కులం కథ – పుస్తక పరిచయం

వ్యాసకర్త : కొల్లూరి సోమశంకర్ 

సంచిక – సాహితి సంయుక్తంగా ప్రచురించిన కథా సంకలనం ‘కులం కథ’. 

తెలుగు కథకులు కులంసమస్యకు స్పందించిన తీరును విశ్లేషిస్తూ, సమస్య పరిష్కారానికి వారు సూచించిన మార్గాల గురించి చర్చించే వీలు చిక్కుతుందనే ఆశతో ఈ సంకలనం కూర్పు జరిగింది.

తెలుగు కథకులు అత్యంత అద్భుతమైన రీతిలో సమాజంలో సమన్వయం సాధించే కథలు రాశారని, ద్వేష భావనలు తొలగిస్తూ, ప్రజల మనస్సుల నడుమ అడ్డుగోడగా నిలచిన కుల భావనను ఛేదిస్తూ, కుల భావన అసలు అర్ధాన్ని వివరించే కధలు అద్భుతమైన విధంగా సృజించారని సంపాదకులు పేర్కొన్నారు.

42 కథలున్న ఈ సంకలనంలోని కొన్ని కథలను సంక్షిప్తంగా పరిచయం చేసుకుందాం.

***

రైతుకు, కుమ్మరికి ఒకరితో ఒకరికున్న సంబంధాన్ని ఆధ్యాత్మిక స్థాయికి చేర్చిన కథని ‘కుమ్మరి చెక్రం’ పేరుతో గోపిని కరుణాకర్ రాశారు. ఆ కథతో ఈ సంకలనం ప్రారంభవుతుంది.

వ్యభిచారం చేసేడప్పుడు అవసరం లేని కులం, కానుకలు తీసుకునేడప్పుడు అక్కర్లేని కులం పండ్లు కొనేచోట మాత్రం ఎందుకని ఓ భార్య భర్తని నిగ్గదీసి అడిగిన కథ ‘నేరేడుపండ్ల కంటు’. రచన శ్రీనివాసులు. రచనాకాలం 1927.

మ్యాదరి వెంకట భాగ్యరెడ్డి వర్మ రాసిన ‘వెట్టి మాదిగ’ కథ 1932 నాటి తెలంగాణాలో పటేళ్ళ అభిజాత్యాన్ని, నిమ్న కులాలని ముద్ర వేసిన మనుషుల పై వాళ్ళు చేసిన దౌర్జన్యాలని చెబుతుంది.

బ్రాహ్మణుడనీ, వైదిక విద్యలో అధికుడననీ గర్వించిన సోమశర్మకు జ్ఞానోదయమైన వైనాన్ని వేలూరి శివరామశాస్త్రి రచించిన ‘మాల దాసరి’ కథ చెబుతుంది.

కులం కోసం శీలవతి, గుణవతి అయిన ఇల్లాలిని వదిలేయడం కంటే, అటువంటి ప్రేమమయి కోసం కుల గౌరవన్ని వదులుకోడమే ఉత్తమం అని చెప్పిన కథ రావులపర్తి సూర్యనారాయణమూర్తి రాసిన ‘కులమా? కులపాలికా?’.

తండ్రి క్రైస్తవంలోకి మారినా, కూతురు హిందూమతంలోనే ఉండిపోయిన ఓ యువతి దొర కామానికి లొంగలేదని, ఆ సాయంకాలం మాలపల్లెలో కొన్ని ఇల్లు కాలిపోతాయి ‘మాలోళ్ళ యెంకి’ కథలో. మతం పేరుతో దురాగతం చేయపోయిన వాడికి తగిన శాస్తి జరుగుతుందీ కథలో. గజపతిరాయ వర్మ రాసిన ఈ కథ 1939 నాటిది.

అధికారం ఉంది కదా అని భృత్యులను తిట్టీ కొట్టీ హీనంగా చూసిన ఒక గిర్దావరు, అతని పాలిట పడ్డ ఓ చాకలి కథ ‘వెట్టి చాకలి దినచర్య’. ఆవుల పిచ్చయ్య 1948లో రాసిన ఈ కథ ఆనాటి సమాజంలోని నైచ్యాన్ని చూపుతుంది.

తనింటి పాలేరుని తమ్ముడిగా భావించిన కుర్రాడి కథ ‘పాలేరు తమ్ముడు’. బాల్యంలోని నిష్కల్మషాన్ని చాటిన కథ ఇది. మానేపల్లి తాతాచార్య రాసిన ఈ కథ 1948 నాటిది.

తల్లిదండ్రులు చనిపోగా బాల్యంలోనే అవమానాలు ఎదుర్కున్న లక్ష్మిని చేరదేసి విద్యాబుద్ధులు చెప్పించి పెద్దచేస్తారు సుశీలా, సుందర్ దంపతులు. డాక్టర్ అయిన లక్ష్మి లోగడ తనని అవమానించిన మహిళకే వైద్యం చేసి, ఆమె మనసు మారేలా చేస్తుంది ‘హరిజన లక్ష్మి’ కథలో. రచన ఆర్. జానాబాయినాయుడు, ఈ కథ 1949 నాటిది.

గొప్ప విప్లవవాదిగా, సంస్కర్తగా, అభ్యుదయవాదిగా పేరుపొందిన వ్యక్తి అసలైన స్వభావాన్ని వెల్లడించి, అతన్ని మార్చడానికి అతని చెల్లెలు చేసిన కృషిని చెప్పిన కథ కప్పగంతుల మల్లికార్జునరావు రాసిన ‘సుడిగుండాలు’.

తమ ఇంట పెరిగిన ఓ అనాథ జీవితంలో పైకొచ్చి కలెక్టర్ అయితే, సంతోషించిన ఓ కుటుంబం – ఆ కలెక్టర్ తమతో ప్రవర్తించిన తీరుకి నగుబాటుకు లోనవుతుంది ఎస్. పార్వతీదేవి వ్రాసిన ‘మంచితనానికి కులమేమిటి?’ కథలో. మంచి మనస్సు, దయాదాక్షిణ్యాలు వున్నవాడే అగ్రజాతి వాడని చెబుతుందీ కథ.

ఆధిపత్య భావన నరనరాల్లో నిండిన వ్యక్తులు కులతత్వం లేని చోట కులతత్వాన్ని ఎలా జొప్పించే ప్రయత్నం చేస్తారో వెల్లడిస్తుంది వసుంధర వ్రాసిన ‘కులతత్వం’ కథ.

మొండి పట్టుదల, సమాజానికి వెరవని ధైర్యం ఉన్న వ్యక్తిని అతనిదే కులమని అడిగేందుకు ఎవరూ సాహసించరని చెబుతుంది వి.ఆర్. రాసాని రాసిన ‘మెరవణి’ కథ.

ఏ కులమో తెలియని కొమరయ్య, తనలాగే కులం తెలియని లక్ష్మిని పెళ్ళి చేసుకుంటే – లక్ష్మిని తీసుకుపోడానికి వచ్చిన వ్యక్తికి లక్ష్మి చెప్పిన సమాధానం కుల సంకుచితాలను దూరం చేయాలంటే ఏం కావాలో చెబుతుంది చావా శివకోటి వ్రాసిన ‘ఏ కులం’ కథలో.

మనుషుల్లోని స్వార్థం, అహం, న్యూనతా భావనలు తొలగకపోవడం వల్ల కుల సంకుచిత్వం ఊడలమర్రిలా పాతుకుపోయిందని సూచిస్తుంది చిలుకూరి దేవపుత్ర వ్రాసిన ‘ఊడలమర్రి’ కథ.

సొంత బిడ్దల్లోనే వేరు కులాలుంటాయని మొదట తెలియక భంగపడి, కులమంటే డబ్బని తెలుసుకున్న ఓ తండ్రి కథ తోలేటి జగన్మోహనరావు రాసిన ‘కులం’ కథ.

కాలంతో పాటు వచ్చే మార్పులు పసిగట్టి, తదనుగుణంగా మారేవారే నెగ్గుకురాగలరనీ, అప్పుడే కులవృత్తుల స్వభావాలు మారుతాయని చెప్తుంది నందినీ సిధారెడ్డి వ్రాసిన ‘కులకశ్మి’ కథ.

ఇంకా చక్కని కథలు అనేకం ఉన్నాయి ఈ పుస్తకంలో. రాప్తాడు గోపాలకృష్ణ కథ అతడు బయలుదేరాడు, ఎన్. దాదా హయాత్ కథ ఎల్లువ, జూకంటి జగన్నాధం కథ కళేబరం, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కథ చనుబాలు, ఆడెపు లక్ష్మీపతి కథ అన్యాపదేశమ్, మంజరి కథ నిమిత్తమాత్రుడు, దగ్గుమాటి పద్మాకర్ కథ లక్ష రూపాయల కథ, నంబూరి పరిపూర్ణ కథ ఎర్ర లచ్చుప్ప, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి కథ పంచన్‌లామా, కె.ఎ. మునిసురేష్ పిళ్ళై అనాది-అనంతంకథ,  సూర్య ప్రసాదరావు కథ వాదమే వేదం, వారణాసి నాగలక్ష్మి కథ అమృతాన్ని సాధించు‘, అంబల్ల జనార్దన్ కథ దండుగు, కొలకలూరి ఇనాక్ కథ కాలేరా?’, మేరెడ్డి యాదగిరి రెడ్డి తోలుబొమ్మలు కథ, కస్తూరి మురళీకృష్ణ ఎక్స్‌పైరేషన్కథ, మొలకలపల్లి కోటేశ్వరరావు కథ రేయ్, యక్కలూరి వై. శ్రీరాములు దళిత బ్రాహ్మణుడు‘  కథ, మూరిశెట్టి గోవింద్ కథ గంగమ్మ తిర్నాళ్లు, ఇండస్ మార్టిన్ కథ చేపముల్లు,  రావుల కిరణ్మయి కథ గంగిరెద్దు, బొమ్మదేవర నాగకుమారి కథ ఏమిట్లు?‘, వసంతరావు దేశపాండే  పెంటయ్య బాబాయి’ కథ, స్వామి రచించిన నిన్నటి ఊపిరి’ కథ – ఆసక్తిగా చదివిస్తాయి, ఆలోజింపజేస్తాయి. ఈ అన్ని కథల్లోనూ కులతత్వాన్ని అధిగమించేందుకు ఏం చేయాలో అంతర్లీనంగా వివరించారు రచయితలు. 

“ఒకరినొకరు అర్ధం చేసుకుని, భేదభావాలను అవగాహన చేసుకుని సమన్వయంతో, ఒకరికొకరు చేయూతనిస్తూ ముందుకు సాగాలి. పైకి ఎదిగిన వాడు క్రింద ఉన్నవారిపట్ల తన బాధ్యతను గుర్తించి తనతోపాటు వారు ఎదిగేందుకు పాటుపడాలి. అయితే ఇదంతా సాధ్యం కావాలంటే కావాల్సింది ఆత్మవిశ్వాసం, నిజాయితీ అన్నది ఈ కథల సంకలనంలోని కథలు నిరూపిస్తాయి. ఆత్మవిశ్వాసం, నిజాయితి, నిస్వార్ధం కల సమాజమే అన్ని సమస్యలకు పరిష్కారం అని ఈ 42 కథల సంకలనం నిరూపిస్తుంది” అంటారు సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్. 

***

కులం కథ (కథా సంకలనం)

ప్రచురణ: సంచిక – సాహితి ప్రచురణలు

పుటలు: 368

వెల: ₹ 250/-

ప్రతులకు: 

సాహితి ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643 

నవోదయ బుక్ హౌజ్, కాచిగుడా క్రాస్ రోడ్స్, హైదరాబాద్

 

You Might Also Like

2 Comments

  1. ch shivakumar

    telangana… suryapet … rk coleg. 7702287862

  2. D Madhusudana Rao

    ఇటువంటి పుస్తకాలూ ఎక్కువగా రావాలి. నేను ఈ పుస్తకాన్ని తప్పక కొని చదువుతాను. క్లుప్తంగా కథలను చక్కగా పరిచయం చేశారు దేవినేని మధుసూదన రావు

Leave a Reply