ప్రచ్ఛాయ సులభనిద్ర

వ్యాసకర్త: వాసు

పరేశ్ (నాకు “పరేష్” అనడమే ఇష్టం. అయితే ఇతని పేరు మీదా తదుల్లేఖనంపైనా ఇతనికున్న హక్కుని గుర్తిస్తూ పరేశ్ అనే అంటున్నాను.) నాకు మిత్రుడు. మన మంచి కవి. ఈయన మరీ ఎక్కువేం రాయలేదు. అన్ని poems కలిపి ఓ చిన్న పుస్తకంలో కుదురుకున్నాయి. గట్టిగా చదివితే ఓ గంటలో పరేశ్ పద్యాలన్నీ చదివెయ్యచ్చు. అయితే ఆ గంట విలువ ఎంతంటేనే చెప్పడానికి కొన్ని గంటలు పడుతుంది. నా తరం కవులందరిలాగానే పరేశ్ కూడా జీవితాన్ని రెండు చేతులూ చాపి ఆహ్వానించాడు. వల వేస్తే ఆశించినవీ అభిలషించినవీ మాత్రమే తగలవు కదా. ఈయనకూ జీవితంలో కొన్ని అపశ్రుతులెదురయ్యాయి. వాటిని గురించీ తన కవిత్వంలో అంత ఎక్కువేమీ చెప్పడు. అయితే లతా మంగేష్కర్ పాటకన్నా అవి పెద్ద సంగతులు కావు. స్త్రీని గౌరవించని వ్యక్తిని ఇతను గౌరవించడు. ఇది కవిత్వంలో కొత్తేమీ కాదు. బాల్యం వైపు ప్రయాణమా అంటే అది కవులందరూ చేసేదే. ఇంకో అడుగు ముందుకో వెనక్కో వేసి అమ్మ కడుపులోకి వెళ్ళి గర్భస్థశిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులూచే చప్పుడు విందామని ఉంది కాబోలు, పరేశ్‌కి. సరే. కవితావస్తువులు కొన్నే ఉన్నాయి ఆధునిక కవులకు. కవి వాటితో ఏం చేశాడన్నదీ, మనకు తన తర్జని వంటి లేఖినితో ఏం చూపుతున్నాడన్నదే మనకు ప్రధానం కదా! చెప్పుకోదగ్గ ఏ ఆధునిక కవినీ “ఇతనిదీ ధోరణి, వీళ్ళే ఇతని గురువులు” అనడం కష్టం. పరేశ్‌కూడా అంతే. కవిని ఒక చట్రంలో ఇమిడ్చే పని ఈ మధ్య కాలంలో ఎవరూ పెద్ద చెయ్యడంలేదు. అయితే పరేశ్ ప్రత్యేకత ఏమిటి? ఇతని కవిత్వం ఎందుకు చదవాలి? కవితా వస్తువు కోసమా, అభివ్యక్తిలో నూతనత్వం ఉన్నందువల్లా అని అడిగితే, నేను ఇవేకాక ఇంకో సంగతి కూడా చెబుతాను.

పరేశ్ మనకు నీడల్ని పరిచయం చేశాడు. మన సొంత నీడల్ని మనకు పరిచయం చేశాడు. “నేను నీడల్నే గుర్తు పెట్టుకుంటాను.” ఇదొక filtered essence లాంటిది. “నా నీడ నా రహస్య ప్రపంచంలోనే పడుతుంది. అదీ గమ్మత్తు.” ఇది కేవలం గమ్మత్తేనా? ఉద్బోధ కూడా. ఇది చూశాకే నాకు ఆ చందమామని చూపించే వేలి విలువ తెలిసొచ్చింది. ఇతను తన “జ్ఞాపకాల సైకిలు” తొక్కుతూ వెళుతుంటే, ఆ pillion rider మైలురాళ్ళని లెక్కపెడుతూ కూచున్నాడట. ఇక్కడ ఆ అభివ్యక్తిలోని మార్మికత కాదు చూడాల్సింది. నా pillion rider నేనే అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను.

“నువ్వు నీ బాల్యం నాటి వర్షపు రాత్రిని వర్ణిస్తే
నేను నా బాల్యంలో కురిసిన వానలో తడిసి తెచ్చుకున్న జలుబు గుర్తొచ్చి
విక్స్ కోసం తడుముకోవడం..”

ఇక్కడ నీడ చైతన్యవంతమయింది. నీడ మనిషికి ప్రాణంపోసి అదే అసలు చోదకశక్తి అయి కూచుంది. యజ్ఞధూమం మేఘాల్ని కలిగించినట్టు!

“కడుపులో ఉన్న బిడ్డ కాళ్ళతో తన్నే” అనుభూతిని పరేశ్ ఇంతబాగా ఎలా చెప్పగలిగాడని నాకొక అనుమానం. బహుశా, పరకాయప్రవేశం చెయ్యకుండానే తెలుసుకొని ఉంటాడు. అతనికా గ్రహణశక్తి ఉంది మరి.

వానతనం అని ఈ చక్కటి కవితలకు నామకరణం చేశాడు పరేశ్. చక్కటి కవితలే అన్నీనూ. “గానలత”, “ఆవిష్కారం”, ఇంకా చాలా. నీడల్ని పరిచయం చేసిన కవితకు “ఆవిష్కారం” అనే title ఔచిత్యంతో కూడుకొని, శాస్త్రసమ్మతంగా ఉంది. కవులు ఆవిష్కర్తలే కదా. “దేహాలది అమలిన భాష” ఎందుకు అయిందంటే అక్కడ సమాగమమే కాదు తదనంతరపు నిద్రాక్రియ ఉంది. నిద్ర మనిషికి ముఖ్యం. ఋగ్వేదంలో నిద్రాసూక్తమొకటుంది, 7.55.

సస్తు మాతా సస్తు పితా సస్తు శ్వా సస్తు విశ్పతి
ససంతు సర్వే జ్ఞాతయః సస్త్వ్యయమభితో జనః (ఋగ్వేదం, 7.55.5)

(Let the mother sleep, let the father sleep, let the dog sleep;
let the clanlord sleep. Let the relations sleep; let this folk round about sleep. — Tr. Brereton & Jamison)

ఈ మంత్రంలో శునకం ప్రసక్తి ఉండడం గమనార్హం. పరేశ్‌కి ఇందులో ఔచిత్యం వెంటనే అర్థమౌతుంది.

నీడ నుంచి తప్పించుకోలేనివాడు నీడని ఈడ్చుకెళతాడు. ఇది కవి పరేశ్‌కి పెద్ద భారం కాదు. కవి మన నీడల్ని మనకు ఉత్తమోత్తమంగా పరిచయం చేశాడు కనుక మీకూ నాకూ ఇది అలవాటై కాస్త సులువనిపిస్తుందేమో! మనం తన నుంచి ఆశించినంతా తను మనకు అందించాడు. అదే ఏ నీడల్నీ ఈడ్చుకోనక్కర్లేని “ప్రచ్ఛాయ సులభ నిద్ర”.

మీ కోసం ఒక పరేశ్ poem, పూర్తిగా:

దేహాలది అమలిన భాష
—————–

అటు తిరిగి పడుకున్న నీ దేహాన్ని
ఇటు తిప్పుతుందీ దేహం.

కళ్ళతో కళ్ళ కబుర్లయ్యాక
చెవులతో పళ్ళు మాట్లాడుకున్నాక
పెదాలు పెదాలతో పలకరించేసుకున్నాక

కరిమబ్బు వచ్చి కొండను ఢీకొన్నదేమో
వర్ణంలో వర్ణం కలిసిపోయి
పొటమరించిన చెమట మెరుపుల్లోంచీ మట్టి వాసన

వేళ్ళు నడిచిన దారిలోంచీ ఉవ్వెత్తున కెరటాలు లేచి
నవ్వుల హోరు కట్టలు తెంచుకుంటుంది
గోళ్ళ సంతకాలూ పెదాల నిశానీలు
మొదలూ చివరా లేని దస్తావేజుల ప్రతి పేజీలోనూ

పూల పరిమళం దేహాల పరిమళాలతో
మత్తు భాషలో మాట్లాడుకుంటాయి మౌనంగా
కొయ్యగుర్రం మీద స్వారీ
అమాయకత్వమా జాణతనమా?
ఇక్కడే ఉన్నట్టుంటుంది, ఏడేడు లోకాలు తిరిగినట్టుంటుంది.

For Copies:

అమెజాన్ లింక్

You Might Also Like

Leave a Reply