తేజో తుంగభద్ర: వసుధేంద్ర

రచనపై అభిప్రాయాలు పంచుకున్నవారు: ముత్తుమణి

(తేజో తుంగభద్ర, ప్రముఖ కన్నడ రచయిత వసుధేంద్ర రాసిన చారిత్రక నవల. దీనిపై ఇది వరకు వచ్చిన పరిచయ వ్యాసాన్ని చూసి, డబ్భై ఐదేళ్ళ ముత్తుమణిగారు నవల చదివారు. విశేషమేమిటంటే ఆవిడ చిన్నప్పుడు బడిలో చదువుకున్న కన్నడం మాత్రమే, గత అరవై ఏళ్ళగా ఆ భాషలో చదివింది లేదు. అయినా కూడా నాలుగు వందల పేజీలుగల నవలని పూర్తిచేశారు. సాహిత్యమంటే ఉన్న మక్కువ భాషావరోధాలని కూడా ఎలా అధిగమించగలదో తెలియజెప్పిన మరో తార్కాణం ఇది కాబట్టి, ఆవిడ ఆలోచలనలతో పాటు నవల చదివిన ఆనందాన్ని, ఉద్వేగాన్ని ఆవిడ గొంతులో ఇక్కడ పొందుపరుస్తున్నాము. ఆడియోలో లేని సంగతులు ఫోనులో పంచుకున్నవి, ఇక్కడ పూర్ణిమ మాటల్లో ఉన్నాయని గమనించగలరు. 

ఈ వ్యాసం ఇక్కడ పంచుకోడానికి పరోక్షంగా, ప్రత్యక్షంగా దోహదపడ్డ ఆదిత్య కొర్రపాటికి, శిరీష్ ఆదిత్యకు మా ప్రత్యేక కృతజ్ఞతలు – పుస్తకం.నెట్) 

కథా, కథనం, శిల్పం గురించి:

 

 

చాలా గొప్ప నవల ఇది. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని కళ్ళ ముందుకి తీసుకొచ్చారు. తేజో నది నుండి తుంగభద్ర నది వరకూ కథను నడిపించుకుంటూ వచ్చారు. గోవాలో కథ ముగుస్తుంది. పొట్ట కూటి కోసం, మనుగడ కోసం మనుషులు ఎప్పుడూ వలసలు వెళ్తూనే ఉన్నారు. వెళ్తూనే ఉంటారు. ఆ క్రమంలో పడే సాధకబాధకాలని, కష్టనష్టాలని ఈ నవల గొప్పగా చూపించింది. 

నవలలో మతం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్నిసార్లు, ఎంతమందిని, ఎన్ని విధాల మతం పేరిట హింస పెట్టారో చదువుతుంటే బాధేసింది. అంటే, ఆ దేశంలోనూ, ఇక్కడ ఏ రాజ్యంలోనైనా, ఆ మతం రాజు ఈ మతం వాడు అనేమీ తేడా లేదు. ఎక్కడైనా మతం మారాలంటూ ఒత్తిడే! రాజకీయాలు ఎప్పుడూ ఉన్నాయి. ఇప్పుడు మనకున్న సమస్యలు మనకే కొత్తగా వస్తున్నాయనుకుంటాం గానీ అవి అన్ని కాలాల వాళ్ళకీ ఉన్నాయి, ఏదో రకంగా. 

ఇంకో సంగతి, అప్పటి ఆడవాళ్ళ పరిస్థితి! ఎంత దయనీయంగా ఉంది అసలు. సతి సహగమనం చేసుకోవడం, లేదా పడవలో బంధీగా చిక్కాక తిండికూడా పెట్టకుండా మగవాళ్ళు పెట్టే చిత్రహింసలు – ఆడదానికి రక్షణ లేకుండా ఉంది. కడుపు తరుక్కుపోయింది చదువుతుంటే. యుద్ధాల్లో స్త్రీలు, అంతఃపురంలో స్త్రీలు అందరివీ కష్టాలే! ఆఖరికి వాళ్ళకి ఆ రోజుల్లో వచ్చే లైంగిక వ్యాధుల గురించి కూడా ఇందులో చెప్పుకొచ్చారు. అవ్వన్నీ చదువుతుంటే, అప్పటికీ ఇప్పటికీ, పరిస్థితులేం మారలేదా అని అనిపించింది. ఒక్క సతీ ఆచారమే పోయినట్టుంది. 

కృష్ణదేవరాయల గురించి మనం ఎన్ని గొప్పలు విని ఉన్నాం. కానీ ఆయనకు కొడుకు పుట్టని కారణాన ఒక కుటుంబం చిన్నాభిన్నమైందని మనకు తెలుస్తుందా అసలు? మనం ఎంత సేపూ రాజులూ, రాజ్యాలూ అంటాం గానీ, సామాన్యుల కథేంటి? అప్పటివాళ్ళు ఎలా బతికారు? ఇవ్వన్నీ తెల్సుకునే అవకాశమిచ్చింది. 

భాష గురించి:

నేను ఎప్పుడో స్కూలులో ఉండగా, అంటే 1958కి ముందు అన్న మాట, అప్పుడు హైస్కూలులో చదువుకున్న కన్నడమే! ఆ తర్వాత భాషతో కాంటాక్ట్ అంటే టివి సీరియల్స్ చూడ్డమే! చుట్టాలు, స్నేహితులూ ఎవరూ లేరు కన్నడవాళ్ళు మాట్లాడ్డానికి. అయితే భాషలంటే ఇష్టం కాబట్టి టివిలో కన్నడం, తమిళం, హింది భాషలు మార్చి మార్చి చూస్తాను. అందుకని కన్నడం ఇంకా గుర్తుంది. కానీ గత అరవై ఏళ్ళల్లో చదివింది, రాసింది లేదు. నా మనవడు ఈ పుస్తకం పంపిస్తానంటే చదివి చూద్దామనుకున్నాను. 

మొత్తానికి నెల పైగా పట్టింది మొత్తం చదవడానికి. కొన్ని పదాలు అర్థం తెలియలేదు. కానీ రచయిత రాసిన విధానం ఎలాంటిదంటే ఒక పదం అర్థం కాకపోయినా, ఆ వాక్యాన్ని బట్టో, ముందూ వెనుకా వాక్యాల బట్టో భావం అర్థమైపోతుంది. అందుకని ఎక్కడా అర్థం కాలేదే అని ఆగిపోవాల్సిన అవసరం రాలేదు. కథ సాగిపోతూనే ఉంది. 

నాకు తెల్సిన కన్నడం బెంగళూరు ప్రాంతానిది. నవలలో వాడిన కన్నడం రాయచూరు ప్రాంతానికి చెందిన యాసలా అనిపించింది.

ఇంకోటి, ఎక్కడా అచ్చు తప్పులు లేవు. ధీర్ఘాలు, ఒత్తులు ఏవీ తప్పుగా పడలేదు. ఇది నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. అలా నాలుగొందల పేజీలు చదువుకుంటూ పోయానంటే అది రచయిత గొప్పదనమే! ఒక అచ్చుతప్పు కూడా లేకుండా వేశారు. అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. 

ఒక తమాషా ఏమైదంటే ఇందులో బెల్లా అని పాత్ర ఉంది కదా, అది అమ్మాయి పేరు అని తోచింది కాదు నాకు. కన్నడంలో “బెల్ల” అంటే బెల్లమని అర్థం. ఏమిటబ్బా ఇది, ఇలా రాశారేం? అని అనుకున్నాను మొదట్లో. కానీ కథ సాగుతున్న కొద్దీ అది అక్కడ అమ్మాయి పేరు అని అర్థమైంది. 

 

రచయితకు తెలుగులో సందేశం:

రచయిత వసుధేంద్రకి కన్నడంలో సందేశం: 

 

You Might Also Like

One Comment

  1. Sujata

    What a nice record of appreciation to Mr.Vasudendhra. Hope thus book gets translated to Telugu.

Leave a Reply