శ్రీరామ శతకము విశిష్టాద్వైత సౌరభం

వ్యాసకర్త: కోడీహళ్లి మురళీమోహన్
****************

పుస్తకం పేరు: శ్రీరామ శతకము విశిష్టాద్వైత సౌరభం
సంపాదకుడు : టి.శ్రీరంగస్వామి
ప్రచురణ: శ్రీలేఖసాహితి
ప్రతులకు: శ్రీలేఖసాహితి,
27-14-53, మండల్ ఆఫీసు ఎదురుగా,
హసన్‌పర్తి, వరంగల్లు, 506 371
తెలంగాణ చరవాణి:9949857955
పేజీలు: 232
వెల:₹150

తెలంగాణాలో పుస్తక ప్రచురణలు చేపట్టిన సాహిత్య సంస్థలు అనగానే తెలంగాణ సారస్వత పరిషత్ (పూర్వం:ఆంధ్ర సారస్వత పరిషత్), యువభారతి, ఇటీవలి కాలంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఇలా రెండు మూడు పేర్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. ఇవన్నీ హైదరాబాదు కేంద్రంగా పని చేస్తున్న సాహిత్య సంస్థలు. హైదరాబాదేతర తెలంగాణాలో గత 40 సంవత్సరాలకు పైగా అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ, దానిలో భాగంగా నిరంతరంగా సాహిత్య గ్రంథాలను ప్రచురిస్తున్న సంస్థ బహుశా శ్రీలేఖ సాహితి ఒక్కటేనేమో. వరంగల్లు జిల్లా హసన్‌పర్తి వంటి మారుమూల ప్రాంతం నుండి శతాధిక గ్రంథాలను ప్రచురించడం సాధారణమైన విషయం కాదు. ఈ సంస్థను అకుంఠిత దీక్షతో నడుపుతున్నవారు డా.టి.శ్రీరంగస్వామి గారు. వీరి సంపాదకత్వంలో ఈ సంస్థ కొత్తగా వెలువరించిన 125వ గ్రంథం శ్రీరామ శతకము విశిష్టాద్వైత సౌరభం. కీ.శే.తిరుకోవలూరు రామానుజస్వామి శతజయంతిని పురస్కరించుకుని వారు వ్రాసిన శ్రీరామ శతకముపై 32 మంది ప్రముఖులచేత విశ్లేషణా వ్యాసాలను వ్రాయించి తీసుకువచ్చిన ప్రత్యేక సంచిక ఇది.

ఈ శతకములో జానకీదేవి (అమ్మవారు/పిరాట్టి) ప్రస్తావనను తొలి వ్యాసంలో విశదీకరించారు ఆచార్య కె.సర్వోత్తమరావు. శ్రీవైష్ణవ సంప్రదాయము ఈ శతకములో ప్రతిబింబించిన తీరును డా.కిడాంబి నరసింహాచార్యులు వివరించారు. శ్రీవైష్ణవ సంప్రదాయ తాత్త్విక పారిభాషిక పదాలను సందర్భానుగుణంగా, అర్థవంతంగా కవి ప్రయోగించిన తీరును డా.పమిడికాల్వ చెంచుసుబ్బయ్య తమ వ్యాసంలో కొనియాడారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని నిర్ధారిస్తూ పూర్వాచార్యులు చేసిన ప్రబోధాలను వాటి వైశిష్ట్యాన్ని ఈ శతకంలో పొందుపరచిన తీరును డా.చెన్నమనేని హన్మంతరావు గారు తమ వ్యాసంలో నిరూపించారు. ఈ శతకంలో ఆళ్వారుల, ఆచార్యుల ప్రస్తావన, ప్రశంసలను వరిగొండ సునంద తమ వ్యాసంలో పేర్కొన్నారు. నవవిధ భక్తి మార్గాలను ఈ శ్రీరామ శతకంలో పొందుపరచిన విధానాన్ని డా.నమిలకొండ సునీత తమ వ్యాసంలో సోదాహరణగా నిర్ధారించారు.

తిరుమంత్ర జపంతో, పంచ సంస్కార సంపన్నతతో, తత్త్వత్రయ జ్ఞానంతో, సదాచార పరాయణతతో వైష్ణవ భక్తి రూపుదాల్చిన సుందరత సీస పుష్పమాలికయే శ్రీరామశతకము అని ఆచార్య గోగినేని యోగప్రభావతీదేవి గారు అభిప్రాయపడుతున్నారు. ఈ సీసపద్య శతకాన్ని ఉత్పలమాలతో ప్రారంభించడం ఒక ప్రయోగమని డా.కంపెల్ల రవిచంద్రన్ అంటున్నారు. ఈ శతకము మార్గదర్శక కావ్యంగా నిరూపిస్తున్నారు డా.పుల్లూరి ఉమగారు. అర్థపంచకమును వివరించుటకు ఈ శతకములో అనేక ఉదాహరణములు ఉన్నాయి. శ్రీ వైష్ణవ సాంప్రదాయక రహస్యములు ఎన్నియో ఈ శతకములో దాగి ఉన్నాయి. శరణాగతి లక్షణములు, రహస్యత్రయము, అకారత్రయము, అష్టాక్షరి వైభవము, ద్వయమంత్ర ప్రభావము మొదలైన అనేక విషయాలు ఈ శతకంలో సందర్భానుసారంగా వర్ణించబడ్డాయని డా.కె.టి.వి.రాఘవన్ తమ వ్యాసంలో ఉద్ఘాటించారు. ‘పతియె నా గతియ’ను పద్యములో రామాయణ సారమును కవిగారు తెలిపి ధన్యజీవి అయ్యారని సముద్రాల పురుషోత్తమాచార్యులు తమ వ్యాసంలో ప్రస్తావించారు.

వైష్ణవ పరిభాషలోని 108 దివ్యదేశాలలోని 6 దివ్యదేశాలను ఈ శతకములో పేర్కొన్న విషయాన్ని ఆచార్య కోసూరి దామోదరనాయుడు విపులీకరించారు. అగాధమైన ఆధ్యాత్మికాంశాలను సరళతరం చేసి రాయడంలో కవి సఫలీకృతుడయ్యాడు అని డా.పల్లేరు వీరస్వామి నిర్ధారించారు. ఇంకా ఈ శతకంలో దాస్యభక్తిని గురించి ఆచార్య జి.డి.నాయుడు, విశిష్టాద్వైత పరిభాష గురించి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ, డా.సి.హెచ్.హరిశ్చంద్ర, శ్రీరామానుజ సంప్రదాయము గురించి ఆరుట్ల భాష్యాచార్యులు, ఔపమ్యాలను గురించి డా.కె.సూర్యనారాయణరెడ్డి తమ వ్యాసాలలో వివరించారు. ఈ శతకములో భక్తి భావ సౌందర్యాన్ని డా.పాతూరి రఘురామయ్య దర్శింపచేయగా, ఈ శతకం ద్వారా లభించే సందేశాన్ని డా.బత్తల శ్రీరాములు, ముడుంబై వరదాచార్యులు వివరించారు. నిందా స్తుతిలో అధిక్షేపిస్తూ కవిగారు చెప్పిన పద్యాలను డా.డి.నల్లన్న తమ వ్యాసంలో ఉటంకించారు. ఈ శతకపు కవితావైభవాన్ని డా.పమిడికాల్వ చెంచుసుబ్బయ్య విశ్లేషిస్తూ వాటిలోని రచనారీతి, భావవిశిష్టత, భక్తిప్రపత్తాలు, చమత్కారాలను సంగ్రహంగా పేర్కొన్నారు. ఈ శతకాన్ని భక్తి ఆర్తిల ప్రపన్న సంగమంగా సముద్రాల వేణుగోపాలాచార్యులు స్తుతించారు. ఇంకా ఈ శతకం గురించి ఆకెళ్ళ విభీషణ శర్మ, కాట్రగడ్డ, డా.పుట్టపర్తి నాగపద్మినీదేవి కూడా తమ తమ విశ్లేషణలు అందించారు.

ఇంతవరకు శ్రీరామశతకము దాని పలు విశిష్టతలను తెలుపుతూ పలువురు వ్రాసిన వ్యాసాలను ప్రస్తావించాను. ఇంకా ఈ గ్రంథంలో తిరుకోవలూరు రామానుజస్వామి గారి వ్యక్తిత్వాన్ని, సాహిత్య పిపాసను, వైష్ణవభక్తిని, సంప్రదాయాభిలాషను వివరిస్తూ డా.కె.కృష్ణమూర్తి, పల్లె సీను, టి.మురళీధరస్వామి, టి.ఉడయవర్లు, డా.ఆకునూరు తదితరులు వ్రాసిన వ్యాసాలున్నాయి. ఇవికాక రామానుజస్వామిగారి కుటుంబీకుల జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులు, ఛాయాచిత్రాలు ఉన్నాయి.

ఈ శతజయంతి ప్రత్యేక సంచికను అందంగా తీర్చిదిద్దడంలో డా.టి.శ్రీరంగస్వామిగారు పడిన శ్రమ ఈ పుస్తకంలోని అన్ని పుటలలోనూ కనిపిస్తున్నది. వారికి అభినందనలు.

You Might Also Like

Leave a Reply