బాల సాహిత్య ఆణిముత్యాలు-ఈ మాణిక్యాలు

వ్యాసకర్త : భైతి దుర్గం
“పిల్లలు దేవుడు చల్లని వారే
కల్ల కపట మెరుగని కరుణామయులే ” అన్నారు ఒక సినీ కవి.
అలాంటి పిల్లలను కాలంతో పోటీపడమంటూ మార్కుల యంత్రాల్లా మార్చి ఒత్తిడి పెంచుతుంది నేటి సమాజం. మరొక వైపు ఇంటర్నెట్, టివి,స్మార్ట్ ఫోన్ లు బాలల మనసులను కల్మషం చేస్తున్నవి. రేపటి భావి భారత నిర్మాతలైన నేటి బాలలకు సరైన మార్గనిర్దేశం చేయడానికి ఉపయోగపడు ఉత్తమ సాధనం బాల సాహిత్యం.
విద్యార్థుల దృష్టి బాల్యం నుండే సాహిత్యం వైపు మళ్లించే గురుతర బాధ్యత నేటి ఉపాధ్యాయులపైన ఉన్నది.పిల్లల కోసం రచనలు చేసిన ఎందరో బాల సాహిత్య వేత్తలు,అలాంటి పిల్లలచేత రచనలు వ్రాయించి ,పుస్తకాలు రూపొందించి బాల సాహిత్య వికాసానికి కృషి చేస్తున్న వారి ప్రయత్నం ప్రశంసనీయం.
పాతికేళ్లుగా బాల సాహిత్యానికి విశేష సేవలందిస్తున్న పెందోట వెంకటేశ్వర్లు తాను వ్రాసిన 32 పుస్తకాలలో 20 బాల సాహిత్యానికి సంబంధించినవి.అందులో చాలా పుస్తకాలు పిల్లలు వ్రాసిన కథలు, గేయాలు, కవితలతో రూపుదిద్దుకున్నవి.ఇప్పుడు పెందోట సంపాదకత్వం లో రూపొందిన మరో ఆణిముత్యం” మర్కుక్-మాణిక్యాలు ” బడిపిల్లల కవితా సంకలనంలో108 మంది చిన్నారులు వ్రాసిన కవితలుఅద్భుతంగాఉన్నాయి
.పచ్చనిచెట్లు,అమ్మ,నాన్న,గురువు,బడి,ప్రకృతి, పండుగలు,మాటతీరు ,అనుబంధాలు అన్నదాతలు లాంటి అత్యున్నత అంశాలను ఎంచుకుని కవితలు మలచిన విధానం బాగుంది.
మనిషికి మనిషితోడు
నీడగ ఉండిన స్నేహం
కలిసి మెలిసి ఉంటూనే
ప్రగతి సాధించును
అనే కవితలో బాల కవయిత్రి స్రవంతి స్నేహం యొక్క విలువను ఐకమత్యమునకు చిహ్నంగా చెప్పింది.
అమ్మ మనకు ధైర్యం
అమ్మ మనకు నడక
అమ్మాయే జీవితం
అమ్మ అంశం పైన ఎన్ని కవితలు వ్రాసినా తరగనిది అమ్మ ప్రేమ గా శిరీష అనే విద్యార్థిని చక్కగా వివరిస్తుంది.
వానా కాలం వచ్చింది
రైతుకు పనులను చెప్పింది
ఎడ్ల తో నాగలిని కట్టాడు
మంచి విత్తనాలను తెచ్చాడు
రైతుకు వర్షానికి మధ్య నున్న అనుబంధం ను అనిల్ కుమార్ అనే బాల కవి కవితగా మలచిన విధానం బాగుంది.
చీమలం మేము చీమలం
క్రమశిక్షణ తో ఉంటాము
పగలు రేయి శ్రమిస్తాము
ఆకారంలో చిన్నగున్న
ఆచరణలో మిన్న
చీమల జీవితం నుండి మనం చక్కని నడవడిక నేర్చుకోవాలని ఆరవ తరగతి బాల కవి అఖిల్ ఎంత బాగా వ్రాశాడు! ఇలాంటి చిట్టి చేతుల ద్వారా వ్రాయబడిన యెన్నో అద్భుత కవితలు ఈ పుస్తకం లో ఉన్నాయి. సరైన ప్రోత్సాహం ఉండాలే కానీ అత్యున్నత విజయం సాధించగలమని ఇటీవల రెండు ముద్రణలతో సంచలనం సృష్టించిన జక్కాపూర్ బడిపిల్లలు కథల పుస్తకం ద్వారా నిరూపించారు.
పిల్లలలో అపారమైన సృజనాత్మక శక్తి ఉన్నది. దానిని వెలికితీయడానికి నిరంతరం తపిస్తున్న పెందోట వెంకటేశ్వర్లు గారికి,వారికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం నకు నమస్కారములు. పెందోట సాహితి వనంలో విరబూసిన అక్షర కుసుమాలైన ఈ విద్యార్థులు రాబోయే తరంలో ఉత్తమ కవి/కవయిత్రులు కావాలని మనసారా ఆకాంక్షిస్తూ ,శుభాభినందనలు.
ప్రతులకు :జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
మర్కుక్ ,సిద్దిపేట జిల్లా
పేజీలు :72, వెల : 100/-
సమీక్షకులు :-
దుర్గమ్ భైతి
9959007914
Leave a Reply