‘ఎక్ల చొలో …’
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
రహదారులు యిప్పుడు యెంతమాత్రం నాగరికతకు ప్రతీకలు కావు. నెత్తుటి పాదముద్రలతో అమానవీయతకి ప్రతిరూపాలయ్యాయి. చెమటోడ్చి నిర్మించుకున్న దారుల్లో నియంతలు కంచెలు పాతుతున్నారు. కట్టుకున్న వారధులు కూలిపోతున్నాయి. దారిదీపాలు యెందుకో కొడిగడుతున్నాయి. కొత్తదారి పరిచే మార్గదర్శకులు కరువయ్యారు. పక్కదారి పట్టించడానికి పక్కా పథకాలు తయారుగా వున్నాయి. నిస్తేజమైన చీకటి దారుల్లో క్రూరమృగాలు దాడిచేయడానికి మాటువేసి వున్నాయి. గమ్యాలు వెక్కిరిస్తున్నాయి. గమనాలు తొట్రుపడున్నాయి. కాళ్ళకు కనపడని బంధాలేవో కట్టిపడేసి ముందుకుపోనివ్వవు. అడుగులు బరువవుతున్నాయి. పోట్రవుతు దెబ్బలకి బొటనవేళ్ళు నుజ్జవుతున్నాయి. వొకవైపు నమ్ముకొన్న జనపదాలు బహుపథాలవుతున్నాయి; మరోవైపు పిల్లబాటలు మూసుకుపోతున్నాయి. భిన్నమార్గాలు గందరగోళ పరుస్తున్నాయి. మహాపథగాములు దిగ్భ్రాంతికి గురై వున్నారు. నడుస్తోన్న దారులు చిక్కుపడుతోన్నాయి. నడిచేకొద్దీ సంక్లిష్టమౌతోన్నాయి.
దారెక్కడ సోనియా ?!
***
ఈ పరిస్థితుల్లో తొవ్వ ముచ్చట్లు అయిదోభాగం మన ముందుకు వస్తోంది. యివి తిరుమలరావు గారు సాహిత్య సాంస్కృతిక సామాజిక క్షేత్రంలో వేస్తున్న మరికొన్ని పాదముద్రలు. ఆశ నిరాశల మధ్య చేసిన ‘సంచారం’లో తీసుకొన్న దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసలు. పాలకుల నూత్న రాజకీయ నిర్ణయాలపై పెట్టిన విమర్శనాత్మక విశ్లేషణలు. బాధాశప్తుల ఆక్రందనల ప్రతిధ్వనులు. అనేకమైన సలపరింతల నుంచి పుట్టిన పీడితుల మూల్గులకు అక్షర ప్రతిరూపాలు. ప్రజాస్వామిక ఆలోచనలకు పట్టుగొమ్మలు.
ఈ ముచ్చట్లు చెప్పింది దాదాపు అయిదేళ్ళ వెనక. కొత్త రాష్ట్రం యేర్పడ్డ సంబురం పులకింతలు యింకా పూర్తిగా అణగిపోలేదు గానీ ఆశల తోరణాలు పచ్చదనాన్ని కోల్పోతున్నాయి. పాత వుమ్మడి గాయాలు పచ్చిగానే వున్నాయి. కొత్తవి మరికొన్ని ‘ప్రణాళికా’బద్ధంగా తాకుతున్నాయి. అప్పటిదాకా మనతో అనేక సామాజిక ఉద్యమాల దారుల్లో కలిసి నడిచినవాళ్ళే కొందరు సుఖాల తీరాలు వెతుక్కున్నారు. లొంగుబాటు బాట పట్టారు. రాజమార్గాల్లో విశ్రాంతి మందిరాల్లో సేదతీరుతున్నారు. పాలకుల రోటికాడ వూకదంపుడు పాటలు పాడుతూ రొప్పుతున్నారు. మరికొందరు అధికార పేషీల్లో పడక్కుర్చీల్లో కూర్చొని కులాసా కథలు అల్లుతున్నారు. బతుకులో ఖుషీలు అనుభవిస్తున్నారు. దాస భక్తితో మైమరచి భజనగీతాలు పాడున్నారు.
అభివృద్ధి అర్థాలు మార్చుకొంటున్న కాలం ఇది. అంతర్జాతీయ రాజధాని నిర్మాణం పేర పంట పొలాల్ని కాంక్రీట్ నిర్మాణాలుగా మార్చుతున్న వికృత ‘క్రీడ’ వొకచోట; ప్రాజెక్టుల కింద జలసమాధి అవుతోన్న ప్రజలపై అమలౌతున్న వ్యూహాత్మక దమన కాండ మరొకచోట. భూ సేకరణో, సమీకరణో పేరు యేదైతేనేం పుట్టిన నేల నుంచి బలవంతపు విస్థాపన. దానికనుగుణంగా చట్టాలు కొత్త కోరలు పెంచుకున్నాయి. న్యాయం నల్ల బజారు సరుకయ్యింది. అభివృద్ధి గొప్ప పారడాక్స్. అది ప్రజా వ్యతిరేక విధానాలకు పర్యాయపదమైంది.
అందుకే యీ సారి తిరుమలరావు ప్రయాణం వైవిధ్య భరితమై అనేక సంక్లిష్టతల మధ్య సాగింది. అభివృద్ధికీ సంక్షేమానికీ ఆమడ దూరంలో జాతి వునికే ప్రమాదపు అంచుల్లో వున్న నల్లమల ఆదిమ చెంచు సమాజంవైపు చేసిన సంచారంతో పాటే – అభివృద్ధి పేర్న అమలయ్యే విధ్వంసం కోరల్లో చిక్కి పునరావాసం కూడా పరిహాసంగా మారినప్పుడు యాభై టియంసిల లోతులో మునిగిపోతున్న అభాగ్యులకు కలం భరోసానిచ్చే ప్రయాణం కూడా యీ సంపుటిలో చూస్తాం. రెండు విభిన్న ప్రపంచాల విషాదాలు ఆయన్ని వూరుకోనివ్వలేదు. ప్రత్యక్ష కార్యాచరణకి పురిగొల్పాయి. కన్నీటి సాగర నిర్మాణానికి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు, కరపత్రాలు, పుస్తకాలు … అలా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల న్యాయబద్ధ హక్కుల పరిరక్షణ కోసం సాగిన ఆందోళనలకి తొవ్వముచ్చట్లు స్ఫూర్తినిచ్చాయి. ఆ దారిలో తొలి అడుగులు, నుడుగులు జయధీరుడివే అయ్యాయి.
తెలంగాణకు తీపిని పంచిన బోధన్ చెక్కెర ఫ్యాక్టరీలో మూడువేల మంది కార్మికుల బతుకులు చేదెక్కి బజారు పాలయ్యాయి. వేల కోట్ల విలువైన ఫ్యాక్టరీ స్క్రాప్ కింద అమ్ముడువోయింది. అతి పెద్ద విరోధాభాస యేమంటే కొనుక్కొన్నది ఆధిపత్య వలస పాలక వర్గానికి చెందిన ధనస్వామి. సొంత పాలనలో తెలంగాణ వనరులు మరోసారి అన్యాక్రాంతమైన వైనం సహజంగానే తొవ్వముచ్చట్లలోకి యెక్కింది. దశాబ్దాల విప్లవాచరణ ఫలితంగా సాధించుకొన్న విజయాలు వ్యర్థమయ్యాయి. ఆశలూ ఆశయాలూ వనరులూ పరుల పాలయ్యాయి. పల్లెల్లోకి ఆధునికతని సంతరించుకొని భూస్వామ్యం పునఃప్రవేశం చేసింది. భూస్వామ్య సమాజపు వుత్పత్తి సంబంధాలు, సాంస్కృతిక విలువలు పునరుద్ధరణ అయ్యాయి. తిరిగి పిట్టల దొర వేషం కట్టి పట్టపగలు దొంగదెబ్బ తీశారు. రాష్ట్ర సాధనోద్యమంలో రాదారుల్లో పోరాట చిహ్నమైన బతుకమ్మను తిరుమలరావు స్త్రీ హృదయంతో ఆవిష్కరించారు. అందరి బతుకమ్మ కొందరికే కొంగు బంగారమై డి జే – డ్యాన్సులతో బహుజన సంస్కృతికి దూరమైన వైనాన్ని సహేతుకంగా ఖండించారు. సహజంగానే తొవ్వ ముచ్చట్లు బంగారు తెలంగాణ బ్యాచ్ ఆగ్రహానికి గురయ్యాయి. అయితే గుర్తించాల్సిన విషయం యేమంటే జయధీర్ తిరుమలరావు కేవలం ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల్ని మాత్రమే విమర్శకు పెట్టలేదు. సాహిత్య సామాజిక కళా రంగవ్యవస్థల్లో లోతుగా పాతుకుపోయిన సమస్త ఆధిపత్యాల్నీ తన రచనల్లో ఖండించారు. వివిధ నిర్మాణాల్లో, స్వచ్ఛంద సంస్థల్లో, ప్రగతిశీల ప్రజాసంఘాల్లో వుండే అపసవ్య ధోరణుల్ని కూడా ఆయన నిర్దాక్షిణ్యంగా చర్చకు/విమర్శకు పెట్టారు. ఆయన లేవనెత్తిన యెన్నో అంశాలు తర్వాతి కాలంలో గుణపాఠాలుగా మారాయి.
సమకాలీన రాజకీయాల్లోకి బలంగా వొక దూకుడుతో చొచ్చుకువస్తున్న నియంతృత్వ ధోరణుల్నీ అప్రజాస్వామిక స్వభావాన్నీ నిరసించడానికి జయధీర్ యెక్కడా జంకలేదు. వెనకడుగు వేయలేదు. అది రచయిత ధర్మం అని భావించారు. భిన్న అభిప్రాయాలు భావజాలాలు కలిగి వుండటమే దేశద్రోహమన్నట్లు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేస్తూ జైలుగోడల్ని దృఢంగా నిర్మిస్తున్న ఫాసిస్టు రాజకీయాల లోగుట్టుని బహిర్గతం చేశారు. దళిత సెక్షన్లలో అంబేద్కర్ విగ్రహంగా మారే కొద్దీ విగ్రహాలు పాలకవర్గాల వోటుబ్యాంక్ రాజకీయాలుగా మారతాయి తప్ప సామాజిక పరివర్తనకి దారితీయడంలేదని హెచ్చరించారు. ప్రగతిశీల శిబిరాల్లో సైతం విగ్రహ పూజ యెక్కడ యెవరిలో యే రూపంలో వున్నా ఆయన వొప్పుకోలేదు. ఈ ప్రమాదం నుంచి బయట పడవేయగల్గిన మేధావి వర్గం దీర్ఘదృష్టి కోల్పోయి తత్ క్షణ ‘ఘటన’ల సుడిగుండంలో చిక్కుకుపోతున్న వైఖరినీ ఆయన తప్పుబట్టారు. పరాయీకరణకీ ప్రైవేటీకరణకీ గురైన విద్యారంగంలోని అసంబద్ధతనీ అశాస్త్రీయతనీ అవ్యవస్థలనీ అనేక సందర్భాల్లో యెత్తిపట్టారు. ప్రకృతికీ మనిషికీ సమాజానికీ దగ్గరచేసి, పిల్లల్లో మానవీయగుణాల్ని పెంపొందించే బడులు నిర్మించాలని ఘోషించారు. బాల్యాన్ని వికసింపజేయాల్సిన చదువుల మర్మం విప్పిచెప్పారు. నెట్ మాధ్యమంగా మానవీయ సంస్పందనల్ని హరించే చవకబారు హాస్యం గుప్పించే షోలనూ, కార్పోరేట్ లాభాల వేటలో మనుషుల్లోని సున్నితత్వాల మీద, సహజాతాల మీద దాడి చేసే ప్రకటనల్నీ తీవ్రస్వరంతో ద్వేషించారు. విస్తృత ప్రజావసరాలకు వుపయోగపడాల్సిన సాంకేతికత మనుషుల మధ్య యెత్తుగా లేపిన టవర్లని చూసి విస్తుపోయారు. ప్రజారోగ్య వ్యవస్థని నాశనం చేస్తున్న వైద్య విద్యలో సమూలమైన మార్పుని ఆశించారు. ఆదివాసీని అడవినుంచి తొలగించడానికి అమలవుతున్న హింసని గర్హించారు. ‘వసుధైక కుటుంబం’లో యేడ్చే బిడ్డ వెంటరాగా భార్య శవాన్ని మైళ్ళ దూరం మోసుకుంటూ నడిచిన అభినవ విక్రమార్కుల ‘వికాస భారత’ మహాప్రస్థానాలు చూసి తల్లడిల్లి తలదించుకున్నారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా వొక కొత్త నినాదాన్ని కోరుకున్నారు. ఆ నినాదం ప్రజాస్వామిక స్వభావం కల్గి వుండాలని భావించారు. అందుకే యీ ముచ్చట్లలోని ప్రతి స్పందనా మానవీయమైనదే.
తొలి తెలుగు సినిమా పాటల రచయిత చందాల కేశవదాసు సాహిత్య జీవిత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించినా, తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట యోధుడు పలాస భిక్షం సామాజిక ఆచరణ వర్తమానంలోకి కొనసాగాలని ఆశించినా, హక్కుల పోరాట యోధుడు బి. చంద్రశేఖర్ నిబద్ధతకి జోహార్లు పలికినా, మరణం అంచున తచ్చాడుతుతున్న చెంచుల జీవితాల్ని అక్షరీకరించిన వర్ధెల్లి వెంకటేశ్వర్లు కృషిని అంచనా కట్టినా, మనకాలపు ప్రజా రచయిత్రి మహాశ్వేతాదేవి విస్మృతికి గురైన అస్తిత్వాల్ని మార్క్సీకరించారని సూత్రీకరించినా, దొరతనం లేని వూరూ వాడా మనవే అని తొడ చరిచి ప్రకటించిన గూడ అంజయ్యకి విప్లవాంజలి ఘటించినా, మిత్ర కైతల కవాతుకు మార్చింగ్ బ్యాండ్ అందించినా జయధీర్ మార్క్ కవితాత్మక వాక్యం ఆ యా వ్యక్తుల నిలువెత్తు చిత్రాల్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తుంది.
కారణమేదైనా యీ సారి రచయిత అడుగులు నగరం వైపు యెక్కువగా పడ్డాయి. నగరీకరణ సాంస్కృతిక చరిత్ర నిర్మాణానికి అవరోధంగా మారడాన్ని ఆయన గుర్తించారు. సాంకేతిక/ప్రసార విప్లవాలు యే వర్గాల ప్రయోజనాలు కాపాడుతున్నాయో తేటతెల్లం చేశారు.
భారతీయతలోని బహుళత్వాన్ని గుర్తించి గౌరవించని అసహనం రోజురోజుకీ వీథుల్లోకి విశృంఖలంగా విజృంభిస్తున్న వేళ తిరుమలరావు చేసిన సంచారాలు, వాటినుంచి గ్రహించిన సారాంశాలు తొవ్వ ముచ్చట్లకు హద్దుల్లేని విశాలతని సాధించాయి. వైవిధ్యాన్ని గుర్తించని ఐక్యతా నినాదం ఆధిపత్యాలకు దారి తీస్తుందని ఆయన నమ్మకం. ఈ భావధార యీ ముచ్చట్లన్నిటిలోనూ గోచరిస్తుంది. చరిత్రని తవ్వే క్రమంలో వొక్కోసారి గత వైభవాన్ని వున్నతీకరించడం కనిపించినా దాన్ని వర్తమాన వికృత చిత్రంపై నిరసన ప్రకటించడంలో, గడ్డకట్టిన ప్రస్తుతాన్ని బద్దలు కొట్టడంలో భాగంగానే రచయిత ఆ టెక్నిక్ స్వీకరించారని గమనించాలి. భవిష్యత్తులోకి ఆయన సారించిన దృష్టి యెంత సామాజిక దార్శనికతతో కూడి వుంటుందో చెప్పడానికి యివాళ్టి రైల్వేల ప్రైవేటీకరణ, ఆన్లైన్ సమావేశాల గురించి చెప్పిన ముచ్చట్లని వుదాహరణగా చూపొచ్చు.
తొలినాటి ముచ్చట్లు తెలుగు భాషా సంస్కృతుల జాడల కోసం దచ్చన్న దారిలో సాగితే యీ సంపుటిలో చూపు వుత్తరం వైపు మళ్ళింది. గోదావరికి ఆవల గోండ్వానా పథాలు దాటి మరాట్వాడాకి వలసపోయిన తెలుగువారి మూలాల అన్వేషణ దిశగా సాగింది. గోండుల జంగుబాయి సంస్కృతీకరణకి గురవుతున్న దృశ్యం ఆయన్ని కలచివేసింది. ధర్మశాలలో టిబెటన్ బౌద్ధులు మౌఖిక కథనాల పరిరక్షణకి తీసుకునే జాగ్రత్తల్ని చూసి జయధీర్ ముగ్ధులయ్యారు. మౌఖిక సాహిత్యం ఆయన అమితంగా ప్రేమించే రంగం. రచయిత్రి ‘సామాన్య’ సేకరించిన సాద్రీ భాషలోని తేయాకు కార్మికుల మౌఖిక కథనాలపై రాసిన ముచ్చట్లు పరిశోధనవ్యాస పరిధిని మించిపోయాయి.
అలాగే ఆదివాసీ ప్రదర్శన శాల ఆవశ్యకత గురించి రాసిన ముచ్చట చూడండి: ఛార్టర్ ఏక్ట్ లాంటి చారిత్రిక పత్రం అది. దేశంలోనే కాదు ప్రపంచ పటంలో యెక్కడ ట్రైబల్ మ్యూజియం యేర్పాటుచేయాలన్నా వుపయోగపడే గైడ్ లైన్స్ అందులో వున్నాయి. అది అలవోకగా చెప్పిన ముచ్చట కాదు నిర్దిష్ట మైన మెథడాలజీతో కూర్చిన శాస్త్రీయ పరిశోధన వ్యాసం. దాని ముగింపు మనఃకంపం కల్గిస్తుంది. చదివితే మీరూ అంగీకరిస్తారు. అందులో ప్రతిపాదించిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగానే స్వయంగా ‘ఆదిధ్వని’ ప్రదర్శనశాల స్థాపన లో తిరుమల రావు తలమునకలై వున్నారు. ‘మూలధ్వని’ పేర మూలమూలల్లోని 300 మంది జానపద గిరిజన సంగీతవాదకులని వాద్యాలతో పాటు గాలించి గోష్ఠి యేర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రాధికారిక సంస్థలు మాత్రమే చేయగల్గిన కార్యక్రమాల్ని ఆయన తనకున్న పరిమితమైన వనరులతో వ్యక్తిగా చేసి చూపిస్తున్నారు.
ఆ రంగంలో ఆయనకున్న అపరిమితమైన తపన చిత్తశుద్ధి పట్టుదలలే ఆయన బలం.
***
యే కొందరో మాత్రమే తొవ్వ పక్కన మొల్చిన గడ్డిపరకల్ని ప్రేమగా స్పృశించగలరు. దారిపొంటి పూల పరిమళాల్ని పంచుకుంటూ పోగలరు. నెత్తిపై సాగే నల్లమబ్బుని పలకరించగలరు. కురిసే చినుకుల్ని దోసిట పట్టగలరు. మోడువారే చెట్టుని ఆలింగనం చేసుకుని చిగురింపజేయగలరు. దారి వెంట చలువ పందిళ్లు కట్టగలరు. చలివేంద్రాలు పెట్టగలరు. కీచురాళ్ళ రొదలో సంగీతం వినగలరు. పక్షులతో బృందగానం కట్టగలరు. గాయపడ్డ మనుషుల్ని గుండెకు హత్తుకోగలరు. మనసులకు మలాం అద్దగలరు. కరచాలనం చేయగలరు. కన్నీళ్లు తుడవగలరు. గోడల్ని పగలగొట్టగలరు. కంచెల్ని తొలగించగలరు. దీపాలు వెలిగించగలరు. స్నేహాన్ని నింపగలరు. వొత్తిని యెగదోయగలరు. స్వయంగా దీపస్తంభాలు కాగలరు.
దారిపొడవునా విత్తనాలు చల్లుకుపోవడం వొక జీవన విధానం. దాపరికాల్లేకుండా ఖుల్లంఖుల్లా మాట్లాడుతూ మనుషుల్ని అల్లుకుపోవడం వొక సృజనాత్మక కళ. నడిచినంత మేర నిర్మలమైన నవ్వుల్ని పూయించడం వొక సహజ స్పందన. నిస్వార్థంగా వైరుధ్యాల్ని పరిష్కరించుకుంటూ పదుగురినీ కలుపుకుని నడవడం వొక మానవీయమైన ఆచరణ.
వీటిని సాధన చేస్తూ వచ్చినవే యీ తొవ్వ ముచ్చట్లు.
ఇప్పటికి అయిదు సంపుటుల్లోనూ కలిపి రెండువందల యాభైకి పైగా ముచ్చట్లు మీకు చేరువయ్యాయి. మీతో కరచాలనం చేశాయి. మీ యెదని తాకాయి. ఇంకా మరో రెండు సంపుటులకి సరిపడా మిమ్మల్ని పలకరించడానికి సిద్ధంగా వున్నాయి. ‘నడవాల్సిన దారి సుదీర్ఘం. పయనం ఆగనిది. అందుకే యీ తొవ్వ ముచ్చట్లు వొడవనివి’ అని యింతకుముందు చెప్పుకున్నాం; నిజానికి యీ తొవ్వే వొడవనిది. గమ్యాలు సుదూరం. అయినా మరి కొన్ని మేలిమి ముచ్చట్లతో త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తామనే హామీతో …
అడిగిన వెంటనే యీ ముచ్చట్లని అనుభవాల గీటురాయిపై గతితార్కికంగా విశ్లేషిస్తూ ఆత్మీయంగా అమూల్యమైన ముందుమాట రాసి యిచ్చిన విప్లవ రచయిత అల్లం రాజన్నకి ప్రత్యేక కృతజ్ఞతలతో …
తొవ్వలో కలిసి నడుస్తున్న హితైషులు ఆత్మీయ మిత్రులందరికీ వందనాలతో…
చివరిగా నా యువ కవి మిత్రుడు శేషు కొర్లపాటి కవిత్వ పాదాల్ని గుర్తుచేసుకుంటూ
‘కల్లోలంలో నీ మనస్సున్నప్పుడు
కలిసిన ప్రతీ మనిషి
కనుమరుగైపోతున్నప్పుడు
కళ్ల చివర తడి ఆరనప్పుడు
ఒంటరిగా నడవడమే…
గమ్యం సుదూరమైనప్పుడు
ప్రయాణం పూర్తవ్వనప్పుడు
నీతో నడిచే మరో పాదం లేనప్పుడు
ఒంటరిగా నడవడమే’
అవును ; యెన్ని ఉపద్రవాలు వచ్చినా నడక ఆపేది లేదు. నడుస్తూ వుంటేనే యెక్కడో వొక దగ్గర, యెపుడో వొకపుడు యెవరో వొకరు వచ్చి కలుస్తారు. గమ్యం వొకటై దారులు వేరైనా ‘వంతలు’ వున్నా లేకున్నా వొంటరిగానైనా నడక సాగాల్సిందే. అది అనివార్యం. అకుంఠితమ్.
చాలాసార్లు వొంటరిగా నడుస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ నడక సామూహికమే. ప్రజారశుల మద్దతు రక్షణ కవచంగా వుంటుంది.
ఇది అనేక గుంపులతో చేసే సంచారం!
అయినా, ఎక్ల చొలో!
ఎక్ల చొలో …
ఎ. కె. ప్రభాకర్
సంపాదకుడు
Leave a Reply