పున్నాగ పూలు : జలంధర

వ్యాసకర్త: వెంకటేశ్వర్లు

జలంధర గారు రాసిన పున్నాగ పూలు నవలను, తెలుగు ప్రింట్ (నవోదయ బుక్ హౌస్) వారు ప్రచురించారు. 398 పేజీలున్న ఈ నవల (వెల 300 రూపాయలు) రెండు రోజుల్లో పూర్తి అయింది. ఈ నవల చదువడం ప్రారంభించిన తరువాత, ఎక్కడ ఆపాలనిపించదు. నవలలో, కథ వస్తువుతో పాటు రచనా శైలి కూడా బాగుంటుంది. రాతలో, చదువులో బద్దకంతో పాటు, ప్రణాళికబద్దత తగినంతగా లేని నేను, ఈ మధ్య కాలంలో త్వరగా పూర్తిచేసిన పుస్తకం ఇదే. అత్యంత సంక్లిష్టమైనటువంటి, జీవితాన్ని బలంగా ప్రభావితం చేయగల మనిషి అలోచనల అంతరంగ ప్రపంచాన్ని, సన్నీహితంగా, లోతైన చూపుతో పరిశీలిస్తూ, శక్తివంతంగా వ్యక్తీకరించే రచనలు ప్రభావవంతంగా ఉంటాయి అనడానికి ఈ పుస్తకం ఒక ఉదాహరణ.

నవలలో ప్రధాన పాత్రధారి రాధ, అనారోగ్యంతో ఉన్న తన భర్తను, మెరుగైన వాతావరణంలో, వినూత్నమైన వైద్యాన్ని అందించే జీ కే హాస్పిటల్ చేర్చడంతో నవల మొదులవుతుంది. ఆ హాస్పిటల్ ఎన్నడో తన పెదనాన్న ఆదర్శాలతో ప్రాణం పోసుకొని కొనసాగుతున్న హాస్పిటల్ అన్న విషయం, అందులో తన భర్తను చేర్పించేదాక రాధకు తెలియదు. రోగాలతో ఆ హస్పిటల్ చేరిన మనుషుల బాధామయ జీవితాల్ని, వాటి తాలుకు ప్రభావాల్ని, వ్యాధుల నుండి వారు కోలుకోవడానికి అమలుచేస్తున్న విధానాలను శ్రద్దగా పరిశీలిస్తూ, హాస్పిటల్ జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటూ, సమస్యలతో బాధ పడుతున్న వారితో మాట్లాడుతూ, వారికి సహకరిస్తూ, హాస్పిటల్ కు జీవం పోసిన ఆదర్శాలు, ఆశయాలు, విలువల ఒడిలో రాధ ఎన్నో విషయాల్ను వినమ్రతతో నేర్చుకుంటుంది. సహజంగా సాగిపోయే ఈ పరిణామ క్రమంలో, తాను జీవితంలో ఏనాడు ఊహించని మార్పులను, దైర్యంగా స్వీకరించడంతో నవల ముగుస్తుంది. నవలలో వివిధ రకాల రోగాలకు, బాధలు, కష్టాలు, అన్యాయాలు, అవేదనలతో కూడిన అంతరంగపు అలజడులు ఎలా కారణం అయితాయో వివరించారు. ఇలాంటి రోగాల్ని నయం చేయడానికి అనుసరించాల్సిన పద్దతుల్ని వివరించారు.

బాధలు, అన్యాయాలకు, ఆధిపత్యాలకు బలి అవుతు, స్వేచ్చా స్వాతంత్రాలకు, గౌరప్రధమైన జీవితానికి దూరమై, పెత్తనాల్ని ఎదిరించకుండా మౌనంతో సహిస్తూ మహిళలు బ్రతుకడం వెనుక ఉన్న కారణాలను విశ్లేషించే ప్రయత్నం చేశారు. సమాజంలో ఆధిపత్య సమూహం, తన స్వార్థం కోసం, ప్రయోజనాల కోసం, అహాన్ని తృప్తి పరుచుకోవడం కోసం, అధికారాన్ని స్థిరపరుచుకోవడం కోసం “మంచి అమ్మాయి” అన్న ముద్రలతో మహిళల్ని బంధనాల్లో ఉంచే క్రమాన్ని, భర్తల అసమర్థతను, మూర్ఖత్వాన్ని, పెత్తనాల్ని ఎదిరించకుండా బలవుతున్న మహిళల జీవితాల్ని చూపించారు. రాధ తన ఎదుట నిలబడి ఒక్క మాట కూడా మాట్లాడలేని, తనను కాదని ఒక్క నిర్ణయం కుడా తీసుకోలేని పరిస్థితిని కల్పించి, నియంత మాదిరి ప్రవర్తించే రాధ భర్త, చివరికి రాధ తెలివిగా తీసుకుంటున్న నిర్ణయాల్ని ఎలా ఆపాలో తెలియని నిస్సహాయ పరిస్థితిలోకి మారిన తీరును అద్బుతంగా వర్ణించారు.

హాస్పిటల్ లో పనిచేసే సిబ్బంది యాటిట్యూడ్ ప్రధానంగా తీసుకున్న తీరును చాలా బాగా వివరించారు. చాల చోట్ల, ఉద్యమాల్లో సైతం వ్యవహార సామర్థ్యం, తెలివితేటలుకు ఉన్న ప్రాధాన్యత, ప్రవర్తనకు తగినంత లేకపోవడం తరచుగా గమనించే విషయమే. ఈ సంధర్భంలో హస్పిటల్ లో పనిచేయడానికి ప్రవర్తననే ప్రధానంగా తీసుకోవాలనుకున్న పద్దతి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ వచ్చిన మంత్రి భార్య, కోట్లాది రూపాయలు హాస్పిటల్ దానం తీసుకొమ్మన సందర్భంలో, పేదలకు సకల సౌకర్యాలతో, నాణ్యమైన వైద్యాన్ని అందించే మంచి లక్ష్యంతో నడుపుతున్న జీ కే హాస్పిటల్ కు ఆర్థిక అవసరం ఉన్నప్పటికి, “డబ్బుకు రకాలు ఉంటాయి. ఎక్కడినుండి వచ్చిందో తెలియని డబ్బు ఉపయోగించుకోరాదు. దానితో పాటు దాని వైబ్రేషన్స్ ను కూడా అనుభవించాల్సి వస్తుందని” అని చెపుతు కోట్లాది రూపాయల సహాయాన్ని డాక్టర్ కృష్ణ సున్నితంగా తిరష్కరించిన తీరు, విలువైన పాఠాన్ని నేర్పిస్తుంది. లక్ష్యం ఉన్నతమైనది అయితే, లక్ష్య సాధనకు అవలంబించే మార్గాల గురించి ప్రధానంగా పట్టించుకోరాదన్న అభిప్రాయం బలంగా ఉన్నచోట, డబ్బుకు రకాలుంటాయని, ఎలా వచ్చిందో తెలియని డబ్బును ఉన్నతమైన లక్ష్యం కోసం అయినాసరే తీసుకోరాదన్న పాఠం విలువైనది. ఉన్నతమైన లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ఉన్నతమైన మార్గాల్ని అనుసరించడం తప్ప మరో దారి లేదన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం.
మనిషి అంతరంగాన్ని నేటికి పూర్తిగా అర్థం చేసుకోలేదన్నది నిజమే అయినప్పటికి, అంతరంగం లోని ఆలోచనలకు ఉన్న ప్రభావితం చేసే శక్తిని కొంత ఎక్కువ చేసి చూపినట్లు నవలలో కనబడుతుంది. చుట్టూ ఉన్నటువంటి సంక్లిష్టమైన భౌతిక పరిస్థితులు కలుగచేసే ప్రభావాల్ని తగినంత పరిగణలోకి తీసుకోలేదనిపిస్తుంది. మంత్రి తన డబ్బును, పదవిని త్యజించడం లాంటి వాటిని చూస్తే, రచయిత్రి కొంత వాస్తవికతకు దూరమయ్యారు అనిపిస్తుంది.

వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న సనాతన సంప్రదాయాల, ఆచారాల పేరిట సామాజిక అసమానతలు, అణచివేతలు, వివక్షతలు, మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోయిన మనిషి అంతరంగానికి, పెట్టుబడిదారి వ్యవస్థలో రూపొందుతున్న ఒంటరితనం, అభద్రతాభావం, పలురకాల ఒత్తిళ్లు, విశృంఖల పోటితత్వం, తీవ్రమైతున్న ఆర్థిక అసమానతలు కూడా తోడయినాయి. అంతరంగం అల్లకల్లోలంగా, సమస్యలమయంగా మారి. జీవితాన్ని దుర్భరంగా చేస్తూ, ప్రేమరాహిత్యంలోకి నెడుతు, బ్రతుకులోని ఆనందాన్ని ఆవిరిచేస్తుంది. అంతరంగాన్ని ప్రభావితం చేసే పరిస్థితులను పైపైన అర్థం చేసుకోవడంతోనే ఆగిపోకుండా, మరింత లోతుగా అంతరంగం ప్రభావితం అయ్యే తీరును, ప్రభావాల్ని విశ్లేషించడం అవసరం. ఈ నేపథ్యంలో పున్నాగ పూలు నవలను చూడాలి.

పున్నాగ పూలు, ప్రతిఒక్కరు తప్పకుండా చదవాల్సిన నవల. ప్రస్తుతం ఈ నవల (4వ ముద్రణ) ఆన్ లైన్ లో (తెలుగు బుక్స్. ఇన్, లోగిలి.కాం మొదలయినవాటిలో) అందుబాటులో ఉంది. హైద్రబాద్ లోని నవోదయ బుక్ హౌస్ లో కూడా ఈ నవల దొరకవచ్చు.

అమెజాన్ లింక్

 

You Might Also Like

Leave a Reply