మానవాళి ని రక్షించే కనురెప్పలు

వ్యాసకర్త: వేల్పుల రాజు
**************
ప్రస్తుతం ప్రపంచాన్ని ఇంటికి పరిమితం చేసి దాదాపు మూడు లక్షల మంది ప్రజలను పొట్టన పెట్టుకున్న కనిపించని కరోనా క్రిమి రక్కసి బారి నుండి ప్రజానీకాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి బాధితులకు చికిత్స చేస్తున్న వైద్య బృందాలు, లాక్ డౌన్ కోసం నిరంతరం శ్రమిస్తున్న రక్షణ యంత్రాంగం, ఎప్పటికప్పుడు పరిశుభ్రత సేవలు అందిస్తున్న సపాయి కార్మికులు, ఆపద సమయంలో మానవత్వం తో పేద వారికి చేయూత నిస్తున్న దాతలు, ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,స్వచ్ఛంద సంస్థలు ,ఇలా అందరు ఏకమై మానవత్వాన్ని చాటుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలలో చైతన్యం కలిగించడానికి యువ కవి దుర్గమ్ భైతి తన వంతు చిరు ప్రయత్నం గా రూపొందించిన14 కవితల ఈ – పుస్తకమే “మానవాళి కనురెప్పలు” పేరు లోనే కాదు ఇందులోని ప్రతి కవిత చదువుతుంటే డాక్టర్లు, రక్షక భటులు,సపాయి కార్మికులు,దాతలు కరోనా బాధితులకు కనురెప్పల వలే ఏవిధంగా ఉన్నారో తెలుస్తుంది.

ప్రపంచమంతా కుటుంబ సమేతంగా /
ఇంటి పట్టున ఖైదీ గా మారితే /
తను నిత్యం కనిపించని /
కోరలు చాచిన కరోనా తో /
యుద్ధం చేస్తూనే ఉన్నాడు /
ఆ రాక్షసి ఏ వైపు నుండి /
దాడి చేస్తుందో తెలియదు /
ఎవరి రూపంలో తన దరికి /
చేరనుందో తనకు అనవసరం /
చేతనైనంత మంది బాధితులను /
కాపాడడమే తన కర్తవ్యం/ అంటూ దైవం వైద్యుని రూపేణా అనే కవిత లో వైద్య బృందాల సేవలకు అక్షర రూపం ఇచ్చారు.

పరిమళించిన మానవత్వానికి /
నిలువెత్తు నిదర్శనం/
నిరంతరం నిస్వార్ధ సేవకే /
అంకితమైన ఉద్యోగుల వేదిక /
అంతరించిపోతున్న మనిషితత్వానికి/
ఊపిరి పోసిన సేవా భావన / గాంధీ ఆసుపత్రి గొప్పతనాన్ని వర్ణించిన ఈ కవిత అంతరించిపోతున్న మానవత్వాన్ని తట్టి లేపుతుంది.ప్రాణాలను లెక్కచేయని సిబ్బంది త్యాగ నిరతిని కొనియాడారు.

కరోనా నీకిది తగునా /
నిత్యం రెక్కల కష్టం తో కడుపు నింపుకునే /
కార్మికుల కూటిలో రాళ్లు వేసావు /
నిండు మనసుతో ఆలోచించు/
ఇక నైనా కరుణ తో శాంతించు /
మాపై కనికరం చూపించు / కార్మికుల శ్రేయస్సు కోసం ఇక శాంతించు మని కరోనా క్రిమి రక్కసిని ప్రాధేయపడే కవిత చదివితే కంట తడి పెట్టిస్తుంది.

లాకెడౌన్ సమయంలో తన బిడ్డ పిల్లలను చూడడానికి ముసలవ్వ పడే తపన ,ఆరాటం ఆమె కడుపు తీపిని గుర్తు చేస్తుంది. అలాగే పల్లెటూరులో ఉన్న తాత గారిని జాగ్రత్తగా ఉండమని మనవడు చెప్పే విధానం బాగుంది.ప్రపంచం ఆగినా సపాయిలు, వైద్యులు, రక్షణ కవచాల నడక ఆగలేదని మరో కవితలో చెప్పారు.

చెరగని చిరునవ్వుతో బాధిత రోగులను /కంటికి రెప్పలా నిరంతరం కాపాడుతున్న /వైద్య రూపంలో ఉన్న నడిచే దేవతలారా /
ఈ జగత్తు మీ ఋణం ఎలా తీర్చగలదు అంటూ కవి దుర్గమ్ భైతి మానవాళి కనురెప్పల గురించి వివరించడం బాగుంది.

మొదటి కవితా సంపుటి అక్షర సేద్యం (2014 ),రెండవ కవితా సంపుటి అలుకు మొలకలు (2017 ) లతో సామాజిక సమస్యల ఇతివృత్తం తో వ్రాసి పాఠకుల ఆదరణ పొందిన కవి తన మూడవ కవితా సంపుటిని కరోనా,లాక్ డౌన్ నేపథ్యంలో వ్రాయడం తన సామాజిక స్పృహ ను తెలియచేస్తుంది. కవిత్వం అందరు వ్రాస్తారు. మనసుని వెంబడించే కవితలు పది కాలాల పాటు గుర్తుంటాయి. అలాంటి కవితలు ఇందులో చాలా ఉన్నాయి. ఈ పుస్తకం పీడీఎఫ్ కావలసిన వారు కవి సెల్ నంబర్ 9959007914 ను సంప్రదించవచ్చు.

You Might Also Like

Leave a Reply