తేజో తుంగభద్రా – వసుధేంద్ర
విస్తార్ హై అపార్, ప్రజా దొనొ పార్
ప్రజా దొనొ పార్, నిశ్శబ్ద్ సదా
ఓ గంగా తమ్
ఓ గంగా తుమ్ బహతీ హో క్యూ?
భుపేన్ హజారికా రాసి, పాడిన ఈ పాటలో, తన ఇరువైపులా ఉన్న ప్రజానీకం ఆకలితో, అజ్ఞానంతో అలమటిస్తున్నది చూస్తూ కూడా ఎందుకు, ఎలా నిశ్శబ్దంగా ప్రవహించగలుగుతున్నావ్ అని గంగానదిని నిలదీశాడు. ఏడేడు జన్మాల పాపాలని మూడు మునకల్లో ప్రక్షాళన చేయగల మహిమ ఉన్న నది, నిర్బలంగా ఉన్న జనాన్ని బలవంతులుగా చేయలేదా అని ఆయన ఆక్షేపణ.
కానీ నదులంతే! అలానే చూస్తూనే ఉంటాయి. నగరాలు ఏర్పడం, రాజులు వచ్చి పోవటం, యుద్ధం, శాంతి, ఐశ్వర్యం, క్షేమం, క్షామం – అన్నింటిని చూస్తూనే ఉంటాయి. మౌనంగా! ఆ మౌనానికి భాష నేర్పి, వాటి లోలోపల దాగున్న కథలన్నీ బయటకు తీసి వినిపించాలంటే చరిత్రను సామన్యుని దృష్టితో చూడాలి. తారీఖులు, శిలాశాసనాలను దాటుకొని మనసుల కథలను, వ్యథలను వినిపించాలి.
అలా ఏ ఒక్క ప్రాంతానికో, నదికో పరిమితమైన కథలను రాయడమే కత్తి మీద సాము. ఒకే కాలంలో, అనంత సాగరాలు విడదిసీన రెండు వేర్వేరు సామ్రాజ్యాల, విభిన్న సంస్కృతుల, వేర్వేరు భాషల, అక్కడి సామాన్య జనజీవనాన్ని గురించి రాస్తూ రెంటిలోనూ సామ్యాలను వెతుక్కుంటూ రావడమే కాక, ప్రస్తుత రాజకీయ సామాజిక నేపథ్యాలు గుర్తొచ్చేలా కథ చెప్పగలడం “తేజో తుంగభద్ర” నవలలో కన్నడ రచయిత వసుధేంద్ర చేశారు.
*******
“అనగనగా ఒక రాజు…” అంటూ మొదలయ్యే కథల్లో రాజుగారి ఏడు చేపల్లో ఒకటి ఎందుకు ఎండలేదనే గొడవే ఉంటుంది కానీ, ఆ చేప ఎండని పాపానికి ఏ సామాన్యుడి కాలో, చేయో, లేదో మెడో విరచబడిందని మనకు తెలీదు. ఆ చేప త్వరగా ఎండాలని ఏ బడుగుజీవినో బలిస్తే అదీ తెలీదు. అవన్నీ తెలియాలంటే చరిత్రలో వచ్చి పోయిన రాజుల గురించే కాదు, ఆ రాజుల పరిపాలనలో బతికిన సామాన్యుల గురించి తెల్సుకోవాలి.
తేజో తుంగభద్ర సామాన్యుని చరిత్ర మాత్రమే కాదు. ఇదో “వలస” నవల. (A book of migration!) ఇందులో అన్ని రకాల వలసలనూ చూబించారు: పని దొరక్క ఒక ప్రాంతంలో ఇంకో ప్రాంతానికి వెళ్ళడం (హొయసలా రాజ్యం అంతమయ్యాక అక్కడి శిల్పులు విజయనగరానికి పనికోసం రావడం), ప్రభుత్వాలు ఒక మతాన్ని ఆమోదించకపోవడంతో జరిగే బలవంతపు వలసలు (స్పేను రాజులు యూదులని వెళ్ళగొట్టటం), డబ్బు సంపాదించి దరిద్రాన్ని పోగొట్టుకోడానికి చేసే వలసలు (భారతదేశాన్ని ఖజానాల పుట్టగా భావించి, వాస్కో డి గామా కనుక్కున్న సముద్రదారి వెంట పోర్చుగీసు యువకులు ధనాశతో రావటం), ఉన్న చోటున దొరకని గౌరవమర్యాదల కోసం వెళ్ళటం. (విజయనగర సామ్రాజ్యంలో దేవదాసీల గురించి విని పోర్చుగీసు వేశ్య ఇక్కడకి వస్తుంది. కేరళలో హరిజనుడిగా బతుకీడుస్తూ పోర్చుగీసుకి వలస వెళ్ళిన వాడొకడు.)
దేశాలు వేరైనా, ఎక్కడైనా ఎప్పుడైనా, సామాన్యుల స్థితిగతులు, కష్టనష్టాలు కొద్దికొద్ది తేడాలతో అలానే ఉంటాయనుకుంటా. దూరపు కొండలు నునుపు కాబట్టి అప్పటి కాలంలో భారతదేశాన్ని బంగారు గనిగా భావించి వెతుక్కుంటూ వచ్చినా, ఇప్పటి కాలంలో అవసరానికి, వెసులుబాటుకి భారతీయులు అక్కడికి ఎగురుకుంటూ వెళ్ళినా, ఏదీ “డ్రీమ్ లాండ్” కాదు, కాలేదు. ఒకటి దొరికితే పది వదులుకోవాలి. అన్నీ వదులుకున్నా, ఆ దేశాన్నే నమ్ముకున్నా స్వదేశపు ఆనవాలు పోవు కదా! గుర్తింపు కార్డుల్లో ఏమున్నా, మనిషిని చూస్తే “అక్కడి వాడు ఇక్కడికొచ్చాడ”న్న స్పృహ పోదు కదా!
ప్రస్తుతం ప్రపంచమంతా ఇదే గోల! “బయటవారి”ని గురించే పేచీ. దీన్నే వసుధేంద్ర సూటిగా నిలదీస్తారు.
స్పేను నుండి పోర్చుగల్‌కి వలస రావాల్సిన పరిస్థితుల్లో ఉన్న యూదుల కష్టనష్టాల గురించి ఓ యూదుడు వాపోతూ ఇలా అంటే:
“గుర్రాలపై ఎక్కించిన సామానుతో సందుల్లో, గొందుల్లో జారుకుంటూ ఎప్పటికీ బతకాలి. కేవలం మా జీవితకాలంలోనే కాదు, మా పిల్లల జీవితాలకి ఈ పరాయితమనే కంటకాలు గుచ్చుకుంటూనే ఉంటాయి. ఒక భూభాగానికి మేము స్థానికులమని అనిపించుకోడానికి ఎంత కాలం కావాలి? దాన్ని నిర్థారించేదెవరు?”
భారతదేశంలో తక్కువ కులంలో పుట్టి, వివక్షకు గురై, కొత్త దేశంలో సమానత్వం చూసిన ఒకడు ఇలా అంటాడు:
“అపాయకరమైన పనని తెలిసే ఒప్పుకున్నాను. మరేం చేస్తాను? ఎక్కువ మర్యాద దొరకాలంటే మనిషి అపాయకరమైన పనులనే స్వీకరించాలి. జన్మభూమి స్వర్గానికి సమానమని ఎందరో అంటుంటారు. అయితే ఆ మాట అందరికి అన్వయించుకోలేము. వలస వెళ్ళిన భూమిలోనే ఎక్కువ మర్యాద, ఖుషీ ఎంతోమందికి లభిస్తుంది.”
మనుషుల వలస మాత్రమే కాకుండా రచయిత పట్టుకున్న మరో వలస – కొన్ని వృత్తులు పాతవైపోయి వాటి స్థానాన్ని కొత్తవి ఆక్రమించుకోవడం.
రాళ్ళు చేత్తో కొట్టి శిలాసాననాలు చేయడం పాతదైపోతున్న కాలం. పుస్తకాల్లో అక్షరాలను రాయనవసరం లేకుండా ప్రింటింగు ప్రెస్సును కనిపెట్టిన కాలం. అక్షరాలని ఒత్తచ్చు కానీ చిత్రాలను ఇంకా చేతితోనే గీయాల్సిన కాలం. కులవృత్తులని వదిలి వేరే వృత్తులు స్వీకరించడం మొదలైన కాలం. వృత్తిపరంగా చూసుకుంటే ఎల్లకాలమూ సంధికాలమేనేమో. అయితే కథాకాలంలో ఈ మార్పులని అంతర్భాగంగా చేసుకుంటూ కథ అల్లుకుంటూ రావడం గొప్పగా ఉంది.
వృత్తులు చేపట్టేదీ మగవాళ్ళే! వలసలు వెళ్ళేదీ వాళ్ళే! అందుకని ఇలాంటి కథలో ఆడవాళ్ళ ప్రమేయం నామమాత్రంగా ఉంటుంది. మహా అయితే “సపోర్టింగ్ రోల్”. వాళ్ళని ఆ పరిమితుల్లో అలా ఉంచుతూనే రచయిత వారి మనోగతాన్ని, అంతర్మధనాన్ని ఆవిష్కరించే ఏ అవకాశమూ వదులుకోలేదు. వాళ్ళని అర్థంచేసుకోవడానికి కావాల్సినంత “స్పేస్” ఇచ్చారు.
వజ్రాలు, వైఢూర్యాలను వీధుల్లో రాశులుగా పోసేంత సుభిక్షంగా ఉన్న రాజ్యంలో, రాజే గొప్ప కవిగారైన విజయనగర సామ్రాజ్యంలో సామాన్య ఆడవాళ్ళ జీవితాలు ఎలా ఉండేవో తెల్సుకోవాలంటే ఈ రచన బాగా దోహదపడుతుంది. సతి అనే ఆచారం గురించి చాలా వివరంగా తెల్సుకునే అవకాశం ఉంది. ఆడైనా, మగైనా అప్పటికాలంలో self inflicted violence నాకు హడలు పుట్టించింది. కొన్ని సంఘటనలోని హింసను చదువుతుంటే కడుపులో దేవింది.
వసుధేంద్ర అంటే మోహనస్వామి అనే ముద్ర పడిపోయింది కాబట్టి, ఇందులో హిజ్రా పాత్రలు ఉంటాయన్న అనుకోలు సహజమే. అయితే, కేవలం ఒక్క పాత్ర ద్వారానే ఆయన అప్పటి LGBTQ+ స్థితిగతులని చిత్రీకరించారు. అలానే దేవదాసీల జీవితాలని ఒక్క పాత్ర ద్వారానే తేటతెల్లం చేశారు. కృష్టదేవరాయలకి దేవదాసి పాత్రకు మధ్య నడిచే సంభాషణ నాకు బాగా గుర్తుండిపోయే సన్నివేశం.
దేవదాసీలతో, హిజ్రాలతో పోలిస్తే (ఎవరి అవస్థను తక్కువచేసే ఉద్దేశ్యం లేదు) అప్పటి ఆడవాళ్ళే అందరికన్నా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారనిపించింది. రచయిత కూడా వారి మనోగతాన్ని గొప్పగా ఆవిష్కరించారు, సందర్భానుసారంగా. భర్త చెక్కిన శిల్పాలను దుండగులు నాశనం చేస్తే, మనసు విరిగిపోయిన అతడు మళ్ళీ ఉలి పట్టనంటాడు. దానికి భార్య ఇలా అంటుంది:
“ఒకసారి శిల్పాలను దుష్టులు నాశనం చేస్తే ఏమవుతుంది? కౌశలం తెల్సినవారు మళ్ళీ అదే పనిని ఇంకోసారి చేయడంలో గొప్ప సవాలు ఏముంది? ఎంతోమంది ఆడవారు తమకు పుట్టిన బిడ్డ ఒకటి ఏదో ప్రాణాంతక వ్యాధిన పడి కంటి ముందే బలవుతుంటే చూస్తారు. ఆ కొరత కొన్నాళ్ళవరకూ ఉంటుంది. అయితే మళ్ళీ కొన్ని రోజులకి ఇంకో బిడ్డను గర్భంలో మోస్తూ కొత్త కలలను కనడం మొదలుపెడతారు. శిల్పాలను ధ్వంసం చేయడం బిడ్డలను పోగొట్టుకోవడంకన్నా దుర్భరమా? ఆడవాళ్ళు ధైర్యంగా ఎదురుకునే సవాలును మగవాడైన కేశవునికి ఎదిరించడం ఎందుకు కష్టమవుతుంది?”
“వలస”, “వృత్తి” కాకుండా ఇందులో మరో ముఖ్యమైన పాత్రగాని పాత్ర మతం! మతవిద్వేషాలు, బలవంతపు మతమార్పిడిలు చారిత్రక నేపథ్యంలో అనేకం జరుగుతాయి ఈ రచనలో. ప్రస్తుతం ప్రపంచంలో మనం చూస్తున్న విద్వేషాలేవీ కొత్తగా పుట్టుకొచ్చినవి కావనీ, ఎప్పటినుండో ఉన్నవనీ, ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో రూపాంతరం మాత్రమే చెందుతున్నాయనీ గుర్తుచేస్తుంది ఈ నవల. మతవిద్వేషాలను గురించి ఒక పాత్ర అడిగిన ఈ ప్రశ్నను మనం గుర్తుచేసుకుంటూ ఉంటే, కొన్ని శతబ్దాల తర్వాత మన కథలు రాయాల్సివచ్చినప్పుడు ఇదే వృత్తాంతం, ఇవే సమస్యలు కాకుండా వేరుగా ఉంటాయి.
“ఈ మానవ ద్వేషంలో ధర్మం పాత్ర ఎంత, మనిషి పాత్ర ఎంత?”
******
రెండు నదులను, వాటి మధ్య అనంత సముద్రాన్ని తీసుకొని రాసిన ఈ నవలలోని కథనం కూడా అలాగే సాగుతుంది. ముందు ఏ నదికి ఆ నది ప్రత్యేకంగా కనిపిస్తుంది. పోలికలకన్నా తేడాలే కనిపిస్తుంటాయి. కానీ ఎక్కడో, ఎప్పుడో నదులు, వాటి ఒడ్డునున్న వారి బతుకులు ఒకేలా కనిపించడం మొదలవుతాయి. ఒకటైపోతాయి. గుట్టా పుట్టా, చెట్టూ చేమా ఏమీ కనిపించని అనంత సాగరం మీద ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది మధ్యలో.
కథ మొత్తం ఒకడే నరేటర్ సరళ భాషలో చెప్పుకొస్తుంటాడు. నరేషన్ కూడా చాలా సరళంగా సాగిపోతున్నట్టు అనిపిస్తుంది గానీ, రచయిత చాలా తెలివిగా కథను అల్లారన్న సంగతి చివరికొచ్చే దాకా గుర్తించలేం. నాకైతే మూడొంతలు దాకా వచ్చేక ఉత్కంఠత పెరిగిపోయి, సస్పెన్స్ థ్రిల్లర్‌లా అనిపించింది.
కేవలం ఒక “గే రైటర్”గానే వసుధేంద్రని ముద్ర వేస్తున్న సమయంలో ఆయన చారిత్రక నవల రాయడమే కాకుండా, ఎన్నుకున్న నేపథ్యాలు ఎంత చారిత్రకమో అంత contemporaryగా రాసుకురావడం విశేషం. ఆయన తక్కిన కథలు, మోహనస్వామి ఒక ఎత్తు. తేజో తుంగభద్ర ఒకటీ ఒక ఎత్తు. ఇది కన్నడవారికే కాదు, యావత్తు భారతీయ సాహిత్యానికి ఒక పెద్ద బహుమానం.
ఈ రచన త్వరలో ఇంగ్లీషు అనువాదంలో లభ్యమవ్వబోతుంది.
(నాకు కన్నడం రాదు. ఈ పుస్తకాన్ని చదవాలన్న పట్టుతో ఒక స్నేహితునితో కలిసి వాట్సాపులో ప్రతి రోజూ గంట కాల్‌లో రెండు పేజీలు చొప్పున, ప్రతి పదం తెలుగులో చెప్పుకుంటూ, చదువుకుంటూ మొదటి ముప్ఫై పేజీల వరకూ పూర్తిచేశాను. ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా చదువుకుంటూ పోతే ఓ రెండు నెలలలో పుస్తకం పూర్తిచేయగలిగాను. ప్రత్యక్షరం అర్థమైందని చెప్పలేను కానీ, కథ నడుస్తున్న కొద్దీ ఉత్కంఠత పెరుగుతూ చదవటం ఆపలేని పరిస్థితి వచ్చిందంటే శైలి ఎలా ఉందో ఊహించుకోండి. భాష రాని నాకే ఇలా ఉంటే ఇక భాషొచ్చి సారాన్ని పూర్తిగా గ్రహించగలిగే వారి ఆనందం చెప్పక్కర్లేదు . అందుకే ఈ పుస్తకం కన్నడ సాహిత్యలోకాన్ని ఒక ఊపు ఊపుతుంది.
పైన పుస్తకంలోంచి ఉదహరించిన వాక్యాలకి అనువాదం నాదే! అర్థాన్ని అందించడానికే తప్ప శ్రద్ధగా చేసిన అనువాదం కాదు. తప్పులుంటే మన్నించగలరు.)
Leave a Reply