శప్తభూమి – బండి నారాయణ స్వామి నవల పై చర్చా సమీక్ష

డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్

మార్చి 3, 2019

చర్చలో పాల్గొన్నవారు: మద్దిపాటి కృష్ణారావు, చేకూరి విజయసారధి, పిన్నమనేని శ్రీనివాస్, బూదరాజు కృష్ణ మోహన్, వేములపల్లి రాఘవేంద్రచౌదరి, ఆరి సీతారామయ్య, వీరపనేని విష్ణు, శంకగిరి నారాయణ స్వామి

చర్చ లో ముఖ్యాంశాలు సమీక్షించిన సభ్యులు: పిన్నమనేని శ్రీనివాస్

2017 సంవత్సరం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానావారి నవలల పోటీలో ఇంకొక నవల (“నీల”) తో  పాటు బహుమతి గ్రహీత శప్త భూమి”.

ఇది ఇప్పటి రాయలసీమ ప్రాంతం లో 1775 సంవత్సర కాలపు చారిత్రక నేపథ్యంలో రాసిన నవల. 2019 సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల. రచయిత అనంతపురం జిల్లా వాస్తవ్యులు బండి నారాయణ స్వామి ఆనాటి శాసనాల (కైఫీయత్లు, గెజిట్లు, శిలా శాసనాలు, వీరగల్లు) ఆధారంతో, చారిత్మాక సంఘటనల కాల ప్రమాణాలకు అనుగుణంగా అప్పటి సమాజంపు విభిన్న కుల మతాల సామాన్య ప్రజలు ముఖ్య పాత్రలుగా, అప్పటి పాలెగాళ్ల మధ్య పోరాటాలతో జరిగిన చారిత్రాత్మక మార్పులను కథా వస్తువుగా తీసుకుని, తన ఊహాశక్తిని జోడించి తెలుగు వారి చరిత్ర పట్ల మన అవగాహాన పరిధిని పెంచేలా రెండు భాగాలుగా రాసిన నవల.

తెలుగువారి చరిత్రకు సంబంధించిన సాహిత్యం లో రాచరికం చుట్టూ జరిగిన విషయాలే మనకి ఎక్కువ పరిచయం. గత కాలంలో సామాన్య ప్రజల జీవన విధానాలు, కరువు కాటకాలు,వారి పైన విధించిన పన్నులు, కుల మత వివక్ష, వాటి మార్పులు, వారి స్థితిగతుల గురించి గ్రంధస్థం చేసిన ప్రయత్నాలు ఆట్టే జరిగినట్లు అనిపించదు. సంస్కృతి పేరుతో మనం ఎందుకు చేస్తున్నామో  తెలియకుండా ఇప్పటికీ పాటించే చాలా ఆచారాలు, దురాచారాలు, నమ్మకాలు మాత్రం మన గతంలో నుండి బయలుదేరినవే.

శప్తభూమి నవలని రచయిత బండి నారాయణ స్వామి పద్దెనిమిదవ శతాబ్దపు చారిత్రక / దళిత చారిత్రక నవల గా ప్రస్తావించినప్పటికీ స్త్రీల పై జరిగిన దురాగతాల, అత్యాచారాల చరిత్రని విస్మరించ లేదు. ఏ వర్గపు స్త్రీల పైన అయినా – దళిత స్త్రీలు, కోమటి పడుచు, గొల్ల పడుచు, బ్రాహ్మణ స్త్రీ, వివాహిత స్త్రీలు, కాపు స్త్రీలు, పనివాళ్ళ, ముక్కుపచ్చలారని ఆడపిల్ల పై జరిపిన అరాచకాలు, హత్యాచారాలు, బలవంతపు సతీసహగమనాలు, పుట్టబోయే బిడ్డల భవిత ని కూడా శాసిస్తూ బసివిని గా మార్చటాలు, అత్యాచారాలనంతరం వారి గతులు, పరిస్థితులు చదువుతుంటే సామజిక స్పృహ వున్న ప్రతి ఒక్కరికి వీపు మీద చరిచినట్లుగా వుంది. అనంతయ్య శ్రేష్టి తన కూతురిని అడివిలో వదిలిపెడితే, ఎర్ర నాగిరెడ్డి భార్య ని కొండ దారుల్లో వదిలి పోవటం, వివాహిత స్త్రీలు అత్యాచారానంతరము వేశ్య గృహాలకు చేరటం, ఆత్మహత్యలకు పాల్పడడం, గొల్ల పడుచు వేశ్యా గృహాలకి తరలింపబడడము, బీరప్ప నెలల బిడ్డని తెలిసీ – దేవదాసీ స్త్రీలకు అమ్ముకోవటం, బొచ్చుతో కూడిన చచ్చిన కుందేలు పచ్చి మాంసాని కై బీరప్ప కోమటి పడుచుని చావ కొట్టటం, బ్రాహ్మణ స్త్రీ మోసపు పెళ్లి వలన ఇంటింటికి తిరిగి తన సంతానాన్ని దత్తత చేసుకొమ్మని అభ్యర్దించటం, ఆడబిడ్డతో సహా ఆత్మ హత్య చేసుకోవటం చదువుతుంటే నేటి సమాజంలోని పరువు హత్యలు, సుగాలీలు ఆడపిల్లల్ని అమ్ముకోవటం గుర్తు చేస్తూ కళ్ళని చెమరుస్తాయి. మరొక సందర్భములో రచయిత పెంపుడు పిల్లిని అడవిలో వదిలిన కొద్ది రోజులకే అడివి పిల్లి గా మారినట్లు  చెబుతుంటే సమకాలీన రాజకీయాల్లో అవివేకికి రాజ్యాధికార మొస్తే అనతి కాలం లోని అరాచకాన్ని సృష్టించడం గుర్తు కు రావట సహజం. రాజవంశీకులు, అమర నాయకులూ, దళిత శారీరక బలాడ్యులు, అవకాశమున్న స్వాముల దాష్టీకాలను ఎండకడతాడు రచయిత.

ఇక సున్నిత మైన మత మార్పిడి అనే అంశం పద్దెనిమిదవ శతాబ్దములోనే ఎలా జరిగిందీ వివరించారు. తొలుత బసివినిగా తర్వాత వేశ్య గ్రహాలకి చేర్చబడిన వారు, బలవంతంగా బసివిని గా మార్పించ బోయిన మేరీ, స్వమతములోని వారు చేసే హేళనలని భరించలేక దేవదాసి పుత్రుడైన మన్నారుదాసు పేరు మార్చుకొని క్రైస్తవాన్ని స్వీకరించటాన్ని కళ్ళకు కట్టినట్టుగా వర్ణించారు.

అనంతపురం సంస్థానాధీశుడిగా ఉన్న హండే సిద్ధరామప్పనాయుడు నుంచి ప్రారంభమవుతుంది కథ. ‘బిల్లే ఎల్లప్ప’ అనే గొఱ్ఱెల కాపరి (కురవ కులం) తన వడిసెల, కాపరి కుక్కల సాయంతో బుక్కరాయసముద్రం చెరువుకు గండి కొట్టాలనే శత్రువు (తాడిమర్రి సంస్థానము) పన్నాగాన్ని భంగపరచి అడ్డుకుని సిద్ధరామప్పనాయుడుకు ప్రీతి పాత్రుడవుతాడు. కురవ కుల కట్టుబాట్లకు విరుద్ధంగా గుర్రమెక్కి ‘ఎల్లప్ప జెట్టి’ అవుతాడు. బాలకొండ బీరప్ప కూతురు ఇమ్మడమ్మకి బిల్లే ఎల్లప్ప, కోడెనీలడు మేనబావలు. రాయలసీమ ప్రాంతం వర్షాధారితమైనందున అక్కడక్కడా ఉన్న  చిన్నా పెద్దా చెరువుల కింద ఉన్న ఆయకట్టు భూమి ఆ నాడు ఎంతో విలువైనది. ఇమ్మడమ్మకు కోడెనీలడే ఇష్టమైనా చెరువు సౌకర్యం లేని కొండాపురం ఊరిలో ఉండే కోడెనీలడికిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టలేదు బీరప్పకు. కరువుసమయం లో పోషించ లేక సొంత బిడ్డను భోగం వాళ్లకు అమ్ముకోవడం, తిండిలేక ఎలుకలు, పిల్లి మాంసం పిల్లలకు తినిపించడం వంటి బాధలు అనుభవించిన బీరప్ప (“ఒక రొట్టె కు, మూడు కాసులకు పిల్లనమ్ముకుంటున్న కరువుకాల మది”), కోడె నీలడికి కాకుండా ఒక మండలానికి నాయకుడైన బిల్లే ఎల్లప్పకే ఇమ్మడమ్మనిచ్చి పెళ్లి జరిపిస్తాడు. కానీ ఇమ్మడమ్మ కోడెనీలడినే తలుచుకుంటూ, ఎల్లప్పను దరిజేరనీయదు.

హరియక్క బోయ ఆడపడుచు. తన తండ్రి చిత్రలింగ నాయకుడిని దొంగదెబ్బ తీసి చంపిన పెమ్మరాజు తిమ్మప్పను మల్లయుద్ధంలో ఓడించి రణంకుడుపు (ఓడిన వాళ్ళ రక్తాన్ని ఎసరుగా చేసి అన్నం వండి కులదైవానికి సమర్పించుకోవడం) తో తాండవమాడిన పౌరుష వనిత. దేవర దున్న లాగా గ్రామాలపై పడి తిరుగుతున్న కోడెనీలడిని చూసి మనసు పారేసుకుంటుంది. హండే రాజును ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటుంది. హరియక్క, కోడెనీలళ్ళ జంటను చూసిన తర్వాత ఎల్లప్పను దరిజేరనీయనందుకు బాధపడుతుంది ఇమ్మడమ్మ. కానీ కోడెనీలడు ఒక్కరోజు కూడా హరియక్కతో ఉండకుండా పారిపోయి, ఎల్లప్ప మండలాధీనంలో వానలు పడడానికి జరుపుతున్న జాతరలోని  ‘గాలి దేవర’ ను దొంగిలించి తన గ్రామానికి తీసుకెళ్ళబోతాడు. బోడె ఎల్లప్ప దాన్ని అడ్డుకుని నీలడిని హతమారుస్తాడు. ఎల్లప్ప ‘భార్య ప్రియుణ్ణి’ చంపిన తరవాత అహంకారంతో బలవంతంగా భార్యను ఆక్రమిస్తాడు. ఇంక నేను ఎల్లడితో కాపురం చేయలేనని పుట్టింటికి చేరుతుంది ఇమ్మడమ్మ. 

ఇలా నవల ఇతివృత్తంలో ముఖ్యపాత్రలుగా ఎల్లప్ప, ఇమ్మడమ్మలు కనిపించినా నాటి సామాజిక  స్థితిగతులను మన కళ్ళముందు మెదిలించడానికి రచయిత సృష్టించిన పాత్రలన్నీ కథాసంవిధానంలో సహజమైనవీ, విశిష్టమైనవీను. కరువు సమయం లో సామాన్య ప్రజల కష్టాలు కంటికి కనపడేలాగా చెప్పగలిగారు.

నాగసాని – కరువు కాలంలో బిడ్డని అమ్ముకున్న బీరప్ప ఉజ్జినమ్మల కూతురు. దేవదాసి, పద్మసాని  (హండే సిద్దరామప్పనాయుడి ఆస్థాన దేవదాసి) పెంపుడు కూతురుగా పెరుగుతుంది.

పద్మసాని – దేవదాసి. తనను పట్టించుకోకపోవడంతో పద్మసాని రాజు ప్రాపకాన్ని వదిలేసి ఓ బీడు మైదానాన్ని ఎంచుకుని అందులో చెరువు తవ్వించి తన తల్లిపేరు మీద జక్కులూరును స్థాపిస్తుంది. అంతేకాకుండా చుట్టుపక్కల మండలాల్లో అమరనాయకుల చేతిలో పీడించబడుతున్న జనాలకు తన ఊరిలో ఆశ్రయం కల్పిస్తుంది. అది చుట్టుపక్కల  మండలాధీశులకు మింగుడుపడదు. ఆమె కొడుకు ఇంగ్లీషు చదువులు చదువుకోవడానికి మద్రాస్ పోయి అక్కడే క్రైస్తవ మతం పుచ్చుకుంటాడు. తన మతం చేసే దురాచారాలతో పాటు తన తల్లిని అసహ్యంగా చూడటానికి కారణమైన బసివిని వ్యవస్థ, తనను తండ్రి ఎవరో తెలియని వాడని లోకం హేళన చేయడం వంటివన్నీ అతడికి హైందవ మతం మీద అయిష్టం పెంచుతాయి. పద్మసాని పెంపుడు కూతురు నాగసాని తను పద్మసాని కి అసలు కూతుర్ని కానని, కరువు కాలంలో బిడ్డని అమ్ముకున్న బీరప్ప ఉజ్జినమ్మ ల కూతుర్ని అనీ తెలుసుకుంటుంది. పన్నెండేళ్ల కొకసారి కలిసే కురువల ‘పరస’ లో తన వాళ్ళని కలుసుకోవచ్చనే పెంపుడు తల్లి సూచనతో బయలుదేరుతుంది. తన అక్క, అమరనాయకుడు ఎల్లప్ప భార్య ఐన ఇమ్మడమ్మను చూసి నిర్ఘాంత పోతుంది. ఇమ్మడమ్మ తాన భర్త ఎల్లప్పను వదిలేసిన తర్వాత ఏడు పెళ్ళిళ్ళు చేసున్న సంగతి తెలిసి నాగసాని ఆశ్చర్య పోతుంది.

క్రూరమైన వ్యక్తిత్వం కలవాడు మండలాధీశుడైతే జరిగే పరిణామాలు వీరనారాయణ రెడ్డి ద్వారా చూపారు. నాటి సమాజంలో మాదిగ కుల స్త్రీలపై వీరనారాయణ రెడ్డి చేసే లైంగిక దాష్టీకాలు అప్పటి స్థితిని కళ్ళకు కట్టినట్లు చెప్పారు. వీర నారాయణ రెడ్డి పగబట్టి ఒక సామాన్య మాదిగ కుల వ్యక్తికి పుట్టబోయే తనకూతురి జీవితాన్ని బసివి వ్యవస్థ కు మార్చి శాసించ గలిగిన వ్యవస్థని వివరించారు.

ఎంత ధనమున్నా, ఉన్నత కులమైనా, రాజు దగ్గర గొప్ప పరపతి ఉన్నా, అధికారం లో ఉన్న కుటిలమైన అధికారి కామదాహానికి ప్రియమైన కూతుర్ని బలి చేసుకున్న వైశ్య కులపెద్ద అనంతయ్య శ్రేష్టి బాధ ఆ కధ అయ్యాక కూడా మన వెంట ఉంటుంది. కంబళి శరభుడు – అమాయక హరిచంద్రుడు. మాల కులం లో పుట్టి ఎవరితరం కాని నల్లగుండు ఎత్తగలిగిన మహా బలశాలి. ఊరి కట్టుబాట్లకు బలి ఐన సామాన్యమైన మనిషి.

నవలలో కొన్ని చోట్ల మనకి తెలిసిన బ్రౌన్ లాటి పాత్రలు అనవసరంగా తీసుకువచ్చినట్లు అనిపించింది. ఒకేసారి చాలా పాత్రలను పరిచయం చేయడం మూలంగా నవల మొదటిలో కొంచెం ఇబ్బంది అనిపించినా, ఒకసారి అలవాటు అయ్యాక ఇబ్బంది పోయింది. ముఖ్య పాత్రలు వారి మధ్య ఉన్న కుటుంబబంధం పటం రూపంలో ఉంచితే ఆ ఇబ్బంది ఉండేది కాదేమోననిపించింది. రచయిత చక్కని తెలుగు పదాలు వాడి ఆ తరంలో ప్రజల వేష ధారణ, ఆహార విశేషాల తో కధని నడిపిన తీరు ఎంతో బాగుంది. కాలంలో జరిగిన మార్పులతో పన్నెండేళ్ల కొకసారి కలిసే కురువల ‘పరస’ లో వీరినందరినీ కలిపి వారి జీవనం లో జరిగిన మార్పులు చూపారు.

కనుమరుగైన దురాచారాలు — ఈ కాలానికి రూపు మాసిపోయిన ఎన్నో దురాచారాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించిన తెలుగు బాష అద్భుతం. అప్పటి దురాచారాలు సతి, వీరమంటపం, గాలి దేవర ఆచారాలు వివరించారు. సతి – అమరనాయకుడైన నాగప్ప ప్రెగడ వారసత్వానికి అడ్డు ఉండకూడదని భర్తను పోగొట్టుకున్న పడమూడేళ్ల అన్న కూతురిని సతీ సహగమనం పేరిట మంటల్లో తోయడం వంటి దూరాచారాలు కనబడతాయి. ముఖ్యంగా ‘సతి’ ఎంత వేదనాభరితంగా వుంటుందో కళ్ళకు కట్టినట్లు వివరించారు. వీరమంటపం – బిల్లే ఎల్లప్ప తన రాజుకు పట్టిన దుస్థితి చూడలేక శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధిలో వీరమంటపం ( ఆత్మర్పణం ) ఎక్కడానికి సిద్ధమవుతాడు. వర్షాలు కురవాలని, తన రాజు రాజ్యాన్ని నవాబుల పాలు కాకుండా ఉండాలని, ‘సగం ప్రపంచం మునిగిపోనినా పర్వాలేదు కానీ అనంతపురం పై కుంభవృష్టి కురవాల’ని కోరుకుంటాడు. శరీరంలో అవయవాలన్ని ఒక్కొక్కటి కత్తిరించి దేవతలకు సమర్పణ చేసుకుంటాడు. గాలి దేవర – జాతర జరిపించే నిర్వహణని ఒక వ్యక్తికి అప్పగిస్తారు గ్రామ పెద్దలు. ఇది జరిగే సమయంలో ఎవరయితే ఆ ఫలాన్ని తెస్తాడో, వాడు మొనగాడు. వాడికి కట్టుబాట్లు వర్తించవు, ఏ ఇంట్లోకైనా వెళ్ళవచ్చు, ఆడువారి మీద పడచ్చు, ఎవరి మీద నయినా చేయి చేసుకోవచ్చు, ఎవ్వరు ఏమి అనకూడదు. కాని ఒక నియమం ఉంది – దేవర మనిషిగా మారినవాడు నోరు తెరచి మాట్లాడకూడదు, సైగలు చేయరాదు. 

ఇప్పటికీ ఉన్న దురాచారాలు – గాలి గున్నప్ప పరస ( ఇప్పటికీ  రాయలసీమ లోని ప్రతి సంవత్సరం తరగకుంట ప్రాంతంలో జరుగుతుంది అని రచయిత 256 పేజీలో ఉదహరించారు) కొత్తగా పెళ్లి చేసుకున్న మాదిగ దంపతులు గుండు కొట్టించుకొని, గుండు చుట్టూ సున్నం బొట్లు పెట్టించుకుని అపరాధ రుసుము చెల్లించడం. ముఖ్య పాత్రలు అన్నీఎదో ఒక దురాచారానికి లోను కావడం కనిపిస్తుంది. దానివల్ల ఇప్పటి మనకి(కాలం మారినా) వారు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. 

పాలెగాళ్ళ మార్పు అప్పుడు ఇప్పుడు – శప్తభూమి అంటే శాపగ్రస్థమైనది అని అర్థం. ఒక్కొక్క సామ్రాజ్యము నుండి మరొక సామ్రాజ్య అభివృద్ధి క్రమంలో రతనాలసీమ అనిపించుకున్న రాయలసీమ ప్రాంతము వానలు కురవక, చెరువులు ఎండిపోయి పంటలు పండక, కరువు కాటకాలతో ప్రజలు వలస పోతుంటే, కప్పం కట్టలేని హండె రాజు సిద్ధరామప్పనాయుడు కోటను ముట్టడిస్తే, కప్పం కట్టనూ లేక, యుద్దానికి దిగనూ లేని స్థితిలో పడిపోతాడు. టిప్పు సుల్తాన్ తరుపున గుత్తి తాబేదార్ అనంతపురం కోట తాళాలు తీసుకుని సిద్ధరామప్పనాయుణ్ణ తన దివాణం లోనే ఖైదీ చేస్తాడు. కాల పరిణామం లో టిప్పు సుల్తాన్ పోయి నిజాం నవాబు వచ్చాడు. నిజాం ను వదిలించుకుంటే సీమ దొరలు (ఇంగ్లీషు వాని) పాలబడి సీడెడ్ జిల్లాల క్రిందకి వచ్చిన రాయలసీమ ప్రాంతము దేశీ విదేశీ దోపిడికి గురి ఇయిన క్రమం అర్ధం అవుతుంది. ఎంతటి బలవంతులైనా ఎల్లప్ప జెట్టి, తిమ్మప్పనాయుడు, సిద్ధరామప్ప, కోడెనీలుడు, ఎర్ర నాగిరెడ్డి, నల్ల నాగిరెడ్డి, రామప్ప వంటి వారు కాల గమనం లో కలిసిపోక తప్పదని చెప్పటం జరిగింది. అభ్యుదయ భావాలూ కలిగిన ప్రతి యువతీ యువకులు, సామజిక స్పృహ వున్నవారంతా చదవ తగ్గ పుస్తకము అని చెప్పటం సందర్బోచితం.

You Might Also Like

Leave a Reply