F. Dostoyevsky Stories

వ్యాసకర్త: అమిధేపురం సుధీర్
*************
పుష్కరం క్రితం, విడుదలైన రెండో రోజు, ఒక సినిమాకి వెళ్ళాం. హాలు మొత్తం 20 మందికి మించి లేరు. సినిమా మొదలైన పది నిమిషాల్లోనే నా ఇద్దరు స్నేహితులు పిచ్చాపాటి లో పడ్డారు. కానీ నాకు మాత్రం ఆ సినిమా చాలా నచ్చింది. టైటిల్స్ పడటం నుంచే ఒక మ్యాజిక్ లాగ అనిపించింది. ఆ సినిమా పేరు ‘సావరియా’. సినిమా పేరు తర్వాత వచ్చిన టైటిల్ ‘Based on Fyodor Dostoevsky’s short story ‘White nights’’. అది చదవగానే ఎందుకో ‘White nights’ అన్న పేరు అలా గుర్తుండిపోయింది. కొంతకాలం క్రితం కోటి లోని సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాపులో ఈ పుస్తకం దొరికింది.

మొత్తం ఐదు కథలున్న ఈ పుస్తకంలో మొదటి కథ ‘White nights’. కథ మొత్తం కేవలం రెండు పాత్రల చుట్టే నడుస్తుంది. ఒంటరితనాన్ని, ప్రేమని, స్వార్ధాన్ని, మంచితనాన్ని, ఆశల్ని, నిరాశల్ని, ఇలా మొత్తం అన్ని రకాల భావాల్ని కేవలం ఈ రెండు పాత్రల ద్వారానే మనకి చూపెడతాడు. సినిమాలో అవసరార్థం?? ఇంకొన్ని పాత్రల్ని తీసుకున్నా, ఒరిజినల్ కథలో మాత్రం కేవలం రెండే పాత్రలు ఉన్నాయి. సినిమా తో పోలిస్తే నాకు ఈ కథ ఇంకా బాగా నచ్చింది. కథ పూర్తయ్యే సరికి కథానాయకుడు అనుభవించిన విరహం, వేదన మనకు కూడా అవగాహన లోకి వస్తాయి. అంత బాగా రాశారు ఈ కథని. ఈ పుస్తకంలో ఉన్న వాటిలో నాకు నచ్చిన బెస్ట్ కథ ఇదే.

పుస్తకం లోని రెండవ కథ పేరు ‘A faint heart’. ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహాన్ని, అందులో ఒక స్నేహితుడి ప్రేమ కథని చెప్తుంది. ఈ కథ కూడా ప్రేమకథే, ప్రేమికుల మధ్య ఉండే కొన్ని సున్నితమైన భావాల్ని ఇందులో లో చాలా బాగా రాశారు. అలాగే ప్రేమలో ఉన్న తన స్నేహితుడి బాధని తొలగించడానికి అతని స్నేహితుడు పడే ఆరాటం కూడా చాలా బాగా చెప్పారు. ఈ కథ చదవగానే నాకు ‘హృదయం’ సినిమా గుర్తుకు వచ్చింది.

మూడవ కథ పేరు ‘A most unfortunate incident’. తాగి ఉన్న ఒక జనరల్ అనుకోకుండా తన సబార్డినేట్ అయిన ఒక వ్యక్తి పెళ్లి కి వెళ్ళటం, తనంత పెద్ద అధికారి, అంత చిన్న ఉద్యోగి పెళ్ళికి వెళ్ళటమే తను చేసే పెద్ద ఉపకారం అనుకుంటాడు. ఏదో చేద్దాం అనుకుని వెళ్లి, తాగటం వల్ల, ఏం చేయలేక ఆ పెళ్ళి వారికే ఇబ్బందులు కలిగిస్తాడు. ఆ కాలంలో, ఆ మాటకొస్తే ఇప్పటికీ కొన్ని ఇండస్ట్రీస్లో లేదా కొన్ని చోట్ల, బాస్ కి సబార్డినేట్ కి, అలాగే ఉన్నవారికి లేనివారికి మధ్య ఏ విధమైన తేడాలు ఉంటాయి అన్నది ఈ కథలో సరదాగా చూపించారు. చదివేవాడికి సరదాగానే ఉంటుంది కానీ నిజంగా ఆ పరిస్థితిని ఊహించుకుంటే మాత్రం, ఒక్కసారి భయమేస్తుంది.

నాలుగవ కథ పేరు ‘The meek one’. ప్రేమని ఇంకో కోణంలో చూపించే కథ ఇది. పేదరికం నుంచి వచ్చిన ఒక వ్యక్తి,  తాకట్టు వ్యాపారి గా మారతాడు. అనుకోని పరిస్తితుల్లో మరో పేద అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. ఎవరు ఎవర్ని ప్రేమించారో, ఎవరు ఎవరికంటే పేదవారో, అన్నట్టు నడుస్తుంది కథనం.

చివరి కథ ‘The dream of a ridiculous man’. ఈ కథ మాత్రం అంతగా నచ్చలేదు. అబ్స్ ట్రాక్ట్ మెథడ్ లో సాగుతుంది. ఈ లోకం మీద విరక్తి పెంచుకొని, చనిపోదామని నిర్ణయించుకొన్న ఒక మనిషి, తనని తాను తుపాకి తో కాల్చుకుంటాడు. మనసు మరో ప్రపచంలోకి వెలుతుంది. అది కలా, లేక నిజమా మనకి తెలీదు.

అద్బుతమైన శైలి ఈ రచయితది. ఫస్ట్ పర్సన్ నారాటివ్ లో రాసినా, తన అద్బుతమైన శైలితో, ఒక్క క్షణం కూడా మనల్ని పుస్తకం మీదినుంచి చూపు తిప్పుకోనివ్వడు.

ఈ కథల్లోని మరో గొప్ప లక్షణం, వీటి సహజత్వం. టైంలెస్ నెస్. వీటిని వ్రాసింది ఇప్పటికి దాదాపు 150 యేళ్ళ క్రితం అయినా, ఈ రోజుకీ అవి చదువుతుంటే, మనం వెంటనే కనెక్ట్ అవ్వగలం. అందుకే ఇవి క్లాసిక్స్ గా మిగిలాయి.

‘వైట్ నైట్స్ ‘ అనే కథ గురించి వికిపీడియాలో చదువుతున్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. 1848 లో మొదటిసారి ప్రచురించబడ్డ ఈ చిన్న కథ మీద ఇప్పటికి తొమ్మిది సినీమాలు వచ్చాయి అట. అంటే ఈ రోజుకి కూడా ఈ కథ ఇంత మందిని ఇన్స్పైర్ చేస్తూ ఎంతో మందిని ఆకట్టుకుంటుంది అంటే, నిజంగా అది ఒక అద్బుతం.

నాకు దొరికిన ఈ పుస్తకం 1981 లో, రష్యా లో, నాలుగవ ముద్రణ పొందింది. ఇక ఇప్పుడు ఇదే పుస్తకం దొరక్కపోవచ్చు. ఆన్లైన్లో కొన్ని పుస్తకాలు వున్నా, అవి వేరే కథలతో వున్నాయి.

ఏదేమైనా మంచి కథలు చదవాలనుకునేవారు తప్పకుండా చదవాల్సిన కథలు ఇవ్వి.

You Might Also Like

2 Comments

  1. b.ajay prasad

    surprised to see the article. attractive.

  2. Ramanjaneya Thannidi

    Good information Sudheer garu

Leave a Reply