కరుణ రస ప్లావితం – విశ్వనాథ సాహిత్యం

రచయిత: జువ్వాడి గౌతమరావు
ఎంపిక చేసి, టైప్ చేసి పంపినవారు: సూరంపూడి పవన్ సంతోష్‌

(కోవెల సంపత్కుమారాచార్య రాసిన విశ్వనాథ సాహిత్య దర్శనం పుస్తకానికి “తనమాట” పేరిట జువ్వాడి గౌతమరావు రాసిన ముందుమాటలోంచి ఆఖరు నాలుగు పేరాలు మినహాయించి విశ్వనాథ సత్యనారాయణ గురించిన భాగం ఇలా అందిస్తున్నాం. పాఠకుల సౌకర్యార్థం వ్యాసానికి భావించి నేనే పేరు పెట్టాను, ఆ పేరు రచయిత పెట్టినది కాదని పాఠకులు గమనించ మనవి. – పవన్ సంతోష్‌)

(ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్.)

************

విశ్వనాథ సత్యనారాయణగారిని గురించి వ్రాయవలెనంటే నిజంగా కొంత కష్టమయిన వ్యవహారమే. ఎందుకంటే, ఎక్కడ మొదలు పెట్టవలెనో తెలియదు.

నేను ఎక్కువగా చదివిన వాడనుగాదు. కారణం మొట్టమొదటనే విశ్వనాథ సత్యనారాయణ అనే సుడిగుండంలో పడటం. అందులో గిరగిరా తిరుగుతూనే ఉంటాము తప్ప బయటికి రాము, రావాలని అనిపించదు కూడా. ఇతరుల విషయం నాకు తెలియదు. నా విషయంలో ఇది అక్షరాలా నిజము.

నాకు ఇంచుమించు పన్నెండేండ్లు ఉన్నప్పటి విషయం కావచ్చు. అంతకంటే ఎక్కువ లేవు అని చెప్పటానికే ఇలా సందిగ్ధంగా చెప్పుట. మా తెలుగు ఉపాధ్యాయులు శ్రీ దూపాటి వేంకట రమణాచార్యులుగారు. (శేషాద్రిరమణ కవులలో నొకరు). మాకు సదా స్మరణీయులు. ఆయన ‘చెలియలి కట్ట’ అనే పుస్తకం చదువుతూ ఉండగా చూచినాను. అప్పటికి ‘నవలలు’ అంటే నాకు తెలియదు. ఆనాటి గ్రంథాలయోద్యమం రోజుల్లో మా కరీంనగరములో కూడా ఒక గ్రంథాలయము వెలసింది. ఆ దాపున ఉన్న మా సహాధ్యాయి ఒకడు అందులో నుంచి నవలలు అనే పుస్తకాలు పట్టుకొని వస్తుండేవాడు. అవి అపరాధ పరిశోధక నవలా రాజములు. ఎక్కువ భాగము బెంగాలీలో పాంచ్ కడీ దేవ్ మొదలయినవారు వ్రాసిన వాటికి అనువాదములు. ఫూల్‌సాహెబు, జులేఖా, అరిందముడు ఇత్యాదులు అప్పుడు మా మనస్సులలో సుప్రతిష్ఠితులు. మేమిద్దరము తరగతిలో వెనుక బెంచీల మీద కూర్చుండి అటు పాఠము సాగుతుంటే ఇటు ఈ నవలలు చదువుతూ ఉండే వాళ్ళము.

ఆ స్థితిలో నాకు ఈ ‘చెలియలి కట్ట’ కనపడినది.

‘చెలియలి కట్ట’ అంటే ఏమిటో నాకు తెలియదు. మా రమణాచార్యులు గారూ నేనూ ఒక పెద్ద ఆవరణములో ఉన్న ఒక ఇంటిలోని వేరు వేరు భాగాలలో ఉంటుండే వాళ్ళము. భాగములోనికి రాకపోకల చనువు నాకు ఎక్కువగానే ఉండేది. పాఠ్య గ్రంథాలే తప్ప మమ్ము నవలలూ గివలలూ చదువ నిచ్చేవారు కారు. అందుచేత వారికి తెలియకుండా వారి ఇంటిలో నుంచి ఆ పుస్తకం ఎత్తుకవచ్చి, కందిలీ దీపం వెలుగులో రాత్రి పొద్దుపోయే దాకా ఏకబిగిని చివరిదాకా చదివి పొద్దున్నే మళ్లా వారి ఇంటిలో యథాతధంగా పెట్టి వచ్చినాను.

ఇదంతా ఇంత వివరంగా ఎందుకు వ్రాస్తున్నానంటే – ఒక పన్నెండేండ్ల పిల్లవాని ఎదలో కలిగిన ఒక ఇదమిత్థమని చెప్పరాని ఒక తీవ్రమయిన, ఒకప్పుడూ మరచిపోరాని కదలికను చెప్పటానికోసము మాత్రమే. ఆ కదలిక ఎట్లా కలిగిందనే విచారమే లేదు.

కడలిలో కొండయంతటి కరడు లేచి పెల్లగిల్లినది – ఇది మొదలు.
నిర్దయా స్వాంతమగు వారినిధికి ఘోర కర్థమాభీల జలపాతకంబు లేచి’ – ఇది చివర.

ఇదంతా నాకు అర్థమయిందని చెప్పుటకుకాదు. అప్పటి కరీంనగరము జిల్లా కేంద్రమయినా – నిజమునకొక పల్లెటూరు. పల్లెటూరు లక్షణాలను అప్పటికి పూర్తిగా జార్చుకోలేదు. జన సంఖ్య పదివేలయినా ఉన్నదో లేదో! కరెంటు లేదు. కటిక చీకటి. ఆ స్థితిలో మనోనేత్రానికి కనబడే ఒక స్త్రీ, ఒక పురుషుడు. ఇరువురూ సముద్రాభిముఖముగా, ఉవ్వెత్తు తుపానుతో కళపెళలాడుతున్న సముద్రాభిముఖముగా నడచి పోతున్న వారు.

‘ఆ సముద్రము కరిగించి పోసిన ఇనుమో, సీసమో – దానికి పోలికే లేదు… అది జాగ్రదవస్థ కాదు. కాకను పోలేదు. మృత్యువు రాలేదు. వచ్చినంత పనియయినది. ఆ స్థితి యెట్టిదో వేదాంతములు చెప్పవు.’ –

ఎట్లా ఉంటుంది ఆ పిల్లవాని మానసిక స్థితి – ఇదంతా చదివి?

చిన్న వయస్సులో విశ్వనాథ సత్యనారాయణగారి నవలలు – పుస్తకాలు చదువుటలో ఒక బాధ ఉన్నది. ఆ వయస్సులోనే ఒక విషాద లక్షణం – కారణం ఏర్పరుచుకోరానిది, తెలియరానిది – మనస్సులో స్థిర పడిపోతుంది.

‘సుందరుడతడు వెడందలౌ కన్నులు
నతని జూచిన గుండె యందు నుండి
త్రవ్వుక వచ్చునే, తారుణ్య భావ ప
యః పయోధి నవనీతాకృతీ! యె
దో గాలివంటిది దుఃఖ తరంగమ్ము
వికృతమౌ నానంద విధురవీచి –‘

అంటాడు సీతాదేవితో ఆంజనేయుడు శ్రీ రామచంద్రుని వర్ణిస్తూ – రామాయణ కల్పవృక్ష మహాకావ్యములో. సత్యనారాయణగారి సర్వసాహిత్య విషయములో నిది యథార్ధమని క్రమక్రమముగా నాకు అవగతమయినది. చెలియలి కట్టలో రంగని వెంబడి రత్నావళి బండిలో పోతున్నప్పుడు సీతారామయ్య – ఆ ఘట్టము చదివినచో కొంతలో కొంత నీ విషయ మనుభవమునకు వచ్చును.

విశ్వనాథ సత్యనారాయణగారి పెద్ద కుమారుడు అచ్యుతదేవరాయలు ఒక సారి నన్నడిగినాడు – ‘మా నాయన గారిని మీరు తిక్కన కంటె గొప్ప కవి అని అంటారా?’ అని. ‘కరుణం ప్రసక్తమయినప్పుడు తప్పకుండా అంటాను’ అని అన్నాను. ‘ఆ మాట నేనూ ఒప్పుకుంటాను’ అన్నారాయన.

వాల్మీకికి భవభూతి ఎట్లాగో, భవభూతికి సత్యనారాయణగారు యధార్థమయిన వారసుడు.

‘నెలలు గడచిన తరువాత నేర్చుకొనిన
యదియ న వ్వేడ్పుజన్మతోనైన గుణము
నవ్వెదేమిటికనుట ప్రశ్నంబుకాని
పరగ నేలేడ్తునన్నది ప్రశ్నకాదు’

సర్వజీవులూ కరుణాస్థానములే. ఆయా స్థానములను మరుగున బడి పోకుండా ఉద్దీప్తముగా మన కెరుక పరుచుట సత్యనారాయణగారి ప్రధాన లక్షణము. ఖరాదులు రాక్షసులు – మునులను చంపి తినెడు వారు.

‘ఖరుండొక మహాసాలంబు పెరికి రామచంద్రునిపైకి రాగా తద్వధానంతరమున స్వామి తదల్పగిరి ప్రస్తరంబున హస్తగత కపోలుండై కూర్చున్న పెద్ద సేపునకు సవ్వడిలేమి జానకీ లక్ష్మణులు గుహాముఖమ్ముల నుండి వచ్చి –
‘ఏదనుజున వధించినను నట్లె విషాదము నొందు, నాత్మమర్యాదుడు స్వామి… అనుకొంటారు. ఆ వధ ఆయన విధి. కరుణ ఆయన జీవలక్షణము. మా కొక ఉపాధ్యాయుడుండేవాడు – ఏడెనమిది తరగతులలో మేము సరిగా చదువుటములేదని ఆయనకు కోపము వచ్చినప్పుడు వచ్చి మమ్ము గట్టిగా వీపుల మీద గుద్దులు గుద్దేవాడు. చెంపలు వాయించేవాడు. కొంత సేపటికి వచ్చి మా వెన్ను నిమురుతూ, చెంపలు పుణుకుతూ – ఎందుకురా చదువవు, చెప్పినట్టు వినవు అని ఓదార్చేవాడు. అప్పుడాయన కన్నులలో తడి మాకు స్పష్టంగా కన్పించేది.

విశ్వనాథ సత్యనారాయణగారు కావ్యం వ్రాసినా, కథ వ్రాసినా, నవల రాసినా – ఏది వ్రాసినా, పాత్రలంతా లోకంలోని వ్యక్తులకు ప్రతిబింబాలే .ఆయన వారి మానసిక, ఆధ్యాత్మిక జీవితాలను అనుభవానికి తెస్తారు. ఇదీ సత్యనారాయణ గారు. ఇది నా తాత్పర్యం, నా అనుభవం.

You Might Also Like

Leave a Reply