కేవలం నువ్వే – వసుధారాణి కవిత్వం

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
*****************

కనిపిస్తున్న ప్రపంచం అంతా సత్యాసత్యాల దుస్తులను మార్చి మార్చి వేసుకుంటున్నదా అని అనుమానం కలిగే స్థాయిలో మారని సత్యం కోసం అన్వేషణ లోలోపల మొదలవుతుంది. ఆ సత్యం రూపురేఖలు తెలియక ఎవరికి వారు తమ ఊహకు తగినట్లు చిత్రించుకుంటారు. ఇటువంటి పలు ఊహల గురించి తెలిసినప్పటికీ, వీటి విషయంలో రాజీ కుదరనప్పుడల్లా మళ్ళీ కొత్త గా మరో ప్రయాణం మొదలవుతుంది. బహిర్ముఖంగా కాకుండా అంతర్ముఖంగా ప్రయాణం జరగడం తపస్సు వంటిదే.

ఒకటి రెండు వాక్యాలలో క్లుప్తతే ఆభరణంగా సాగిన ఈ రచనలో వసుధారాణి గారు అటువంటిరూపాన్ని ‘నువ్వు’గా సంబోధిస్తూ

నువ్వు నేను

ఇదే నా ప్రపంచ జనాభా”

అని చెప్తారు.

మొదలుపెట్టిన మాటే మనసును తాకేలా –

నేను నీకు ఒక పూలమాలను అర్పించి పొంగిపోయాను.

నీవు నాకోసం పూలతోటనే సృష్టించావు.”

అంటూ ఆనందంగా అందుకుంటారు. ఔను, పూలతోట వంటి మనసు అందుకొని ఉంటేనే కదా ఈ భావసుమాలు విరిసేది! ఈ సుమాల పరిమళం ఆనందం మాత్రమే. అందుకే

నువ్వు ఎవరో తెలీకముందు కూడా

నేను సంతోషంగానే ఉన్నాను.

నువ్వు తెలిశాక ఇంకొంచెం సంతోషంగా.

ఆ ఇంకొంచెం లోనే ప్రపంచం అంతా ఉంది.”

అనగలిగే నిస్సంకోచమైన సంతృప్తి కనిపిస్తుంది. నీటి నిశ్చలత్వాన్ని మనసుతో, అల రేపే చిరుగాలి తరగను జ్ఞాపకం రేపే అలజడి తో పోలుస్తూ, ఎన్నో ఇవ్వడం నీకు తెలిసినట్టు మనసును అర్పించడం నాకు తెలుసు అని పోటీ పడుతూ క్రమంగా ఒక స్థాయిలో ‘నేను’అదృశ్యమై ‘కేవలం నువ్వు’ మిగిలున్నట్టు నిరూపణ జరుగుతుంది. నిన్ను దాచుకొన్న గుండె గుప్పెడేనని, నిన్ను ఒలకబోసుకున్న జ్ఞాపకం సముద్రమంత అని అల్పమేదో అనంతమేదో అవగాహన కలుగుతుంది. ఇంత గొప్ప మజిలీ చేరినా ఇంకా గమ్యం చేరనట్టేనేమో. అందుకే ‘నువ్వు నేను’, ‘నీతో నేను’ అంటూ సాగి ‘కేవలం నువ్వే’ దాకా సాగిన పయనం తర్వాత మళ్ళీ సమాజంతో నేను, మహిళగా నేను అన్న అధ్యాయాలు ఎందుకు వచ్చాయో తెలీలేదు.

బహుశా అది ముందే తెలిసే

వదిలి రావాల్సిన జాబితా చాలా ఉంది.

ఒకటి తీసేస్తే రెండు పెట్టుకోవడం

సంచి ఖాళీ చేయడం, నింపుకోవడం

ఈ జన్మకి నీదాకా ప్రయాణం

సాగేలా లేదు.”

అన్నారేమో. మానసిక ప్రపంచంలో ప్రయాణం చేయించే వసుధారాణి గారి రచన “ కేవలం నువ్వే” హాయిగా, ఆగకుండా సాగిపోతుంది. నాలో నేను” , “కేవలం నువ్వే” రెండు అధ్యాయాలలో 68 వ కవిత రిపీట్ అవడం తప్పితే పుస్తకం ముద్రణ అంతా బాగుంది. కొన్ని మళ్ళీ చదవాలని అనిపించేలా ఉన్నాయి. వాటిలో కొన్ని.


ఆశలు కొన్ని దోసిట్లోకి తీసుకున్నాను.

జీవితం విషాదంతోనే చేజారిపోతుందని

అవీ నిలవడం లేదు, ఒడిసిపట్టడం నాకు రాదు కాబోలు.”

నిన్ను కలిసిన తర్వాత

జీవితం మబ్బు తునకకు

ఉయ్యాల కట్టి ఊగినంత

ఉల్లాసమై పోయింది.

అనంతంలోకి ఆలోచనలు

రెక్కలు విప్పుకొని అవి

నిను చేరే ప్రయాణం

చేపడితే

మీకంత శక్తి లేదని ఆపలేను.

నీదాకా కొనసాగించలేను.

***

You Might Also Like

2 Comments

    1. లక్ష్మీదేవి

      థాంక్యూ రజిత గారూ.

Leave a Reply