‘మీటూ’ తంత్రుల్ని మీటే కథలు

వ్యాసకర్త: విశీ 

అమీర్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘సత్యమేవ జయతే’ కార్యక్రమంలో ‘గృహహింస’ అంశాన్ని చర్చించేందుకు సామాజిక కార్యకర్త కమలా భాసిన్ వచ్చారు.

“పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. అసలా వ్యవస్థకు వ్యతిరేకమైన వ్యవస్థ ఏది?” అని ప్రశ్నించారు. అమీర్ ఖాన్ కాస్త తడబడుతూ “మాతృస్వామ్య వ్యవస్థ” అన్నారు‌. దానికామె “తప్పు. ఎందుకంటే పితృస్వామ్యం తప్పయినప్పుడు మాతృస్వామ్యం కూడా తప్పే. పితృస్వామ్యానికి వ్యతిరేకం సమానత్వం. అదే అందరూ కోరుకోవాల్సింది” అన్నారు.

మనకన్నా తక్కువ అనుకున్న వారి నుంచి తప్పకుండా కొన్ని లాభాలను, సేవలను మనం ఆశించే నైజం మనుషుల్లో ఉంది. పురుషుడు స్త్రీని తక్కువగా చూసే క్రమంలో ఆమె నుంచి కోరుకునే లాభాలు అనేకం ఉంటాయి. అవే ‘మీటూ’ ఉద్యమానికి మూలం. అన్నిసార్లూ వేధింపులు లైంగికపరమైనవే అవ్వాల్సిన పని లేదు. కనిపించే రూపాల కంటే కనిపించని రూపాల్లో సాగే వివక్ష ఆడవారికి అతి ముఖ్యమైన శత్రువు. వాటి గురించి చర్చించిన పుస్తకం ‘మీటూ కథలు’. 2019 డిసెంబర్ నెలలో విడుదలైన ఈ పుస్తకానికి ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ సంపాదకురాలిగా వ్యవహరించారు. ఇందులో మొత్తం 13 కథలున్నాయి. అవన్నీ స్త్రీలు వివిధ సందర్భాల్లో ఎదుర్కొన్న సమస్యల గురించి వివరిస్తాయి.

ఊడుగుల జరీనా రాసిన కథ ఇద్దరు మహిళల గృహహింస సమస్యను కళ్ల ముందు పెడుతుంది. చర్విత చరణంలా తరతరాలుగా భార్యలు భర్తల చేతుల్లో ఎదుర్కొంటున్న హింసకు అచ్చమైన రూపం ఆ కథ. ఇది ఆమె రాసిన తొలి కథ అంటే నమ్మలేం! స్వర్ణ కిలారి రాసిన కథ స్నేహితురాలి తండ్రి చేతిలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న అమ్మాయి కథ. చివరకు తను డాక్టరైన తర్వాత ఆ వ్యక్తి పేషంట్‌గా తన దగ్గరికే వచ్చి, అప్పుడూ పాత బుద్ధి మర్చిపోకుండా ప్రవర్తించడం కొందరి మగవారి హీన సంస్కారానికి సాక్ష్యం.

‘మీటూ’ ఉద్యమం పట్టణాలకేనా అని ప్రశ్నించే కథలు రాశారు రచయిత్రులు ఝాన్సీ పాపుదేశి, ఎండపల్లి భారతి. ఒకరు జోగిని వ్యవస్థ గురించి చర్ఛిస్తే, మరొకరు పల్లెటూళ్లలో భూస్వాముల చేతిలో మానభంగాలకు గురయ్యే స్త్రీల దయనీయ స్థితిని వివరించారు. కథలు చిన్నవే అయినా విస్తృత పరిధిలో చర్చించిన తీరు బాగుంది. ఉమా నూతక్కి కథ బంధువు చేతిలో లైంగిక వేధింపులు ఎదుర్కొని, ఆ హింసను మర్చిపోలేక వివాహ జీవితంలోనూ ఇబ్బంది పడే మహిళ గురించి చెప్తుంది. చదువుతున్నంతసేపూ పాఠకులను ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లే కథ ఇది.

సుజాత వేల్పూరి రాసిన కథ చాలా మంది ఎదుర్కొంటున్న అనుభవం. ఇరుగుపొరుగున ఉంటూ, పెద్దమనుషులుగా చలామణీ అయ్యే పురుషులు తమకు అనుకూలమైన స్త్రీలపై పాల్పడే లైంగిక హింస. దానికి అనేక మంది బలైపోతున్నారు. కథంతా ఒక ఎత్తు. చివర ఇచ్చిన షాక్ మరో ఎత్తు అనిపిస్తుంది. దేవికారెడ్డి రాసిన కథ అచ్చంగా ఉద్యోగంలో లింగ వివక్ష. పాతికేళ్ల క్రితమూ అంతే.. ఇప్పుడూ అంతే! ఆడవాళ్ల మీద చిన్నచూపుతో వారిని అవకాశాల నుంచి దూరం చేసే పరిస్థితులకు ప్రతిబింబం ఈ కథ. ఆఫీసులో సాగే లైంగిక వేధింపుల గురించి ప్రభావవంతమైన కథ రాశారు ఉషా తురగా రేవెల్లి. సంస్థలోని అధికారులకు పరిస్థితి వివరించినా వారు పట్టించుకోకపోతే, దానికి తనే సరైన పరిష్కార మార్గాన్ని ఎంచుకోవడం బాగుంది. అలాంటి పురుషులకు కనువిప్పుగా మారుతుంది.

మహిళలపై లైంగిక వేధింపుల మరకులు ఈనాటివి కావు. యుగాలుగా అదే స్థితి అనే అంశాన్ని వివరిస్తూ మైథిలి అబ్బరాజు రాసిన కథ మీటూ ఉద్యమాన్ని మరో స్థాయికి చేర్చింది. త్రేతాయుగంలో రంభపై రావణాసురుడి బలాత్కారం, నలకూబరుడి శాపం గురించి కథ రాయడం పురాణలపై రచయిత్రి సునిశిత దృష్టికి నిదర్శనం. తద్వారా మహిళల స్థితిగతులను చర్చించిన విధానం బాగుంది. మహిళ అవ్వడం వల్ల మహిళలకు ఎదురయ్యే సమస్యలపై కథ రాశారు మమత వేగుంట సింగ్. ఐడెంటిటీ సమస్యలపై చక్కటి విశ్లేషణ ఇది. కళాశాలల్లో విద్యార్థినులపై సాగే వేధింపులు, వాటిని ఎదుర్కొని నిలబడాల్సిన తీరుపై సాంత్వన చీమలమర్రి రాసిన కథ టీనేజర్స్ ఇబ్బందులను కళ్లకు కడుతుంది.

స్త్రీలపై పురుషులు వేధింపులకు పాల్పడ్డ సమయంలో, మరో స్త్రీ అతనికి రక్షణ కవచంగా మారుతున్న వైనాన్ని ఎండగడుతూ కథ రాశారు స్వేచ్ఛ. పుస్తకంలోని చివరి కథ కుప్పిలి పద్మది. హింస అన్నిసార్లూ వ్యక్తి నుంచే రావాల్సిన అవసరం లేదంటూ మహిళలు ఎదుర్కొనే రాజ్యహింస గురించి తన కథలో చర్చించారు. ప్రతి కథా అందరూ తప్పక చదవాలి. పురుషులు మరీ మరీ చదవాలి.

పుస్తకం వెల: రూ.165/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

 

You Might Also Like

One Comment

  1. My

    మానభంగం అనే పదాన్ని వాడడం లేదు. మానాన్ని భంగం చేయడం అనేది ఏదీ ఉండదు కనుక. అన్నీ అత్యాచారాలే.

Leave a Reply