ఉత్సాహమే ఊపిరిగా – ఆత్మకథ, డా. ముక్కామల అప్పారావు
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి
మే 3, 2020 (ఇంటర్నెట్ సమావేశం)
చర్చాంశం: ఉత్సాహమే ఊపిరిగా – ఆత్మకథ, డా. ముక్కామల అప్పారావు
(ముద్రణ: డిసెంబరు 2018, ఎమెస్కో బుక్స్ ప్రచురణ, హైదరాబాదు, 328 పేజీలు, సంపాదకులు: డా. డి. చంద్రశేఖర రెడ్డి, వెల: రు. 200, ISBN: 978-93-88492-06-5)
పాల్లొన్నవారు: ఆరి సీతారామయ్య, వేములపల్లి రాఘవేంద్రచౌదరి, పిన్నమనేని శ్రీనివాస్, అడుసుమిల్లి శివ, చేకూరి విజయ్, వీరపనేని విష్ణు, బూదరాజు కృష్ణమోన్, మెట్టుపల్లి జయదేవ్, పారినంది లక్ష్మీనరసింహం, లావణ్య, డి.యల్.ఆర్. ప్రసాద్, కె.వి. రామారావు, నర్రా వెంకటేశ్వరరావు, పిన్నమనేని శ్వేత, ముక్కామల అప్పారావు, మద్దిపాటి కృష్ణారావు
సమీక్ష: మద్దిపాటి కృష్ణారావు
దాదాపు యాభైయ్యేళ్ళగా డిట్రాయిట్ సమీప నగరం ఫ్లింట్ లో వైద్యుడిగా పనిచేసిన ముక్కామల అప్పారావు గారి జీవిత కథ ఇది. అప్పారావు గారు తన జీవిత కథను చెప్పగా రచయిత పప్పు అరుణ గారు అక్షరరూపం ఇచ్చారని, ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఎ. కృష్ణారావు గారు రచనకు నగిషీలు అద్దారని, పుస్తకాన్ని సమర్పించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వివరించారు.
సాధారణంగా ఎవరి జీవిత చరిత్రైనా తెలుసుకోవాలనుకోవడానికి కారణం వారి జీవితకాలంలో చేసిన పనులవల్ల సమకాలీన సమాజంపై, భావితరాలపై కలిగిన ప్రభావం. ఈ చర్చలో పాల్గొన్నవారిలో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారంతా డిట్రాయిట్ వాసులే కాబట్టి అప్పారావుగారు అందరికీ తెలిసుండడం వింతేమీ కాదు. కానీ, ముక్కామల అప్పారావు గారి పేరు అమెరికాలో ఉన్న తెలుగు వారిలో అత్యధికశాతం మందికి తెలిసే ఉంటుంది. అందులోను ముఖ్యంగా వైద్యరంగంలోని వారికి. అంతమందికి అప్పారావుగారి గురించి తెలియడానికి ఒక కారణం 1980 ల్లో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషయన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (AAPI, ఆపి) ఆవిర్భావంలో అప్పారావు గారు ప్రధాన పాత్రధారి కావడం. విదేశాల్లో వైద్యవిద్య చదువుకుని అమెరికాలో వైద్యవృత్తిని నిర్వహించు కోవాలనుకుంటున్న వారిపై వివక్షలను నిరోధించడంలో ఆపి కృషి అంతా ఇంతా కాదు. ఇది తెలుగు వారికే కాక భారతదేశం నుండి అమెరికా వచ్చిన వైద్యులందరికీ జరిగిన మేలు. దానికి తోడు భారతదేశం నుండి వచ్చిన అనేక వైద్యవిద్యార్ధులకు రెసిడెన్సీ ఏర్పాటుకు సహాయం చెయ్యడంలో ఆయన కృషి అద్వితీయం. అలాగే 1979 లో అమెరికాలోని తెలుగు వారినందరినీ సంఘటిత పరిచేందుకు ప్రారంభించిన తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) వ్యవస్థాపకుల్లో కూడా అప్పారావు గారు ప్రధాన పాత్ర వహించారు. భారతీయులకు విశిష్టమైన ఆధ్యాత్మిక జీవనవిధానాన్ని అందరికీ అనుభవంలోకి తీసుకురావడానికి విశేషంగా కృషి చేసిన స్వామి చిన్మయానంద గారి చిన్మయ మిషన్ అమెరికాలో నిలదొక్కుకోవడానికి, వృద్ధి చెందడానికి నిరంతర కృషి చేసింది అప్పారావుగారే. ఇన్నిటితోపాటు సామాజికసేవ, ఉపాధికల్పన దృక్పథంతో అమెరికాలోనూ, భారతదేశంలోనూ తన వ్యాపార దక్షతతో విద్యాలయాలు, వైద్యాలయాలు ప్రారంభించి, నిర్వహించడంలో అప్పారావుగారి పట్టుదల, అలుపెరుగాని కృషి మనల్ని వారి గురించిన జిజ్ఞాసలో పడేస్తాయి.
ఈ పుస్తకాన్ని స్థూలంగా నాలుగు భాగాలుగా విభజించవచ్చు. మొదటిది అప్పారావు గారి పుట్టుక నుండి అమెరికా రావడం వరకూ. రెండు, వైద్య వృత్తిలో వారి పరిణతి, తద్వారా అమెరికాలోని భారతీయుల సామాజికాభివృద్ధికి చేసిన కృషి. మూడు, ఆధ్యాత్మిక దృష్టి, సేవ. చివరిగా, వ్యాపార దక్షత. ఐతే చివరి మూడు భాగాలూ పుస్తకంలో సమాతరంగా కలిసే నడుస్తాయి. అప్పారావు గారి జీవిత మొదటి అధ్యాయం (ఇండియా నుండి అమెరికా ప్రస్థానం వరకు) తోనే ఆయన వ్యక్తిత్వం మనల్ని ఆకట్టుకుంటుంది. తరువాత జీవితంలో ఆయన ప్రయాణానికి బీజాలు అక్కడే కనబడతాయి. హాస్టల్‌లో నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఒంటి నిండా సబ్బుతో టవల్ చుట్టుకుని హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫీసులో ప్రత్యక్షమవడంలోనే సమస్యా పరిష్కారానికి సృజనాత్మకమైన దారులు ఎన్నుకోవడం కనిపిస్తుంది. అదే పట్టుదల, ముక్కుసూటి ధోరణి తమ రేడియాలజీ గ్రూపు ఛైర్మన్ పదవిపై జరిగిన కుట్రను ఎదుర్కోవడంలోనూ కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా గమనించవలసింది కోస్తా జిల్లాల్లో అప్పటి మధ్య తరగతి కుటుంబాల్లో చదువుకు ఇచ్చిన ప్రాముఖ్యత, కుటుంబ విలువలు, సామాజిక దృక్పథం ఆయనను జీవితమంతా నడిపించడం.
మొదటి భాగంలో నడిచిన కథనం తరువాత భాగాల్లోని వ్యక్తిగత అనుభవాల చిత్రణలోనూ, పరస్పర సంబంధాల వివరణలోనూ అంతే హృద్యంగా ఆకట్టుకుంటుంది. అప్పారావు గారికి రేడియాలజీలో గురువైన ఆర్మండ్ గారితో గానీ, ఆధ్యాత్మిక దృక్పథానికి గురువులైన స్వామి చిన్మయానంద, చిన జియ్యర్‌స్వామి గార్లతో గానీ, పిల్లలు బంధు మిత్రులతో గానీ, తానా, ఆపి లాంటి స్వచ్ఛంద సంస్థల ఆవిర్భావానికి తోడైన మిత్రులతో గానీ, లాభాపేక్షను లెక్కించకుండా ప్రారంభించిన వ్యాపార సంస్థల్లో భాగస్వాములతో గానీ, చిన్న పెద్ద తారతమ్యాలు పాటించకుండా అందరినీ ఆప్యాయంగా కలుపుకుపోయే ఆయన నైజం ప్రతి వాక్యంలోనూ కనబడుతుంది. ‘పండ్లున్న కొమ్మకే రాళ్ళ వేట్లు‘ అన్నట్టు నిరంతరం సమాజం కోసం ఏదో ఒకటి చెయ్యాలనుకునే వారికి ఆటుపోట్లు తప్పవు. వాటిని కూడా ‘ప్రసాద బుద్ధితో మాత్రమే‘ స్వీకరించడం జీవితానికి అప్పారావు గారు ఎన్నుకున్న మార్గం. పెట్టుబడిదారీ వ్యవస్థ నరనరాల్లోనూ జీర్ణించుకున్న అమెరికన్ సమాజపు మానవతా విలువలపై ఉన్న అపోహలను సరిజేస్తూ, వాటిని తాను పెరిగిన భారతీయ సంస్కృతితో అనుసంధానం చేసి నెగ్గుకురావడం ఆయన జీవిత చరిత్రలో మనకు కనబడుతుంది. ఇది భావితరాల ప్రవాస భారతీయులకు మార్గదర్శకమైనప్పటికీ, గుడి, బడి వంటి అనేక బృహత్కార్యక్రమాలు చేపట్టడంలో ఆయన ఎదుర్కున్న అవరోధాలు, కొన్ని సంస్థల్లో తలెత్తిన వివాదాలు లాంటి వాటిపై విశ్లేషణాపూర్వకమైన వివరణ జతచేసి ఉంటే ఇంకా ఉపయోగకరంగా ఉండేదేమోననిపిస్తుంది. పదిమందిని కలుపుకుంటూ చెయ్యాల్సిన పని ఏదీ నల్లేరు మీద బండి నడక కాదు. సఫలతతో పాటు విఫలత, విముఖత, విఘ్నాలు కూడా తెలిస్తేనే తర్వాత తరాలవారు ఆ సమస్యలను ముందుగా ఊహించి నివారించడానికి తోడ్పడుతుంది. ఐతే, పుస్తకంలో చర్చించిన సంస్థలన్నీ వర్తమానాలే, వ్యక్తులందరూ సమకాలీనులే. విమర్శ అంటే కేవలం వ్యతిరేకార్ధంలోనే ఆలోచించడానికి అలవాటు పడిన వారికి ప్రతి సవరణ, సూచన వ్యక్తిగతంగా మాత్రమే కనిపించే సమస్య ఉంది. సమకాలీన వ్యక్తుల జీవిత చరిత్రల రచనలతో ఇది ఒక ఇబ్బందే. ‘కరవమంటే కప్పకు కోపం, విడమంటే పాముకు కోపం‘ అన్నట్టు, విషయాలను యధాతథంగా వివరిస్తే అప్రస్తుతమైన కోపతాపాలెదుర్కోవాలి, దాచిపెడితే నిజాయితీతో మార్గదర్శకం కావాల్సిన రచనను అసంపూర్తిగా వదిలెయ్యాలి!
పుస్తకంలోని భాష, శైలి రమ్యంగా ఉండి, చదివిస్తాయి. కథ చెప్పింది అప్పారావు గారు, రాసింది అరుణ గారు, కాబట్టి కథ అంతా ఉత్తమ పురుషలో రాసినప్పటికీ తృతీయ పురుష అక్కడక్కడా తొంగి చూడకుండా శ్రద్ధ తీసుకోవాల్సింది. కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా అమెరికాలోని సంస్థల గురించి, సాంస్కృతిక, సాంఘిక, వ్యాపార విషయాలు వివరించడంలో మిగిలిన భాగాలకంటే సరళత కొంత తగ్గిందనిపిస్తుంది. అదీగాక, ప్రతి అధ్యాయానికి ముందు చేర్చిన ‘నగిషీలు‘ మిగతా వచనంతో సమన్వయం కలిగి ఉంటే, అతికించినట్లుండేది కాదు!
పుస్తక ప్రచురణలో చాలా శ్రద్ధ కనిపిస్తుంది. ముద్రారాక్షసాలు ఇంచుమించు లేవనే చెప్పాలి. తరవాత ముద్రణలో సవరించుకునేందుకుగాను కొన్ని (మాత్రమే) సూచనలు:
పేజి 19: ‘పక్షవాతం వల్ల మా తాత చిన్నవయసులోనే మరణించారు.‘ ఎవరి చిన్నతనంలో? ఈ అధ్యాయంలో చాలా (లేదా అన్నీ) అప్పారావు గారు విన్నవనే అనిపిస్తుంది గానీ, ప్రధమ పురుషలో వివరించడం వల్ల ఆయన విన్నవేవో, చూసినవేవో ఊహించడం కష్టం.
పేజి 27: నాలుగవ పేరా మొదట్లో ‘ఆ‘ అచ్చుతప్పు.
పేజి 32: రెండవ పేరా రెండవ లైను – ‘… రెండవ అతి పెద్ద …‘. ఇది ‘second largest’ కు అనువాదమని తెలుస్తూనే ఉందిగానీ, తెలుగులో సహజ వ్యక్తీకరణ కాదు!
పేజి 51: ఐదవ పేరాలో ‘మరచిపోలేని రోజు‘ వాడకం సరిపోలేదు. సాధారణంగా ఇది సంతోషకరమైన సందర్భంలో వచ్చే వ్యక్తీకరణ. మిత్రుడు చనిపోవడాన్ని వివరించే సందర్భానికి అతకలేదు.
పేజి 82: ఫోటోలో ఉన్న మిషిగన్ గవర్నర్ ఇంటిపేరు ‘గ్రాన్‌హోం‘, ‘గ్రాహం‘ కాదు.
పేజి 88: ఈ పేజిలో ఉన్న రెండు పేర్లు ఇంగ్లీషులో ఎలా పలుకుతారో, తెలుగులో అలానే వ్రాస్తే బాగుంటుంది (పైగా మనది ప్రతి శబ్దం పలికే బాష కదా!). Chippeawa ‘చిప్వా‘, Buick ‘బ్యూయిక్‘.
పేజి 116: ఈ పేజి చివరలో ఇన్స్యూరెన్స్ కంపెనీలపైన వివరణ సరిచూసుకోవాలి. వ్యాధి నిరోధక మార్గంలో రోగులను సమాయత్తపరిస్తే వైద్యులకు ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఇవ్వాల్సిన డబ్బు తక్కువగా ఉంటుంది. దానివల్ల ఇన్స్యూరెన్స్ కంపెనీలకు లాభమే గాని నష్టం కాదు. కానీ తరువాత పేరాలో ఇన్స్యూరెన్స్ కంపెనీలకు లాభదాయకం అని ఉంది. మొత్తం వివరణ ఒకసారి సరిచూసుకుంటే చెప్పదలుచుకున్న వివరాల్లో పరస్పర వైరుధ్యం తొలుగుతుంది.
పేజీలు 172, 174: ఎన్నారై కాలేజి ప్రారంభం 2003 లోనా 2005 లోనా? రెండు పేజీల్లో రెండు తేదీలున్నాయి! అవి వివిధ దశలై ఉండొచ్చు. రెండు వేర్వేరు తేదీలకు కొంచెం వివరణ అవసరం.
‘సన్నుతి‘ భాగంలో చేర్చిన గురువుల, మిత్రుల, శ్రేయోభిలాషుల, కుటుంబ సభ్యుల, వివిధ అభిప్రాయాలు, వ్యక్తిగత అనుబంధాలు అప్పారావు గారి జీవితానికి అద్దం పడతాయి. అందులో కొన్ని ఇంగ్లీషు నుండి అనువదించినవి. హృదంతరాళాల్లోంచి పొంగే ఉద్వేగం సొంత భాష నుండి తర్జుమా చేసినప్పుడు ఎంతో కొంత నష్టానికి సమాధాన పడక తప్పదు. అనువాదాలతో పాటు మూల ప్రతిని కూడా చేరిస్తే బాగుంటుంది.
ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువదిస్తే అమెరికాలో ఉన్న రెండవ తరం భారతీయులకు ఉపయోగకరంగా ఉంటుందన్న సూచనను ముందుగానే అప్పారావు గారు ఊహించినట్టున్నారు! సమావేశం చివరలో ఇప్పటికే సిద్ధమైన ఇంగ్లీషు సంపుటాన్ని చూపించారు.
Leave a Reply