గొల్లపుడి నవల “సాయంకాలమైంది” పై ఒక దృక్పథం

వ్యాసకర్త: చరసాల ప్రసాద్
***************
సాయంకాలమైంది. ఇది గొల్లపూడి ఒక నవల పేరు. ఇది ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్‌గా 2001లో వచ్చిందట. ఈ నెల (ఏప్రిల్ 2020) మా బుక్‌క్లబ్బు పఠనంగా తీసుకున్నాం. ఇలా దీన్ని సభ్యులు ఎన్నుకోకపోయుంటే గొల్లపూడి రచనలు నేనెప్పటికీ చదివి వుండేవాన్ని కాదేమో. ఎందుకంటే అక్కడక్కడా అతని వ్యాసాలను చదివి అతని ఆలోచనా దృక్పథం తెలిసినవాన్ని కనుక, అది నాకు పడదు గనుక అతన్ని విస్మరించాను. కానీ ఇప్పుడు తప్పనిసరై “సాయంకాలమైంది” చదవడమైంది.

స్థూలంగా కథ చెబుతాను. శ్రీవైష్ణవ సంప్రదాయంలో పురోహితుడిగా పనిచేసిన సుభద్రాచార్యులకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు చినతిరుమలాచార్యులు, కూతురు ఆండాళు. కొడుకు వున్నత చదువులు చదివి అమెరికా వెళితే, కూతురు సంప్రదాయానికి విరుద్దంగా ఒక కుమ్మరిని పెళ్ళిచేసుకొని బహిష్కృతురాలవుతుంది. సుభద్రాచార్యులు తన వృద్దాప్యంలో అటు కొడుకు ఆసరా లేక, ఇటు ఆండాళును దరిచేరనీయక చివరిదినాల్లో ఒక తక్కువకులం వాడి చేతి కూడు తిని చచ్చిపోతాడు. మూలకథ ఇంతే. అయితే ఇందులో పిట్టకథలు, పాత్రలు చాలా వున్నాయి. నాకు తోచినంతమేర నన్ను కుదిపినంతమేర ఆయా పాత్రలను చర్చిస్తాను.

నవలను ఎలా మొదలెట్టారో, నవల చివరికి వచ్చేసరికి మరిచిపోయినట్టున్నారు. సుభద్రాచార్యుల అంత్యక్రియల ఘట్టంతో నవల ప్రారంభం అవుతుంది. అందులో తనకొడుకు చినతిరుమలాచార్యులు వచ్చేవరకు శవం విశాఖపట్నం మార్చురీలో వుంచారని చెబుతారు. చినతిరుమలాచార్యులకు ఆచారాలు తెలియవని, పంచె ఎలా కట్టుకోవాలో తెలియదని చెబుతాడు. తక్కువ కులంవాన్ని పెళ్ళి చేసుకున్నందున బహిష్కృతురాలైన చెల్లెల్ని లోపలికి రకూడదని తెలిసీ “వాట్ నాన్సెన్స్? కమిన్!” అంటాడు. ఈ ప్రారంభంతో మొదలయిన నవల పాఠకుడికి చినతిరుమలాచార్యులు 40 ఏళ్ల కిందట అమెరికా వెళ్ళిపోయి, తల్లిదండ్రులను, ఆచారాలను మరచిపోయి, కేవలం ఇప్పుడు తలకొరివి పెట్టడానికి వచ్చినవాడిగా చూపిస్తాడు. కానీ నవల చదువుతున్నపుడు ఇదంతా తప్పు అని తేలుతుంది. నవల చివర్లో సుభద్రాచార్యుల వియ్యంకుడు అతనికి దహన సంస్కారాలు చేసినట్టు చెబుతాడు. అంతేకాదు.. చినతిరుమలాచార్యులు ఎల్లప్పుడూ తన తండ్రి బాగోగులు కనుక్కుంటూ వుండడమే కాదు, మధ్యలో రెండుముడుసార్లు వచ్చి వెళ్ళాడుకూడా. అతనికి నాన్న పాటించే సంప్రదాయం తెలుసు.

విశ్వనాథ వేయిపడగలకు మల్లేనే ఈ “సాయంకాలమైంది”కీ చాలామంది అభిమానులున్నారు. మాజీప్రధాని నరసింహారావు దీన్ని మెచ్చుకుంటూ లేఖ రాస్తే, అప్పట్లో జైల్లో ఖైదీగా వుండి తెలుగునేలకు బాగా పరిచయమైన “మొద్దు శీను” కూడా దీన్ని మెచ్చుకుంటూ లేఖ రాయడం ఒక వింత. ఇంకా నవల చివర్లో ఎందరో నవలని మెచ్చుకుంటూ రాసిన వుత్తరాలని ఉటంకించారు. యద్భావం తద్భవతి అని.. బహుశా నా దృష్టిలోపం కావచ్చు. ఈ నవల మొత్తం లోపభూయిష్టంగా, చాదస్తంగా. మితిమీరిన స్వోత్కర్షతో, బ్రాహ్మణ విలువల్నే సమాజ విలువలుగా చూపిస్తూ సాగిన నవల. ధర్మమని నమ్మిన ఒక సంప్రదాయానికి ఇది సాయంకాలం అని గొల్లపూడి బాధపడ్డారు. ప్రతి సాయంకాలం తర్వాతా ఉషోదయం వుంటుంది కదా?

ఇక సాహిత్యపరంగా మరొక పెద్ద లోపం.. నవలలో పాత్రల ద్వారా చెప్పించాల్సిన/పాత్రలే చెప్పాల్సిన పద్దతి వదిలేసి, ఈయన మధ్యలో దూరి అధిక ప్రసంగం చేయడం. మనం నవల చదువుతున్నామా లేక గొల్లపూడి వ్యాసం చదువుతున్నామా అని అక్కడక్కడా అనుమానం వస్తుంది. మరొక విషయం.. ఇందులో చాలా వైష్ణవుల ఇళ్ళలోని మాటలు, ఆచారాలు ఎటువంటి వివరణా లేకుండా రాసేసారు. వారి ఆచార వ్యవహారాల గురించి తెలియని నాలాంటివారికి అవేంటో తెలుసుకోవడం ఒక అభ్యాసన. నవల ముఖచిత్రం ఒక బ్రాహ్మణుడు. నవల ఉపోద్ఘాతం “శ్రీవైష్ణవ సత్సంప్రదాయ వైభవాన్ని..” అంటూ గొల్లపూడి చెప్పడంతోనే ఇది కేవలం బ్రాహ్మణ సాహిత్యం అని రూడీ అవుతుంది. ఇన్ని తప్పులతో ఈ నవల ఆంధ్రప్రభలో ఎలా సీరియల్‌గా వచ్చింది అని ఆశ్చర్యం కలుగుతుంది.

నవల మొదలుపెట్టడంలోనే ఏ కులం స్థానం ఎక్కడో స్పష్టంగా చెబుతూ దాన్నే వైభవం, నిష్ట, సత్సంప్రదాయం, పవిత్రం అనే విశేషణాలతో వర్ణిస్తాడు. అంటే నవల చెప్పదల్చుకున్నదేమిటో మొదటనే అర్థమయిపోతుంది. మచ్చుకు నవల ఇలా మొదలవుతుంది.. “వూరంతా ఇంటిముందు వుంది. పెన్మత్స వీర నరసింహ రాజు గారు పాలేళ్ళచేత కుంకుళ్ళతో తలస్నానం చేయించుకొని ఇంటిముందు కుర్చీలొ కూర్చున్నారు. అయ్యవారిమీద ఎండపడకుండా సాతాని గురయ్య గొడుగు పట్టుకు నిలబడ్డాడు. నవనీతం కారులో వచ్చింది కానీ కుర్చీవేస్తానన్నా కుర్చోవడానికి నిరాకరించింది. అది గౌరవంతో కాదు, అచారాన్ని పాటిస్తూ. వూరంతా యింటిముందే వున్నా పురోహితుడు అనంతాఆర్యులు, భోక్తలు వినా పిట్ట మనిషి కూడా గుమ్మందాటి లోనికి అడుగు పెట్టలేదు.”

ఒక సమీక్షలో ఈ నవల గురించి రాయడం పెద్ద సాహసం అవుతుంది. ఇందులో కులపిచ్చి వుంది. బ్రాహ్మణారాధన వుంది. వర్ణవివక్ష వుంది. స్త్రీ వివక్ష వుంది. బాడీ షేమింగ్ వుంది. అమెరికా మీద అక్కసు వుంది. ఒక్కోపాత్రను చిత్రీకరించడం మీద, ఒక్కో పాత్ర మీద రచయిత చూపే మక్కువ, ప్రేమ, అసహ్యం, వెక్కిరింపు గొల్లపూడి తనదైన శైలిలో వెల్లడించడం వుంటుంది. కథాకాలం 19 శతాబ్దం నుండి 20 శతాబ్దం వరకూ కాబట్టి మనకు అన్ని రకాల పాత్రలూ ఎదురు పడతాయి. కానీ కథకుడు కథ చెబుతున్నది 20వ శతాబ్దపు చివరి నాళ్ళలో. అయినా కథకుడి గొంతులోనూ చాదస్తమే. గడిచిపోయిన చాదస్తపు రోజుల గురించి వేదనే.

ఈ నవల అంతా ఎన్నో జుగుప్స కలిగించే సన్నివేశాలూ, డైలాగులూ వున్నా నవనీతంపై అత్యాచారాన్ని వర్ణించడంలో గొల్లపూడి సినిమాల్లో విలన్ పాత్ర బయటికి వచ్చింది. ఈ క్రింది పేరా మీరే చదవండి.

“సరుగుడు తోపులో జీడిమామిడిచెట్ల కింద పొన్నయ్య నవనీతాన్ని బలాత్కారం చేసి రేప్ చేశాడు. నవనీతం చేతిలో ఉన్న కిరసనాయిలు సీసా పగలగొట్టి పొన్నయ్యని పొడిచింది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు. పదేపదే పొడిచింది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పదే పదే నవనీతం మీద అత్యాచారం చేశాడు పొన్నయ్య. పొన్నయ్య బలాడ్యుడు. నవనీతం వయస్సులో ఉన్న పిల్ల. సెక్స్, పోరాటం రెండూ హోరాహొరీ సాగాయి. సగం విరిగిన సీసా గుచ్చుకున్నా పొన్నయ్య ఆగలేదు. ఆమె అందం, ఆమె పొందులో మైకం అతన్ని పిచ్చివాడిని చేసింది. నవనీతమూ కసితో, కోపంతో పిచ్చిదయింది. పాశవికమైన కోరిక ఆమెను కబళించింది. రక్తంలోని వేడి ఆమెను తిరగబడేటట్టు చేసింది.

కూలిపోతున్న యోధుడు శరీరమంతా బులెట్లు తూట్లు పొడిచినా ఆఖరి తుటా పేల్చి ఒక్క శత్రువునైనా కబళించి కూలిపోతాడు. దేశభక్తి, బాధ్యత, కర్తవ్య నిరతి వీటన్నిటికీ మించిన అతీంద్రియశక్తి శరీరంలో సమీకృతమవుతుంది.

కడుపులో, గుండెల్లో, ముఖంమీద సీసా గుచ్చుకొని రక్తం కారుతున్నా పొన్నయ్య ఆ అందమైన శరీరానికి ఆఖరి నివాళి సమర్పించి ఆమె కౌగిలిలో ప్రాణం వదిలాడు. ఒక్కక్షణం నేరాన్ని మరిచిపోతే, రెండు ప్రాథమిక శక్తుల పోరాటంలో ఇద్దరూ పోరాడి వీగిపోయారు. ఒకరు ప్రాణాల్ని, ఒకరు శీలాన్ని నష్తపోయారు. ఈ పోరాటాన్ని ఫ్రాయిడ్, మపాసా ఇద్దరే విశ్లేషించగలరు.”

నవల బాగా చదివిస్తుందనడంలో సందేహం లేదు, ఈ చాదస్తాన్ని జీర్ణించుకోగలిగితే/నచ్చితే. నవల డిజిటల్ కాపీ కినిగె వారి వెబ్‌సైట్‌లో లభ్యం.

You Might Also Like

5 Comments

  1. G K S Raja

    నవల చాలామందిని చదివించగలిగింది అనడంలో సందేహం లేదు. కానీ ప్రసాద్ గారి సమీక్ష అర్ధవంతమయినదే. కథలోని పాత్రల ఔచిత్యం, సందేశం (ఏమైనా ఉంటే) లోపభూయిష్టం గానే తోస్తాయి. ముఖ్యంగా సనాతనం ఛాందసంగా కనబడుతుంది. కులాల అంతరాలను పైమెట్టుకు ఎక్కించినట్టు రచయిత ఉద్దేశ్యంగా దర్శనమిస్తుంది. ఇక సాహిత్యప్రయోజనం అంటారా? చదివిస్తుంది. శైలి బావుంది. అంతే.

  2. Dr. Appalayya Meesala

    బాగా రాశారు. మనం కధలూ, చరిత్రలు ఒక బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుడు, వేదాలు నభ్యసించిన బ్రాహ్మణుడు ….వీరి చుట్టూ నే తిరిగుతాయి.

    1. ప్రసాద్

      సాహిత్యమూ, కళలూ, కథలూ అన్నీకూడా మనల్ని ఒక కోణంలో చూసేల చేస్తున్నాయి. అలాంటి ప్రయత్నమే గొల్లపూడి ఈ నవలంతా చేశారు.

  3. Chandrika

    ‘ఈయన మధ్యలో దూరి అధిక ప్రసంగం చేయడం’ – మీ సమీక్ష కూడా మీ దృష్టిలోపాన్ని పాఠకుల మీదకి రుద్దుతున్నట్లే ఉంది. ఏ పుస్తకమైనా ఆపకుండా చదివించగలిగి, ఆలోచింపచేసే విధంగా ఉంటే మంచి పుస్తకం క్రిందనే లెక్క. మిమ్మల్ని ఎంతగా ఆలోచింపచేసింది కాబట్టే మీరు సమీక్ష వ్రాసారు. అదీ సంగతి 🙂 అందుకనే ఎంతో మంది మెచ్చుకున్నారు.

    1. ప్రసాద్

      చంద్రిక గారూ,
      మనిద్దరం ఎంత వాదించినా మీ కోణం నాకూ, నా కోణం మీకూ అర్థం కాదు. అంత మత్రాన దాన్ని దృష్టిలోపం అనలేం.
      పలానా కుక్కను చూసి మీరు నక్క అనుకున్నారు అని మీరు వివరిస్తే నేను నాకు దృష్టిలోపం వుందేమో డాక్టరుదగ్గర చూపించుకుంటాను.

Leave a Reply