Boys without names : Kashmira Seth

వ్యాసకర్త: భారతి కోడె

ఈ పుస్తకం మనకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఏడిపిస్తుంది. కానీ మొదలుపెట్టాక పూర్తి చేయకుండా ఆపలేము. కాశ్మీరా సేథ్ రాసిన బాయ్స్ వితౌట్ నేమ్స్ అనే ఈ పుస్తకం కొన్ని సంవత్సరాల క్రితం చదివి ఉన్నా నా ఈ-బుక్ లిస్ట్ లో కనపడితే మళ్ళీ చదవాలనిపించి చదవడం మొదలుపెట్టా. ఈ ఈ-బుక్ నా దగ్గరకి వచ్చిన సందర్భం ఇంకా గుర్తు ఉంది. ‘Stories for everyone’ అనే ప్రాజెక్ట్ కు గతంలో నేను subscribe చేసి ఉన్నా. అందులో భాగంగా ప్రతి బుధవారం ఒక కథను, ప్రతి శుక్రవారం ఒక నవలలో కొంత భాగాన్ని ఈ-మెయిల్ ద్వారా పంపుతుంటారు. అలా ఒక శుక్రవారం ఈ నవలలో ఒక 50 పేజీలు మొదటి భాగంగా వచ్చాయి. అవి చదివాక తర్వాత శుక్రవారం వరకు ఎదురు చూసాను రెండవ భాగం కోసం. అది కూడా వచ్చాక మళ్ళీ తర్వాతి శుక్రవారం వరకు ఆగలేక పూర్తి పుస్తకం సంపాదించి చదవడం మొదలుపెట్టాను.

అత్యంత దుర్భరమైన పరిస్థితులలోకి నెట్టబడిన గోపాల్ అనే పదకొండేళ్ళ పిల్లవాడి కథ ఇది. మహారాష్ట్రలోని ఒక పల్లెటూరికి చెందిన గోపాల్ ది వ్యవసాయ కుటుంబం. పంటలు సరిగా పండక, చేసిన అప్పులు తీర్చలేక ఒక రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా ఆ కుటుంబం ముంబై పారిపోతుంది. అక్కడ అనుకోని పరిస్థితులలో గోపాల్ తండ్రి కనపడకుండా పోతాడు. ఈ పిల్లవాడు తాను ఏదో ఒక పని చేసి అమ్మకు కుటుంబ పోషణలో సహాయపడాలనుకుని పనికోసం వెతుక్కుంటున్న క్రమంలో ఒక వ్యక్తి ఫ్యాక్టరీలో పని ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి ఒక చిన్న కార్ఖానాలో పనికి పెడతాడు. గోపాల్ కు తెలియని విషయం ఏమంటే అక్కడ ఆ పిల్లవాడు ఒక బానిస. ఇంటికి వెళ్ళడానికి లేదు. చేసిన పనికి తిండి పెట్టడం తప్ప అతనికి ఇచ్చేదేమీ లేదు. అతనితో పాటు మరొక ఐదుగురు పిల్లలు అలాగే వెట్టిచాకిరి చేస్తుంటారు అక్కడ. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. వాళ్ళ పేర్లు కూడా ఎవరికీ చెప్పడానికి వీల్లేదు. వాళ్లంతా పేర్లు లేని పిల్లలు.

వాళ్ళ యజమాని పరమ దుర్మార్గుడు. వీళ్ళని ఒక కొట్టంలో పెట్టి కొంచెం కూడా విశ్రాంతి ఇవ్వకుండా పని చేయించడమే తప్ప సరిగా ఆహారం కూడా ఇవ్వడు. వారికి బయటకు వెళ్లే అవకాశం లేదు. ఎవరితోనూ మాట్లాడే పరిస్థితి ఉండదు. అక్కడ నుండి ఎలా తప్పించుకోవాలో తెలియదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఎవరి పనిలో వారు మునిగి దుర్భరమైన పరిస్థితులలో బతుకుతున్న ఆ పిల్లలను గోపాల్ రకరకాల కథలు చెబుతూ అందరినీ తనవైపు ఆకట్టుకుంటాడు. ఆ తర్వాత ఏమి జరుగుతుందీ ఆ పిల్లలు అక్కడ నుండి బయట పడగలుగుతారా అని ఎంతో ఆసక్తిగా చదివేలా రాశారు రచయిత్రి ఈ పుస్తకాన్ని.

చైల్డ్ ట్రాఫికింగ్, బాల కార్మిక వ్యవస్థ నేపథ్యంలో రాసిన పుస్తకం అయినా వాటి గురించి పెద్దగా చర్చ చేయకుండా చాలా subtle గా సమస్యను చర్చిస్తారు రచయిత్రి. అయితే ఈ పుస్తకంలో నాకు నచ్చిన విషయం వేరే ఉంది. అది గోపాల్ వ్యక్తిత్వం. చిన్న పిల్లవాడైనా అతను చూపించే ధైర్యం, తాను స్వయంగా ఒక బాధితుడు అయి ఉండి ఇతర బాధితుల పట్ల ఆ పిల్లవాడు చూపించే compassion, తన తెలివితేటలు, ఆత్మ విశ్వాసం, అన్నిటికన్నా ముఖ్యంగా అంత దారుణమైన పరిస్థితిలో జీవిస్తూ కూడా హాయిగా నవ్వుతూ, మిగిలిన పిల్లలను నవ్విస్తూ ఉండే ఆ అబ్బాయి స్వభావం మనకు గోపాల్ మీద ఎంతో ప్రేమ కలిగేలా చేస్తాయి.

అత్యంత కఠినమైన పరిస్థితులలో జీవిస్తూ కూడా కాస్తంత నవ్వుకోగలగడం, రేపటి పట్ల ఆశను కోల్పోకపోవడం సాధ్యమే అనే వాస్తవం మన నరాల్లోకి, మట్టి బుర్రలోకి ఎక్కాలంటే ఈ పదకొండేళ్ళ పిల్లవాడి కథ చదవాల్సిందే.

You Might Also Like

Leave a Reply