సూక్ష్మ క్రిమి అన్వేషకులు – జమ్మి కోనేటి రావు

వ్యాసకర్త: అమిధేపురం సుధీర్

‘Microbe Hunters’ అనే ఒక ప్రసిద్ది పొందిన ఇంగ్లీషు పుస్తకానికి తెలుగు అనువాదం ఇది. ఈ పుస్తక రచయిత పేరు ‘పాల్ డి క్రూఫ్’. 

సైన్సు పుస్తకాల మీద వున్న ఆసక్తితో, కేవలం అట్ట మీది పేరు చూసి కొన్న పుస్తకం ఇది. కొని మూడేళ్ళకు పైగా అయిపోయినా, మొన్ననే చదవగలిగాను. 1926 లో మొదటిసారి ఈ పుస్తకం ప్రచురితమయ్యింది అని తెలిసి ఆశ్చర్యపోయాను. దాదాపు వంద సంవత్సరాల క్రితం ప్రచురింపబడ్డా, ఈ రోజుకి కూడా ఈ పుస్తకం విలువైనదే. ఇందులో వున్న విషయాలు ఏవీ obsolete కావు. కారణం, ఇది సైన్సు సిద్ధాంతాలకన్నా, వాటి చరిత్రని ఎక్కువగా చెప్పిన పుస్తకం.  

ఇందులో మొత్తం పదమూడు మంది శాస్త్రవేత్తల కృషిని వివరించారు. పుస్తకం పేరు లోనే వున్నట్టు వీరందరూ  మైక్రో బయాలజీ లో చేసిన కృషి గురించి మాత్రమే ఇందులో ఎక్కువగా వుంది. పదిహేడవ శతాబ్దంలో మైక్రోస్కోప్ ను మొదట కనుక్కున్న లీవెన్ హాక్ నుంచి, ఈ పుస్తకం ప్రచురించడానికి కొంతకాలం ముందు వరకూ వున్న పాల్ ఎర్లిష్ అనే శాస్త్రజ్ఞుని కృషి వరకూ ఇందులో వివరించారు.  ఒక్కొక్క చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఒక్కొక్క శాస్త్రవేత్త ఎంత కష్టపడ్డారో తెలిస్తే అబ్బురమనిపిస్తుంది.  ఈ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల గురించే కాకుండా, వారి వ్యక్తిగత  జీవన విధానం, వారి బలహీనతలు, ఈగోలు, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు, పేరు కోసం పడ్డ తాపత్రయం, ఇలా అన్నీ వివరించటం వలన, ఒక మంచి కథలా ఈ పుస్తకం ప్రతీ ఒక్కరిని అలరిస్తుంది. మైక్రోబయలజీ ని ఒక సబ్జెక్ట్ లా చదివిన వారికి ఇది మరికొంచం ఆహ్లాదంగా వుంటుంది.

మలేరియా క్రిమిని కనుక్కోవడంలో సర్ రొనాల్డ్ రాస్ చేసిన కృషి, మన తెలుగు నగరం, సికిందరాబాద్ లో అతను చేసిన పరిశోధన గురించి చాలా మందికి తెలిసే వుంటుంది.  ఏ విధంగా అతను ఆ క్రిమిని కనుక్కున్నాడో ఈ పుస్తకం లో విపులంగా వుంది.

ఒక విధంగా చెప్పాలంటే తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, భయంకరమైన సూక్ష్మ క్రిములతో ప్రయోగాలు చేసి సైన్సుని ముందుకు తీసుకెళ్ళిన వీరి గురించి తప్పకుండా అందరూ తెలుసుకోవాలి.

అక్కడక్కడా తెలుగు అనువాదం కొంచం ఇబ్బంది పెట్టినా ఇంత మంచి ప్రయత్నం తో పోలిస్తే, ఆ ఇబ్బంది చాలా చిన్నది.

సాధారణంగా విశాలాంధ్ర వారి అన్ని పుస్తకాల షాపుల్లో ఈ పుస్తకం దొరుకుతుంది. ఆన్లైన్లో కావాలంటే, ఆనంద్ బుక్స్ వారి వెబ్సైట్ ద్వారా తెప్పించుకోవచ్చు. వివరాలు క్రింది లింక్ లో వున్నాయి.

http://www.anandbooks.com/Sukshma-Krimi-Anveshakulu-Microbe-Hunters

 సైన్స్ పుస్తకాలు చదివేవారు తప్పకుండా చదవాల్సిన పుస్తకాల్లో ఇదొకటి అని నా అభిప్రాయం.

You Might Also Like

Leave a Reply