగు సమాజంలో ఒక రచయిత రచనలన్నీ సేకరించటమనేది కత్తిమీద సామే.


శ్రీపాదకు సంబంధించి రచనల జాబితాకి ప్రధాన ఆధారం చామర్తి కనకయ్య పరిశోధన సిద్ధాంత గ్రంథం. పాత పత్రికలలోని పుస్తక ప్రకటనలు, ఆత్మకథలో ప్రస్తావింపబడిన వివరాలు, కథానిలయం డేటాబేస్ కూడా మాకు సహకరించాయి. పరిశోధన విద్యార్థులు తాము అధ్యయనం చేసిన రచయిత రచనలన్నీ తమవద్ద భద్రపరిచే బాధ్యత వహించితే భవిష్యత్తులో ఇలాంటి సేకరణలకు ఉపయోగపడుతుంది. ఈ జాబితాయే సమగ్రం కాదు. ఇందులో తొంభై శాతం సేకరించ గలిగామని మా మనసు అంచనా. అనేక పాత పత్రికలు లభించలేదు. శ్రీపాద ప్రబుద్దాంధ్ర సంచికలు చాలా వరకు లభించలేదు. ఆయన పత్రికలో సంస్కృత విభాగంలో కూడా రాసినట్టు ‘అనుభవాలూ, జ్ఞాపకాలూనూ’ గ్రంథం ద్వారా తెలుస్తుంది. పొద్దుటూరు నుంచి బిఎన్ స్వామి సంపాదకత్వంలో ఒక ముస్లిం నడిపిన ‘ఆంధ్రచంద్రిక’ పత్రికలో 1915లో ‘ఇది ఇప్పుడావశ్యకం’ అన్న శీర్షిక నిర్వహించానని రాసుకున్నారు. ఆ పత్రిక లభించలేదు.
శ్రీపాద చాలా కథలను మొదట ప్రచురించిన తరవాత సవరణలతో పుస్తకరూపంలో ప్రచురించారు. అలాంటివాటిలో మాకు దొరికినటువంటి రచనల్లో కొన్ని జీర్ణావస్థలో వుండడంవల్ల కొన్ని అక్షరాలు స్పష్టంగా లేవు. కొన్ని అసలే లేవు. అలాంటి చోట “xx” వుంచాము. కొన్ని కథల మొదటి, ఆఖరు ముద్రణలను ఇందులో చేర్చాము.

3.2015 ఏప్రిల్ 23న శ్రీపాద 125వ పుట్టినరోజు సందర్భంగా ఈ సర్వస్వాన్ని తీసుకురావాలని మా ‘మనసు ఫౌండేషన్’ సంకల్పం. ఆవిష్కరణ జరిగింది. అప్పటికి గ్రంథం తయారయింది. కాని ఇంకా కొన్ని రచనలు దొరికే అవకాశం ఉంటంతో ముద్రణ ఆపాం. ఇది చాలా ఆలస్యానికి దారి తీసింది. ఒక సంస్థగా మేం తెలుగు సాహితీ సమాజపు చీవాట్లకు అర్హులమే. కాని దానివల్ల దాదాపు మరో 2200 పేజీల రచనలు సేకరించగలగటం మాకు సంతోషకారకం. ఇది పాఠకులకీ ఆనందదాయకమే అని భావిస్తున్నాం.


ఈ సేకరణలో సహకరించిన వ్యక్తులకు, ప్రభుత్వ విభాగాలకు, యితర సంస్థలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
యు.ఎ.నరసింహమూర్తి అస్వస్థతని సైతం లెక్కచేయకుండా ఈ గ్రంథ ఆవిష్కరణకి వచ్చారు. మమ్మల్ని ప్రోత్సహించారు. వీరు పేరుమోసిన విమర్శకులు, పండితులు. కన్యాశుల్కం నాటకానికి ఆనాటికి వచ్చిన ప్రపంచ ప్రసిద్ధ నాటకాలకీ వారు చేసిన తులనాత్మక అధ్యయనం ‘కన్యాశుల్కం-19వ శతాబ్ది ఆధునిక నాటకం – తులనాత్మక అధ్యయనం’ అనే గ్రంథం ఎందరో విమర్శకుల, రసికుల మన్ననలను పొందింది. గురజాడ అప్పారావు, చాగంటి సోమయాజులు, శ్రీరంగం నారాయణబాబుల గురించి వీరు చేసిన అధ్యయనం సాధికారికమైనదని పలువురి ప్రశంసలు పొందింది. అమృతవర్షిణి, దర్పణ, నేటి తెలుగు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీరంగం నారాయణబాబుల కవితావైశిష్ట్యం, విశ్వనాథ సౌందర్య దర్శనము, శబ్దవిరించి శ్రీశ్రీ వంటి గ్రంథాలు ఆయన పాండిత్యానికీ, సూక్ష్మ పరిశీలనకీ తార్కాణాలు. మిసిమి మాసపత్రికలో వెలువడి ప్రశంసలు పొందిన నోబెల్ సాహిత్య పురస్కారోపన్యాసాలు గ్రంథరూపంలో వెలువడింది. అటువంటి విశిష్టవ్యక్తి శ్రీపాద పుస్తకావిష్కరణకి రావటం ఎంత ఆనందకరమో, మరి రెండు రోజులకే కాలం చెయ్యటం అంతకన్నా బాధాకరం. ఏమైనా శ్రీపాద రచనాసర్వస్వం ఆవిష్కరణ సభలో వీరు పాల్గొనటం ‘మనసు’ మరువలేని జ్ఞాపకం.

ఈ గ్రంథ సంపాదకులు,
రచనలు సంపాదించడంలో మాకు సహకరించిన – కుర్రా జితేంద్రబాబు, ఎ.పి.స్టేట్ ఆర్చీవ్స్, కాళిదాసు పురుషోత్తం (నెల్లూరు), లంకా సూర్యనారాయణ (గుంటూరు, టీవీ9 టీమ్)
మొదటి నుంచి మాకు పూర్తి సహకారం అందజేసిన – వై. గోపాలకృష్ణ, వై.ఆర్. వాచస్పతి, పి. రాజేశ్వరరావు (హైదరాబాద్)
కవర్ డిజైన్ చేసినటువంటి – చిదంబరం (హైదరాబాద్)
చాలా శ్రమకోర్చి డిటిపి చేసిన – శ్రీనివాస్ (అమలాపురం)
ప్రూఫ్‌ రీడింగ్‌లో మాకు సహకరించిన – మిత్రులు,
పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సహకరించిన – కడియాల రామ్మోహనరాయ్ (గుంటూరు), అనిల్ బత్తుల, బాలాజీ కె., టైటానిక్ సురేష్‌, కాకుమాను ప్రతీక్ (హైదరాబాద్)
మొదటి నుంచి మా ప్రచురణలన్నిటికి ముద్రణలో అన్నిరకాలుగా సహకరించిన కళాజ్యోతి ప్రాసెస్, ఆలపాటి బాపన్న (హైదరాబాద్)
పుస్తకావిష్కరణ సభను నిర్వహించిన – కాళీపట్నం రామారావు, కేతు విశ్వనాథరెడ్డి, పోరంకి దక్షిణామూర్తి, వోల్గా, మృణాళిని,
వీరే కాక ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందించిన వారందరికీ మా కృతజ్ఞతలు.

You Might Also Like

Leave a Reply