కావ్యదహనోత్సవం – వేలూరి వేంకటేశ్వర రావు
వ్యాసకర్త: తమ్మినేని యదుకుల భూషణ్
***************************
నిజమైన శాస్త్రవేత్తలు రాసిన వచనం చదవాలంటే నాకు మహా ఉబలాటం. కనీసం వారికి తార్కికంగా ఆలోచించడం అలవడి ఉంటుందని నా ఆశ. దానికి కొంత ఉత్సాహం , ఆవేశం తోడవుతే – ఆకాశంలో రంగుల గాలిపటం ఎగురవేసినట్లే.ఆ కోవకు చెందినదే వేలూరి గారి వచన రచన – ‘కావ్యదహనోత్సవం ’.. రచయిత స్వయానా శాస్త్రవేత్త – పదునైన ఆలోచనకు తోడుగా ఎంతో ఉత్సాహం – అగ్నికి ఆజ్యం తోడయితే మరి కావ్యం తగులబడ వలసిందే.
ఈ పుస్తకానికి సహకరించిన వారు సామాన్యులు కారు – బొమ్మకంటి శ్రీనివాసాచార్య ఎం. ఏ . నేను చిన్న నాడు ఎమెస్కో వారు ప్రచురించిన వీరి పాకెట్ డిక్షనరీని ఎన్ని సార్లు తిరగేసి ఉంటానో లెక్కే లేదు. కాస్త ఊహ తెలిశాక వీరి ఖండకావ్యం ‘ ఓవరి’ గురించి సమీక్షలు చదివిన గుర్తు. అప్పట్లో ఆయన మేడేపల్లి వారితో కలిసి తెలుగు భాషా సమితి వేదాంత శాఖలో పనిచేస్తుండే వారు.
ఈ పుస్తకం వెనుక చాలా గ్రంథం నడిచింది. ‘ చెత్తకావ్యాలకి దహనసంస్కారం చేస్తే తెలుగుదేశంలో ఇక ముందు మంచికావ్యాలు ప్రచురించబడటానికి అనుకూల వాతావరణం రావటానికి దోహదమవ వచ్చుననే మౌలిక భావన’ ఉద్దేశం బహు దొడ్డది. కాబట్టే అప్పట్లో ఎంతో సంచలనం రేకెత్తించింది
వీరు తలపెట్టిన కావ్యాదహనోత్సహం. కానీ, కాలగమనంలో ఈ ఘటన మాసిపోయింది. దీని వెనుక ఉన్నదెవరో కూడా తెలియని పరిస్థితి – అప్పట్లో ఒక కుదుపు కుదిపిన ఈ భావన మరెవరికో ఆపాదించ బడింది. ఆ చారిత్రక సందర్భాన్ని మనముందుకు సజీవంగా పట్టుకొచ్చే ప్రయత్నంలో భాగంగా, 1960 నాటి రాత ప్రతిని యథాతథంగా అచ్చువేశారు. రచయిత ముందుమాట అదనం.
ఐదు పుష్కరాల కాలంలో ఎంతో మంది కనుమరుగయ్యారు.మన అదృష్టం రచయిత మన ముందున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది అనటానికి గుర్తు ఈ పుస్తకం. పది పుటల ముందుమాటలో ఈ కావ్యదహనోత్సవంలో పాలుపంచుకున్న అందరిని సజీవంగా మన ముందు నిలుపుతారు. బొమ్మకంటి, మేడేపల్లి అబ్బూరి , చేరా , బంగోరె శంకరమంచి సత్యం – వారిలో లబ్ధ ప్రతిష్ఠులు. అప్పట్లో వెయ్యి మంది వచ్చారంటే మహా సభ కింద లెక్క ఆ సందర్భంలో ‘wish cremation success’ అని శ్రీ శ్రీ తంతి పంపించారు అంటే దీని ప్రకంపనలు ఎంతో దూరం తాకినట్టు అర్థం చేసుకోవచ్చు.. శ్రీ శ్రీ చేదుపాటను ప్రార్థనా గీతంగా పాడటం కూడా ఎంతో వినూత్న పోకడ.
రచయితకు ప్రహసనంలో మిగుల ఆసక్తి ఉన్నట్టు – వ్యంగ్యంలో మంచి పట్టు ఉన్నట్టు ఆరంభం నుండి తెలుస్తుంది. పట్టుమని పాతికేళ్ళులేని వయసులో ఈ పని తలపెట్టి, నలుగురిసహకారంతో విజయవంతం చేయడం మాటలు కాదు..ఇప్పటికీ ఈ మౌలికభావన పాతబడ లేదు. ఎన్నో కావ్యదహనాలు జరగవలసిన అవసరంఉంది. ఐతే కవిత్వవిమర్శ ఆ పని చేయగలదు. అప్పుడువెఱ్ఱి తలలు వేస్తున్న కవిత్వధోరణులు సర్దుకుంటాయి. సంప్రదాయ కవిత్వ పునాదులమీద ఆధునికత లేచి రాగలదు. మనకు కావలసినదల్లా కొత్తపాతలను కలుపుకుపోగల సమన్వయదృష్టి.
****
ఈ ప్రహసనంలో పాత్రధారులు :విదగ్ధ కావ్యకర్త- వేలూరి గారు , కృతిభర్త -బంగోరె , ప్రధాన వాహకుడు -సత్యమూర్తి -నిరసన వ్యక్తం చేసే వర్తమాన కవి- చేరా – వెరసి ఈ సభకు అధ్యక్షత వహించింది – మేడేపల్లి వరాహ నరసింహ స్వామి. ఈ పాత్రల ప్రసంగాలు రాసినది వేలూరి గారే. ఈ పాత్రములు వెల్లడించిన అభిప్రాయములు కాల పరీక్షకు తట్టుకొని నిలిచినవి – మచ్చుకు :
ప్రధాన వాహకుడు -ఎ . సత్యమూర్తి
“ఏది మహాకావ్యమో , ఏది తుచ్ఛ కావ్యమో కొంత కాలం తర్వాత కానీ తేలని ప్రశ్న. అంతే కాకుండా,
ఒక తుచ్చ కావ్యం యొక్క తుచ్ఛత్వం లోకానికంతటికీ తెలిసిన చాలా కాలానికి గానీ కవికి ఆ సంగతి తెలియడం సాధారణంగా జరగదు.”
“మంచి చెడ్డల నిర్ణయం అంత తేలికయిన పని కాదు. అని, బ్రతికున్న వాళ్ళు వ్రాసిన కావ్యాల్లో ఎవరి కావ్యం చెడ్డదని అన్న మనల్ని వాళ్ళు చచ్చినా బ్రతకనియ్యరు “
( ఈ విషయం లో సమీక్షకునికి ఎంతో స్వానుభవం ఉన్నది .-వేలూరి గారి ముందుమాట లో అంటారు – ‘మనకి చాటుపద్యాల వెనుక తయారయిన కట్టుకథలు సాహిత్య చరిత్రగా చెలామణీ చెయ్యటం కూడా అలవాటే. ఈ విషయమై నేనెవరినీ తప్పు పట్టడం లేదు. మనకి, ఇప్పటికీ సాహిత్య చరిత్ర రాయటానికి సరైన శిక్షణ లేకపోవడం విచారకరం.’ . సాహిత్య చరిత్ర రాయటంలోనే కాదు – విమర్శను ఎలా స్వీకరించాలి అన్న విషయంలో కూడా మనవారికి శిక్షణ అవసరం.
నిజం చెప్పాలంటే, కవిత్వం , విమర్శా మన జీవితవిధానంలో భాగం కానంత వరకు ఎంత శిక్షణ ఇచ్చినా – “ఎంత చదువు చదివిన ఎన్నియో విన్నను / హీనుడవగుణంబు మానలేడు అన్న చందాన ఉండిపోతారు మేము విమర్శలకు అతీతం అనుకునే వారి అశాస్త్రీయ చింతనను మార్చ బ్రహ్మ తరమా ?? )
కృతి కర్త – వేలూరి వేంకటేశ్వర రావు
“చెప్పడానికి ఏదయినా వస్తువు ఉండి దాని గూర్చి ఛందస్సులో చెప్పడమే కష్టం, అలా కాకుండా, చెప్పడానికి ఏమీ లేకండా, పద్యం చెప్పడం ఎంత కష్టమో మీలో కొందరికయినా తెలుసు .”
“ఇప్పటి తెలుగు సాహిత్యం అంత సన్నాసి సాహిత్యం ఇండియా లో లేదు “
“ యతి స్థానంలో పద్యం విరగకుండా , ఏ పాదానికి ఆ పాదం అంతం అవకండా , అడుగడుగునా కుంటుకుంటూ నడిచే నడక – ఈ తెలుగు కవిత్వానికి నన్నయ గారు ఏనాడూ అంకురార్పణ చేశాడో గానీ, ఆనాటి నుండి నేటి వరకు ప్రపంచ రసజ్ఞుల ముందు ఇది మా గొప్ప కావ్యం – ఏ భాషలోకి అనువదించినా ఇది కావ్యంగానే నిలబడుతుంది అన్న కావ్యం మనకు ఒక్కటీ రాలేదు. ఉమాకాంత పండితుడు అన్నమాట కరెక్టేమో అనిపిస్తుంది. “
విమర్శలో స్వతంత్ర బుద్ధికి, నిర్భీకతకు మారుపేరైన అక్కిరాజు ఉమాకాంతం గారి ప్రస్తావన ఎన్న దగినది.. తమ గ్రంథం “ నేటికాలపు కవిత్వం” ( 1928) తో తెలుగు విమర్శను ‘దిమ్మసా కొట్టిన హైరోడ్డు’ మీదకు మళ్లించిన వాడు. తర్వాతి కాలంలో, ఆ ఒరవడి ని అందిపుచ్చుకుని ఉంటే వ్యవహారం కావ్యాదహనాల దాకా వచ్చేది కాదు – కారణం సద్విమర్శ తుచ్ఛకావ్యాన్ని అంతరింప చేస్తుంది.
మరి కేవలం ప్రశంసలే కావాలి అన్న ప్రలోభానికి ఎందుకు లొంగి పోతున్నారు మన కవులు, అనువాదకులు, రచయితలూ ?? ఈ ప్రశ్నకు సమాధానం – అరవైఏళ్ల ముందు, ఎంతో దూర దృష్టితో చెప్పిన కృతికర్త ముక్తాయింపు మాటల్లో – దొరుకుతుంది.
“ వందల ఏళ్ళు మనం దాస్యంలో ఉండడం వల్లనయితేనేమి , మన స్వబుద్ధితో ఆలోచించే అలవాటు ఎప్పుడో వదిలివేయడం వల్లనయితేనేమిమనం కృతకమైన బ్రతుకులు బ్రతకడానికి అలవాటు పడ్డాం : వెనకటి తరం వాళ్ళని నిందించి ప్రయోజనం లేదు. ఇక ముందయినా నాటకాల్లో పాత్రల్లా బ్రతికే ఈ పద్ధతికి స్వస్తి చెప్పాలి. “
వర్తమాన కవి – చేకూరి రామారావు
“ ఈ నాడు మెజారిటీ ప్రజలకు అర్థమయ్యేదే కవిత్వం . మెజారిటీ చేత సెభాష్ అనిపించుకున్నదే సాహిత్యం. “
అధ్యక్షుడు -మేడేపల్లి వరాహ నరసింహ స్వామి
“ సాహిత్యం అందరికీ అనువాదం కలిగించవలసిందే . అయితే సాహిత్యంలో మంచి చెడ్డలు ఓటింగు ద్వారా నిర్ణయించడం ఏ దేశంలో నన్నా జరుగుతుందా ? “
చివరిగా , చిరపరిచితమైన చేతిరాతలో ఇస్మాయిల్ గారి లేఖ.
“ ఒకప్పుడు కావ్యాదహనోత్సవం జరిపించారు గదా !. ప్రస్తుతం , మీ అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య, పాడు కావ్యాలు పేరుకు పోతున్నాయి. ఎప్పుడు వచ్చి తగల బెడతారు.?”
***
ఈ ప్రహసనంలోని పాత్రలు – ముఖ్యంగా విద్యార్థులుగా ఉన్నవారు చేకూరి రామారావు , బండి గోపాల రెడ్డి గార్లు తర్వాతికాలంలోచేరా , బంగోరెలుగా తెలుగు సాహిత్యంలో తమదైన ముద్ర వేసినవారు. తెలుగు విశ్వవిద్యాలయం అక్కిరాజు ఉమాకాంతం గారి ‘నేటి కాలపు కవిత్వం’ పుస్తకాన్ని పునర్ముద్రిస్తూ ( 1994) – కవిత్వ విమర్శకు అంకితమైన చేరాకే సంపాదకత్వబాధ్యతలు అప్పగించారు. ఆయన ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ సదరు విమర్శ గ్రంధానికి చారిత్రకప్రాముఖ్యం గలదన్నసత్యాన్నిగుర్తిస్తూ అక్కిరాజు ఉమాకాంతాన్ని నేటితరం
పాఠకులకు పరిచయం చేస్తూ రాసిన మహత్తర వాక్యాలు :
“నిర్భీకత , కాలానికి ఎదురీదే లక్షణం . పాండిత్యం, కృషి, చెప్పే విషయంలో నిజాయితీ , స్పష్టత, సూటిదనం , సహేతుక వాదపటిమ ఆయన నిర్ణయాలకు మించి విలువైనవి. అవే ఆయన తన తరువాత తరానికి అందించిన విలువలు. ”
“ ఆయన వాద పధ్ధతి నుంచి ఈనాటి విమర్శకులు నేర్చుకోవలసింది చాలా వుంది. ఉపపత్తులు చూపకుండా ఆయన సిద్ధాంతాలు చేయలేదు. ఆక్షేపణలకు సమాధానం చెప్పకుండా ఊరికే వదలలేదు. ఏ విషయాన్నీ మరుగుగానూ , అస్పష్ఠంగానూ చెప్పలేదు.
ఇది తర్కంలో శిక్షణ పొందిన శాస్త్రవేత్త వచనశైలి – ఆలోచనకు పలు దారులు – శాస్త్రం ఒక క్రమ శిక్షణ గఱపుతుంది. “ So if a man’s wit be wandering, let him study the mathematics” అని Francis Bacon ( Of Studies, 1625) నొక్కివక్కాణించడానికి కారణం అదే. తర్కపద్ధతుల్లో సరైన తర్ఫీదు లేకపోవడం -మనవారి ఆలోచనల్లో, రాతల్లో గందరగోళానికి కారణం !
ఉమాకాంతం గారు పెట్టిన ఒరవడిలో తన వంతు పాత్ర నిర్వహించిన ఈ పుస్తకానికి తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.
( కావ్యదహనోత్సవం – వేలూరి వేంకటేశ్వర రావు – ప్రాప్తి స్థానం : విశాలాంధ్ర, నవోదయ, నవ చేతన)
Leave a Reply