కథగా కల్పనగా… ఊహాజగత్తుల సంచారం…

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్

ఒక సినిమా పాటలోని పదాలను తన తొలి నవల టైటిల్‌గా పెట్టుకున్న అరిపిరాల సత్యప్రసాద్ గారి నవల ‘జరుగుతున్నది జగన్నాటకం’ చదవడం మొదలెట్టాకా, నాకెందుకో ‘వసంత కోకిల’ సినిమాలోని పాట ‘కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని’ పాట గుర్తొచ్చింది. పుస్తకం చదువుతున్నంత సేపూ, ‘కథగా కల్పనగా’ అనే పదాలు నా మనసులో తచ్చాడుతూనే ఉన్నాయి.

ఐర్లాండ్‌లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఈ నవలని రాయడానికి తనని ప్రేరేపించిదని రచయిత తెలిపారు. అక్కడి ఆ చట్టం గురించి తన శ్రీమతితో చర్చిస్తూ ఆయా దేశాలలోని సాంస్కృతిక, సామాజిక, రాజకీయ నేపథ్యాలలోని వైవిధ్యాల వల్ల ఒకరి చట్టాలొకరి తప్పుగా అనిపిస్తాయని అంటూ, ‘ఓ ద్వీపంలో అందరూ ఎడమచేతితో భోం చేసేవారున్నారనుకో…’ అని అన్నారట. ఆ మాటలే ఆలోచనలై, పదాలై, వాక్యాలై…. చివరికి నవల అయ్యాయి.

***

ముగ్గురు మిత్రులు సారథి, మూర్తి, ప్రసాద్‌లు నగర శివార్లలో ఒక రేవ్ పార్టీకి హాజరవుతారు. అక్కడ మందు తాగుతారు, గంజాయి పుచ్చుకుంటారు. ఇంతలో సారథి దృష్టి అక్కడ కనబడిన ఓ యువతిపై పడుతుంది. ఆమెను ముందురోజు రాత్రి టీవీలో చూశానంటాడు. ఓ ట్రివియల్ రీజన్‌తో విడాకులు తీసుకుందని చెప్తాడు. మూర్తి వాదిస్తాడు… ‘ఆ రీజన్ నీకు ట్రివియల్‌గా అనిపించవచ్చు, కానీ ఆమెకి కాదు’ అని. వాదన పెరుగుతుంది, ప్రసాద్ వీళ్ళిద్దరిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తాడు. చివర్లో సారథి డబుల్ డార్క్ అనే ఓ మాదకద్రవ్యం టాబ్లెట్స్ నాలుగు నోట్లో వేసుకుని, అక్కడ్నించి వెళ్ళిపోతాడు.

***

కథ మొదటి అంకం ‘సవ్యలంక’లోకి ప్రవేశిస్తుంది. సారథి మగతగా పడి ఉంటాడు. మాలతిని కలిసినట్టు, ఆమె తనకు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ఎడమ చేయి చాచినట్టు అతనికి స్ఫురిస్తుంది. కాసేపటికి మరో వామ హస్తం అతనికి చేయి అందిస్తుంది. తానెక్కడ ఉన్నానో అని కాకుండా, తానెవరా అని ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఆ మగతలో, ఆకాశంలో మబ్బులలో అతనికి గాంధీజీ, కనులు మూస్తే కళ్ళెదురుగా సుభాష్ చంద్రబోస్ కనిపిస్తారు.

కళ్ళు తెరిచి చూస్తే ఓ బాలుడు తనకేసి ఆత్రంగా చూస్తూ కనబడతాడు. “ఎవరు నువ్వు?” అని అడుగుతాడు ఆ పిల్లాడు. తెలియదంటాడు సారథి.

“సముద్రంలో కొట్టుకొచ్చావా?” అంటే తలూపుతాడు.

తన పేరు ‘నందూ’ అని చెప్పి, నువ్వెవరని మళ్ళీ అడుగుతాడు.

తనకి బాగా దాహంగా ఉందని తాగడానికి నీళ్ళు కావాలని అంటాడు. “మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, వెళ్దాం” అంటాడు నందూ. దారిలో, ‘నీ పేరు ఇంకా చెప్పలేదు’ అంటాడు నందు. తన పేరు ‘బోస్’ అని చెప్తాడు అప్రయత్నంగా.

నందూ ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాసుతో మంచినీళ్ళు బోస్‌కి అందించబోతాడు. అయితే బోస్ గ్లాసందుకోడు. ఎడమ చేత్తో ఇవ్వడం తప్పని, కుడి చేత్తో ఇవ్వాలని అంటాడు. “ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఎడమ చేత్తోనే ఇవ్వాలని మా అమ్మ నేర్పింది” అంటాడు నందూ. “కాదు, కుడి చేత్తో ఇవ్వాలని చెప్పి ఉంటుంది” అంటాడు బోస్. ఇంతలో నందూ వాళ్ళ నాన్న పశుపాలకి కోపం వస్తుంది. “చిన్నపిల్లాడితో తప్పుడు మాటలు మాట్లాడడానికి సిగ్గుగా లేదా?” అంటాడు. “లేకపోతే నువ్వు వాళ్ళల్లో ఒకడివా” అని అడుగుతాడు. బోస్ ఏదో చెప్పబోతే కోప్పడి ఇంట్లో నుంచి పంపించేస్తాడు. నీటి కోసం వెతుకుతూ ఆలయంలోకి ప్రవేశిస్తాడు బోస్. ఆలయంలోని కుళాయి నుంచి నీళ్లు తాగుతాడు. అప్పుడు అతనికి ఆకలి వేస్తుంది. గుళ్లో ప్రసాదం ఇస్తున్న చోటకి వెళ్లి చెయ్యి చాపబోతాడు. ప్రసాదం ఇస్తున్న అర్చకుడు ‘ముందు దర్శనం చేసుకుని రండి’ అంటాడు. వెళ్లి దర్శనం చేసుకుంటాడు బోస్. తీర్థం కోసం కుడిచేతిని చాపితే అక్కడున్న అర్చక స్వాములు బెదిరి పోతారు. తమనేమీ చెయ్యొద్దని వేడుకుంటారు. తనను చూసి వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కాదు. ప్రసాదం బలవంతంగా ఇప్పించుకుని తిని మళ్లీ కుళాయి దగ్గర నీళ్లు తాగడంతో అతని ఆకలి తీరుతుంది. ఇంతలో అతనిని కొంతమంది సైనికులు బంధిస్తారు. ఊరి మధ్యలోకి తెచ్చి శిక్ష అమలు చేయమన్నాడు ఆ రాజ్యపు దళాధిపతి. తనని ఎందుకు బంధించారో తెలుసుకోవాలనుకుంటారు బోస్. తమ రాజ్యపు ‘ధర్మ గ్రంథం’ లోని నియమాలను అతిక్రమించినందుకు మరణదండన విధించానని చెప్తాడు దళాధిపతి. ఇంతలో ఆచార్య వేదాంతం, అతని శిష్యురాలు ద్వీప, నందు, పశుపాల అక్కడికి చేరుకుంటారు. పరదేశి కాబట్టి తెలియక నియమాలని అతిక్రమించి ఉంటాడని, విడిచిపెట్టాలని వేదాంతం కోరతాడు. అందుకు దళాధిపతి నిరాకరిస్తాడు. ఇంతలో ‘ధర్మ నారీ సమితి’ జోక్యంతో బోస్‌కి శిక్ష తప్పుతుంది. బోస్‌ని తమ ఇంటికి తీసుకువెళతారు నందూ వాళ్ళు.

అక్కడ ద్వీప అతనికి ఆ రాజ్యం గురించిన కొన్ని వివరాలు చెబుతుంది. తను తిరిగి తన ప్రాంతానికి వెళ్ళిపోతాను అంటాడు బోస్.  అందుకు జలపతి ఒక్కడే సహాయం చేయగలరని పశుపాల అంటాడు. జలపతి ఒక బహిష్కృత పౌరుడనీ,  తిరుగుబాటుదారుడనీ తెలుస్తుంది. జలపతిని కలవడానికి బయలుదేరుతాడు బోసు. ఈ లోపు తమ ‘ధర్మ గ్రంథం’లో పేర్కొన్న విప్లవ నాయకుడైన ‘మహాబసు’ ఈ బోసే అని వేదాంతం, ద్వీప గ్రహిస్తారు. నవలలోని తదుపరి అంకం ‘మహాబసు’ మొదలవుతుంది.

మహాబసు ఎవరు, ఆ రాజ్యంలో ఎందుకు అడుగుపెడతాడు తెలుసుకుంటాడో బోసు. అందరూ అతడిని మహాబసుగా నమ్ముతారు. తానే మహాబసు అని విశ్వసించిన బోసు తన అనుచరుల సాయంతో రాజుకి వ్యతిరేకంగా, ఎడమ చేతి వాటానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీస్తాడు. గాంధీజీ సిద్ధాంతాల ప్రకారం అహింసా పద్ధతిలో ఉద్యమం చేస్తాడు. దేశాధినేతే స్వయంగా కత్తి చేతబూని సత్యాగ్రహులందరినీ నరికేస్తాడు. మహాబసు ఖిన్నుడవుతాడు. హింసామార్గం తప్ప గత్యంతరం లేదు అనుకుంటాడు. సైనికులపై దాడికి ఆదేశిస్తాడు. మెల్లగా మహాబసు అనుచరులు పెరుగుతారు. దేశాధినేత సైతం విస్మరించలేని వ్యక్తిగా మారుతాడు మహాబసు. వీళ్ళ ఆసుపాసులను కనిపెట్టడానికి మహారాజు ఆంతరంగికుడు ఉదంతుడు ఉద్యమకారులలో కలిసి పోతాడు.

ఒక్కో అంకం నడుస్తుండగా మధ్యలో బోస్ సారథి అవుతాడు. వాస్తవ ప్రపంచంలో సంచరిస్తుంటాడు. ఈ రెండు ప్రపంచాల సంగతేంటో తేల్చుకోవాలని ‘డా. నరసింహం’ అనే ఓ సైకియాట్రిస్ట్ వద్దకు వెళతాడు. ఆయన సమాంతర విశ్వాల (పారలల్ వరల్డ్స్) భావన చెప్పి, ఈ ప్రపంచంలో సారథిగా ఉంటే, ఆ ప్రపంచంలో బోస్‌గా, మహాబసుగా ఉంటున్నావని అంటాడు. కొన్నాళ్ళకి డా. నరసింహం కూడా తానూ ఆ ప్రపంచంలోని పాత్రధారినే అనీ, తానే ఆచార్య వేదాంతం అని గ్రహిస్తాడు.

నవలలో తదుపరి అంకం ‘ సంగ్రామం’. ఈ అంకంలో రాజుగారి సైనికులకి ఉద్యమకారులకు మధ్య సంధి ప్రయత్నాలు చేస్తారు రాజ్యంలోని వర్తకగణం. అవి విఫలమవడంతో, యుద్ధం ప్రారంభం అవుతుంది. కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయి. మహాబసుని బంధిస్తారు. ఇది నవలలో తదుపరి అంకం ‘మహా ప్రళయం’ కు దారి తీస్తుంది.

మహాబసుని కలిసిన రాజు ఓ రహస్యం చెబుతాడు. ఈ రాజ్యంలో ఎడమ చేతి వాటం ఎందుకు అమలు చేయబడింది వివరిస్తాడు. మహాబసుని తప్పించడానికి ఉదంతుడు సాయం చేస్తాడు. ఈ లోపు మహాబసు చనిపోయాడనుకున్న అతని అనుచరుల్లో అభిప్రాయభేదాలు వస్తాయి. నాయకుడు లేని దళం కకావికలం అవుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని దళాధిపతి వాళ్ళను నిర్మూలించాలనుకుంటాడు. అదే సమయంలో మహాబసు ప్రత్యక్షమవడం, పోరాడడం, దళాధిపతి మరణించడం జరిగిపోతాయి. రాజు పారిపోతాడు. అతని సైన్యం లొంగి పోయి శరణు కోరతారు. మహాబసు అనుచరుడు ‘ఉగ్ర’ వాళ్లని చంపాల్సిందే అంటాడు. ఈ లోపు జలప్రళయం విరుచుకుపడి అందరిని జల సమాధి చేసేస్తుంది.

ప్రళయం అనంతరం సారథి ద్వీపం ఒడ్డున స్పృహ తప్పి పడి ఉంటాడు. కళ్ళు తెరిచేసరికి నీలమేఘశ్యాముడు శ్రీకృష్ణుడు దర్శనమిస్తాడు. తానే భక్తుల కోరిక మేరకు సారథి రూపంలో అవతరించారని అంటాడు.

ఇంతలో ఎవరో తనని ‘సారథీ, సారథీ’ అని పిలుస్తుండటంతో మెలకువ వస్తుంది. అది ఓ హాస్పిటల్. మూర్తి, ప్రసాద్ ఎదురుగా ఉంటారు! ఒక లేడీ డాక్టర్ సారథికి వైద్యం చేస్తూ ఉంటుంది. ‘డా. నరసింహం ఏరి?’ అని అడుగుతాడు సారథి. తనని ఇప్పటిదాకా ట్రీట్ చేసింది ఈవిడే అని మిత్రులు చెప్తారు. “నాకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి?” అని అడుగుతాడు. “డ్రగ్ ఓవర్ డోస్… దాని తరువాత దానివల్ల ఏవో పిచ్చి పిచ్చి ఊహలు… డ్రగ్ ఇన్డ్యూస్డ్ హలూజినేషన్ అంటారు. దాంట్లో చాలా తీవ్ర స్థాయికి వెళ్లారు…” అంటుందామె. ఆమె పేరు అడిగి తెలుసుకోవడంతో నవల ముగుస్తుంది.

***

మాదక ద్రవ్యాల వల్ల కలిగే భ్రమలను నిజం చేయడానికే రచయిత ఈ నవలని సృష్టించారా అని కొంతమందికి అనిపించవచ్చు. అటువంటి భ్రమలను మిషగా తీసుకొని కొన్ని సిద్ధాంతాలకి ప్రతి సిద్ధాంతాలు, కొన్ని విశ్వాసాలకి ప్రతి విశ్వాసాలను లేవనెత్తి పాఠకులను ఆలోచింప చేస్తారు. తాము ఎంచుకున్న మార్గాల ద్వారా చరిత్రలో నిలిచిపోయిన వారి మనసులోని భావాలను బహిర్గతం చేస్తారు! బహుశా అప్పటి వారి విధానాన్ని వారే బలంగా నమ్మలేదేమో అని అనిపిస్తుంది. అధికారానికి మతానికి; పాలకులకు వర్తకులకు ఉండే సంబంధాన్ని ఈ నవలలో విస్తృతంగా చర్చించారు.

ఏది కథ, ఏది కల్పన అని తేల్చుకోలేనంతగా జిగిబిగి అల్లికలా కథనాన్ని కొనసాగించి పాఠకులని మనో లోకాలలో తిప్పి నవలలో లీనమయ్యేలా చేశారు రచయిత. ఈ నవలలో “తప్పొప్పుల వివరణ ఉంది. సైన్స్ ఉన్నది. అన్నిటినీ తనలో ఇముడ్చుకొని ‘ఇది ముమ్మాటికీ నిజమే’ అని సమ్మోహనంగా పాఠకుడిని నమ్మించే ‘కల్పనా చాతుర్యం’ ఉంది” అన్నారు భువనచంద్ర గారు.

ఇది సాంఘిక నవల అయినప్పటికీ, జానపద ఛాయలు కొన్ని కనిపిస్తాయి. మధ్యమధ్యలో చారిత్రక నవలగా అనిపిస్తుంది. మరికొన్ని సార్లు సైన్స్ ఫిక్షన్‌గానూ, సోషియో-ఫాంటసీ నవలగానూ అనిపిస్తుంది. 206 పేజీల ఈ నవల చదువుతుంటే సమయం అస్సలు తెలియదు. గో ఫర్ ఇట్!

***

జరుగుతున్నది జగన్నాటకం (నవల)

రచన: అరిపిరాల సత్యప్రసాద్

ప్రచురణ: జ్ఞ ప్రచురణలు

పుటలు: 206, వెల: ₹ 180/-

ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.

ఆన్‌లైన్‌లో పుస్తకం తెప్పించుకోడానికి – అమెజాన్

ఈబుక్ – కినిగె

 

You Might Also Like

Leave a Reply