పొన్నియిన్ సెల్వన్

వ్యాసకర్త: చంద్రమోహన్

పొన్నియిన్ సెల్వన్‘ అన్న చారిత్రిక నవలను ఆర్. కృష్ణమూర్తి అన్న ప్రసిద్ధ రచయిత వ్రాసారు. ఆయన కలంపేరు ‘కల్కి’. ఆయన పేరును కల్కి కృష్ణమూర్తి అని చెబితేగానీ జనులు గుర్తుపట్టలేనంతగా ప్రాచుర్యం చెందింది. కల్కి అన్న ఒక వారపత్రికను కూడా ఆయన స్థాపించారు. అది నేటికీ నడుస్తున్నది. ఆయన నవలలు ఆ వారపత్రికలోనే ధారావాహికంగా వచ్చేవి. ఆయన నవలలకు ఎంత డిమాండ్ ఉండేదంటే కేవలం ఆ సీరియల్ గురించి కల్కి వార పత్రిక 1950లలోనే  70వేల కాపీలకు పైగా అమ్ముడు పోయేవి. దేశంలోనే అప్పట్లో అది ఒక రికార్డు.

ఆయన వ్రాసిన చారిత్రిక నవలల్లో ముఖ్యమైనవి మూడు (కథా కాలానుక్రమంగా): ‘శివగామియిన్ సపదం‘ (శివగామి శపథం), ‘పార్తిపన్ కనవు‘ (పార్థిపుని కల), ‘పొన్నియిన్ సెల్వన్‘ (పొన్ని[కావేరి] యొక్క వరపుత్రుడు). తమిళ రాజవంశాల గురించి, వారి వీర గాథల గురించి వర్ణించిన నవలలవి. చరిత్రలో దొరికిన ఆధారాలు, జానపదుల పాటల్లోని కథలు, గాథలు, బోలెడన్ని కల్పనలు కలగలిసిపోయిన చారిత్రిక కల్పనా సాహిత్యమది. ముఖ్య పాత్రలన్నీ చారిత్రిక వ్యక్తులే అయినా చరిత్రలో కనిపించని ఎన్నో కథా పాత్రలు కూడా ఆ నవలల్లో కనిపిస్తాయి. స్వాతంత్ర పోరాట సమయంలోనూ, స్వతంత్రం వచ్చిన క్రొత్తలోనూ కల్కి రచనలు తమిళ ప్రజల్లో గొప్ప జాతీయ భావనను, పోరాట స్ఫూర్తిని నింపాయి. కల్కి కృష్ణమూర్తి స్వయంగా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు కూడా.

చాళుక్య రాజైన రెండవ పులకేశి పల్లవుల రాజధానియైన కాంచీపురంపై దండెత్తి పల్లవరాజు నరసింహ వర్మ యొక్క ప్రేయసి శివగామిని చెరబట్టి తీసుకు పోవడం, నరసింహ వర్మ తనను అవమానించిన చాళుక్యులను జయించి, వారి రాజధానియైన బాదామిని అగ్నికి ఆహుతి చేస్తే కాని తాను తిరిగి కంచికి వెళ్ళనని శివగామి శపథం చేయడం, అన్నట్లే నరసింహ వర్మ రెండవ పులకేశిని ఓడించి, బాదామి నగరాన్ని అగ్నికి ఆహుతి చేసి, తన ప్రియురాలిని కంచికి తీసుకొని వెళ్ళడం మొదటి నవల యొక్క ముఖ్య కథ.

చోళరాజైన పార్థిపుడు పల్లవుల సామంత రాజుగా ఉండేవాడు. గొప్ప చరిత్ర గల చోళ రాజ వంశానికి మళ్ళీ మంచి రోజులు రావాలని, పల్లవుల సామంత రాజ్యంగా కాక చోళ రాజ్యం ఒక మహా సామ్రాజ్యంగా రూపొందాలనీ కలలు కనేవాడు. తన కుమారుడైన విక్రమునికి ఎప్పుడూ ఈ విషయమే చెబుతుండేవాడు. కొంత కాలానికి పార్థిపుడు పల్లవులకు కప్పం కట్టడానికి నిరాకరించడం, పల్లవ రాజైన నరసింహ వర్మ చోళ రాజ్యంపై దండెత్తడం, ఆ యుద్ధంలో పార్థిపుడు ఓడిపోయి చావుదగ్గర పడినప్పుడు ఒక సాధువు అతని దగ్గరకు వచ్చి అతను కన్న కలను అతని పుత్రుడు నిజం చేస్తాడని చెబితే విని అతను యుద్ధరంగంలో నిశ్చింతగా మరణించడం, అనేక మలుపుల తరువాత అతని పుత్రుడైన విక్రముడు నరసింహ వర్మ కుమార్తె కుందవిని వివాహం చేసుకొని, మామగారి సహాయంతో ఉరైయూరు రాజధానిగా స్వతంత్ర చోళ రాజ్యాన్ని నెలకొల్పి తన తండ్రి పార్థిపుడు కన్న కలను పాక్షికంగా నిజంచేయడం రెండవ నవల ఇతివృత్తం. పార్థిపునికి మరణ సమయంలో కనిపించిన సాధువు నరసింహ వర్మనే అన్నది కల్పనే అయినా నవలలో ఒక ముఖ్యమైన మలుపు.

శత్రు భయంకరమైన మహా చోళ సామ్రాజ్యం అన్న పార్థిపుని కల తండ్రినుండి కొడుకుకు సంక్రమించింది. ఆ కల మరో మూడువందల సంవత్సరాల తరువాత రాజరాజ చోళుడు, అతని కుమారుడైన రాజేంద్ర చోళుల ద్వారా నెరవేరిందన్న ప్రస్తావనతో ఆ నవల ముగుస్తుంది. దానికి కొనసాగింపే ‘పొన్నియిన్ సెల్వన్’ నవల. దాదాపు రెండువేల పేజీలకు పైగా ఉన్న మహా నవలా రాజం అది. పుదువెళ్ళమ్  (క్రొత్త వరద), సుళర్కాట్రు  (సుడిగాలి ), కొలై వాళ్ (మృత్యు ఖడ్గం), మణి మకుడమ్ (మణి మకుటం), త్యాగ సిగరమ్ (త్యాగ శిఖరం) అన్న పేర్లతో ఐదు సంపుటాలుగా వచ్చింది. అనేక పాత్రలు, పల్లవ, పాండ్య, చోళ రాజ వంశాల వ్యక్తులు, వారి సంబంధాలు, శత్రుత్వాలు కలగలిసిన అద్భుతమైన చారిత్రిక నవల. ముఖ్యంగా తరువాతి కాలంలో చోళ సామ్రాజ్యాన్ని నలుదెసలా వ్యాపింపజేసి రాజరాజ చోళుడుగా కీర్తింపబడిన అరుళ్ మొళి వర్మ, అతనికి చేదోడుగా నిలిచి ఆప్త మిత్రుడైన వండియదేవన్ ల చుట్టూ తిరిగిన కథ. అన్ని విభిన్న పాత్రలతో ఎక్కడా విసుగనిపించకుండా, కథా గమనంలో బిగువు సడలకుండా అంత పెద్ద కథను కల్కి నడిపించిన తీరు అసామాన్యం. తమిళ నవలా రచయితలకు పాఠ్య గ్రంథం లాంటిది ‘పొన్నియిన్ సెల్వన్’.

రెండువేలకు పైగా పుటలున్న నవల కథను క్లుప్తంగా చెప్పడం కష్టమే. ఐనా ఇతివృత్తం టూకీగా ఇదీ: చోళ రాజ వంశం బలపడుతున్న కాలం (సుమారుగా పదవ శతాబ్దం తొలిరోజులు). పాండ్య రాజ్యాన్ని చోళులు తమ అధీనంలోకి తెచ్చుకొన్నారు. పాండ్యవంశాకురమైన ఒక పిల్లవాడిని పాండ్య రాజు అనుయాయులు రహస్యంగా పెంచుతుంటారు. ఈ బృహత్కథను అర్థం చేసుకోవడానికి చోళ రాజుల వంశవృక్షాన్ని అవగతం చేసుకోవడం తప్పనిసరి.

https://qphs.fs.quoracdn.net/main-qimg-8c509340a20ddb2d56bfe87d8112c5cf

ఒకటవ పరాంతక చోళునికి ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడైన రాజాదిత్యుడు యుద్ధంలో మరణించడం వలన రెండవ కుమారుడైన గండరాదిత్యుడు రాజైనాడు. అతనికి మలివయస్సులో పుట్టిన కుమారుడు మధురాంతక ఉత్తమ చోళుడు. గండరాదిత్యుని అనంతరం అతని కుమారుడు పసివాడు కనుక అతని సోదరుడైన ఆరింజయ చోళుడు రాజ్యాధికారాన్ని చేపట్టాడు. అతని మరణానంతరం అతని కుమారుడైన రెండవ పరాంతక చోళుడు (ఇతనికే సుందర చోళుడన్న పేరు కూడా ఉంది) సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతనికి ఆదిత్య కరికాలుడు, అరుళ్ మొళి వర్మ అనే కుమారులు, కుందవి అనే కుమార్తె ఉన్నారు.

మన కథా కాలానికి ఈ సుందర చోళుడు వృద్ధుడై మంచం పట్టినాడు. వృద్ధ రాజును, అతని ఇద్దరు కుమారులను చంపి, అమాయకుడైన అతని చిన్న సోదరుని రాజును చేస్తే అతన్ని బొమ్మని చేసి ఆడిస్తూ, చోళ వంశాన్ని నశింపజేసి మళ్ళీ పాండ్య రాజ్యాన్ని పునరుద్ధరించాలని ఒక వర్గం కుట్రలు చేస్తుంటారు. ఈ కుట్రలను ఆదిత్య కరికాలన్ యొక్క ఆప్త అంగరక్షకుడైన వల్లవరాయన్ వండియదేవన్ గ్రహిస్తాడు. ఈ వండియదేవన్ నుండే నవల ప్రారంభమౌతుంది. నవలలోని అనేక ముఖ్య పాత్రలు వండియదేవన్ ద్వారానే మనకు పరిచయమౌతాయి.

యువరాజు రెండవ ఆదిత్య కరికాలన్ శత్రువుల కుట్రల ఫలితంగా మరణిస్తాడు. చిన్నవాడైన అరుళ్ మొళి వర్మ శ్రీలంకలో యుద్ధంలో మునిగి ఉంటాడు. వండియదేవన్ శ్రీలంకకు వెళ్లి యువరాజుకు ఇక్కడి విషయాలను వివరిస్తాడు. రానున్న ప్రమాదాన్ని పసి గట్టిన సుందర చోళుడు తన రెండవ కుమారుని రాజుగా ప్రకటిస్తాడు. ప్రజలందరూ ఆ నిర్ణయాన్ని హర్షిస్తారు. అయితే అరుళ్ మొళి వర్మ తన చిన్నాన్న వరుసయ్యే ఉత్తమ చోళుడిదే రాజ్యాధికారం అని, అదే న్యాయం అని చెప్పి తన రాజ్యాధికారాన్ని త్యాగం చేసి ఉత్తమ చోళుణ్ణి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు.

మొదట నవల అక్కడితో ముగించినా, రాజరాజ చోళుడు రాజు కాకపోవడం సహించని పాఠకులు గొడవ చేయడం వలన రచయిత ఒక ఎపిలాగ్ వంటిది వ్రాసి తరువాతి కాలంలో జరిగిన సంఘటనల వలన ఉత్తమ చోళుని అనంతరం రాజరాజ చోళుడు రాజుగా సింహాసనాన్ని అధిరోహించడం వరకు వ్రాయవలసి వచ్చింది.

ఇదీ క్లుప్తంగా కథ. దీనిని చదివి ఆనందించ వలసిందే కానీ చెప్పడం కుదరని పని. ఈ నవలకు కనీసం నాలుగైదు మంచి ఆంగ్లానువాదాలు ఉన్నాయి. నా ఎఱుకలో పవిత్రా శ్రీనివాసన్ అనువాదం ఉత్తమమైనది. సి. వి. కార్తిక్ నారాయణన్ అనువాదం కూడా బాగానే ఉంటుంది. 

You Might Also Like

5 Comments

  1. Vatsalya

    పొన్నియిన్ సెల్వన్ నవల 5 భాగాలూ దొరుకుతున్నాయండీ.నేను తెలుగుబుక్స్ డాట్ ఇన్ నుండి ఆర్డర్ చేసాను.దాసుభాషితం యాప్‌లో మొదట నేను చదివాను.ఆ యాప్ ఇప్పుడు సాంకేతిక కారణాలవల్ల క్రొత్త సభ్యులని అనుమతించట్లేదనుకుంటా!

    1. Ramgopal

      89/- chupistundi chadavtanki..free kadu

    2. Shivaraj

      Please give me the link to order the book

    3. gururaja

      I want in Telugu a book for reading on Chola, Pallava and Pandya Kings. Please advise which book I should buy. thank you. gururaja, Bengaluru

  2. kiran kumar suggala

    nice narration.
    is there any telugu translation available to this novel series?

Leave a Reply