మురిపించే ముచ్చటైన వ్యాఖ్యానం

(శ్రీనాథుని చాటువుల్లో నానా వర్ణ వనితా వర్ణనం – కవితావైదగ్ధ్యం అనే  పుస్తకానికి  ఏల్చూరి మురళీధర రావు గారు రాసిన పీఠిక ఇది. పుస్తకం.నెట్‍లో ప్రచురించడానికి అనుమతించిన ఏల్చూరిగారి మా ప్రత్యేక ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

ఆగర్భశ్రీమంతులని అంటారే, అట్లాగే ఆగర్భకవులని కూడా ఉంటారట. తల్లి గర్భంలో ప్రవేశించినది మొదలు విజ్ఞానమయకోశంలో వివేకితకు ప్రాణం పోసుకొని అంతఃప్రకృతిలో ఆ స్మృతిరేఖలను గుర్తుంచుకొని విద్యాభ్యాసవేళ భావుక మనోహరమైన శైలీశైలూషి రూపుదిద్దుకొన్నప్పటి నుంచి ప్రాణాంతకాలంలో శివుడు ఓంకారాక్షర మంత్రరాజాన్ని ఘటించేటంత వరకు కవిత్వమే ఊపిరిగా జీవించినవారు. జాతాశౌచం నాటి తొలిస్నానం మొదలుకొని మృతాశౌచం నాటి అంతిమస్నానం దాకా కవిత్వమే అఘమర్షణస్నానంగా జీవితాన్ని ఆజీవితం చెల్లించుకోగలిగినవాళ్ళు. సృష్టిక్రమానికి సూర్యచంద్రుల లాగా సారస్వత చరిత్ర గమనానికి వేవేల వెలుగుబాటలను పరిచి చూపినవాళ్ళు. అటువంటి మహనీయులైన మహాకవులలో శివంకరశీతకిరణుడు శ్రీనాథుడు. అక్షరాక్షరం అపురూపమైన కొత్తదనం వెల్లివిరిసే అందమైన కవిత్వానికి తెలుగు పేరు. కవి జీవితానికీ, కావ్యజీవితానికీ సౌందర్యమే అలంకారమని నమ్మినవాడు. ఆ నమ్మకంతో సుఖాన్నీ, దుఃఖాన్నీ ఆశనూ, నిరాశనూ సాఫల్యాన్నీ, వైఫల్యాన్నీ ఉత్థానపతనాల ఔన్నత్యనిమ్నత్వాలనూ దేనినీ మనస్సులో దాచుకోక ఎటువంటి స్పందననైనా ఏనాటికానాడు సంకోచమన్నది లేక సాలంకృతంగా వెల్లడించిన సంస్కారపూర్ణ రచనావ్యాసంగశీలి. ఆయన కంఠోద్యానవనంలో కామనీయకాన్ని సంతరించికొని ఎల్లకాలం పద్యాల పువ్వులు విరబూసే ఆమని ఋతువొకటి అచ్యుతభావంతో నెలకొన్నది. కావ్యరచనను కొనసాగిస్తూనే భవ్యమైన భణితిభంగిమతో కలకాలం నిలిచిపోయే కావ్యత్వసిద్ధి కలిగిన కమ్మని చాటువులను చెప్పాడు. అవి నవ్యకవితాద్రవ్యలక్ష్మికి, సరస శృంగార హాస్య రసప్రతీతికి పేరెన్నికగన్నాయి. ఆ రసోదీర్ణచాటువులలో నానావర్ణాల వరవర్ణినీ వర్ణనాపూర్ణాలైన కొన్నింటిని ఎన్నుకొని చల్లని వెన్నెల జిలుగు వంటి మురిపించే మాటతీరుతో మైమరపించే ముచ్చటైన వ్యాఖ్య ఇది. మనస్వితల్లజులు, మధుర కోమలసాహితీవల్లభులు అయిన మాన్యులు డా౹౹ కోడూరు ప్రభాకరరెడ్డి గారు సంతరించిన శ్లాఘనీయ గ్రంథం. శ్రీనాథపద్యసౌందర్యఋషికుల్యకు వర్షాగమరసవేణిక.

శ్రీ రెడ్డిగారికి కవిత్వం అంతర్లీన స్వభావం. విమర్శ ప్రకాశరూపం. స్వభావము అంటే నిసర్గజమైన సంస్కారమని అర్థం. ఆ సంస్కారమే జీవులకు తత్తత్ప్రారబ్ధకర్మవశాన దేహావస్థానుగతమైనప్పుడు స్వరూపము అనబడుతున్నది. స్వరూపము జీవేశ్వర స్వాత్మకమైన పదార్థం. ఆ స్వరూపావస్థితుడు స్వరూపుడు. అంటే, సర్వకాల సర్వావస్థలయందు స్వాభావిక సంస్కారముయొక్క సత్త్వశుద్ధిని చెంది తత్త్వదర్శనాన్ని పొంది స్వాత్మారాముడైన పండితుడన్నమాట. ఆ దర్శనమును మనకై దర్శింపజేయగలవారు కవులు. స్వరూపావస్థితులైన కవులు తమ రచనలలో కథాస్థగితంగా ఆయా వ్యక్తుల దేహాదిస్వరూపనిరూపణను బహుభంగిమలలో చేయగా తత్పరార్థజిజ్ఞాసువులైన పాఠకులు ఆ బహిరంగ చిత్ర చిత్రీకరణముఖంగా వారివారి అంతరంగ స్వభావదర్శనకై యత్నించటం జరుగుతుంది. “స్వభావ మేకే కవయో వదన్తి” అని అందుకే అన్నారు.

అసలు కవిత్వమంటేనే దృశ్యాదృశ్య వర్ణనవిలాసం. ఆ కవిత్వకోవిదులలో అగ్రేసరుడు శ్రీనాథుడు. ఆ శ్రీనాథ కవిత్వకోవిదులలో అగ్రేసరులు శ్రీ ప్రభాకరరెడ్డి గారు. అన్యోన్యాలంకారం అన్వర్థమైన సమావేశం ఇది.

శ్రీనాథుని కవిత్వమంతా భక్తిశృంగారమయం. భక్తి వర్ణనకు పరమేశ్వరప్రీత్యర్థజీవనులైన పుణ్యధనుల కథలను,శృంగారవర్ణనకు తనకాలం నాటి నానావర్ణాల వర్ణనీయ వనితల రూపురేకలను ఆలంబనలుగా స్వీకరించాడు. తన కన్నులయెదుట కానవచ్చిన దర్శనీయదృశ్యాలన్నింటినీ నోరారా వర్ణించి చెప్పాడు. అనంతముఖీనమైన వైదుష్యసంపద, తననోట పలికిన ప్రతిపలుకు ప్రసిద్ధపదబంధమై నానాట నాటుకొనే తీరున కల్పింపగల శబ్దబ్రహ్మానుభవగరిమ, సర్వాహ్లాదహేతువైన చమత్కృతిమత్కృతిత్వనైపుణి ఆయనకు భగవంతుడిచ్చిన వరాలు. ఎన్ని హొయలను, ఎన్నెన్ని సొగసుసోయగాలను ఆయా కాంతల మేనికాంతులలో కనుగొన్నాడో అన్ని వంపుసొంపుల తళుకుబెళుకులను తన పద్యాల నడకలలోనూ నడిపించి చూపాడు. ఆ సౌరుతీరులన్నింటినీ శ్రీ రెడ్డిగారు తమ తాత్పర్యరచనలో అంతే తాత్పర్యంతో వెల్లడించారు.

‘వలతే’ అంటే వలచుచున్నాడు అని అర్థం. ‘వల్యతే’ అంటే వలపింపబడటం అన్నమాట. కవిత్వ – విమర్శలు రెండూ సహజకోమలస్వభావులైన ఆయనను వలచి వలపించుకొన్నాయి. అందుకే ఆయన కోమలసాహితీవల్లభులయ్యారు.

శ్రీనాథుడు చూచిన లోకం అతివిశాలమైనది. ఆయన వర్ణించి ఉండకపోతే మనకు ఆనాటి ఆచార సంప్రదాయాలు, ఆ వేషభాషలు, ఆ ఒయ్యారాలు, ఆ సరసాలు, సరాగాలు, సాహసాలు, వాకోవాక్యాల విలాసాలు, వినోదాలు, రౌచికతలు, వివేకితలు, కళలు, కుటుంబజీవితంలో అల్లుకొన్న అనుబంధాలు, ఆటపాటలు, పల్లెపట్టుల ప్రజల తీరుతెన్నులు, రాజాస్థానాలలోని భోగభాగ్యాలు కన్నులకు కట్టినట్లుగా మనకు తెలిసే సదవకాశం వేరొకటి ఉండేదే కాదు. ఆ వివరాలను నలభైఆరు శీర్షికలలో తొంభైమూడు పద్యాలలో శ్రీ రెడ్డిగారు పాఠకులకు రుచిరవ్యాఖ్యతో విశదీకరించారు. ప్రతిపదటీకావసరం లేని బోధకమైన తీరున ఈ తాత్పర్యరచన సరసంగా సాగిపోయింది. వీటిలో కొన్ని “ముంజె పదనైన” (ఈ సంకలనంలోని 6-వ పద్యం), “కుసుమం బద్దిన చీరకొంగు” (28-వ పద్యం), “పంచారించిన నీ పయోధరము లాస్ఫాలింతునో” (29-వ పద్యం), “మీనవిలోచనంబులును మీఁటిన ఖంగను గుబ్బచన్నులు” (38-వ పద్యం), “గండాభోగము పజ్జ లేనగవు శృంగారింప” (43-వ పద్యం), “కోణాగ్ర సంఘర్ష” (44-వ పద్యం), “ఎకసక్కెముగ నాడు” (62-వ పద్యం), “ద్రుతతాళంబున వీరగుంఫితక” (95-వ పద్యం) వంటివి – వల్లభరాయల క్రీడాభిరామంలోనివి. ఇందులోని “హైమగ్రావనితంబ” అన్న 73-వ పద్యం “వ్యామగ్రాహ్యనితంబ” అన్న చిన్ని మార్పుతో క్రీడాభిరామంలో ఉన్నది. మధ్యమధ్య అవకాశం లభించినప్పుడు శ్రీ రెడ్డిగారు ఈ వనితా వర్ణనమనే ప్రధానేతివృత్తానికి సంబంధించని శ్రీనాథుని ఇతర చాటువులను, గ్రంథస్థపద్యాలను సైతం అక్కడక్కడ అధోజ్ఞాపికలలో ఇవ్వటం వల్ల పఠితలకు మహాకవి రచనలోని వివిధభంగీకమైన శయ్యావైయాత్యాన్ని పరికించే సదవకాశం కలిగింది. అధోజ్ఞాపికలలోని పద్యాలలో సైతం “కప్పురభోగి వంటకము” (33-వ పుట) వంటి పద్యాలు కొన్ని క్రీడాభిరామములోనివి ఉన్నాయి. తులనాత్మక పరిశీలనం పట్ల ఆసక్తి గలవారికి ఇటువంటివి ఆసక్తి గొలుపుతాయి. ఈ పద్యాలలో అధికభాగం ‘శ్రీనాథుని వీథి నాటకము’అన్న పేరిట లభిస్తున్న చాటుపద్యాల సంకలనంలో నుంచి, ఇతర సంధానగ్రంథాలలో నుంచి స్వీకరించినవి. ఈ సంకలనాలు ఏ ఒక్కదానిలోనూ లేక ఇందులో కానవస్తున్న పద్యాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటికి ఆధారకల్పమైన తొలిముద్రణ ఏదో నాకు తెలియరాలేదు. క్రీస్తుశకం 1830 ప్రాంతాల సి.పి. బ్రౌను దొర సేకరించిన శ్రీనాథుని వీథి నాటకం ప్రతులు, శ్రీనాథుని చాటుపద్యాలలో కొన్నింటికి ఆయన వ్రాసిన లఘువ్యాఖ్యలు ఈ వాఙ్మయపరిశోధనకు ప్రాతిపదికలు. 1887లో కందుకూరు వీరేశలింగం గారి ఆంధ్ర కవుల చరిత్రములో ఈ విషయాన్ని అధికరించి ఎంతో మౌలికమైన సమాచారాన్ని ప్రకటించారు. 1902లో గంజాం జిల్లా పూడిపెద్ది సాంబశివరావు గారిచే ‘శ్రీనాథుని వీథి నాటకము’ అన్న పేరుతో చెన్నపురి శ్రీవిద్యాలయ ముద్రాక్షర శాలలో గుజిలీ ప్రతి ఒకటి అచ్చయింది. శ్రీనాథునివిగా ప్రసిద్ధికెక్కిన కొన్ని శృంగార పద్యాల, చాటువులు సంకలనం ఇది. దాని ఆధారంగా “శ్రీనాథుని వీథినాటకమను శృంగారపద్యములు”అన్న శీర్షికతో 1908లో వంకాయల కృష్ణస్వామిశెట్టిగారి శ్రీరంగవిలాస ముద్రాక్షరశాలలో మఱొక ప్రతి చెన్నపురిలో అచ్చయింది. ఈ రెండింటిలోనూ శ్రీనాథుని పద్యాలతోపాటు పొరపాటున శ్రీనాథునికి తర్వాతి కాలంలోనివారైనా తురగా రామకవి, గోగులపాటి కూర్మనాథకవి మొదలైన ఇతరకవుల శృంగారపద్యాలు కూడా ఉన్నాయి. అందువల్లనే వల్లభరాయల క్రీడాభిరామమును 1909లో ప్రకటించిన మానవల్లి రామకృష్ణకవి గారు తత్పీఠికలో –

“శ్రీనాథుని వీథినాటకమను చిన్న పొత్తము బజారులలో నమ్మునది ప్రాచీనగ్రంథము కాదని తోచుచున్నది.”

అని దాని ప్రామాణికతను సందేహించారు. అభినవ మల్లినాథులు శ్రీ వేదము వేంకటరాయశాస్త్రి గారు కూడా 1913లో తమ ‘శృంగారనైషధ సర్వంకష’ వ్యాఖ్యను ప్రకటించినప్పుడు పీఠికలో –

“ఇతని దని ప్రకటితమగు వీథీనాటకము ఇతని దని పలువురు నమ్ముట లేదు.”

అని వ్రాశారు. అయితే, వాక్యసందర్భాన్ని బట్టి శ్రీ వేంకటరాయశాస్త్రి గారి విమర్శ ప్రస్తుతం మనము చర్చిస్తున్న ‘శ్రీనాథుని వీథి నాటకము’ పద్యాలను గురించో; “వీథీనాటకము” అనటం వల్ల శ్రీనాథుని పేర ప్రచారానికెక్కిన క్రీడాభిరామము కర్తృత్వాన్ని గురించో – ఏ సంగతీ స్పష్టంగా నిశ్చయించటానికి వీలుగా లేదు. అయితే అప్పటికింకా క్రీడాభిరామము శ్రీనాథుని పేర ముద్రితం కాలేదు. వల్లభరాయల పేర రామకృష్ణకవిగారి ముద్రణమొక్కటే వెలువడింది. అందువల్ల వేంకటరాయశాస్త్రి గారు “ఇతని దని ప్రకటితమగు వీథీనాటకము ఇతని దని పలువురు నమ్ముట లేదు” అని వ్రాసినది పై గుజిలీ ప్రతి విషయమే అనుకోవాలి.

‘శ్రీనాథుని వీథి నాటకము’ అని ప్రకటితమైన 1892, 1908ల నాటి గుజిలీ ప్రతుల తర్వాత 1905లో శ్రీ వేంకటగిరి సంస్థానం వారి ఆస్థానవిద్వాంసులు మోథీ జగన్నాథ మల్లు గారు ‘శృంగార పద్యరత్నావళి’ అన్న పేరుతో 1364 పద్యాల అద్భుతావహమైన సంకలన గ్రంథాన్ని వెలువరించారు. 1908లో దీనికే 1520 పద్యాలతో ఒక పరివర్ధిత ముద్రణ, 1911లో దాని పునర్ముద్రణగా 99-పద్యాల ‘శృంగారపద్యరత్నశేషము’ అన్న అధికపాఠంతో మొత్తం 1619 పద్యాలతో చెన్నపురిలో చదలువాడ సుందరరామశాస్త్రుల వారి శారదాంబా ముద్రాక్షరశాలలో ఇంకొక ప్రతి ముద్రితమై ప్రకటింపబడింది. ఈ 1911 నాటి ముద్రణలో ‘శ్రీనాథుని వీథి నాటకము’ నుంచి ప్రస్తుతం మనకందుబాటులో ఉన్న ప్రతులతో పోలిస్తే కొన్ని కొన్ని ముఖ్యమైన పాఠభేదాలతో 3 పద్యాలున్నాయి. జగన్నాథ మల్లు గారు వెనుకటి గుజిలీ ప్రతుల నుంచి గాక వేరేదో ప్రతినుంచి తమ పాఠాన్ని గ్రహించినట్లు కనుపిస్తుంది. శృంగారపద్యరత్నశేషము లోనే వల్లభరాయల క్రీడాభిరామము నుంచి కూడా 42 పద్యాలున్నాయి. వాటిలోనూ ప్రకృతం అందుబాటులో ఉన్న క్రీడాభిరామము ముద్రితప్రతులలో లేని పాఠాలు కొన్ని ఉన్నాయి. ‘శ్రీనాథుని వీథి నాటకము’, ‘క్రీడాభిరామము’ ఇంకా సుపరిష్కృతాలు కావలసిన ఆవశ్యకతను ఈ సంకలనం నిరూపిస్తున్నది.

ఆ తర్వాత వెనుకటి గుజిలీ ప్రతులను రెండింటిని కలిపి, చెన్నపురి ప్రాచ్యలిఖితగ్రంథాలయంలోని వ్రాతప్రతుల నుంచి మరికొన్ని పద్యాలను సేకరించి 1924లో వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారు ‘వీథి నాటకము – శృంగారపద్యములు’అని “శ్రీనాథ మహాకవి ప్రణీతము”గా ఒక సుపరిష్కృతమైన చిన్న పుస్తకాన్ని ముద్రించారు. అది పలుమార్లు పునర్ముద్రణకు వచ్చింది. దానికి మునుపు విజయనగరం నుంచి సెట్టి లక్ష్మీనరసింహ కవిగారి దొకటి ‘శ్రీనాథుని శృంగార పద్యములు’ అన్న పేరిట, కాకినాడ నుంచి మద్దూరి శ్రీరామమూర్తి గారిదొకటి ‘శ్రీనాథుని శృంగార చాటువులు’ అన్న పేరిట – ఇందాక చెప్పిన గుజిలీ ప్రతుల వంటి సేకరణలు ఆధునిక ముద్రణపద్ధతిలో వెలువడ్డాయి. సెట్టి లక్ష్మీనరసింహ కవిగారు ‘శ్రీనాథుని రసికాభిలాషము’ అనే ఒక కావ్యాన్ని తామే రచించి, దానిని శ్రీనాథుని పేర వెలయించినప్పుడు – ఆ వృత్తాంతపు కలరూపు తెలిసిన విద్వల్లోకం అది శ్రీనాథుని రచనమని నమ్మలేదు. ఆ సంపుటిలోనే ఆయన ‘వీథి నాటకము’లోని శృంగారపద్యాలున్న మరొక భాగాన్ని కూడా ‘పూర్వకవుల చాటుపద్యములు’ అన్న పేరిట సంకలనంగా అచ్చువేశారు కాని – ఆ రోజుల్లో దాని ప్రామాణికత కూడా సంశయగ్రస్తమే అయింది. 1928లో పిఠాపురం నుంచి దాసరి లక్ష్మణస్వామి గారు తెలుగులో ఉత్తమోత్తమమైన సంకలన గ్రంథం ‘వర్ణన రత్నాకరము’ను నాలుగు భాగాలుగా ప్రకటించినపుడు – అందులో ‘శ్రీనాథుని వీథి నాటకము’నుంచి పద్యాలను వావిళ్ళ వారి ముద్రణ నుంచి, ‘క్రీడాభిరామము’ నుంచి పద్యాలను మానవల్లి రామకృష్ణ కవిగారి ముద్రణ ప్రతినుంచి గ్రహించారు. ఎమెస్కో వారు బి.వి. సింగరాచార్య గారి “సమాలోకనము”తో అచ్చువేసిన ప్రామాణికమైన ‘క్రీడాభిరామము’ ప్రతి చివఱ మహావిద్వాంసులు శ్రీ తీర్థం శ్రీధరమూర్తి గారు కృషిచేసి అనుబంధంగా 58 పద్యాల “శ్రీనాథుని వీథినాటకము”ను, 124 పద్యాల “శ్రీనాథుని చాటుపద్యములు” సంకలితాన్నీ విడి భాగాలుగా ప్రకటించారు.

ఇంతకీ ఈ ‘శ్రీనాథుని వీథినాటకము’ యొక్క పై ముద్రితప్రతులన్నింటికీ మూలమైన తాళపత్ర ప్రతి చెన్నపురి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉన్నది. ఆ గ్రంథాలయం వారు 1932లో మహామహోపాధ్యాయ ఎస్. కుప్పుస్వామిశాస్త్రిగారి సంపాదకత్వంలో ప్రచురించిన An Alphabetical Index of Telugu Manuscripts ను బట్టి అక్కడ ‘వీథి నాటకము’ అన్న శీర్షికతో 2945 సంఖ్య గల వ్రాత ప్రతి ఒకటీ; దానికి సి.పి. బ్రౌను దొర వ్రాయించిన 2944 సంఖ్య గల కాగితం ప్రతి ఒకటీ ఉన్నాయి. ఇవిగాక, ‘శృంగార పద్యములు’ అన్న పేరుతో ఆ గ్రంథాలయంలో 3325, 3326, 3327 సంఖ్యలు గల తాళపత్ర ప్రతులు; 3328, 3329, 3330 సంఖ్యలు గల కాగితం ప్రతులు ఉన్నాయి. కాకినాడ ఆంధ్ర సారస్వతపరిషత్కార్యాలయంలోనూ ‘శ్రీనాథుని వీథి నాటకము అని తాళపత్ర ప్రతి ఒకటుండేది. ఆ రోజులలో అచ్చయిన ప్రతులన్నీ వీటి ఆధారంగా వెలువడినవే.

ఇవన్నీ ముద్రణ యుగం ప్రారంభమయిన నాటి తర్వాతి సంగతులు.

వల్లభరాయలు రచించిన క్రీడాభిరామ కావ్యానికి ‘శ్రీనాథుని వీథినాటకము’ అన్న వ్యవహారం చాలా పూర్వకాలం నుంచే ఉన్నట్లు కనబడుతుంది. మహాకవి తెనాలి రామకృష్ణకవి అల్లుడు, లింగమగుంట రామకవిగారి తమ్ముడు అయిన క్రీ.శ. 1600 – 1640 (±) నాటి లింగమగుంట తిమ్మకవి తన సులక్షణసారములో ‘శ్రీనాథుని వీథినాటకము’ అని “కుసుమం బెట్టిన చీర” అన్న క్రీడాభిరామములోని 86-వ పద్యాన్ని ఉదాహరించాడు. అప్పకవి కూడా అదే శీర్షికతో, అదే విధంగా ఆ క్రీడాభిరామములోని 86-వ పద్యాన్ని ‘శ్రీనాథుని వీథి నాటకము’ అని తన అప్పకవీయములో ఉదాహరించాడు. అప్పకవి “కండుక కేళి” అన్న క్రీడాభిరామములోని 82-వ పద్యాన్నికూడా ‘శ్రీనాథుని వీథినాటకము’ అని ఉదాహరించాడు. ఇకపోతే, పెదపాటి జగన్నాథకవి సమకూర్చిన ప్రబంధరత్నాకరములోనూ ‘వీథినాటకము’ అన్న నిర్దేశంతో క్రీడాభిరామమునుంచి మొత్తం ఎనిమిది పద్యాలున్నాయి.

పై ఉదాహరణలను బట్టి లక్షణగ్రంథాలు, సంకలన గ్రంథాలలోనే కాక ఇతరస్థలాలలో కూడా క్రీడాభిరామమునకు ఆ రోజుల్లో ‘శ్రీనాథుని వీథి నాటకము’ అన్న వ్యవహారం ఉండినట్లు భావింపవచ్చును. వేటూరి ప్రభాకరశాస్త్రి గారు తాము వ్రాతప్రతుల సేకరణకు గాను గ్రామగ్రామం పర్యటనలు చేసినప్పుడు రామరాజభూషణుని హరిశ్చంద్రనళోపాఖ్యానము తాళపత్ర ప్రతి ఒకదానిలో “కాకుళ్ళ తిరునాళ్ళ జెప్పిన శ్రీనాథుని వీథి నాటకం” అన్న నిర్దేశంతో “హైమగ్రాహ్యనితంబ” అని ఒక పద్యాన్ని చూశారట. ఈ విషయాన్ని తమ శృంగారశ్రీనాథము (పు. 31) లో వ్రాశారు. నిజానికది వారే చెప్పినట్లు, క్రీడాభిరామములోని “వ్యామగ్రాహ్యనితంబ” అన్న 209-వ పద్యమే. అది శ్రీకాకుళం తిరునాళ్ళలో అక్కడి దృశ్యాలను వర్ణిస్తూ శ్రీనాథుడు చెప్పిన వీథి నాటకము లోనిదని లేఖకుని అభిప్రాయ మన్నమాట. ఆ పద్యం క్రీడాభిరామములో ఉండటం యాదృచ్ఛికమో! లేక క్రీడాభిరామము కావ్యమే శ్రీకాకుళం తిరునాళ్ళలో చెప్పబడిన ‘శ్రీనాథుని వీథి నాటకము’ అని లేఖకుని అభిప్రాయమో!

ఈ విధంగా “శ్రీనాథుని వీథి నాటకము” లోనివని లాక్షణికులు, తాళపత్ర విలేఖకులు ఉదాహరించిన పద్యాలనేకం వల్లభరాయల పేరిట ఉన్న ‘క్రీడాభిరామము’లో ఉండటం విశేషం కాగా, వీటిలో ఏవేవి తత్కవి రచించిన స్వతంత్రమైన పద్యాలో, ఏవేవి త్రిపురాంతకుని ‘ప్రేమాభిరామము’ ఆధారంగా రచితాలో – ఆ గ్రంథం మనకు లభింపనందువల్ల – చెప్పటం సాధ్యం కాదు.

మొత్తం మీద, వల్లభరాయల ‘క్రీడాభిరామము’లో “శ్రీనాథుని వీథి నాటకము”లోని పద్యాలో, “శ్రీనాథుని చాటువులు” లోని పద్యాలో, శ్రీనాథుని ఆ పద్యాల అనుకరణలో ఉన్నమాట వాస్తవం. ఉదాహరణకు, “శ్రీనాథుని చాటువులు” అని లభిస్తున్న ఎమెస్కో వారి సంకలనంలోని –

ఉ. మీనవిలోచనంబులును, మీటిన ఖంగను గుబ్బచన్ను, లిం

    పైన వచోమృతంబు, సొగసైన మదాలసమందయానముం

    గా నొనరించి, దీని గణికామణిఁ జేయక నిర్దయాత్ముఁడై

    గానులదానిఁ జేసిన వికారవిధిం దల మొత్తగా దగున్.

అన్న 107-వ పద్యం నిజానికి తత్సంపాదకులు శ్రీ తీర్థం శ్రీధరమూర్తి గారు అధోజ్ఞాపికలో పేర్కొన్నట్లు – క్రీడాభిరామము లోని 104-వ పద్యమే. ముమ్మొదట సి.పి. బ్రౌను దీనిని గుర్తించి, చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని 2944 సంఖ్య గల ప్రతిలో ఇది “శ్రీనాథుని వీథి” లోనిదనే వ్రాశాడు. కాని, ఇది ప్రస్తుతపు ముద్రణలను బట్టి చూస్తే ఇది “శ్రీనాథుని వీథి”లో లేదు. చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని వ్రాతప్రతు లన్నింటినీ పునఃపరిశోధించి, “శ్రీనాథుని చాటుపద్యము”లను, శ్రీనాథుని “వీథి నాటకము” పద్యాలను క్ర్రీడాభిరామముతో సరిపోల్చి పరిష్కరించి, సమగ్రమైన ప్రామాణికపాఠాన్ని రూపొందింపవలసి ఉన్నది.

ఈ విషయాలను పరిశీలిస్తే – శ్రీనాథుని చాటుపద్యమే క్రీడాభిరామములో చేరిందో? లేక, క్రీడాభిరామములోని పద్యాన్ని పొరపాటున ఆ రోజుల్లో తాళపత్ర లేఖకులు శ్రీనాథుని చాటువు అనుకొన్నారో? రెండూ గాక, ఈ పద్యానికి మూలం ప్రేమాభిరామములోనే ఉండినదో? అని సందేహాలు కలుగుతాయి. ప్రేమాభిరామమునకు శ్రీనాథుడే తొలుత ఆ ప్రకారమే, “వీథి” గానే మొదలుపెట్టి పూర్తిగానో, అసంపూర్తిగానో ఒక అనువాదం చేసివుంటే – ఆ అనువాదం ఆ తర్వాత వల్లభరాయల క్రీడాభిరామముగా పరివర్తన చెందినదేమో? అలా జరగటానికి అప్పటి కారణాలేమిటో? ఊహించటం కష్టం. త్రిపురాంతకుని ప్రేమాభిరామము దొరికితే కాని ఏ విషయమూ ఇదమిత్థంగా తెలియదు.

శ్రీనాథుని వీథి – శ్రీనాథుని చాటువులు

ఇంతవరకు మనము చూచిన “శ్రీనాథుని వీథి నాటకము” అన్న నిర్దేశం లాక్షణికవ్యవహారంలో వల్లభరాయల పేరిట వెలసిన క్రీడాభిరామమునకు చెందినదిగా ఉండటం సాహిత్యచరిత్రలో మనకు కనుపిస్తున్న మొదటి దశ. “శ్రీనాథుని చాటువులు” అన్న భాగం మునుపటి రోజుల్లోనో, ఇటీవలి కాలంలోనో – ఎప్పుడో ఒకప్పుడు సంకలితమై, తాళపత్ర ప్రతులలో అది “శ్రీనాథుని వీథి నాటకము”నకు అనుబంధంగా ఏర్పడి ఉండటం దీని రెండవ దశ. “శ్రీనాథుని వీథి నాటకము” అని లభిస్తున్న పద్యాలు “వీథి” అనే దశవిధరూపకాలలోని రూపక ప్రభేదానికి వర్తింపవు. అయితే, ప్రేమాభిరామము దశవిధరూపకాలలో ఒకటైన “వీథీ రూపక”మని ఒకసారి, “వీథి నాటక”మని ఒకసారి; తన అనువాదం కూడా “వీథి రూపక”మని ఒకసారి, “వీథి నాటక”మని ఒకసారి పరిపరివిధాల పేర్కొనటం వల్ల వల్లభరాయ లంతటివాడే మొట్టమొదట ఈ సందిగ్ధావస్థను తానే ప్రారంభించాడు కదా! క్రీడాభిరామములో కనుపిస్తున్న పద్యాలు “శ్రీనాథుని వీథి నాటకము” అన్న పద్యసంకలనంలో ఉన్నందువల్ల లాక్షణికులు దానిని కూడా “వీథి” అనే వ్యవహరించారేమో తెలియదు.

లేదా, “శ్రీనాథుని వీథి” లోని పద్యాలలో పెక్కింటికి మూలం త్రిపురాంతకుని ప్రేమాభిరామములోనే ఉన్నదేమో? అని నా ఊహ.

ఈ విధంగా “శ్రీనాథుని వీథి నాటకము”లోని పద్యాలన్నింటికీ మూలం త్రిపురాంతకుని ‘ప్రేమాభిరామము’లోనే ఉంటే, ‘క్రీడాభిరామము’ వల్లభరాయల పేరిట ఎట్లా వెలసిందనేది మరొక ప్రశ్న. ఇప్పు డా చర్చను చేయటం లేదు. “శ్రీనాథుని వీథి” అన్న పేరిట వెలసిన శ్రీనాథుని పద్యాలకు మూలం చాలా వరకు త్రిపురాంతకుని ప్రేమాభిరామములోనే ఉన్నదేమో అన్న నా ఊహను మాత్రమే మీకు వివరిస్తున్నాను. లిఖిత గ్రంథాలయాలలో ఉపలభ్యములైన కొన్ని కొన్ని అముద్రిత శ్లోకాలకు తెలుగుసేతలను మాత్రం చూద్దాము:

హేమకార స్త్రీ వర్ణన

ఓష్ఠకాన్తిపరిభూతప్రవాలా ఇన్ద్ర(చేన్ద్ర?)నీలమణిభాసురచోలా

భాతి భూపతిపథే చ సుశీలా స్వర్ణకారకులభూషణబాలా.

భస్మత్రిపుణ్డ్రాంచితఫాలభాగా తన్మధ్యరక్తాంచితచిత్రకా చ

ఉరోజమధ్యాంచితలిఙ్గపీఠా విరాజతే కాచన హేమకారీ.

దీనికి తెలుగు – “శ్రీనాథుని వీథి నాటకము” నుంచి:

సీ. పొలుపొందఁగ విభూతి బొట్టు నెన్నొసలిపైఁ దళుకొత్తఁ జెమట కుత్తలపడంగ

    సొగసుగాఁ బూదండ జోపిన కీల్గొప్పు జాఱఁగా నొకచేత సరుదుకొనఁగ

    బిగిచన్నుఁగవ మీఁద బిరుసు పయ్యెద చెంగు దిగి జాఱి శివసూత్ర మగపడంగ

    ముక్కున హురుమంజి ముత్యాల ముంగర కమ్మ వాతెఱ మీఁద గంతు లిడఁగఁ

తే. గౌను జవ్వాడ, మెట్టియల్ గదిసి మ్రోయఁ

    గమ్మవిలుకాని జాళువా బొమ్మ యనఁగ

    మెల్లమెల్లన సింహాద్రిమీది కేఁగెఁ

    గన్నెపూఁబోఁడి, యగసాలి వన్నెలాడి. (72-వ పద్యం)

ఇది పై శ్లోకద్వయికి సుస్పష్టమైన అనువాదం. ఎటొచ్చీ మహాకవి కనుక ఎక్కడికక్కడ మూలానికి తళుకులద్దాడు. పద్యంలో మహాకవి కవితాప్రతిభ సర్వేసర్వత్ర ఉట్టిపడుతున్నది. మూలశ్లోకంలోని “భస్మత్రిపుణ్డ్రాంచితఫాలభాగా తన్మధ్యరక్తాంచితచిత్రకా చ” అన్న దళంలో “భస్మత్రిపుండ్రాంచితఫాలభాగా”న్ని మాత్రం నిలిపి, “రక్తాంచితచిత్రకా”న్ని అందులోనే కలిపి, ఎంతో అందంగా “పొలుపొందఁగ విభూతి బొట్టు నెన్నొసలిపైఁ దళుకొత్తఁ జెమట కుత్తలపడంగ” అని వ్యంజింపజేసి, స్వేదోదయాన్ని వర్ణనీయ సాత్త్వికభావోద్దీపనకు వినియోగించుకొన్నాడు. “ఉరోజమధ్యాంచితలిఙ్గపీఠా” అన్న దృశ్యీకరణను యథాయథంగా గ్రహించి, “బిగిచన్నుఁగవ మీఁద బిరుసు పయ్యెద చెంగు, దిగి జాఱి శివసూత్ర మగపడంగ” అని కన్నులకు కట్టి చూపాడు. శైవాచారవిధివిధాన పరిచయం, శైవకాంతాపరిచయం ఉన్న త్రిపురాంతకుడు – కథలో ఒక వనిత “సుశీల” అయినప్పటికీ మంచన శర్మ ఆమెకేసి దృష్టి సారించి, “వక్షోజమధ్యాంచితలింగ” పీఠాన్ని చూసి వర్ణించినట్లుగా తన ప్రేమాభిరామములో చిత్రీకరించి ఉంటాడు. అయితే శృంగారవర్ణనల పట్ల ఆసక్తి గల శ్రీనాథుడు ఆమె “సుశీల” అన్న విషయాన్ని విడిచివేశాడు. అలాగని సభ్యత మీఱి వర్ణించలేదు. శివకాంత చన్నుగవ పైనుంచి పైట జారినప్పుడు వక్షఃస్థలిపై లింగపీఠాన్ని సైతం బహిర్గతం చేయక, “శివసూత్ర మగపడంగ” అన్నంత వఱకే ప్రదర్శించి, వర్ణనలో ఔచిత్యాన్ని పాటించి, మూలానికి మెఱుగుపెట్టాడు. వర్ణ్యవిషయం కాబట్టి “విరాజతే కాచన హేమకారీ” అన్న కర్తృపదాన్ని మాత్రం ఉన్నదున్నట్లు “కన్నె పూబోడి – అగసాలి వన్నెలాడి” అని తెలుగుచేశాడు. శ్రీ రెడ్డి గారు దీనికి –

“సింహాచల నృసింహ తిరునాళ్ళలో ఒక కంసాలి కలికిని చూచి ఈ చాటువును చెప్పాడు మధుర భావనా చక్రవర్తి శ్రీనాథుడు. చెమటకు నొసటిపైని విభూతి బొట్టు చెదిరిపోగా, కొప్పులో అందంగా కూర్చిన పూలమాల జారిపోతుండగా చేత సర్దుకొంటూ, బిగువైన పాలిండ్లపైని బిరుసైన పైటకొంగు జారిపోయి శుభకరమైన సూత్రం (దారం) కనిపిస్తుండగా, హురుమంజి దేశపు మంచి ముత్యాల ముంగర అందమైన పెదవిమీద గంతులేస్తుండగా, మన్మథుని బంగారుబొమ్మను తలపిస్తూ మందగమనయైన వగలొల్కే అగసాలి కన్య సింహాద్రికి ఎక్కిరావటం సరసకవి శ్రీనాథునికి నయనానందం కలిగించింది.”

అని హృదయంగమమైన వ్యాఖ్యను సంతరించారు.

బియ్యం దంచుతున్న పడతి

ఇటువంటి సన్నివేశంలోనిదే, మరొక శ్లోకం:

ఏకేనైవ కరేణ దర్శితభుజామూలం క్షిపన్తీ క్రమా

దుత్ క్షిప్తం ముసలం స్మితార్ధ ముదయద్గీతం ముఖం బిభ్రతీ

పర్యాయోన్నమితానతస్తనభరా ప్రస్విన్నఫాలస్థలీ

బాలా శాల్యవఘాతవిభ్రమమిషా దతిక్షుణ్ణం విధత్తే మనః.

దీనికి తెలుగుసేత క్రీడాభిరామములో లేదు. “శ్రీనాథుని చాటుపద్యములు” అన్న సంకలనంలో ఉన్నది. బహుశః ఇది “శ్రీనాథుని వీథి”లోనే ఉండినదేమో! నిజానికి క్రీడాభిరామములో ఉండవలసినదేమో! పొరపాటున చాటుపద్యంగా పరిగణింపబడి ఉంటుంది:

ఉ. పువ్వులు కొప్పునం దుఱిమి, ముందుగఁ గౌ నసియాడుచుండఁగాఁ

    జెవ్వున జంగ సాచి, యొక చేతను రోకలిఁ బూని, యొయ్యనన్

    నవ్వు మొగంబుతోడఁ దన నందనుఁ బాడుచు, నాథుఁ జూచుచున్

    “సువ్వియ సువ్వి” యంచు నొక సుందరి బియ్యము దంచె ముంగిటన్.

అని. మూలానికి విధేయంగా అమరిన అనువాదమిది. ఒక్కొక్క దళాన్ని పరిశీలిద్దాము: “ఏకేనైవ కరేణ దర్శితభుజామూలం క్షిపన్తీ క్రమా దుత్ క్షిప్తం ముసలం” అన్నది అదే క్రమంలో, “చెవ్వున జంగ సాచి, యొకచేతను రోకలిఁ బూని” అయింది. “స్మితార్ధ ముదయద్గీతం ముఖం బిభ్రతీ” స్పష్టంగా “ఒయ్యనన్ నవ్వు మొగంబుతోడఁ దన నందను బాడుచు, నాథు జూచుచున్” అని కొంత మార్పుచెందింది. మూలంలో లేని – నాథుడు, నందనుడు కొత్తగా వచ్చి చేరారు. “పర్యాయోన్నమితానతస్తనభరా” అన్నది మునుపటి పద్యంలో వలెనే “ముందుగఁ గౌ నసియాడుచుండఁగా” అని రూపుదిద్దుకొంది. “ఉదయద్గీతం” అన్నప్పుడు ఒక విశేషం: సంస్కృతకవి సహజంగానే ఆంధ్రదేశపు ఆ గీతపాఠాన్ని ప్రస్తావింపలేదు. శ్రీనాథుడు ఉండబట్టలేక తెలుగిళ్ళలో పాడుకొనే “సువ్వీ! సువ్వీ!” అన్న పాటను తెచ్చి, “సువ్వియ సువ్వి యంచు” అని నిపుణంగా సన్నివేశానికి ప్రాంతీయనైపథ్యాన్ని సంతరించాడు. మూలంలోని “బాల” తెలుగులో పెళ్ళైన ఆడపడుచు కనుక కవి “సుందరి” అని సందర్భోచితమైన మార్పుచేశాడు. మూలంలో “శాల్యవఘాతవిభ్రమమిషాత్” అని మళ్ళీ సంస్కృతకవి బియ్యం దంచుతున్న నెపంతో శృంగార భంగిమలను ప్రదర్శించిన యువతిని వర్ణింపగా – తెలుగు కవి ఆమె కుటుంబిని కాబట్టి ఆ ప్రస్తావనను తొలగించి, “బియ్యము దంచె ముంగిటన్” అని దృశ్యానికి తెరదించాడు. “శ్రీనాథుని వీథి”లోనో, వల్లభరాయల ‘క్రీడాభిరామము’ లోనో ఉండవలసిన పద్యమిది.

దీనికి శ్రీ రెడ్డిగారి అందమైన వ్యాఖ్యను ఈ కృతిలోని 80-వ పద్యం వద్ద 68-వ పుటలో చూడవచ్చును.

చతుర్థ స్నాత

చతుర్థేఽహ్ని స్నాతాం త్రిదినవిరహాత్ పాణ్డురముఖీ

రజోముక్తాం తన్వీం ధవలదశనాం శుభ్రవసనామ్

హరిద్రాహ్రీబేరప్రచురపటుగంధాం ప్రణయినీం

స ధన్యో యో భుఙ్క్తే చ్యుతకుసుమశేష మివ లతామ్.

అచ్ఛాచ్ఛచేలదరదృష్టానిజోరుకాన్తి

ర్నిర్ముక్తసఙ్గమతయా జడతాలసాఙ్గీ

ఆపాణ్డుగణ్డనిపతత్సరసాలకాగ్రా

స్నాత్వా సమేతి సుతను ర్దివసే తురీయే.

ఈ శ్లోకాల అనువాదం క్రీడాభిరామములో ఉన్నది:

శా. గండాభోగము పజ్జ లేనగవు శృంగారింప, గ్రేగన్నులన్

     మెండై మించు మెఱుంగుజూపుగమి క్రొమ్మించుల్ పిసాళింపగా

     జండాలాంగన వచ్చె నొక్కతె ఋతుస్నానార్థమై యిక్షుకో

     దండుం డేర్చిన బాణమో యనగ సౌందర్యంబు నిండారగన్.

అని. ఇటువంటివి ఇంకా అనేకం సంస్కృతం నుంచి క్రీడాభిరామము లోనికి, “శ్రీనాథుని వీథి” లోనికి, “శ్రీనాథుని చాటువులు” గాను తెలుగులోకి వచ్చి ప్రసిద్ధమైనాయి. దీనికి శ్రీ రెడ్డిగారి వ్యాఖ్యను 43-వ పద్యం వద్ద 42-వ పుటలో చూడవచ్చును.

శ్రీ రెడ్డిగారి తాత్పర్యకథనం రసోదంచితంగా, సాహిత్యప్రవేశం అంతగా లేని సామాన్యపాఠకులకు సైతం ఆసక్తిదాయకంగా సుమనోమనోహరంగా సాగింది. కఠినమైన శ్రీనాథుని శబ్దావళిని సరసమైన పోకడతో వివరించి చెప్పారు. గ్రాంథికంలోని పదబంధాలకు చక్కటి తెలుగులో ప్రత్యామ్నాయాలను కల్పించి వ్యాఖ్యానించారు. ఎక్కడికక్కడ తెలుగువారి సంస్కృతి విశేషాలను విశ్లేషించారు. అశ్లీలములని అనిపించే పద్యాలను సైతం సుశీలమైన పరిభాషలోకి పరివర్తించి చెప్పటం వీరి సంస్కారానికి నిదర్శనం. తీయదనాన్ని మించిన తెలుగుదనం ఈ చిన్ని గ్రంథమంతటా వెల్లివిరుస్తుండటం శ్రీ రెడ్డిగారి సంస్కారవిశేషమే.

సంస్కృతంలో ‘కవి’శబ్దానికి మేటిపలుకుల కూర్పరి అని, దృశ్యాదృశ్య వర్ణననిపుణుడని, శుక్రాచార్యుడని అర్థాలున్నాయి. శుక్రాచార్యుడు మృతసంజీవనీ విద్యతో తనవారికి ప్రాణదానం చేసినప్పటి నుంచి వైద్యశాస్త్రకోవిదులకు ఈ కవి శబ్దం రూఢికెక్కినట్లు తోస్తుంది. అందుకే కాబోలు, ఉత్తర భారతదేశంలో వైద్యులను ‘కవిరాజ్’ అంటారు. వైద్యశాస్త్రవిద్వచ్ఛిరోవతంసులు, ఆంధ్రసంస్కృతాంగ్లాలతోపాటు హిందీ భాషావిశేషజ్ఞులైన డా. కోడూరు ప్రభాకరరెడ్డి గారు ఇందుకు సార్థకాభిధానులై బహుశ్రుత కోమల సాహితీవల్లభులు కావటం, బహుగ్రంథకర్తృత్వలబ్ధమైన యశోవిలాసంతో విశ్రమింపక తమ శ్రీనాథకవిత్వాభిమానాన్ని పాఠకలోకానికి ఇతోధిక శ్రీనాథకవిత్వాభిమానాపాదకంగా ఈ సరళ వచోవ్యాఖ్యాకృతిని విరచించటం ఎంతో ముదావహంగా ఉన్నది. ఏవంవిధమైన ఈ శ్రీనాథ పద్యతాత్పర్య శ్లాఘా లఘువచనికాముఖంగా మీతో ప్రసంగింపగలగటం శ్రీ ప్రభాకరరెడ్డి గారి అమేయమైన మనస్విత నాకు ప్రసాదించిన సదవకాశమే కనుక వారికి కృతజ్ఞతాపూర్వక సర్వాభినందనపూర్వక హృద్యనమస్సులను విన్నవించికొంటున్నాను.

“కోమల సాహితీవల్లభ”, “గీతపద్య విధాత” డా. కోడూరు ప్రభాకరరెడ్డి గారు రాగవిపంచి, పల్నాటి భారతం, కవికోకిల దువ్వూరి రామిరెడ్డి కవిత్వం – వ్యక్తిత్వం, రేనాటి పలుకుబడులు, గాథాత్రిశతి, గాథాచతుశ్శతి మొదలైన ఇరవైకి పైగా కృతులను ప్రకటించారు. ప్రొద్దుటూరులో శిశువైద్యనిపుణులుగా సేవలందిస్తున్నారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ భాషాకోవిదులు. వీరి శ్రీనాథుని చాటువుల్లో నానా వర్ణ వనితా వర్ణనం – కవితావైదగ్ధ్యం 2020 లో వెలువడింది. ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైదారాబాద్ – 27. వెల: రు. 200/=. రచయిత ఫోన్ నెంబరు: 9440170808. 

You Might Also Like

4 Comments

  1. రవి

    “సంస్కృతంలో ‘కవి’శబ్దానికి మేటిపలుకుల కూర్పరి అని, దృశ్యాదృశ్య వర్ణననిపుణుడని, శుక్రాచార్యుడని అర్థాలున్నాయి.”

    కవిర్మనీషీ పరిభూః… అని ఈశావాస్యోపనిషత్తు. ఆ శ్లోకం ఆత్మతత్వాన్ని వివరించేదైనా, శాంకరభాష్యంలో కవి పరంగా వ్యాఖ్యానించినట్టు కనిపిస్తుంది. మనీషీ మనసి ఈషితా సర్వజ్ఞః ఈశ్వర ఇత్యర్థః !

    కవిసార్వభౌముడైన శ్రీనాథుని కవిత్వాన్ని వ్యాఖ్యానించడం అంటే సామాన్యం కాదు. బహుముఖీనమైన దృష్టి కావాలి. శ్రీ ప్రభాకరరెడ్డి గారి రచన గురించి ఈ ముందుమాటలో మీరు చెప్పిన ప్రకారం చూస్తే అట్టి దృష్టి కనిపిస్తున్నది. జానపదుల జీవితం గురించి పదకవితాపితామహుడు అన్నమయ్య తన కవితల్లో సమగ్రంగా వర్ణించినట్లు నా అవగాహన. శ్రీనాథుడు అంతకు మునుపే తన చాటువుల్లో వర్ణించినట్లు ఈ చిన్ని వ్యాసపరిచయం ద్వారా తెలుస్తున్నది. ముఖ్యంగా “సువ్వియ సువ్వి” అన్నశబ్దం గురించి ఈ వ్యాసం ద్వారానే తెలిసింది.

    పుస్తకానికి ముందుమాటగా ఈ వ్యాసం కలికితురాయి అనుటలో సందేహం లేదు.

    ఈ వ్యాసాన్ని ప్రచురించి వెలికి తెచ్చిన పుస్తకం నెట్ వారికి ధన్యవాదాలు.

  2. C Raghothama Rao

    చాలా చక్కటి వ్యాసం.

    ధన్యవాదాలు.

  3. K. V Giri

    I read it very carefully n slowly. After a long time I could come across the so many KAVI’Snames. I always remember ShriNath garu. Now I got opportunity to go thr. Many others too. Many many thanks to MUralidhara Rao garu.

  4. తాడిగడప శ్యామలరావు

    .. తీయదనాన్ని మించిన తెలుగుదనం…..
    ఆ మాట నిజం!

Leave a Reply