ఉపనిషద్ రత్నావళి – శ్రీ కళానిధి సత్యనారాయణ మూర్తి

వ్యాసకర్త: అమిధేపురం సుధీర్

*****************
చిన్నప్పటినుంచీ ‘మెట్ట వేదాంతం’ అనీ, ‘వేదాంతం చెప్పకు’ అనీ, ఇలా పెద్దవాళ్ళు మాట్లాడుకోవటం చాలాసార్లు వినీ, చదివీ వుండటం వలన, వేదాంతం అంటే ఒక నిరాశాపూరితమైన వాదనో లేక సిద్దాంతమో అనిపించేది. అసలు వేదాంతం అంటే ఏమిటో అప్పటికి ఏమీ తెలియదు.

ఏదో పుస్తకంలో, వేదముల చివరిలో వున్నని ఉపనిషత్తులని, వేదముల యొక్క అంతములో ఇవి వుంటాయి కాబట్టి, వీటిని వేదాంతములు అంటారు అని చదివాను. ఒక చిన్న పులకరింత. ఓహ్, వేదాంతమంటే ఇదా? అని. అప్పుడే అనిపించింది, ఉపనిషత్తులు అన్నీ చదవాలని. కానీ ఒక భయం. ఇలాంటి (ఆధ్యాత్మిక) పుస్తకాలు చదవాలంటే చాలా ఓపిక కావాలి. చాలా టైం పడుతుంది. ఇంకో భయం, సరి అయిన పుస్తకాలు దొరకవు. అంటే, ఒక్కో పుస్తకానికి, చాలా మంది భాష్యాలు వ్రాసి వుండొచ్చు. ఎంత కాదనుకున్నా, వారి వారి స్వంత అభిప్రాయాలు ఎంతో కొంత వాటిలో చొప్పించబడతాయి. ఒక్కోసారి అది ఆ పుస్తకం మీదే తప్పుడు అభిప్రాయం మనకి కలిగించొచ్చు. ఇది నేను భగవద్గీత చదివినప్పుడు తెలుసుకొన్నాను. ఇస్కాన్ వారి భగవద్గీత చదివినప్పుడు, నాకు అస్సలు నచ్చలేదు. అటూ ఇటూ తిరిగి, చివరికి అంతా కృష్ణ లీలే అన్నట్టు వుంటుంది. తర్వాత పండిత గోపదేవ్ గారు అనువదించిన భగవద్గీత చదివితే అద్బుతంగా అనిపించింది. అలా ఏది సరి అయిన పుస్తకమో తెలుసుకోవడం కూడా ఒక కష్టమైన పనే. పండిత గోపదేవ్ గారు కొన్ని ఉపనిషత్తులని తెలుగులోకి అనువదించారని తెలిసి ఆ పుస్తకాలు సంపాదించాను.

కానీ అంతకంటే ముందే, ఉపనిషత్తుల గురించి వెతుకుతుంటే ‘ఉపనిషద్ రత్నావళి’ అనే పుస్తకం గురించి తెలిసింది. శ్రీ కళానిధి సత్యనారాయణ గారు, వేద భారతి అనే సంస్థ ద్వారా ప్రచురించిన ఈ పుస్తకం తెప్పించాను. నాలుగు భాగాలుగా ఉన్న ఈ పుస్తకం లో మొత్తం 11 ఉపనిషత్తులను పరిచయం చేశారు. ఈ పుస్తకం కేవలం ఒక పరిచయం లాంటిదే. ప్రతీ ఉపనిషత్తు లోని ముఖ్యమైన విషయాన్ని చెప్తూ అక్కడక్కడా, అవసరమైన ఒకటీ, రెండూ శ్లోకాలను ఉదహరణకు చెప్పారు తప్ప, ప్రతీ శ్లోకం, దాని తాత్పర్యం ఇందులో లేవు. దీని వలన వచ్చిన ఒక ఇబ్బందేమిటంటే, చదివిందే చదివినట్టు వుండటం. చాలా చోట్ల చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పినట్టుగా వుంది.

మొదటి భాగం లో, హిందూ మతం, భారతీయ తత్వ శాస్త్రం, ఉపనిషత్తుల స్వభావ స్వరూపాలు చెప్పి, తర్వాత ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తుల గురించి చెప్పారు. రెండవ భాగంలో ముండకోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తుల గురించీ, మూడవ భాగంలో ఛాందోగ్యోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, కఠోపనిషత్తు ల గురించీ, నాల్గవ భాగంలో బృహదారణ్యకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తుల గురించి చెప్పారు.

ప్రతీ ఉపనిషత్తులో కొన్ని అధ్యాయాలు, కర్మ కాండకి సంబంధించినవి మరికొన్ని జ్ఞానకాండకి సంబంధించినవి. ఈ పుస్తకం లో కేవలం జ్ఞానకాండకి సంబంధిన విషయాల్ని చెప్పటం జరిగింది. ప్రతీ ఉపనిషత్తు, గురు శిష్య సంవాదన రూపంలో వుంటుంది. శిష్యుడు అడిగిన తాత్విక ప్రశ్నలకు, గురువు ఇచ్చే సమాధానమే ఆ ఉపనిషత్సారం. ప్రశ్నలు ఎక్కువగా ఇలా వుంటాయి. ప్రాణం ఎక్కడినుంచి వచ్చింది? పరమాత్మ వున్నాడా? సృష్టి కర్త ఎవరు? సృష్టికి పూర్వం ఏముండేది? అన్నిటికంటే ఉన్నతమైన జ్ఞానం ఏది? ఇలాంటి ముఖ్యమైన ప్రశ్నలతో పాటు, మానవ శరీర నిర్మాణం, వాటి పనితీరు, పంచభూతాలు, ప్రకృతి, వీటి గురించిన శోధన కూడా వుంది.

హిందూ మతానికి ముఖ్యమైన కర్మ సిద్దాంతానుగుణంగానే సమాధానాలు వున్నాయి. కొన్ని సమాధానాలని, ఇప్పుడున్న విజ్ఞానంతో మనం ఒప్పుకోకపోవచ్చు గానీ, అసలు అన్ని శతాబ్దాల క్రిందట ఇలాంటి ప్రశ్నల మీద జరిగిన చింతన ఖచ్చితంగా ఒక గొప్ప విషయమే.

కొన్ని విషయాలు నిజంగా నన్ను ఆశ్చర్యపరిచాయి. ఇప్పటివరకు ఏనాడూ, ఏ హిందూ గురువూ లేదా ప్రవచనకర్తా ఈ విషయాలు చెప్పటం నేను వినలేదు. బహుషా అది నా తప్పు కూడా అయి వుండవచ్చు.

ఇంతవరకూ భగవంతున్ని నిరాకారుడుగా పూజించటం కేవలం ఇస్లాం మరియు క్రిస్టియానిటీ లోనే వుందనుకున్నాను. కానీ, ఉపనిషత్తులు రెండు మార్గాలు భోదించాయి అని చదివాను అవి, కర్మ కాండ (భక్తి మార్గం) ద్వారా లేదా జ్ఞాన మార్గం ద్వారా కూడా ఆ భగవంతున్ని చేరవచ్చు. కర్మ మార్గం లో (యజ్ఞాలూ, పూజలూ చేస్తూ) భక్తి మార్గం లోకి వచ్చినా, చివరికి జ్ఞాన మార్గం ద్వారానే ఆ నిరాకారుడు అయిన భగవంతున్ని చేరుకొని జన్మ రాహిత్యం పొందాలి అని వుంది. పేరుకి భగవంతుడు సర్వాంతర్యామి అని కొంతమంది హిందూ గురువులు ప్రభోదించినా, ఏనాడూ, అదే చివరి సత్యం అనే విషయం గట్టిగా ఏ గురువూ చెప్పగా నేను వినలేదు. విగ్రహారాధనకి, కర్మ కాండలకి ఇచ్చిన విలువ జ్ఞాన మార్గానికి ఇప్పుడు ఇస్తున్నట్టు లేదు. దానికి మనం రెండు కారణాలని ఊహించవచ్చు. ఒకటి, గురువులకే ఈ విషయం తెలియకపోయి వుండొచ్చు. రెండు, ఒక వేళ ఈ విషయం నిజంగానే తెలిసినా అది వారి వ్యాపారాత్మక ధోరణికి సరిపడదని ఊరుకొని ఉండవచ్చు.

ఉపనిషత్తుల గురించి లేదా ఎంతో కొంత భారతీయ తత్వ శాస్త్రం గురించి తెలుసుకోవాలని అనుకునే వారు. ఈ పుస్తకాలని చదవొచ్చు. చాలా చోట్ల చెప్పిన విషయాన్నే మళ్ళీ, మళ్ళీ చెప్పినట్టు వుంటుంది. కానీ కనీస పరిజ్ఞానం మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. మొత్తమ్మీద మీరు నాస్తికులైనా, ఆస్తికులైనా తప్పక చదవాల్సిన పుస్తకాలు ఉపనిషత్తులు. మీరు నాస్తికులైతే, ఆ కాలం లో నిజమైన జ్ఞానం కోసం జరిగిన ప్రయత్నాన్ని మెచ్చుకుంటారు. ఆస్తికులైతే, మీ ఆధ్యాత్మిక దారి వేదాంత మార్గమో కాదో తెలుసుకుంటారు.

You Might Also Like

One Comment

  1. Bhaskaram Kalluri

    బాగా రాశారు. పై పైన పోలిక చెప్పాలంటే భక్తిమార్గం విష్ణ్వాలయం లాంటిది. అక్కడ అన్ని రకాల వైభవాలూ, భోగాలూ ఉంటాయి. జ్ఞానమార్గం శివాలయం లాంటిది. అక్కడ వైభవాలూ, భోగాలూ ఏవీ ఉండవు.

Leave a Reply