మహీధర నళినీ మోహన్ గారి సైన్స్ రచనలు

వ్యాసకర్త : అమిధేపురం సుధీర్

కొన్ని రోజుల క్రితం అనుకోకుండా ‘కరెంటు కథ ‘ అనే పుస్తకం చదివాను. రచయిత శ్రీ మహీధర నళినీ మోహన్ గారు. ఈ పుస్తకం ఒక స్వీట్ సర్ప్రైజ్ నాకు. ఇప్పటివరకూ తెలుగులో మంచి సైన్స్ రచనలు అంటే నండూరి రామ్మోహన్ గారివే అనుకున్నాను. తరువాత కొడవటిగంటి రోహిణి ప్రసాద్ గారి పుస్తకాలు కూడా నచ్చాయి. అడపా దడపా రష్యన్ అనువాదాలు కొన్ని చదివినా అవీ ఒకటీ అరా మాత్రమే.  ఒకే రచయిత ఇన్ని సైన్స్ పుస్తకాలు వ్రాసినా, ఇంతకాలం నాకు వీరి పుస్తకాల గురించి తెలియకపోవటం నా అజ్ఞానం. వారి రచనల గురించి తెలుసుకొన్నాక, కొందామంటే వారి పుస్తకాలు చాలా వరకు అందుబాటులో లేవు. మొత్తానికి కొన్ని పుస్తకాలని సంపాదించి చదివాను. వాటి గురించే ఈ వ్యాసం.

 

  1. కరెంటు కథ:  ఒక అద్బుతమైన పుస్తకం. ఎంతో సులభమైన శైలితో, చాలా చక్కగా విషయాలను వివరించారు. సైన్స్ మీద ఆసక్తి లేని వారు కూడా, ఈ పుస్తకం చదివితే, ఒక చక్కని పుస్తకం చదివిన అనుభూతి పొందుతారు. పుస్తకం యొక్క పేరులోనే వున్నట్టు, ఈ పుస్తకం కథ అంతా కరెంటు గురించే.
  2. కాలెండర్ కథ: అప్పుడప్పుడు ఇలాంటి విషయాల మీద, అంటే ఇంగ్లీష్ నెలలు, తెలుగు నెలల మధ్య తేడాలు, వివిధ శకాలు, ముఖ్యంగా క్రీస్తు పుట్టిన సంవత్సరం 1 A.D కాకపోయినా,  ఎందుకు 1 A.D ని శకారంభం గా వాడతాము? ఇలాంటి సందేహాలొచ్చినా, ఎప్పుడూ అంత లోతుగా అలోచించలేదు. ఈ పుస్తకం చదువుతుంటే ఇలాంటి విషయాలు చాలా  తెలిసాయి. మనం అత్యంత సహజంగా భావించే విషయాల వెనుక ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర వుందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు కాలెండర్ ఏర్పడడంలో జరిగిన పరిణామాల్ని గమనిస్తే, మనం ముహూర్తాలని, వర్జ్యాలని నమ్మటం ఎంత అర్థరహితమో అర్థమవుతుంది. 
  3. రాకెట్ కథ: కరెంటు కథలాగే ఇది కూడా పూర్తిగా రాకెట్టు కథ. చదివి ఆనందించొచ్చు. అక్కడక్కడా టెక్నికల్ విషయాల మీద వివరణ కొద్దిగా ఎక్కువగా వున్నట్టు అనిపిస్తుంది. అది మినహా మిగిలిందంతా బావుంటుంది.
  4. సౌర శక్తికి సంకెళ్ళు:  మిగిలిన వాటితో పోలిస్తే ఈ పుస్తకం చదవడానికి కొంచం ఎక్కువ సమయం పట్టింది. టెక్నికల్ విషయాలే కాకుండా, వాటికి సంభందించిన లెఖ్ఖలూ వివరణలూ ఎక్కువగా వున్నాయి. అయితే ఇప్పటికీ ఈ పుస్తకంలోని మూల విషయాలు మారకపోయినా, సౌర విద్యుత్తులో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. ఆ విధంగా చూస్తే ఈ పుస్తకం ఇప్పుడు చదవడం సరి కాదు. ఇప్పుడు జరుగుతున్న మార్పులని ఇంత వివరంగా, ఇంత సులభంగా,  ఈ పుస్తకానికి రెండవ ఎడిషన్లా ఎవరైనా చెప్తే బావుంటుందనిపించింది.
  5. ప్రపంచానికి ఆఖరి ఘడియలు:  మనిషికి ప్రపంచం గురించి తెలిసినప్పటినుంచీ, ఈ ప్రపంచం ఎప్పుడు అంతమవుతుందో అని ఎదురు చూస్తున్నాడేమో అనిపించింది ఈ పుస్తకం చదువుతుంటే. ప్రపంచం లో వివిధ సందర్బాల్లో, వివిధ ప్రదేశాల్లో, ప్రపంచాంతం గురించి వచ్చిన పుకార్లని గురించి చెపుతూ, నిజంగా ప్రపంచాంతం ఏ ఏ విధాలుగా జరుగవచ్చో, సైంటిఫిక్ గా వివరిస్తూ సాగిన పుస్తకం ఇది. సైన్స్ అభివృద్ది చెందని రోజుల్లో జరిగిన విషయాల గురించి చదువుతుంటే, అప్పటికీ ఇప్పటికీ ఇలాంటి విషయాల్లో మనుషుల్లో పెద్ద మార్పేమి లేదనిపించింది. నా వరకూ నాకు 2012 లో జరిగిన హడావిడి గుర్తొచ్చింది. సరదాగా సాగుతూనే, చివరికి వచ్చేసరికి మన జీవితాలు ఎంత చిన్నవో గుర్తు చేసినట్టనిపించింది.  

 

మొత్తమ్మీద తెలుగులో ఇంత మంచి సైన్స్ పుస్తకాలని చదువుతానని అనుకోలేదు. వీరికి వున్న విషయ పరిజ్ఞానం కొన్ని చోట్ల చాలా ఆశ్చర్యం కలిగించింది. ప్రతీ విషయాన్ని ఎంతో లోతుగా తెలుసుకుంటే కానీ చెప్పిన విషయాల మీద అంత పట్టు రాదు.  విషయ పరిజ్ఞానానికి తోడు మంచి శైలి కూడా వుండటం ఈ పుస్తకాల విలువని చాలా పెంచింది.  పదిహేను సంవత్సరాల వయసులో ఈ పుస్తకాలు చదివి వుంటే సైన్స్ లో కొన్ని మార్కులు  ఎక్కువ వచ్చేవేమో అనిపించింది. ప్రస్తుత కాలంలో ఇంత మంచి సైన్స్ రచనలు ఆశించటం అత్యాశే అవుతుందేమో అనిపించినా, అంత కంటే బాధపెట్టిన అంశం, ఈ రచయితవే చాలా పుస్తకాలు ముద్రణలో లేక దొరక్కపోవటం.  

 

ఇంకా ఈ క్రింది పుస్తకాల కోసం ప్రయత్నిస్తున్నాను, 

  1. టెలిగ్రాఫ్ కథ
  2. నిప్పు కథ
  3. టెలిఫోన్ కథ
  4. గ్రహణాల కథ
  5. పిడుగు దేవర కథ
  6. నక్షత్ర వీధులలో భారతీయుల పాత్ర

 

ఎప్పటికి దొరుకుతాయో చూడాలి!!!

 

You Might Also Like

5 Comments

  1. లియో

    మంచి పరిచయంతో పాటు పుస్తకాల చిట్టా కూడా యిచ్చారు. ధన్యవాదాలు. నండూరి రామ్మోహన్, కొడవటిగంటి రోహిణి ప్రసాద్ గారి పుస్తకాల గురించి కూడా వివరించండి.

    1. Sudheer

      లియో గారు, ధన్యవాదాలు. తప్పకుండా వారి పుస్తకాల మీద కూడా నేను అర్థం చేసుకున్నది వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

  2. naveen kumar dakoju

    Please post the links to buy the books.

Leave a Reply