అనగనగా ఓ పుస్తకం – 1 :: కొత్త కథ 2018

వ్యాసకర్త : విశీ

కథ రాయడమంటే, ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గు వేయడం లాంటిది – పెరుమాళ్ మురుగన్(ప్రముఖ తమిళ రచయిత)

కథ రాయడమంటే నిజంగా ఇలాంటిదే! ఒక క్రమపద్ధతిలో సాగే జీవనసారం. సాధనతో, సంకల్పంతో ఫలితం సాధించే ప్రక్రియ. కథలెందుకు రాయాలి? అనే ప్రాథమిక దశ నుంచి కథే లోకంగా బతికిన మహనీయుల వరకూ కథను ఒక యజ్ఞంలా నిర్వర్తించిన వారెందరో! వారి ఆరాటమంతా కథ కొనసాగింపు కోసమే. కథాజీవనది నిరంతర గమనం కోసమే.

అటువంటి ప్రయత్నమే ఈ “కొత్త కథ 2018”. రైటర్స్ మీట్ ఆధ్వర్యంలో, కన్వీనర్లు కె.సురేశ్, మహమ్మద్
ఖదీర్‌బాబు సారథ్యంలో హైదరాబాద్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో 2017 నవంబర్లో జరిగిన
రచయితల సమావేశంలో పాల్గొన్న రచయితలు రాసిన కథల సంకలనం ఇది. రచయితలు కుప్పిలి పద్మ, వెంకట్ శిద్దారెడ్డి దీనికి సంపాదకులు. మొత్తం 24 మంది రచయితలు రాసిన 24 కథలు. ఇన్ని రచనలు ఒకేచోట చదవడం ఓ వేడుక. ఒక్కో కథ ఒక్కో తీరు. అన్ని దారాలు కలిసి నేసిన మేలు మగ్గం సారె ఇది.

1) పుష్పలత నవ్వింది – కరుణకుమార్
ఉత్తరాంధ్ర మాండలికంలో రాసిన ఈ కథ ఇప్పటికే చాలా ప్రాచుర్యం పొందింది. దాదాపు ఐదు భాషల్లోకి
అనువాదమైంది. కథాంశం చాలా కొత్తది. అరుదైనది. పుష్పలత నవ్విందెందుకో, అందుకు కారణం ఏమిటో తప్పక తెలుసుకోవాలి.

2) ఇరానీ కేఫ్ – వి.మల్లికార్జున్
ఒకే స్పాట్. రెండు మూడు సన్నివేశాలు. బిగువైన కథనం. అచ్చం బాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి
కలుగుతుంది. ఊహాశక్తికి, వాస్తవానికీ మధ్య గీసిన అందమైన గీత ఈ కథ.

3) కొన్ని బతుకులు గంతే – అన్వర్
అమ్మానాన్న ఎందుకు విడిపోయారని కొడుకలో చెలరేగిన ప్రశ్న. దానికి సమాధానం తెలుసుకోవాలని
బయలుదేరాడు. ఏం తెలిసింది? తెలిశాక ఏం చేశాడు? మానవ సంబంధాలను విలక్షణమైన రీతిలో కథనం చేసే అన్వర్ గారి కథ.

4) చూపు – అల్లం రాజయ్య
అడవి కట్టు మనుషులు పట్నానికి వచ్చిన వేళ జరిగిన సంగతుల సమాహారం ఈ కథ. మాండలికం పదును
గురించి ఎంత చెప్పినా తక్కువే! అల్లం రాజయ్య అక్కడ.

5) బ్లూవేల్ – చైతన్య పింగళి
వృత్తుల్లో భిన్న వృత్తిగా మారుతోన్న స్పెర్మ్ డొనేషన్ గురించి రాసిన కథ. కథనం నడిచిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

6) కండీషన్స్ అప్లై – పసునూరి రవీందర్
అద్దె గర్భాల ప్రక్రియనూ కులం కాటు వీడలేదని చెప్పిన కథ.

7) దురాయి – ఎంఎస్‌కె కృష్ణజ్యోతి
కూతురి కాపురం కోసం తపన పడే సముద్రం అంచు పల్లె మనిషి లచ్చమ్మ కథ ఇది. ప్రధాన పాత్రను మలిచిన తీరు, కథలో సాగిన మాండలిక సొగసు బాగుంది.

8) మాతమ్మ అలియాస్ స్టెల్లా మేరీ – చంద్రశేఖర్ ఇండ్ల
పేరు కోసం దళితుల్ని పెళ్లాడి వారిని నిరంతరం వివక్షకు గురిచేసే పెద్ద మనుషుల బుద్ధులను బట్టబయలు చేసిన కథ.

9) ట్రెండింగ్ – నాగేంద్ర కాశీ
భౌతిక సౌందర్యం గురించిన భయాలను క్యాష్ చేసుకునే వ్యాపార సాధనాలపై చక్కటి అల్లిక ఈ కథ.

10) నక్షత్రాలు లేని నేల – రిషి శ్రీనివాస్
మహిళల శౌచాలయ అవసరాల గురించి కొత్త కోణంలో రాసిన కథ. పోలీసు స్టేషన్లో బాత్రూమ్ లేక కానిస్టేబుల్
పైడితల్లి ఏం చేసిందో కథ చదివితే తెలుస్తుంది.

11) తలాఖ్… తలాఖ్… తలాఖ్ – రెహనా
ట్రిపుల్ తలాఖ్‌పై రాసిన కథ. మేలైన కథనం.

12) శ్రీలక్ష్మి పేరు మార్చుకుంది – కూనపరాజు కుమార్
భర్త చేతిలో ఇబ్బందులు పడ్డ శ్రీలక్ష్మి మేరీగా మారిన వైనం ఆసక్తికరం.

13) కొండదాపు – భూతం ముత్యాలు
కొండదాపున ఉన్న ఊరి మనుషుల విషాదం ఈ కథ. కన్నీరు తెప్పించే కథ.

14) మీటూ – అనిల్ అట్లూరి
పసిపిల్లలపై లైంగిక వేధింపుల వైనాన్ని ఒక సంఘటనగా మలిచిన కథ.

15) ఇంటర్మిషన్ – అపర్ణ తోట
భార్యాభర్తలు ఇద్దరు, ఉద్యోగానికి ఒక్కరే. ఎందుకిలా? అని ప్రశ్నించడం ఇందులోని కథాంశం. కావేరి పాత్ర గుర్తుండిపోతుంది.

16) ఈ కోయిలకు ఋతువు లేదు – నండూరి సుందరీ నాగమణి
సంగీతానికి కులమత భేదాలు అంటవు అనే అంశం ప్రధానంగా సాగిన కథ.

17) గంగరాజం బిడ్డ – పూడూరి రాజిరెడ్డి
తెలంగాణ పల్లెలోని ఓ గతకాలపు జ్ఞాపకం ఈ కథ. చదివిన వెంటనే అంత సులభం మర్చిపోలేరు. పూర్ణలత కోసం మనసు తప్పక వెతుకుతుంది.

18) ఐ – మణి వడ్లమాణి
“ఈ ప్రపంచంలో మిగిలే చివరి సత్యం నువ్వే​”. ఈ మాట ఆధారంగా సాగే కథ.

19) జ్వాలాగీతం – వెంకట్ శిద్దారెడ్డి
అన్న ఉద్యమ దాహం.. తమ్ముడి భౌతిక జీవితం. రెండింటికీ మధ్య వైరుధ్యం. లోతైన కథ. వ్యాఖ్యానం కష్టం. చదివి తీరాల్సిందే!

20) నో ఎగ్జిట్ – కుప్పిలి పద్మ
నమ్మిన సిద్ధాంతాలకూ, కనిపించే వాస్తవాలకూ మధ్య స్పష్టమైన తేడా కనిపించే కాలంలో రాజీ పడక తప్పనిపరిస్థితి. ఈ అంశం గురించి అర్థవంతంగా చెప్పిన కథ.

21) చేపకనుల రాజకుమారి – ఉణుదుర్తి సుధాకర్
ప్రాభవం కోల్పోతున్న రాజవంశాల గతకాలపు జ్ఞాపకం ఈ కథ. తక్కువ పాత్రలతో, కథను దృశ్య రూపంలా మలిచి అందించారు.

22) నారింజ రంగు సిరా మరకలు – మహి బెజవాడ
దేశంలో అసహన పరిస్థితుల నడుమ కాలం వెల్లదీస్తున్న కళాకారుడి కథ. భిన్నమైన శిల్పం. ఆకట్టుకునే శైలి.

23) నాగరికత – భగవంతం
నాగరికత​ ఎరిగిన మనిషి అడవిలో మనుషుల మధ్య నిలిచిన క్షణాన జరిగేదేమిటి? భిన్నమైన కథ. తప్పకుండా చదివి తీరాలి.

24) 8th డైమెన్షన్ – కె.సురేశ్
ఇదీ అని చెప్పలేని  కథ. అదే ఈ కథలో ప్రత్యేకం. కథలోని అంశం, చెప్పిన రీతి.. రెండూ వైవిధ్యం.

You Might Also Like

Leave a Reply