చారిత్రక కథా రచన కార్యశాల అనుభవాలు

(మార్చి 14, 15వ తేదీలలో విజయవాడలో జరిగిన “కాలయంత్రం: చారిత్రక కథా రచన కార్యశాల”లో నేనూ పాల్గొన్నాను. ఆ విశేషాలు ఇక్కడ! )

చారిత్రక కథలు, నవలలు రాయడానికి సిద్ధం చేసే వర్కుషాప్ ఒకటి తెలుగులో జరగొచ్చునని ఊహించలేదు. దానికి నన్ను పిలుస్తారని అసలే అనుకోలేదు. సాయి పాపినేని గారి మొదటి కాల్ వచ్చినప్పుడు ఆశ్చర్యం. ఆయనతో పది నిముషాలు మాట్లాడగానే “చివరి నిముషంలో ఏమైనా అడ్డు వస్తే చెప్పలేనుగాని, తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తాను” అని చెప్పేశాను.

ప్రేరణ

హిస్టారికల్ ఫిక్షన్ అంటే నాకేమీ ప్రత్యేక మక్కువ లేదుగానీ ప్రపంచ సాహిత్యం చదివేటప్పుడు, ఇష్టమైన రచయితల రచనలన్నీ ఏకబిగిన చదువుతున్నప్పుడు ఈ జాన్రే ఎదురపడకతప్పదు. ఆ రచనల్లో నేపధ్యమైన చరిత్ర గురించి అంతగా తెలియకపోయినా కథనం కట్టిపడేస్తుంది కనుక అవి “ఫేవరెట్స్” అయ్యి కూర్చుంటాయి. ఉదాహరణకి, టర్కీ రచయిత ఒర్హాన్ పాముక్ రాసిన “మై నేమ్ ఇస్ రెడ్!” ఇది, 15,16వ శతాబ్దంలో ఒట్టమాన్ సామ్రాజ్యంలో మినియేచరిస్టుల (ముఖ్యంగా ఇస్లాము పుస్తకాల్లో కనిపించే బొమ్మలు.) జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. వారి వృత్తి, వారి మీద పడుతున్న పశ్చిమ దేశాల ప్రభావం నేపధ్యంగా తీసుకొని రాసిన నవల.

ఈ వర్క్ షాపు గురించి తెలియక ముందే కన్నడంలో వచ్చిన వసుదేంధ్ర నవల “తేజో-తుంగభద్ర” చదవటం మొదలెట్టాను, ఒక ఫ్రెండు సాయంతో. ఇందులో కథ వాస్కో డి గామా భారతదేశానికి అప్పుడే దారి కనుక్కున రోజుల నుండి మొదలై, ఆ తర్వాత అక్కడ ఇక్కడ సామాజిక, రాజకీయ స్థితిగతులు ఎలా మారాయో, అందులో సగటు ప్రజల జీవితాలు ఏమైయ్యాయో గొప్పగా చూబించారు. ఒక రెండు నెలల సమయం ఉండేసరికి పట్టుబట్టి పదం పదం కూడుకుంటూ మొత్తానికి నవల పూర్తి చేశాను. వర్క్ షాపుకి ఇది చదివి వెళ్ళటం నాకు చాలా విధాలుగా ఉపయోగపడింది.

ఇది కాక కోర్సెరాలో ఎప్పటి నుండో నాన్చుతున్న “Plagues, witches and war: The worlds of historical fiction” ని కూడా మళ్ళా మొదటినుండి తిరగేసాను. మొత్తం అన్ని వారాలూ పూర్తి చేయలేకపోయాను కానీ, సగం వరకూ కోర్సు చేసినా చాలా విషయాలు తెలిశాయి. ముఖ్యంగా ఒక చారిత్రక పాత్రను తీసుకొని అతడి జీవితాన్ని మళ్లీ కథగా చెప్పటంలోని సాధకబాధకాలు బగా తెలిసి వచ్చేలా రచయితలు వివరించడం ఈ కోర్సుకే హైలైట్.

కార్యశాల

కార్యశాల రెండు రోజులు జరిగింది. దీన్ని ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించుకోవచ్చు. ౧) చరిత్ర గురించిన విశేషాలు. ౨) చారిత్రక సాహిత్యం గురించిన విశేషాలు.

చారిత్రక కథలు చెప్పాలంటే ముందుగా చరిత్ర తెలియాలి. ఆ చరిత్రను ఆధారంగా చేసుకొని, జరిగిన సంఘటనలని, అప్పటి రాజకీయసామాజిక పరిస్థితులని ఉన్నది ఉన్నట్టుగానే ఉంచుతూ ఒక కట్టు కథ చెప్పాలి. అంటే, చరిత్ర రచన ఒక వల అనుకుంటే ఆ వల పెద్దవి అయిన వాటిని, ముఖ్యమైన వాటి పట్టుకుంటుంది – ఏ రాజు ఏ యుద్ధం ఎప్పుడు చేశాడు, ఏ కళాకారాడు ఏ రాజు దగ్గర ఆశ్రయం పొందాడు లాంటివి మాత్రమే చిక్కుతాయి. చారిత్రక సాహిత్యం అందులోంచి జారిపోయినవాటిని గురించి కల్పన చేసి మళ్ళీ కథగా పట్టుకుంటుంది. అంటే యుద్ధానికి వెళ్ళే ముందు రాజుగారి మానసిక పరిస్థితి ఎలా ఉంది, లేక ఆ యుద్ధం చేసిన సైనికుల మనోగతి ఏంటి లాంటివి అన్నమాట. వసుదేంధ్ర నవలలో ఉదాహరణ తీసుకొని చెప్పాలంటే, కృష్ణదేవరాయలకి చాన్నాళ్ళ వరకూ పుత్రప్రాప్తి లేదని, ఎట్టకేలకి ఎప్పుడో పుట్టాడని చరిత్ర చెబుతుంది. అయితే ఆయనకి కొడుకు లేకపోవడం అప్పటి సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపింది అన్నది ఆ నవల చదివితే తెలుస్తుంది.

చారిత్రక కథలకి ముడిసరకు చరిత్ర కాబట్టి, ఈ కార్యశాల దానితోనే ప్రారంభమైంది. తెలుగునాట ఉన్న మూడు ముఖ్యమైన ప్రాంతాలు, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలకు ఒక్కొక్కళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడి ఘన చరిత్రను చెబ్బుకొచ్చారు. జనాల నోళ్ళల్లో నలిగే కథల గురించి కాకుండా తగినంత సాక్ష్యాధారాలు ఉన్న వాటిని గురించే ఇక్కడ ప్రస్తావించారు. 

ధీర్ఘాసి విజయభాస్కర్ కళింగాంధ్ర గురించి మాట్లాడారు. గమ్మత్తు అనిపించిన విషయాలు: ఆంధ్రులు కౌరవులకి కురుక్షేత్ర యుద్ధంలో మద్దత్తు ఇవ్వటం, దుర్యోధుని భార్య తెలుగు ఆడపడుచని చెప్పటం. కట్టా శ్రీనివాస్ తెలంగాణ చరిత్ర గురించి చెబ్బుకొచ్చారు. ముఖ్యంగా ఆయన సొంతంగా పనిచేసిన అంశాలను చెప్పటం బాగనిపించింది. ఒక రాతి అవశేషాన్నో, శిల్పానో ముందుగా చూసినప్పుడు అనుకున్నదానికి, తర్వాత తర్వాత దాన్ని పరిశోధిస్తూ, తీర్మానించుకున్నదాన్ని వాళ్ళే తిరస్కరించుకుంటూ వెళ్ళటం ఎలా ఉంటుందో ఆయన ఉపన్యాసంలో బాగా తెలిసింది. ఖమ్మం జిల్లాకి నలభై కి.మీ దూరంలో నాగులవంచ అనే గ్రామంలో డచ్ వారు మచిలీపట్నం నుండి గోలుకొండకు వెళ్తున్న దారిలో విశ్రాంతికి ఆగటం, అక్కడ చేసిన వ్యాపారాలు, అందుకు స్థానికులచేత విపరీతమైన పనిచేయించడం, దానికి వారు తిరుగుబాటు చేయటం లాంటి విషయాలు చెప్పుకొచ్చారు. 

 వేంపల్లి గంగాధర్ రాయలసీమ చరిత్ర గురించి చెప్పారు. ఈయన స్పీచులో బాగా నొక్కిపెట్టి చెప్పిన విషయం: మనం మన చరిత్ర అవశేషాలని ఎంతగా విస్మరిస్తున్నామోనని. కోటల్లో, కొండల్లో బంగారమో, వజ్రాలో దొరుకుతాయన్న ఆశతో వాటిని తవ్వుకుంటూ కూర్చుంటాము, కొంచెం ఓపిక చేసుకొని మన చరిత్రను మనం తెల్సుకునే ప్రయత్నం ఎందుకు చేయము? అన్నది వారి వాదన. రేనాటి చోళుల కాలంనాటి రాణి వసంత పోరి, జొన్నగిరి అశోకుడి శాసనాలు వగైరా గురించి క్షుణ్ణంగా చర్చించారు. (ఈ ఉపన్యాసాలన్నీ ఒకట్రెండు గంటల హిస్టరీ లెక్చర్లుగా కొనసాగాయి. వీటిలో ప్రస్తావించిన చారిత్రకాంశాలు గురించి చెప్పాలంటే నాకు రివిజను అవసరం – నాకు బొత్తిగా అలవాటులేని, నేను అప్పుడే మొదటిసారిగా విన్న సబ్జెక్టు కాబట్టి. అందుకే రెండు ముక్కలతో ముగిస్తున్నాను.) 

తర్వాత చారిత్రక కథలు రాయడానికి కథకులకి ఎదురయ్యే అడ్డంకుల గురించి కథకులనే చర్చించుకొని రమ్మన్నారు. ఇందులో ముఖ్యంగా బయటపడ్డ అనుమానాలు, భయాలు: చరిత్రను గురించి రాసేటప్పుడు దాన్ని వక్రీకరించకుండా రాయడం సాధ్యమేనా? చరిత్రను అర్థం చేసుకొని, ఆకళింపుచేసుకొని కథలుగా మలచటానికి మన దగ్గర చరిత్రను గురించి ఎంత సమాచారం అందుబాటులో ఉంది? లేని సమాచారాన్ని పొందే వనరులేంటి? చారిత్రక పాత్రచేత ఇప్పటి పరిస్థితులపై వ్యాఖ్యానింపజేస్తే అది చారిత్రక సాహిత్యం అవుతుందా? అసలు, ప్రతి కథా ఎంతో కొంత social historyని పట్టుకుంటుంది, అలా ఎలాగూ చరిత్రను రాస్తూనే ఉన్నాం కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎప్పుడో జరిగిపోయినదాని గురించి, ఏం జరిగిందో ఖచ్చితంగా తెలియనిదాని గురించి మళ్ళీ రాయడమెందుకు? లాంటి ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. 

వీటికి సాయి పాపినేని చారిత్రక కథలు రాసిన రచయితగా తమ అభిప్రాయాలు చెప్పారు. చినవీరభద్రుడు కథల గురించిన అనుమానాలని కథలతోనే తిప్పికొట్టారు. గురజాడ రచనలనుండి, చందమామ కథలనుండి ఉదాహరణలు తీసుకొని చారిత్రక కథారచనలపై ఉన్న అనుమానాలను దూరంచేశారు. ఈయన చదివి వినిపించిన రెండు కథలూ మాత్రం ఇప్పుడప్పుడే మర్చిపోవడం కష్టం నాకు. 

ఈ రెండు రోజుల్లో జరిగిన మరో ముఖ్యమైన ఉపన్యాసం ఆదిత్య కొర్రపాటి ఇచ్చిన “భారత సాహిత్యంలో చారిత్రక సాహిత్యం” అనే అంశం గురించి. పశ్చిమ దేశాలలో చారిత్రక సాహిత్యం ఎలా మొదలైంది, దాన్ని వాళ్ళు ఎలా నిర్వచించుకున్నారు అన్నదాని నుండి మొదలెట్టి, భారతీయ భాషల్లో ఇది ఎలా కొనసాగిందో చెప్పారు. కన్నడ, తమిళ, మలయాళ, మరాఠి, గుజరాతి భాషల్లో వచ్చిన, వస్తున్న హిస్టారికల్ ఫిక్షన్ గురించి, అవి ఆయా భాషల సాహిత్యాలను, సమాజాలను ప్రభావితం చేసిన తీరు గురించి చెప్పుకొచ్చారు. గుజరాతీలో వచ్చిన చారిత్రక నవలని రాజకీయ నాయకులు ఇప్పటికీ తమ ఉపన్యాసాల్లో వాడుతారని తెలిసి ఆశ్చర్యపోయాను. 

“శప్తభూమి” రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న బండి నారాయణ స్వామిగారి తో ముఖాముఖి జరిగింది. ఇందులో ఆయన ఈ నవల రాయడానికి ప్రేరణ ఎలా వచ్చింది, తెలిసిన చరిత్రలోనుండి పాత్రలను ఎలా పుట్టించారు, చరిత్రకి, కల్పనకి మధ్య వారధి ఎలా కట్టారు లాంటి పంచుకున్నారు. ఈ నవలలో ప్రస్తావించిన కొన్ని నేపథ్యాలకి, వసుదేంధ్ర నవలలో ఘటనలకీ పోలికలు ఉన్నాయనిపించింది. శప్తభూమి కూడా రీడింగు లిస్టులోకి చేరింది. ముఖ్యంగా శప్తభూమి నవలలో హింస గురించి కొంత చర్చ నడిచింది. నాకు తేజో తుంగభద్రలో కూడా హింస, ముఖ్యంగా మనుషులు తమ మీద తాము చేసుకునే హింస – అది భక్తి పేరిట అయినా, రాజభక్తి పేరిట అయినా ఎక్కువగా కనిపించింది. 

చివర్న ఈ కార్యశాల కొండవీడు కోటను సందర్శించడంతో ముగిసింది. 

ఎమెస్కోవారు పి.వి. పరబ్రహ్మశాస్త్రిగారు రాసిన కాకతీయులు, “ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర” పుస్తకాలను బహూకరించారు. సాయిపాపినేని తన పుస్తకం “ఆంధ్రపథం” ఇచ్చారు. 

You Might Also Like

4 Comments

  1. Venu Mareedu

    We are proud of Shri Katta Srinivas

  2. రాయదుర్గం విజయలక్ష్మి

    చారిత్రక నవలా రచనా గురించి, సంక్షిప్తంగానే అయినా తగినన్ని వివరాలు ఇచ్చారు.

  3. Johnson Choragudi

    Good
    Sincere attempt
    Rgds

Leave a Reply