సాహిత్య పంపిణీదారులకి మనవి
వ్యాసకర్త: రాజన్ పి.టి.ఎస్.కె
నా ఫేవరట్ రైటర్ యండమూరి గారి అన్ని పుస్తకాలూ పెట్టినందుకు థాంక్స్. “వెన్నెల్లో ఆడపిల్ల”, “అంతర్ముఖం” PDFలు మాత్రం మిస్ అయ్యాయి. అవి ఆల్ టైమ్ సూపర్ హిట్స్. సో.. అవి కూడా పెట్టగలరు. ఇలా G-Drive లింక్‌తో PDFలు పంపే మీ ఆలోచన భలేగా ఉంది.
“మీ ప్రోత్సాహానికి థాంక్యూ!” ఇంకెమన్నా పుస్తకాలు కావాలన్నా అడగండి. ట్రై చేద్దాం.
మధుబాబు “కాళికాలయం” దొరుకుతుందా? షాడో బుక్స్ అయితే.. అన్నీ నా దగ్గర ఉన్నాయ్. కావాలంటే షేర్ చేస్తాను.
“ఓ రియల్లీ!” ప్లీజ్! వెంటనే పంపించండి. నాకు షాడో బుక్స్ అంటే పిచ్చి. నా అభిమాన రచయిత మధుబాబు గారే. చిన్నప్పుడు తెగ చదివేవాడిని. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉన్నాయి కానీ, చదవాలంటే డబ్బులు పే చెయ్యాలంట. ఎదుకులే అని వదిలేశాను. ఇప్పుడు మీ మాట వినగానే ప్రాణం లేచొచ్చింది. ప్లీజ్ షేర్ చెయ్యండి.
ఎలాగైనా సరే, సూర్యదేవర రామ్మోహనరావు గారి “కృతయుగ్”, శతపత్ర సంపాదించి పెట్టండి. స్వాతీలో వచ్చిన ఆయన హిట్ సీరియల్స్ అన్నీ నా ద్గగర స్కాన్డ్ కాపీలు ఉన్నాయి. అవి రేపు upload చేస్తాను.
ఆల్రెడీ 10 రోజుల క్రితం స్వాతి మ్యాగజైన్ సీరియల్స్ అన్నీ మన గ్రూప్‌లో ఒక మెంబర్ అప్‌లోడ్ చేశాడు. మీరు మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి నవల్స్ వేరే గ్రూప్స్‌లో ఏమన్నా దొరుకుతాయేమో ట్రై చెయ్యండి.“శ్రీవారికి ప్రేమలేఖ” సినిమా ఒరిజినల్ స్టోరీ పొత్తూరి విజయలక్ష్మి గారిదట. ఆ నవల పేరు తెలియదు. ఎవరిదగ్గరన్నా ఉంటే షేర్ చెయ్యండి. ఆవిడ హాస్యకథలు కూడా పెట్టడానికి ప్రయత్నించగలరు.
ఖదీర్‌బాబు “మెట్రో కథలు” వెబ్ సిరీస్‌గా వస్తోందట. ఆ ఒరిజినల్ బుక్ పెట్టండి. ఆయన దర్గామిట్ట కతలు కూడా అమేజింగ్‌గా ఉంటాయి.
చాసో, రావిశాస్త్రి. చలం కథల PDF ల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చెయ్యండి.
నేను మిమ్మల్ని మా ఫేస్‌బుక్ క్లోజ్డ్ గ్రూప్‌లో యాడ్ చేస్తాను. మా దగ్గర సుమారు మూడు వేల పిడిఎఫ్‌లు ఉన్నాయి. మీరు నిరభ్యంతరంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
“తప్పకుండా!” మీరు అడిగిన పుస్తకాలను ఈ వారంలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. మీ ఫ్రెండ్స్‌కు కూడా మన “టెలిగ్రామ్” గ్రూప్ కోసం చెప్పండి.
ఇవీ సాహితీ పిపాసులకు, సాహిత్య పంపిణీదారులకు మధ్య ఈమధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్న సంభాషణలు. వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ ఇలా అన్ని మాధ్యమాలలోనూ ఈ తంతు నడుస్తూనే ఉంది. మెల్లగా పాత తరం రచయితలకు నిర్వేదాన్నీ, కొత్తతరం రచయితలకు నిరాశావాదాన్నీ కలిగించే దిశగా సాగిపోతోంది.
కానీ తెలుగు సాహిత్యానికి తమవంతు సాయం చేస్తున్నామనుకునే ఈ సాహిత్య పంపిణీదారులలో చాలామందికి ఈ విషయం మీద అవగాహనే లేదు.
తమ దగ్గర ఉన్న పుస్తకాలను స్కాన్ చేసో, ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉన్న పుస్తకాల లైసెన్సులను డీకోడ్ చేసో, ఆ పుస్తకాల PDFలను రకరకాల మాధ్యమాల ద్వారా ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు. ఇలా చేస్తూ.. తెలుగు సాహిత్యానికి తమ వంతు సాయం చేస్తున్నాం అనుకుంటున్నారే తప్ప, జరగబోయే పరిణామాల గురించి ఆలోచించడం లేదు.
ఒక రచయిత తానొక రచన చేసి, కొన్ని వేలు ఖర్చు పెట్టి పుస్తకాలు అచ్చు వేయించుకుంటాడు. తాను పడిన కష్టానికి పాఠకుల చప్పట్లతో పాటూ, న్యాయమైన ఆదాయాన్నీ కోరుకుంటాడు. కానీ, ఎవరో ఒకరు ఒక పుస్తకాన్ని కొని, దానిని స్కాన్ చేసి వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లో పెట్టేస్తుంటే.. ఇక అతనిలో ఉత్సాహం ఏముంటుంది. తన పుస్తకం పిడిఎఫ్ తనకే whatsappలో వస్తే.. ఇంకొక రచన చేయడానికి ప్రోత్సాహం ఎలా కలుగుతుంది.
ప్రచురణకర్తలదీ అదే పరిస్థితి. ఇంత ఖర్చుపెట్టి పుస్తకాలు ప్రచురిస్తే.. వాటి PDFలు ఉచితంగా అనేక మాధ్యమాలలో అలా అలా తిరిగేస్తుంటే.. పుస్తకాల అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా తగ్గిపోకుండా ఎలా ఉంటాయి. ప్రచురణ సంస్థల మనుగడకు ప్రమాదం రాకుండా ఎందుకుంటుంది. ప్రచురణకర్తే లేనప్పుడు, ఇక రచయితకు ఆధారం ఎక్కడుంటుంది.
గత రెండేళ్ళ కాలంలో తెలుగులో ఎన్నో పబ్లిషింగ్ సంస్థలు మూతపడ్డాయి. మరికొన్ని సంస్థలు ఆ దిశగానే వెళ్ళుతున్నాయి.
యండమూరి వీరేంద్రనాథ్, మధుబాబు, సూర్యదేవర రామ్మోహనరావు వంటి ఇప్పటికీ రచనలు చేస్తూనే ఉన్న స్టార్ రైటర్స్ సంగతైతే చెప్పనక్కరనే లేదు. వారి కొత్త రచన మార్కెట్‌లోకి వచ్చిన అరగంటలో స్కాన్డ్ కాపీ whatsapp, Telegramలలో స్వైరవిహారం చేస్తుంటుంది. మా అభిమాన రచయిత ఫలానా అని ఢంకా బజాయించి చెప్పేవాళ్లలో కూడా చాలామంది ఒరిజినల్ పుస్తకాన్ని కొనకుండా, పైరసీ కాపీ కోసమే చూస్తుంటారు. “ఇలా చెయ్యడం వల్ల మన అభిమాన రచయితకు నష్టం కలుగుతుంది కదా?”. “ఇంకొక కొత్త పుస్తకం రాయడానికి ఇంక ఆ రచయితకు ఉత్సాహమేముంటుంది?” అన్న ఆలోచన పాఠకులు ఒక్కసారి చేసినా, ఈ పరిస్థితిలో మార్పువైపు అడుగులు పడతాయి.
రచయితలకు, ప్రచురణకర్తలకు న్యాయంగా, వారి కష్టార్జిత ఫలితంగా రావలసిన ఆదాయానికి ఇలా చట్టవిరుద్ధమైన పద్ధతుల ద్వారా గండికొట్టడం, దానికి సాహిత్యసేవ అన్న పేరు పెట్టుకోవడం ఎంత వరకూ సబబు.
కొద్దిరోజుల క్రితం ఒక telegram groupలో కినిగెకు కాపీరైట్ ఉన్న పుస్తకాలు కొన్ని ఉన్నాయని తెలిసింది. ఆ గ్రూప్‌లోకి వెళ్లి ఇలా పైరసీ పుస్తకాలు పెట్టడం తెలుగు సాహిత్యానికి ఎంత చేటు చేస్తుందో వివరిస్తూ, గౌరవంగా మెసేజ్ పెట్టాను. ఆ గ్రూప్‌లో ఉన్న వేల పుస్తకాలలో కినిగె పుస్తకాల సంఖ్య మూడు నాలుగు శాతం కూడా లేదు. కాకపోతే, కినిగె కాపీరైట్ ఉన్న పుస్తకాలను అప్పటికప్పుడే ఆ అడ్మిన్ తీసివేశాడు. అప్పుడొక గ్రూప్ మెంబరు.. “అమెజాన్ కిండిల్ పుస్తకాలనే పైరసీ చేసేస్తున్నాం. వాళ్ళకంటే మీ eBook companies గొప్ప సెక్యూరిటీ పెట్టగలవా? మాలాంటి వాళ్ళను ఆపడం వాళ్ళ వల్లే కాలేదు. మీవల్ల ఏమవుతుంది. ఇక్కడ తీసేస్తే, వేరే గ్రూప్ పెట్టి అక్కడ అప్‌లోడ్ చేస్తాం. మీ కినిగెలో లేని వేల పుస్తకాలను ఇక్కడ స్కాన్ చేసి పెట్టాం. పెడుతూనే ఉంటాం. మేం ఎవ్వరికీ దొరకం.” అన్నాడు. మరో ఇద్దరు సాహిత్యపిపాసులు “Well said” అని రిప్లై ఇచ్చి అతని భుజం తట్టారు.
ఇదివరకు ఇలా ఎక్కడైనా కొన్ని Websites కాపీరైట్ బుక్స్‌ని పైరసీ చేసి పెడుతున్నాయిని తెలిస్తే.. Copyright violation notice ఇచ్చేవాళ్ళం. దానితో వాళ్ళు ఆ website మూసేసేవారు. కొంతకాలం ఆగి మరో కొత్త పేరుతో మళ్ళీ పునః ప్రారంభించేవారు. ఇప్పుడు whatsapp, Telegram ఉధృతి పెరిగాక వీరి ఉత్సాహం కూడా పెరిగింది.
ఈ పరిస్థితిని మార్చగలిగేవారు కేవలం సాహిత్య అభిమానులు మాత్రమే. ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే చాలు.. జరగబోయే చెడ్డ ఏమిటో కళ్లముందు కనిపిస్తుంది. కనుక ఇప్పటికైనా, సాహిత్య అభిమానులు ఇటువంటి పైరసీ పుస్తకాల జోలికి పోకుండా.. తామున్న గ్రూప్స్‌లో ఇలా స్కాన్డ్ పుస్తకాలు, పైరసీ పుస్తకాలు ఫార్వర్డ్స్‌గా వచ్చినప్పుడు, వాటిని డిలీట్ చెయ్యడం, ఇటువంటి ఫార్వర్డ్స్ చెయ్యవద్దని గట్టిగా చెప్పడం ద్వారా తెలుగు సాహిత్యానికి, సాహిత్యకారులకు చేటు చేసే విధానానికి అడ్డుకట్ట వెయ్యగలం.
నిజానికి ఇలా పైరసీ చేసి పుస్తకాలు పంపిణీ చేసే వారిలో 90 శాతం మందికి తాము చేస్తున్నదాని పర్యవసానం తెలియదు. ఒకసారి ఆలోచించి, ఈ పైరసీ పద్ధతికి అడ్డుకట్ట వేసిన గ్రూప్స్ కూడా ఉన్నాయి. అందులో వందలమంది సభ్యులున్న మధుబాబుగారి అభిమానుల గ్రూప్ ఒకటి. మన అభిమాన రచయితకు, నష్టం, కష్టం కలిగించే పనులు చేయబోమంటూ ఆ గ్రూప్ మెంబర్స్ తమ గ్రూప్‌లో అంతవరకూ పోస్ట్ అయిన PDFలను డిలీట్ చేసేశారు. ఇకపై ఎవరైనా PDFలు share చేస్తే గ్రూప్ నుండి రిమూవ్ చేస్తామన్న నియమం విధించారు.
“పైరసీ పుస్తకాలు ఇక్కడ దొరుకుతున్నాయ్. తీయించండి” అంటూ ఎంతోమంది సాహిత్యాభిమానులు ఎవరో ఒకరు మాకు ఈ-మెయిల్స్ చేస్తూనే ఉంటుంటారు. ఇలా పైరసీ చెయ్యడం తప్పంటూ కొన్ని సైట్స్‌ను మూయించిన వాళ్ళూ ఉన్నారు. ఇటువంటి సాహిత్యాభిమానుల ఆలోచనా విధానమే తెలుగు సాహిత్యానికి శ్రీరామరక్ష.
యండమూరి గారు, మధుబాబు గారు, సూర్యదేవరగారు, పొత్తూరి విజయలక్ష్మిగారు మొదలైన ప్రసిద్ధ రచయితలతో పాటూ, తొలి తెలంగాణా మహిళా ప్రచురణకర్త JV Publications జ్యోతిగారు, నాణ్యమైన సినిమా పుస్తకాల ప్రచురణకర్తలైన Creative Links Publications సూరిబాబుగారు, పరిచయం అవసరమే లేని Victory Publishers, Navaratna Publishers, ఇంకా ఎందరో ఔత్సాహిక రచయితల, ప్రచురణకర్తల వాణినే నేనిక్కడ వినిపిస్తున్నాను. మీకు వినపడుతుందనే ఆశిస్తున్నాను.
స్వస్తి!
నీహారిక
ప్రచురణ కర్తల దోపిడీ గురించి ఒక్క ముక్క కూడా వ్రాయలేదే ? ధియేటర్లకి కుటుంబంతో వెళితే జరిగే దోపిడీ భరించలేకే పైరసీ పుట్టుకొచ్చింది. అలాగే ప్రచురణ కర్తలు మరియు రచయత/త్రులు కలిసి చేసే దోపిడీకి పరిష్కారముందా ?