వంశీ – నల్లమిల్లోరిపాలెం కథలు

(ప్రముఖ రచయిత, సినీ దర్శకుడు శ్రీ వంశీ రచించిన నల్లమిల్లోరిపాలెం కథలు, జనవరి 5న కాకినాడలో ఆవిష్కరించబడుతున్న సందర్భంలో, ఆ పుస్తకానికి డా. జంపాల చౌదరి వ్రాసిన ముందుమాట).
చాలాకాలం క్రితం, అంటే ఇంటర్నెట్లో తెలుగులో టైపు చేయడానికి అవకాశం కూడా లేని రోజుల్లో, చాలామందికి ఇంటర్నెట్ ఉన్నదని కూడా తెలీనంత పాతరోజుల్లో, నేనూ, జర్మనీలో పాడర్‌బర్న్‌లో ఉండే ప్లాస్టిక్స్ ఇంజనీరు పర్చూరి శ్రీనివాసూ, న్యూజెర్సీ నుంచి కంప్యూటర్ సైంటిస్టు కన్నెగంటి రామారావూ, అట్లాంటా నుంచి ఈమాట పత్రిక స్థాపించిన కొలిచాల సురేషూ, ఇంకా బోల్డంతమందిమి రోజూ రచ్చబండ అనే ఇంటర్నెట్ గ్రూపులో సాహిత్యం గురించీ, రాజకీయాల గురించీ, ఇంకా మరెన్నో విషయాల గురించీ కబుర్లు చెప్పుకుంటూ, కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మాతో పాటు చికాగోనుంచి వేలూరి వెంకటేశ్వరరావు, డిట్రాయిట్ నుంచి ఆరి సీతారామయ్య, టెక్సాస్ నుంచి రామారావు వాళ్ళన్నయ్య కన్నెగంటి చంద్ర, ఫిలడెల్ఫియా నుంచి నాసీ అని మేమంతా పిలుచుకొనే నారాయణస్వామి వంటి రచయితలు కూడా ఆ గ్రూపులో వుండేవారు. చాలా విషయాల గురించి వాదులాడుకొనేవాళ్ళం. ఒకసారి ఎవరు మొదలెట్టారో గుర్తులేదు కానీ మంచికథ లక్షణాలేమిటి అని కొన్నిరోజులపాటు వాడిగా వేడిగా చర్చ జరిగింది. న్యూజెర్సీలో ఉండే తమ్మినేని యదుకుల భూషణ్ మంచి కవిత్వం రాస్తాడు, బాగా చదువుతాడు. అతను మంచి కథకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం వాతావరణ కల్పన అని ప్రతిపాదించాడు. ఆ మాటను అందరూ ఒప్పుకోలేదన్నది పక్కన పెడదాం. కానీ కథల్లో ఆ వాతావరణ కల్పన అంటే ఏమిటి అన్న అనుమానం మీకుంటే, శ్రీ వంశీ వ్రాసిన ఈ కథలు మీరు చదివితే వెంటనే అర్థమై పోతుంది.
తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురంనుంచి, చోడవరం వైపు కాకుండా, మాచవరం బ్రిడ్జివైపు వెళ్ళేదార్లో ఉన్న పసలపూడి అనే చిన్న పల్లెటూరు ఎలా ఉంటుంది, ఆ ఊళ్ళో మనుషులు ఎలాంటివాళ్ళు అని అడిగితే, తెలుగుదేశంలో పుస్తకాలూ, పత్రికలూ చదివేవాళ్ళు చాలామంది టక్కున సమాధానం చెప్తారు. వాళ్ళలో చాలామందికి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడీ, గాలికొండాపురం రైల్వే గేటూ, బలభద్రపురం రైల్వే స్టేషనూ, అరకు, అక్కడ్నుంచి పోయే రైల్వే లైనూ ఇవన్నీ కూడా బాగా పరిచయమే. ఇక గోదావరిలో పడవ ప్రయాణాలూ, అక్కడ దొరికే రకరకాల చేపలూ, వాటిని వండే రకరకాల వైనాల సంగతులూ సరే సరి. దాదాపు రెండు దశాబ్దాలుగా వంశీ తన కథల్లో కల్పించిన వాతావరణం పుణ్యమే ఇదంతా. ఆర్కేనారాయణ్ మాల్గుడి కాల్పనికం కానీ, వంశీ పసలపూడి మాత్రం నిజం.
ఐతే వంశీ కథల్లో ఒక్క వాతావరణం మాత్రమే ఉండదు. ఆ కథల్లో మనుష్యులు ఉంటారు. వాళ్ళ పేర్లు సినిమాల్లో మల్లే ఫ్యాన్సీగా ఉండవు; వాళ్ళకు ఒక జీవితం ఉంటుంది; చుట్టాలు, స్నేహితులూ ఉంటారు; ఒక జీవన సరళి ఉంటుంది; ఒక ప్రవర్తన నియమావళి ఉంటుంది; తిండితీరులు ఉంటాయి; బంధుత్వాలూ, స్నేహాలూ ఉంటాయి; రాగద్వేషాలూ ఉంటాయి; వీటన్నిటితో పాటు, ప్రేమించే హృదయాలుంటాయి. అందువల్ల, ఆ మనుష్యులు మనకు నిజంగా ఉన్నారనిపిస్తుంది. వంశీకథల్లో మనుష్యులు చాలావరకు మంచివాళ్ళు, పక్కవాళ్ళకి సాయం చేసేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ప్రేమ వల్ల బలపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, పాఠకులు సానుభూతిని పొందేవాళ్ళు. జానపదకథల్లో కనిపించే ఒక పురాతన ప్రపంచపు చాయలు ఈ కథల్లో, ఈ మనుష్యుల్లో కనిపిస్తాయి.
వంశీ కథల్లో తరచు కనిపించే విషయాలు ఇంకొన్ని ఉన్నాయి: మనుషుల మధ్య ఉండే (లేక ఉండాల్సిన) బంధాలూ, బాంధవ్యాలూ, సెంటిమెంట్లు, ఒక మార్మికమైన వ్యక్తి (సాధారణంగా ఒక మిస్టరీ వుమన్) కోసమో, బంధంకోసమో అన్వేషణ, కథాంతంలో ఒక మలుపు. ఇవన్నీ కలిసి పాఠకుల మీద ఒక బలమైన ముద్ర వేస్తాయి.
వీటన్నిటికీ తోడు, ఇంకో అదనపు విశేషం వంశీ కథల్లో తరచు కనిపించే తిండి ప్రస్తావన; ఆ నేతిపెసరట్లు, ఆత్రేయపురం కాజాలు, పూతరేకులు, పొట్టెక్కలు, అల్లప్పచ్చళ్ళు, చేపలపులుసులు, నీచుకూరలు, ఒకటేమిటి, ఈ కథలు చదువుతుంటే నోరూరక తప్పదు. తెలుగు కాల్పనిక సాహిత్యంలో తిండి గురించి ఇంతగా వ్రాసిన రచయిత మరొకరు లేరు. తెలుగు ప్రపంచంలో ఉన్న గొప్ప వంటవాళ్ళందరూ ఈయన కథల్లోనే ఉన్నారా అనిపిస్తుంది; దానికితోడు అతిథులతో ఆ వంటలు తినిపించి ఆనందించే ఆతిథేయులూ పుష్కలంగానే కనిపిస్తారు. నిమ్మరసం మాంసంకూర మీరెప్పుడైనా తిన్నారేమో నాకు తెలీదు కాని నేనెప్పుడూ వినను కూడా వినలేదు; ఈయనేమో ఏకంగా ఆ వంటకం రెసిపీ కూడా చెప్పేస్తాడు ఒక కథలో. వీలైనంత వెంటనే కోనసీమ చేరుకొని ఈయన చెప్పిన హోటళ్ళు వెదుక్కొని ఆ పదార్థాలన్నీ తినని జన్మ జన్మ కాదు అనిపించేలా వ్రాయటం ఈయన సొత్తు.
వంశీ తన కథల్లో వాడే భాష గురించి కూడా ఒక మాట చెప్పాలి.. తూర్పుగోదావరి జిల్లా మాండలికాన్నీ, అక్కడ వ్యాప్తిలో ఉన్న అచ్చతెలుగు మాటల్నీ, నిత్య జీవిత సంభాషణనీ సునాయాసంగా చొప్పించటం వంశీ కథల్లో ప్రాంతీయత (నేటివిటీ)ను మరింత చిక్కపరుస్తుంది.
మనకు ఆ ప్రాంతమూ, ఆ మనుష్యులూ తెలియకపోయినా, మనం పల్లెటూళ్ళలో, పెరిగినా, పెరగకపోయినా, మన మూలాల్ని తట్టి, ఒక నోస్టాల్జియాతో గుండెని తట్టే టెక్నిక్ వంశీ స్వంతం చేసుకున్నాడు. అసాంఖ్యాకమైన పాఠకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇమిటేషన్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ (అనుకరణను మించిన పొగడ్త లేదు) అని ఒక ఇంగ్లీషు సామెత ఉంది; ఈరోజున ఇంటర్నెట్లోనూ, ఇతరత్రానూ, కనిపిస్తున్న వంశీ మార్కు నోస్టాల్జియా కథలు చూస్తే ఈ రచయిత ఒక తరం పాఠకుల్ని ఎంత ప్రభావితం చేస్తున్నాడో అర్థమవుతుంది.
నాకు చాలా ఇష్టులైన బాపు గారికి వంశీ అంటే చాలా అభిమానం. తమ కథల్లో ఒక్కదానికైనా బాపు గారు బొమ్మ గీయటమే మహా భాగ్యం అని కోరుకునే రచయితలున్న తెలుగుదేశంలో, వంశీ కథలకు బాపుగారు దాదాపు మూడువందలు బొమ్మలు గీశారంటే ఆశ్చర్యంగా ఉంటుంది.
ప్రముఖ రష్యన్ కథకుడు చెహోవ్ కథలకు ఏర్పరచిన నియమం ఒక్కటుంది – కథ మొదటి సన్నివేశంలో గోడమీద తుపాకీ ఉంది అని ఉంటే, కథ అయిపోయే లోపల ఆ తుపాకీ పేలి తీరవలసిందే అని. అంటే కథలో వచ్చిన ప్రతి విషయానికీ కథకూ ప్రత్యక్ష సంబంధం ఉండాలి; కథలో అనవసర విషయాల ప్రస్తావన తేవడం మంచికథ లక్షణం కాదు అని ఆయన అభిప్రాయం. ఆ నియమాన్ని బొత్తిగా ఖాతరు చేయకుండా ఉండటమే తన ట్రేడ్‌మార్కుగా చేసుకొన్నాడు వంశీ. కథకు ప్రత్యక్షంగా సంబంధం లేని అనేక విషయాలను అలవోకగా చెప్పుకొంటూ పోతూ తనతో పాటు పాఠకుల్ని తన లోకం లోకి తీసుకు వెళ్ళడం వంశీ శైలిలో ప్రత్యేకత. ఐతే, ఒకోసారి ఈ శైలిలో అసలు కథను వెతుక్కోవాల్సి వచ్చిన విషయం కూడా పాఠకులు గుర్తించలేకపోవటం విశేషమే.
స్వతహాగా రచయిత ఐన వంశీ, భావుకత, అన్వేషణల కలపోతల సినిమాల దర్శకుడిగా, ఉత్కంఠ పూరితమైన కథను వెండితెరపై చెప్పగలవాడిగా లబ్ధప్రతిష్టుడైన వ్యక్తి. చాలా కథల్లో ఆ సినిమాటిక్ టెక్నిక్ కనిపిస్తుంది – పాత్రల నిర్మాణం, సంఘటనల కూర్పు, కథ నడిపించే నేర్పూ ఇవన్నీ ఆ టెక్నిక్‌లో భాగమనే చెప్పచ్చు. ఆయన వ్రాసే కథలకు ఈ టెక్నిక్ బలమూ, బలహీనతా కూడా. బలం ఎందుకంటే కథ పాఠకుడిలో ఉత్సుకతని రేపి, కథలో లీనం అయ్యేట్టు చేసి చదివిస్తుంది. బలహీనత ఎందుకంటే సినిమాలకు అవసరమైన నాటకీయత ఒకోసారి కథలో ఉన్న జీవాన్ని చంపేస్తుంది; పాత్రలు కేరికేచర్లలాగా తయారవుతాయి; ముగింపు ముందే తెలుస్తుంది. వంశీ ఈ విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది.
ఈ నల్లమిల్లోరిపాలెం కథలు సంకలనంలో ఉన్న 40 కథలు వంశీ శైలిలో వివిధ పార్శ్వాలకి ఉదాహరణలుగా నిలుస్తాయి; ఆసక్తిగా చదివిస్తాయి. కొన్ని కథలు మనస్సును గాఢంగా తడతాయి. కొన్ని పాత్రలు గుండెల్ని గట్టిగా తడతాయి. కొన్ని కథల్లో వంశీ ఒక పాత్రలా ఉండటం మనం ఇంతకు ముందు చాలాసార్లు చూశాం; ఆ కథల్లో నిజమెంత, కల్పన ఎంత అన్నది మనకు ప్రశ్నగా మిగులుతూ ఉంటుంది. ఈ సంపుటిలో మాత్రం కొన్ని నిజజీవితపు కథలు ఉన్నాయి – వాటిలో కొన్ని వంశీ స్వంత కథలు. మరికొన్ని అతనికి తెలిసిన మనుషుల కథలు. ఈ పుస్తకంలో ఉన్న కాల్పనిక కథలకన్నా, ఈ నిజజీవితపు కథలు (ఉదాహరణకి పాతూరి వెంకటసుబ్బమ్మ గారు, కుతుకులూరి సత్తిరెడ్డిగారి రెండో అబ్బాయి) ఇంకా అబ్బురంగా అనిపించాయి. కల్పనకన్నా జీవితంలోనే నాటకీయత ఎక్కువ ఉంటుంది అని ఈ కథలు నిరూపిస్తాయి.
గత రెండు దశాబ్దాలలో సాధారణ పాఠకులలో కథలు చదవటంలో ఉత్సాహాన్ని, ఆసక్తిని పెంచిన రచయితలలో ముఖ్యుడైన వంశీ ఇంకా గొప్ప కథలు వ్రాసి తెలుగు సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారని గాఢంగా ఆకాంక్షిస్తూ, ఆయన మిగతా కథల పుస్తకాలలాగే ఈ పుస్తకాన్ని కూడా పాఠకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను.
varPrasad.k
వంశీ గారి కథలు అన్నీ కలసి ఒకే సీరీస్ గా మళ్లీ ప్రచురిస్తే బావుంటుంది.