సోల్ సర్కస్ : వెంకట్ సిద్ధారెడ్డి

వ్యాసకర్త: నండూరి రాజగోపాల్

చాలాకాలంగా ప్రపంచంలోని చాలా దేశాలలో కధకు ఆదరణ తగ్గిపోయింది. కథలను సంపుటిగా ప్రచురించాలంటే, ఆ రచయిత సంవత్సర కాలంలో ఒక నవలను రాస్తానని హామీ అయినా ఇవ్వాలి. లేదా అప్పటికే ఒక నుంచి నవలైనా రాసి ఉండాలి. అప్పుడే ప్రచురణకర్తలు కధలను పబ్లిష్ చేస్తున్నారు. 50వ దశకంలో సంవత్సరానికి 150 కథలను ప్రచురించిన ‘న్యూయార్కర్’ లాంటి పత్రిక కూడా ఇప్పుడు 50 కథలను కూడా ప్రచురించ లేకపోతోంది. దీనిని బట్టి అక్కడి పరిస్థితిని మనం ఊహించుకోవచ్చు. అక్కడి పాఠకులు ‘నవల’ చదవడానికి ఇష్టపడుతున్నారు. లారెన్స్ లాంటి వాళ్ళు ఎప్పుడైతే నవలకు ‘Bright books of life’ అని కితాబు ఇచ్చారో, అప్పటి నుండి జీవితాన్ని సమగ్రంగానూ, సవివరంగానూ చిత్రించే అవకాశం నవలకు మాత్రమే ఉందని అభిప్రాయపడుతున్నారు. కథ ఎప్పుడూ పాఠకుడిని ఒక అసంపూర్తి చట్రం’లో వదిలేస్తుందని, దాని క్లుప్తత పాఠకుడి ఆలోచనను అస్థిమితం చేస్తుందని వారి అభిప్రాయం. దానికి తోడు 70వ దశకంలోని ప్రముఖ విమర్శకుడు అయిన జూలియా కార్టజర్ ఒక వ్యాసం రాస్తూ… “చాలానుంది రచయితలు, విమర్శకులు కథ ఎప్పుడూ విజ్ఞానాన్ని సవాల్ చేస్తూ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. జీవిత అనుభవాన్ని స్పష్టంగా, అర్థమ్యయేటట్టుగా, వాస్తవంగా వివరించడం ‘కథ’కు సాధ్యం కాదని, నిజానికి అది అభిలషణీయం (not even desirable) కూడా కాదని” తేల్చి చెప్పేసి, కథ చుట్టూ ఒక చట్రాన్ని బిగించేశారు. 18, 19 శతాబ్దాలలో వెల్లివిరిసిన కథనోత్సాహం కాని, ఆనాటి కథకులు కాని, విమర్శకులు కాని, వారి కధలు కాని, వారి అభిప్రాయాలు కాని గడచిన రెండు దశాబ్దాల కాలంగా పాశ్చాత్య కథాసాహిత్యానికి దారి చూపెట్టలేక పోయాయి.


ఒక చార్లెస్ మే, ఒక వయోరికా పాటియా, ఒక రెబెకా హేమండజ్, ఒక మేరియా జీసస్ వంటి వారు నవలలో ఆకర్షిస్తున్న కొత్త సాంకేతికతను ‘కథ’కు జోడిస్తూ కొన్ని ఉదాహరణలు, అది చేసే అద్భుతాలు చెపుతూ రావడం వలన, మన తెలుగు కథకులు కొంతమంది వాటిని అందిపుచ్చుకుని ‘కథ’కు కొత్తరంగులద్దుతున్నారు. ప్రపంచ సాహిత్యంలో ‘కథ’ ఎలా ఉన్నా కూడా గడచిన నూటపది సంవత్సరాలుగా తెలుగుకథకు చీకటి రోజు లేకుండా చేస్తున్న ఈ కధకులకు జేజేలు పలకాల్సిన సందర్భం ఇది. తల్లావజ్జల పతంజలి శాస్త్రిగారు నుండి మొదలు పెట్టి, ‘చేదుపూలు’ జల్లిన మెహర్ దాకా అనేక మంది కథకులు తెలుగు కథకు సాంకేతికతను అద్దుతున్నారు. అదిగో ఆ దారిలో ఇప్పుడు మనకు ‘సోల్ సర్కస్’ అనే తన కథల సంపుటిని అందించిన వెంకట్ శిద్దారెడ్డి జత కలిశారు.

ఈ సంపుటిలో మొత్తం పదకొండు కథలున్నాయి. పది కథలు చదివినా కూడా పూర్తవని నా ‘అన్వేషణ’ ఆఖరుది, పదకొండదది అయిన ‘అలిఖిత నవలలోని 42 శకలాలు’ చదివాక ఒక సాక్ష్యాన్ని, ఒక అనుభవాన్ని సాధించగలిగింది. నేను ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే అన్వేషణ అనే పదం వాడాను. ఈ సంవత్సరం జనవరిలో జరిగిన విజయవాడ పుస్తక మహోత్సవంలో మొదటిసారి నేను వెంకట్ శిద్దారెడ్డిని కలిశాను. ఒకే వేదికను కలసి పంచుకున్న ఆ 27 నిమిషాలలో, ఆయన మాటలలోని ఆశ, చూపులలోని వెతుకులాట నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేశాయి. ‘కథ’ను వెతుక్కుంటూ తిరిగే ఒక సంచారిగా, కదిలించే కథల గురించి వినిపించే కబుర్ల కోసం తాపత్రయ పడుతున్న వారిలా కనపడుతున్న ఈ వెంకట్ శిద్దారెడ్డి దశాబ్దకాలపు తన వెతుకులాటలో పోగేసి వినిపిస్తున్న జగదాధారపు కబుర్లను వినమని స్వాగతిస్తున్నారు. ఏ రకమైన స్పందనా రాని ఈ వాతావరణానికి ఆయన కాస్త ఆశ్చర్యపోయినట్టే కనపడ్డారు. ఆయనకు తన కథలపై ఒక ‘Unacknowledged passion’ ఏదో లోలోపల చాలా గాఢంగా ఉంది. నిజానికి నేను passion అని పైపైన అన్నాను కానీ, అది ఒక Pride గానే నేను ఫిక్స్ అయిపోయాను. అందుకు, ఆ గర్వం వెనకాల రహస్యాన్ని శాధించే క్రమంలో నేను అన్వేషణ’ అనే పదాన్ని ప్రయోగించాను.

ఈ కథలలో ‘కథనం’ ఒక విలక్షణమైన రూపాన్ని సొంతం చేసుకుంది. సినిమాలతోనూ, సాహిత్యంతోనూ చాలా గాఢమైన అనుబంధాన్ని, అధ్యయనాన్ని కలిగి ఉన్న ఈ కథకుడు, సినిమాల వలే తన కథల నిర్మాణాన్ని ఒక దృశ్యంలోంచి చూపెడుతున్నారు. ఏ కథను తీసుకున్నా అనేక చిత్రాలు మన కళ్ళముందు కదిలిపోతున్నప్పుడు మనం కూడా ఆ కథలో Unnamed Character గా దూరిపోతాం . అంతగా పాఠకుడిని own చేసుకుంటున్న ఈ కథనం ఒక శక్తివంతమైన దీర్ఘ వృత్తాకారంగా కనపడుతుంది. అందుగురించే కథకుడు ఈ కథనం ద్వారా గత వర్తమానాల మధ్య, గుర్తులు, జ్ఞాపకాలు, కలలు, భ్రాంతుల మధ్య ముందుకు వెనక్కి కాలంలో, కాలంతో ప్రయాణిస్తూ… మనం చూడని సత్యాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ కదలికను చూస్తున్నప్పుడు, దానిలో ఆ ease ను గమనిస్తున్నప్పుడు తాత్కాలికంగానైనా కథనం ఒక శక్తివంతమైన ద్రవస్థితి (Liquid state)లో ఉందేమో అని కూడా అనిపిస్తుంది. ఈ పదకొండు కధలలో ఉన్న ఈ విశిష్టత వల్లే ప్రతి కథా కూడా పాఠకుడికి ఒక సంపూర్ణ జీవన చిత్రాన్నే చూపెడుతోంది.


ఈ కథలలో రెండో విషయం గమనించినప్పుడు ఒక నిజాన్ని, ఒక వాస్తవాన్ని చూపెడుతున్న దిశగా ఈ కథలన్నీ కదలడం గమనిస్తాడు. కాలం కప్పేసిన ఒక చిత్వాన్ను, హెన్రీ ప్రేమను, కస్తూరి పూల రహస్యాన్ని బట్టబయలు చేసేస్తాయి. కథలంటే వ్యక్తిత్వ వికాస తరగతులకు పనికి వచ్చే పాఠాలు కాదు. కథలంటే జీవితంలో మనం చూడకుండా మర్చిపోయిన దుఃఖాన్నో, విషాదాన్నో, వ్యక్తిత్వాన్నో, వెలుగునో మనముందుకు తీసుకువచ్చేవి. అందుకే ఈ కథలు పాఠకుడిని కాసేపు తడిచేస్తాయి. అతనికి తెలియని జీవితపు అవతలిగట్టును పరిచయం చేస్తాయి. జీవితంతో మరికాస్త ఇష్టంగా, ప్రేమగా ఉండాలన్న తపనను కలిగిస్తాయి. ఇది చాలా చిత్రమైన essence. వెంకట్ శిద్దారెడ్డి కథలు ఎంత మేఘావృతమైన జీవితాన్ని చూపెట్టినా, ఆ కథనం జీవితం పట్ల ఒక అశను రేకెత్తిస్తుంది. దానికి కారణం మనకు డా. వయోరికా పాటియా గమనింపుతో అర్థమవుతుంది. కధకు మూలధాతువు కథన నిర్మాణంలో ఉండదని, అది చూపెట్టే నగ్నసత్యంలోనూ, వాస్తవికతలోనూ ఉంటుందన్న ఆమె ప్రయోగ ఫలితాన్ని, కథనంతో కలిపి వినిపించిన కథలివి.

ఇంకొకటి, ఈ కథలు జీవితంలో మనకి తెలియకుండా మనం చేసే ఒక ప్రయాణాన్ని చూపెడతాయి. ఒక నిజం వైపు, ఒక గమ్యంవైపు, ఏ రకమైన ప్రత్యామ్నాయం లేని ఒడ్డుకి చేరడానికి మనిషి చేస్తున్న ప్రయాణాలను ఈ కథలు పట్టుకున్నాయి. బహుశా, చదవడం ఒక అలవాటుగా మారడం, చెప్పవలసిన చోట చాలా గట్టిగా చెప్పడం ఒక వ్యసనంలా దూరడం వలన మాత్రమే ఈ రచయిత కొన్ని కథలను వినిపించాడనిపిస్తుంది. నిజానికి, ఈ వాస్తవాలు Beyond the life ఉన్నవి కాదు. ఉండాల్సినవి కాదు. అసలు ఇదో ఆధ్యాత్మిక ప్రయాణం కానే కాదు. మనలో ఉన్న తపన, ప్రేదు, ఆరాటం ఏది కోరుకుంటుందో మనకి తెలీకుండా చేసిన ఈ కాలంలోని అతి వేగానికి తట్టుకుని, తిరిగి ఆ అసలు – సిసలు జీవితం వైపు అడుగులు వెయ్యడానికి, ‘ఫర్ ది నన్ టు షైన్ అండ్ ది డోర్స్ టు ఓపెన్” (పేజీ.142) కోసం నిరీక్షిస్తున్న దశకి పాఠకులను చేర్చడం ఈ కథల మెరుపుదనం.

చిత్రమేమిటంటే, సాహిత్య అకాడెమీ తెస్తున్న భారతీయ సాహిత్యం’ అనే పత్రిక మార్చి-ఏప్రిల్ సంచికలో పరమిత సత్పతి రాసిన ‘కలర్స్ ఆఫ్ లోన్లీనెస్’ కథల సంపుటిని కె. సచ్చిదానందన్ సమీక్షిస్తూ మూడో లక్షణంగా …. her choice of characters and contexts… ” అంటూ కొనసాగిస్తారు. అసలు కధే తన కథనాన్ని నిర్ణయించుకుంటూ ముందుకు సాగిపోతుంది. ప్రారంభం మాత్రమే కథకుడి చేతిలో ఉంటుంది. ఒక ఈస్థటిక్ డిస్టెన్స్ కధంతా పరుచుకొని వుంటుంది. కథకుడికి ఏమాత్రం choice ఉండదు. దీనివలన కథ నేరుగానూ, సులువుగానూ పాఠకుడికి చేరే అవకాశం ఉంటుంది. అందుకే నవలలో కనపడే ఒక completeness మనకి ఇప్పుడు కథలలో కనడుతోంది. ఎంత present continuous లో కథ ఉన్నా… జీవితాన్ని పాఠకుడు పట్టుకోవడమే కథ సాధిస్తున్న విజయం. ఇలాంటి టైమ్ లో కూడా రచయితకు పాత్రలను, సందర్భాలను, సమయాలను ఎంచుకునే ఛాయిస్ ఉందని చెప్పడం సబబు కాదు.

అలాగే ఓ హెన్రీ కథలలోనో, మపాసాలోనో, ఇంకెవరిలోనో సంభాషణలు వెంకట్ సిద్ధారెడ్డి కథలలో కూడా కనపడ్డాయి అనడం నేను గర్వంగా ఫీలవను. నవల ఇచ్చే ఒక completeness ను కథ కూడా ఇచ్చేటట్టుగా కథను చెక్కుతున్న ఈ కథకుల ప్రత్యేకతను ఆంగ్ల రచయితలు నేర్చుకుంటారేమో అని ఎవరైనా జోస్యం చెపితే బాగుంటుందనిపిస్తుంది. ఈ కథలు చదివాక ఐహుశా ఈ క్లుప్తతలోని స్మార్టెనెస్కి వెంకట్ సిద్ధారెడ్డి చేసిన అధ్యయనం కూడా తోడయ్యింది. ‘అలిఖిత నవలలోని 42 శకలాలు’ కథ స్క్రీన్ ప్లేకు ఒక మంచి ఉదాహరణ. ఎక్కడా వాచకం చెయ్యకుండా ఇద్దరిలోనూ, ఇద్దరి పట్ల ఉన్న అమితమైన అనురాగాన్ని, ఇష్టాన్ని, ప్రేమను ఎంతో హేతుబద్ధంగా ఈ కథనం మనకు చూపెడుతుంది.


మనం తప్పించుకోలేని ఒక జీవన లాలసను ఈ కథలు మరోసారి దున దృష్టికి తీసుకువస్తాయి. ఒక్కొక్కప్పుడు కథకుడే రచయితేమో అన్నంతో భ్రమ కలుగుతుంది. మన పక్కనో, మన ఊళ్ళోనో జరుగుతున్న సంఘటనల్లా అనిపిస్తాయి. అప్పుడప్పుడు మన మనస్సులో కూడా పరిమళాలు, పశ్చాతాపాలు మొదలవుతూ ఉంటాయి. కథల అసాంతం పాఠకుడు అల్లుకు పోవడమే ఈ కధన నిర్మాణ చాకచక్యం. నిజంగానే ఈ కథకుడికి తన కథల పట్ల ఇంత Passion ఉండడం సబబే. అది గర్వమైనా కూడా తప్పు లేదు. కంగ్రాట్స్ వెంకట్ శిద్దారెడ్డి గారూ…!

-అక్టోబర్ 2020 | చినుకు 

You Might Also Like

Leave a Reply